యూట్యూబ్ జర్నలిస్ట్‌ను దుస్తులు విప్పించి నిల్చోబెట్టిన పోలీసులు, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేసినందుకేనా

యూట్యూబ్

ఫొటో సోర్స్, Kanishka Tiwari

ఫొటో క్యాప్షన్, కనిష్క్ తివారీ
    • రచయిత, దిల్‌నవాజ్ పాషా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మధ్యప్రదేశ్‌లోని సీధీ జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్‌లో తీసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ ఫొటోలో కొందరు వ్యక్తులు అర్థనగ్నంగా నిలబడి ఉన్నారు. వారంతా స్థానిక జర్నలిస్టులని సోషల్ మీడియాలో చెబుతున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు బీబీసీ ప్రయత్నించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

అసలేం జరిగింది?

ఏప్రిల్ 2న రాత్రి 8.30 గంటల ప్రాంతంలో సీధీ పోలీస్ స్టేషన్‌లో తీసిన ఫొటో ఇది. ఇందులో ఎనిమిది మంది అర్థనగ్నంగా నిలబడి ఉండడం చూడవచ్చు. వీరిలో ఇద్దరు స్థానిక జర్నలిస్టులు కాగా మిగిలినవారు డ్రామా ఆర్టిస్టులు.

ఒక థియేటర్ ఆర్టిస్టును అరెస్ట్ చేసినందుకు నిరసనలు తెలియజేస్తుంటే, పోలీసులు వీళ్లను పట్టుకుని స్టేషన్‌కు తీసుకొచ్చారని, బట్టలు విప్పి నడిపించారని చెబుతున్నారు.

అయితే, పోలీసులు ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు.

ఫొటోలో కనిపిస్తున్న ‘జర్నలిస్ట్’ కనిష్క్ తివారీతో బీబీసీ మాట్లాడింది.

"ఈ ఫొటోలో కనిపిస్తున్న వారిలో మేమిద్దరం జర్నలిస్టులం. నేను, నా కెమెరామన్. మిగిలిన వారు స్థానిక డ్రామా ఆర్టిస్టులు, ఆర్‌టీఐ కార్యకర్తలు. ఒక కేసులో థియేటర్ ఆర్టిస్ట్ నీరజ్ కుందేర్‌ను అరెస్ట్‌ చేశారు. దాన్ని వీళ్లు వ్యతిరేకించారు" అంటూ చెప్పుకొచ్చారు.

"ఫేస్‌బుక్‌లో నకిలీ ప్రొఫైల్‌ సృష్టించి స్థానిక ఎమ్మెల్యే కేదార్‌నాథ్ శుక్లాపై అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు నీరజ్ కుందేర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అందుకు థియేటర్ ఆర్టిస్టులు నిరసన వ్యక్తం చేశారు. దీని కవరేజీ కోసం నేను, నా కెమెరామన్‌తో కలిసి వెళ్లాను. వాళ్లు నిరసన వ్యక్తం చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కనే ఉన్న నన్ను, నా కెమెరామన్‌ను కూడ పట్టుకున్నారు. మమ్మల్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి దుస్తులు విప్పించి అర్ధనగ్నంగా నడిపించారు. తరువాత, స్టేషన్ హెడ్ గదిలో నిలబెట్టి ఈ ఫొటో తీశారు"

ఈ ఘటన తరువాత పోలీసుల దురుసు చర్యలపై ఫిర్యాదు చేసేందుకు చాలాసార్లు ప్రయత్నించినా, ఎవరూ పట్టించుకోలేదని కనిష్క్ చెప్పారు.

సీధీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌ఎస్పీ) ముఖేష్ కుమార్ మాట్లాడుతూ, "నీరజ్ కుందేర్ ఒక థియేటర్ ఆర్టిస్ట్. ఆయన్ను అరెస్ట్ చేసిన తరువాత జనం నిరసనలకు దిగారు. పోలీసు స్టేషన్ బయట అభ్యంతరకరమైన నినాదాలు చేశారు. పోలీసులు వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కానీ వాళ్లు వినలేదు. రాత్రి వాళ్లను కూడా పట్టుకున్నాం. సెక్షన్ 151 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశాం."

మధ్యప్రదేశ్, యూట్యూబ్

ఫొటో సోర్స్, @mpsandeshnews24

ఫొటో క్యాప్షన్, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కేదార్‌నాథ్ శుక్లాకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేయడం వల్లే తనను టార్గెట్ చేశారని కనిష్క్ అంటున్నారు.

ఏ నియమాల ప్రకారం దుస్తులు విప్పించి నిల్చోబెట్టారు?

అరెస్ట్ చేసినవారిని అర్ధ నగ్నంగా ఉంచి ఫొటో తీయడంపై పోలీసు సూపరింటెండెంట్ ముఖేష్ కుమార్‌ను బీబీసీ ప్రశ్నించింది.

"ఈ ఫొటో గురించి నాకు తెలిసింది. ఏ పరిస్థితుల్లో ఈ ఫొటో తీశారో దర్యాప్తు చేస్తున్నాం. దీనిపై విచారణను డీఎస్పీకి అప్పగించారు. రిపోర్టు వచ్చిన తరువాత తగిన చర్యలు తీసుకుంటాం" అని ఆయన చెప్పారు.

ఇది వ్యక్తి గౌరవానికి సంబంధించినది. ఏ నియమాల ప్రకారం ఇది జరిగిందో పోలీసులు విచారిస్తున్నారు.

"ఏ పరిస్థితులలో ఇది జరిగింది, ఏ నియమాల ప్రకారం జరిగింది అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నాం. ఇది నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని తెలిస్తే స్టేషన్ ఇన్‌ఛార్జ్‌ సహా ఇతర పోలీసులపై కూడా చర్యలు తీసుకుంటాం. పోలీసులు దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం" అని పోలీసు సూపరింటెండెంట్ ముఖేష్ కుమార్‌ చెప్పారు.

ఫొటోలో ఉన్నవారు జర్నలిస్టులా కాదా అని పోలీసు సూపరింటెండెంట్‌ను అడిగాం.

"ఆయన బైట్స్ తీసుకుంటూ ఉంటారు కానీ, గుర్తింపు ఉన్న మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్ట్ కాదు. నాకు తెలిసినంతవరకు ఆయన యూట్యూబ్‌లో వార్తలు ప్రసారం చేసే స్థానిక యూట్యూబర్" అని చెప్పారు.

స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకే పోలీసులు ఇలా చేశారని కనిష్క్ తివారీ ఆరోపించారు.

ఆయన ఆరోపణలు నిరాధారమైనవని పోలీసులు అంటున్నారు.

"కనిష్క్ తివారీపై ఇప్పటికే ఒక కేసు ఉంది. దానిపై దర్యాప్తు జరుగుతోంది. 2021లో ఆయన ఒక హాస్టల్‌లోకి ప్రవేశించారు. ఈ సంఘటనకు సంబంధించి ఐపీసీ 452 కింద కేసు నమోదైంది. ఇది విచారణలో ఉంది. అయితే, ఆయన్ను ఎప్పుడూ ఏ కేసులోనూ అరెస్ట్ చేయలేదు" అని ఎస్‌ఎస్పీ ముఖేష్ కుమార్ తెలిపారు.

మధ్యప్రదేశ్, యూట్యూబ్

ఫొటో సోర్స్, Kanishka Tiwari

తన యూట్యూబ్‌ ఛానెల్‌లో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కేదార్‌నాథ్ శుక్లాకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తుంటానని, అందుకే తనను టార్గెట్ చేశారని కనిష్క్ ఆరోపించారు.

కేదార్‌నాథ్ శుక్లా ఈ ఆరోపణలను కొట్టిపారేశారు.

"జర్నలిస్టుల మీద ఏ దాడీ జరగలేదు. ఏ జర్నలిస్టూ ఎలాంటి ఫిర్యాదూ చేయలేదు. ఆయన జర్నలిస్టే కాదు. ఆయన్ను జర్నలిస్టు అనకండి. ఇంతకు మించి నేను చెప్పేదేం లేదు" అని కేదార్‌నాథ్ శుక్లా బీబీసీతో అన్నారు.

ఈ ఘటన పోలీస్ స్టేషన్‌లోనే జరిగిందా అని శుక్లాను అడిగాం.

"ఈ ఘటన జరిగింది కానీ, ఇందులో జర్నలిస్టులెవరూ లేరు" అని ఆయన జవాబిచ్చారు.

కాగా, తాను 'ఎంపీ సందేశ్' న్యూస్ పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ నడుపుతున్నానని, లక్ష మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారని కనిష్క్ చెప్పారు. తనకు జాతీయ మీడియాతో కూడా అనుబంధం ఉందని అన్నారు.

వీడియో క్యాప్షన్, ఎక్స్‌ప్రెస్ రైలు ముందు దూకిన యువకుడు.. రెప్పపాటులో కాపాడిన పోలీస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)