మా ఎన్నికలు - చిరంజీవి: 'పదవుల కోసం మాటలు అనడం, అనిపించుకోవడం చూస్తుంటే బయటివారికి ఎంత లోకువ అయిపోతాం' - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, KONIDELA CHIRANJEEVI/FB
మూలాల్లోకి వెళ్లి సమస్యను దూరం చేసుకుంటే ఇండస్ట్రీ వసుదైక కుటుంబం అవుతుందని, దీని కోసం సమస్యలను సృష్టించే వారిని దూరం పెట్టడం మంచిదని చిరంజీవి అన్నట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది.
ఆ కథనం ప్రకారం.. నాకు నారప్పలో క్యారెక్టర్ తప్ప వెంకటేశ్ కనిపించలేదు. తనకు ఫోన్ చేసి ప్రశంసించా. తను సైరా చూసి వ్యక్తిగతంగా నా దగ్గరికి వచ్చి ప్రశంసించాడు. అందరి హీరోల మధ్య ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే పరిశ్రమలో వివాదాలు, కొట్టుకోవడాలు, మాటలు అనడం, అనిపించుకోవడాలు ఉండవు కదా అని చిరంజీవి అన్నారు.
పదవులు రెండేళ్లుంటాయా? మూడేళ్లుంటాయా? చిన్న చిన్న బాధ్యతల వంటి వాటి కోసం మాటలు అనడం, అనిపించుకోవడం చూస్తుంటే బయటివాళ్లకి ఎంత లోకువ అయిపోతామో కదా?
ఒక పదవి కోసం అంత లోకువ కావాలా? నాకిది చాలా బాధగా అనిపించింది. ఎవరైనా కానివ్వండి.. ఏ ఒక్కరినీ నేను వేలు పెట్టి చూపించడం లేదు. విజ్ఞతతోటి, మెచ్యూరిటీతోటి ప్రతి ఒక్కరూ ఉండాలి తప్ప.. మన ఆధిపత్యం చూపించుకోవాలని, మన ప్రభావాన్ని చూపించుకోవడం కోసం అవతలి వారిని కించపరచాల్సిన అవసరం లేదు.
మూలాలలోకి వెళ్లి ఆలోచించండి. ఎవరు.. దీనికంతటికి కారణం? అలాంటి వ్యక్తులను దూరంగా ఉంచితే కనుక మనది వసుదైక కుటుంబం అవుతుంది'' అని చిరంజీవి అన్నారని ఆంధ్రజ్యోతి రాసింది.

దేశం చూపు.. సింగరేణి వైపు
దేశంలో బొగ్గుకు డిమాండు పెరగడంతో సింగరేణి కీలకంగా మారిందని, దీంతో దక్షిణాది రాష్ట్రాలే కాకుండా పశ్చిమ, ఉత్తర భారత రాష్ట్రాలు సైతం సింగరేణి బొగ్గును అడుగుతున్నాయని 'ఈనాడు' కథనం ప్రచురించింది.
''మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల విద్యుత్ కేంద్రాలకు అదనంగా బొగ్గు పంపాలని సింగరేణిపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి.
ఒక్కసారిగా గిరాకీ పెరిగినా, అందుకు తగ్గట్టు బొగ్గు సరఫరా చేయలేని స్థితి. కొత్త గనుల తవ్వకాలు, విస్తరణ, ఆధునీకరణ తదితర అంశాల్లో జాప్యం వల్ల సంస్థ ఉత్పత్తిని పెంచలేకపోతుంది.
ఈ సంస్థ ఉత్పత్తి చేసే బొగ్గులో ఇంతకాంల 92 శాతం విద్యుత్ కేంద్రాలకు, మిగిలిన 8 శాతం సిమెంటు, ఇనుము వంటి ఇతర పరిశ్రమలకు ఇచ్చేవారు.
ప్రస్తుత పరిస్థితుల్లో పరిశ్రమలకు సరఫరా నిలిపివేసి వంద శాతం బొగ్గును విద్యుత్కేంద్రాలకే పంపాలని సింగరేణి తాజాగా నిర్ణయించింది.
ఈ సంస్థ సాధారణంగా రోజుకు 30 నుంచి 32 గూడ్సు రైళ్లలో పలు రాష్ట్రాల విద్యుత్కేంద్రాలకు బొగ్గు పంపుతోంది.
ప్రస్తుత డిమాండు తీర్చాలంటే దాన్ని 40 రైళ్లకు పెంచాలి. అంటే రోజుకు 30 శాతం అదనంగా ఉత్పత్తి చేయాలి. కానీ సింగరేణిలో పరిస్థితులు అందుకు అనువుగా లేవని'' ఈనాడు రాసుకొచ్చింది.

ఫొటో సోర్స్, TSRTCHQ/FACEBOOK
తెలంగాణ ఆర్టీసీలో అదనపు చార్జీలు లేవు
పండుగ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపినట్లు 'నమస్తే తెలంగాణ' కథనం రాసింది.
''పండుగ కోసం 4,035 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు పేర్కొన్నారు. గడిచిన ఐదు రోజుల్లో రికార్డుస్థాయిలో 1.3 కోట్ల మంది ఆర్టీసీ సేవలు వినియోగించుకున్నారని చెప్పారు.
వాణిజ్య, రవాణా ప్రయోజనాలకు వైట్-ప్లేట్ వాహనాలను ఉపయోగించడం చట్టవిరుద్ధమని తెలిపారు. మోటర్ వాహనాల చట్టం (66) నిబంధనలను ఉల్లంఘిస్తే సెక్షన్ 192 (ఏ) కింద శిక్ష పడుతుందని హెచ్చరించారు.
కొద్ది రోజులుగా నిబంధనలు ఉల్లంఘించిన 20 వాహనాలను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారని తెలిపారు. వైట్ ప్లేట్ ట్యాక్సీల్లో ప్రయాణించేవారికి ఏదైనా జరిగితే ఎలాంటి బీమా వర్తించదని చెప్పారు.
ప్రయాణికులు స్వీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని టీఎస్‌ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని కోరారు. 'సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం చేయండి. టీఎస్ ఆర్టీసీని ఆదరించండి' అని ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.
'బుల్లెట్ బండి వద్దు.. ఆర్టీసీ ప్రయాణం సురక్షితం' అని షార్ట్ ఫిల్మ్ తీసిన వికారాబాద్ వాసులు నాగారం ఆనంద్, సంతోష్‌కుమార్, కిరణ్‌లను ఆయన అభినందించినట్లు'' నమస్తే తెలంగాణ కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES PLUS
కొంచెం ఈజీ.. కొంచెం కష్టం
యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష పత్రం కొంచెం కఠినంగా, మరికొంత సులభంగా అనిపించిందని అభ్యర్థులు తెలిపినట్లు 'ఆంధ్రజ్యోతి' పేర్కొంది.
''ఆదివారం దేశవ్యాప్తంగా 77 నగరాల్లో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష సాఫీగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, అనంతపురం, తిరుపతి నగరాల్లో పరీక్షను నిర్వహించారు.
జనరల్ స్టడీస్‌తోపాటు కనీస అర్హత పరీక్షలు నిర్వహించారు. కనీస అర్హత మార్కులు రావాల్సిన పరీక్షలో ఆంగ్లం, అర్థమెటిక్, రీజనింగ్ నుంచి ప్రశ్నలు ఉన్నాయి.
ఈ పరీక్షలో కనీసం 67 మార్కులు వస్తేనే.. జనరల్ స్టడీస్ పేపర్ మూల్యాంకనం చేస్తారు. అయితే, ఈసారి కనీస అర్హత మార్కులు సాధించాల్సిన పేపర్ కొంచెం కఠినంగా.. జనరల్ స్టడీస్ పేపర్ తేలిగ్గా ఇచ్చారని అభ్యర్థులు తెలిపారు.
జనరల్ స్టడీస్‌లో 80 ప్రశ్నలకుగాను.. చరిత్ర నుంచి 20 ప్రశ్నలు వచ్చాయి. 15 ప్రశ్నలు రాజనీతి శాస్త్రం నుంచి అడిగారు. ఈసారి కొత్తగా క్రీడలకు సంబంధించిన ప్రశ్నలను కూడా ఇచ్చినట్లు అభ్యర్థులు తెలిపారని'' ఆంధ్రజ్యోతి పేర్కొంది.
వర్షానికి గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం కొత్తపల్లిలో గోడ కూలి ఒకే కుటుంబంలోని ఐదుగురు అక్కడికక్కడే చనిపోయినట్లు 'వెలుగు' కథనం పేర్కొంది.
''అయిజ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పుల్లెద్దుల మోష, శాంతమ్మ దంపతులు. వారికి అయిదుగురు సంతానం. వీరంతా ఎప్పటిలాగే శనివారం రాత్రి పడుకున్నారు. అయితే జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల వారి ఇంటి గోడ కూలింది.
దాంతో దంపతులతో పాటు వారి ముగ్గురు పిల్లలు చరణ్, తేజ, రాము ప్రమాదంలో చనిపోయారు. కాగా.. కూతురు స్నేహ, కొడుకు చిన్నాకు తీవ్ర గాయాలయ్యాయి.
దాంతో వారిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. మోష కుటుంబం భువనగిరిలో ఇటుక బట్టీలలో పనిచేసేవాళ్లని గ్రామస్తులు చెబుతున్నారు.
మరో రెండు రోజుల్లో భువనగిరికి వెళ్లాల్సి ఉందని.. ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని స్థానికులు తెలిపినట్లు'' వెలుగు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
- వారానికి రెండు రోజులు ఉపవాసం ఉంటే జ్ఞాపకశక్తి పెరుగుతుందా
- ఆర్యన్ ఖాన్: సముద్రంలో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న షారుఖ్ ఖాన్ కుమారుడిని ఎలా పట్టుకున్నారంటే..
- హవాలా అంటే ఏంటి? ఈ నెట్వర్క్ ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది? ఈ బిజినెస్ ఎంత పెద్దది?
- రెండవ ప్రపంచ యుద్ధం: ఈ చిన్న పడవలో నాజీల నుంచి ఆ సోదరులు ఎలా తప్పించుకున్నారు?
- పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని ఒక బెంగాలీ పైలట్ హైజాక్ చేసినప్పుడు...
- అమెరికాలో అబార్షన్ హక్కుల కోసం భారీ నిరసన ప్రదర్శనలు
- తొలి సిపాయిల తిరుగుబాటు విశాఖ కేంద్రంగా జరిగిందా?
- సమంత, అక్కినేని నాగ చైతన్య విడాకులు: విడిపోతున్నామని ప్రకటించిన హీరో, హీరోయిన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








