మా అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం

ఫొటో సోర్స్, fb/Vishnumanchu
తెలుగు సినిమా పరిశ్రమ నటీనటుల సంఘం.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించారు. ప్రకాశ్ రాజ్ మీద 106 ఓట్ల తేడాతో విష్ణు గెలుపొందారు.
విష్ణుకు మొత్తంగా 380 ఓట్లు రాగా, ప్రకాశ్ రాజ్‌కు 274 ఓట్లు వచ్చాయి.
ఉత్కంఠగా సాగిన ఎన్నికల్లో ఆధిక్యాలు అటూ తారుమారు అవుతూ వచ్చాయి. చివరకు విజయం మంచు విష్ణును వరించింది.
మా అధ్యక్షుడిగా ఎన్నికైన విష్ణుకు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన శ్రీకాంత్‌కు, మిగతా విజేతలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ చిరంజీవి ట్వీట్ చేశారు. కొత్త కార్యవర్గం మూవీ ఆర్టిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతుందని ఆశిస్తున్నానని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఉదయం ఎన్నికల సందర్భంగా చిన్న చిన్న ఘర్షణలు, వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. శివబాలాజీ చేతిని నటి హేమ కొరకడంతో ఆయనకు స్వల్పంగా గాయమైంది. శివబాలాజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.
మా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈసారి 665 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 60 పోస్టల్ బ్యాలెట్లు. వెంకటేష్, ఎన్టీఆర్, మహేశ్, ప్రభాస్ వంటి కొందరు సీనియర్ నటులు ఈసారి ఓటింగులో పాల్గొనలేదు.
ఉపాధ్యక్షుడిగా మంచు విష్ణు ప్యానెల్‌కు చెందిన మాదాల రవి విజయం సాధించారు. ఆయన ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు చెందిన బెనర్జీని ఓడించారు.
జనరల్ సెక్రటరీగా మంచు విష్ణు ప్యానెల్ నుంచి పోటీ చేసిన రఘుబాబు, జీవిత రాజశేఖర్‌పై విజయం సాధించారు.
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి శ్రీకాంత్ ఎన్నికయ్యారు. విష్ణు ప్యానెల్ తరఫున పోటీ పడిన బాబూ మోహన్‌పై శ్రీకాంత్ విజయం సాధించారు.

ఫొటో సోర్స్, VishnuManchu/Twitter
కౌంటింగ్ ఆద్యంతం ఉత్కంఠ
కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ ఆధిక్యాలు అటూ ఇటూ మారుతూ వచ్చాయి.
ప్రకాష్ రాజ్ ప్యానల్ లో 8 మంది ఈసీ మెంబర్స్, మంచు విష్ణు ప్యానల్ లో 10 మంది ఈసీ మెంబర్స్ గెలిచినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విజయాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఈ ఎన్నికల్లో మొత్తం 605 ఓట్లు పోలయ్యాయి. మరో 52 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసీ ఓట్లలో 50 ఓట్లు చెల్లనివిగా నిర్ధరించారు.
ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు చెందిన శివారెడ్డి, కౌశిక్, సురేష్ కొండేటి, అనసూయ విజయం సాధించారు.
ప్రెసిడెంట్ ఓట్ల కౌంటింగ్ చివరలో జరుగుతుంది. అధ్యక్ష ఎన్నికల ఫలితం తేలేది రాత్రి 8 గంటల తరువాతే అని చెబుతున్నారు.

ఉదయం నుంచి పోలింగ్
ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ఈ ఎన్నికల్లో హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రామ్‌చరణ్, మంచు మనోజ్, నాగార్జున, అల్లరి నరేశ్ లతో పాటు రోజా, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, సుమన్, శివాజీ, నాగబాబు, తొట్టెంపూడి వేణు, సప్తగిరి, కోట శ్రీనివాసరావు సహా పలువురు నటీనటులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన జెనీలియా ముంబయి నుంచి వచ్చి తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. పలువురు మా సభ్యులు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా వచ్చి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
ఉదయం 11 గంటల వరకు పోలైన ఓట్లు 287
మా ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 287 ఓట్లు పోలయ్యాయని, పోస్టల్ బ్యాలెట్లు కాబట్టి కచ్చితంగా 300ల ఓట్లకు పైనే పోలయ్యి ఉండొచ్చని సినీ నటుడు, మా మాజీ అధ్యక్షుడు నరేశ్ చెప్పారు.
- మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో సభ్యుల సంఖ్య - 925
- వీరిలో ఓటు హక్కు ఉన్నవారి సంఖ్య - 883
ఉదయం 8 గంటలకు మొదలైన ఓటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 2 గంటల వరకూ జరుగనుంది. దీన్ని బట్టి తొలి అర్థభాగంలో దాదాపు 30 శాతం ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది.
ఓటుహక్కు వినియోగించుకున్న తర్వాత సినీ నటి రోజా మీడియాతో మాట్లాడుతూ.. పోలింగ్ స్టేషన్‌లో ఇరు వర్గాలూ స్నేహితుల్లా ఉన్నారని, ఎలాంటి ఘర్షణలూ లేవని చెప్పారు. సినీ నటులంతా కలసి పనిచేసిన వాళ్లమేనని, ఎన్నికల తర్వాత కూడా అంతా కలసి పనిచేస్తామని చెప్పారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది

‘చిరంజీవి, మోహన్ బాబు.. వాళ్లిద్దరూ ఫ్రెండ్స్’
ఓటు హక్కు వినియోగించుకున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘తిప్పితిప్పికొడితే 900 మంది. దాంట్లో వ్యక్తిగత దూషణలు.. ఇవన్నీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. పది మందికీ సినిమాలు చేసేవాళ్లు కొంచెం ఆదర్శంగా ఉండాలి. వ్యక్తులు చేసేది ఎప్పుడూ సినిమా రంగానికి అంటదు. వ్యక్తులు చేసేది వ్యక్తులకే అంటుతుంది.
చాలాసార్లు ఓట్లేశాను కానీ ఈ స్థాయిలో ఎప్పుడూ చూడలేదు. నాకూ అర్థం కావట్లేదు ఎందుకు అని. ఇంత అవసరం ఉందా? అనిపిస్తుంది ఒక్కోసారి.
సినిమా ఇండస్ట్రీ రెండు వర్గాలుగా చీలిపోతుందా? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. 'అలా ఎప్పుడూ జరగదు.. నేను చెబుతున్నా మీకు. సినిమా ఇండస్ట్రీ చీలడం అనే ప్రశ్నే లేదు. ఎందుకంటే.. సైడ్స్ తీసుకోవచ్చు. ఇవన్నీ ఉంటాయి కానీ..' అన్నారు.
మీ సపోర్ట్ ఎవరికి? అని ప్రశ్నించగా.. 'అలా ఎలా చెబుతామండీ.. చెప్పకూడదు కదా. ప్రభావితం చేసినట్లవుతుంది' అన్నారు.
నేను పెట్టిన పార్టీలో కూడా ఎంపీటీసీలు, పంచాయితీలు గెలిచాం. దాంట్లో కూడా ఉదాహరణకు అధికార పార్టీ వాళ్లు వచ్చి మాకు సహకారం ఇస్తే మేం ప్రెసిడెంట్, మండల ప్రెసిడెంట్ అవుతాం అన్నారు. అక్కడే అంత సహకారం ఉన్నప్పుడు.. ఇక్కడ కూర్చోబెట్టి, అందరం కూర్చుని మాట్లాడుకుని, చాలా సున్నితంగా, ఏకగ్రీవంగా చేసి ఉండొచ్చు. పొలిటికల్‌గా ఏమీ టర్న్ అవదండీ’’ అని పవన్ అన్నారు.
చిరంజీవికి, మోహన్ బాబుకు మధ్య జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది కదా.. అని అడగ్గా.. ‘‘వాళ్లిద్దరూ ఫ్రెండ్స్ అండీ’’ అంటూ పవన్ వెళ్లిపోయారు.
‘వర్గాలు ఏమీ లేవు’ - బాలకృష్ణ
తెలుగు సినీ పరిశ్రమలో వర్గాలు ఏమీ లేవని, అందరం కలిసి పనిచేసుకుంటామని సినీ హీరో బాలకృష్ణ అన్నారు.
‘‘ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎప్పుడూ జరిగేలాగే మా ఎన్నికలు.. ఎవరు బాగా చేస్తారో.. కళాకారులకు, ఇండస్ట్రీకి వారికి నేను ఓటేయడం జరిగింది. ఇద్దరూ బాగానే చేస్తారు అనిపిస్తోంది. దీంతో ఒక ప్యానల్‌కో, కొందరికో, రెండు ప్యానెళ్లలోని బాగా పనిచేస్తారు అనుకున్న వారికి ఓటేయడం జరిగింది. ఏదైనా ఇండస్ట్రీకి ఇద్దరూ అన్నదమ్ముల్లాంటివాళ్లే. మాటలు చెప్పడమే కాదు చేసి చూపించేవాళ్లు. ఏదైనా ఇండస్ట్రీలో మళ్లీ షూటింగుల్లో కలిసి పనిచేసుకునేవాళ్లమే. ఎవరెవరికి ఏ అవసరాలు ఉంటాయో వారికి అవి అందేలా చేసే బాధ్యత మా కమిటీ వాళ్ల బాధ్యతే కాదు, అందరి బాధ్యత. ఎవరు గెలిచినా కూడా వాళ్లను వెనకఉండి నడిపిస్తాం, ప్రోత్సహిస్తాం’’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- యూపీ: ‘రైతుల్ని కారుతో గుద్ది చంపిన కేసు’లో కేంద్ర మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రా అరెస్ట్
- 'వృద్ధాప్యం ఒక వ్యాధి, దాన్ని నయం చేయవచ్చు' -హార్వర్డ్ శాస్త్రవేత్త డేవిడ్ సింక్లెయిర్
- చైనాలో తైవాన్ శాంతియుతంగా కలవాల్సిందేనన్న షీ జిన్‌పింగ్ -BBC Newsreel
- ఇమ్రాన్ ఖాన్ పాలనలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎందుకు పతనమవుతోంది?
- ఎయిర్ ఇండియా మళ్లీ టాటా గూటికి చేరడం వల్ల ఎలాంటి మార్పులు రావచ్చు?
- అస్సాంలో ముస్లిం యువకుడి హత్యపై ఓఐసీ ప్రకటన.. ఇస్లామిక్ దేశాల జోక్యంపై భారత్ ఏమందంటే..
- హెటిరో ఫార్మా సంస్థలో ఐటీ సోదాలు, రూ. 142 కోట్ల నగదు స్వాధీనం
- పాకిస్తాన్లో భూకంపం, స్పెయిన్‌లో బద్దలైన అగ్నిపర్వతం... ఈ వారం విశేషాల ఫోటో ఫీచర్
- "చపాతీని కొలవడానికి నా భర్త రోజూ స్కేలు తీసుకొని భోజనానికి కూర్చుంటాడు!"
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













