కేసీఆర్: "దళిత బంధు ఎంతమందికైనా ఇస్తాం, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా" - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, fb/telangana cmo
దళిత బంధు పథకాన్నినాలుగేళ్లలో తెలంగాణలో 17 లక్షల దళిత కుటుంబాలకు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
''దళిత బంధును ఎంత మందికి ఇస్తరని అంటున్నరు. ఎంత మందికైనా ఇస్తం. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా? తెలంగాణలో 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి. అన్ని కుటుంబాలకూ రూ.10 లక్షల చొప్పున ఇస్తే లక్షా 70 వేల కోట్ల రూపాయల ఖర్చవుతుంది. ఏడాదికి ముప్పయి, నలభై వేల కోట్ల రూపాయల చొప్పున బడ్జెట్ పెట్టి మూడు, నాలుగేళ్లలో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తాం'' అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
హుజూరాబాద్ నియోజక వర్గంలోని శాలపల్లిలో సోమవారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో 'జై భీం' అంటూ సీఎం కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
‘‘దళితులు తరతరాలుగా దోపిడీకి, వివక్షకు గురవుతున్నారు. వారికి సామాజిక విముక్తి కలిగించేందుకు మహత్తర ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు. మహా ఉద్యమం. కచ్చితంగా విజయ తీరాలకు చేరుతుంది. ఇందులో అనుమానాలు, అపోహలకు తావుండదు'' అని స్పష్టం చేశారు.
''ఈ కిరికిరిగాళ్లున్నరు. ఒకేసారి చెబితే హార్ట్ ఫెయిలై చస్తరని ఒకటి తర్వాత ఒకటి చెబుతున్నా. దళిత వాడలన్నీ బంగారు మేడలవుతాయి. ఇవాళ్టి నుంచి పట్టుబడితే వెన్నెల విరజిమ్మాలి'' అని సీఎం ఆకాంక్షించారని పత్రిక తెలిపింది.
దళిత బంధు పథకం అమలుపై అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, 75 ఏళ్ల స్వాతంత్య్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ సీఎం అయినా... దేశంలో ఏ ప్రధాని అయినా, ఏ పార్టీ అయినా, ఇంకెవడన్నా ఇంటికి 10 లక్షలు ఇవ్వాలన్న ఆలోచన చేశారా? అని సీఎం కేసీఆర్ నిలదీశారు.
‘‘ఏకాన ఇవ్వనోడు మాట్లాడుడు మొదలు పెట్టిండ్రు. దళితులు బాగు పడవద్దా? కుండ బద్దలు కొట్టి చెబుతున్నా. ఇచ్చేవాడు ఇస్తడు.. తీసుకునే వాడు తీసుకుంటడు. నడుమ వీళ్లకెందుకు కడుపు నొప్పి!?'' అన్నారు.
''రాష్ట్ర జనాభాలో అత్యధికంగా 75 లక్షలు దళితులే. ఇది ప్రజాస్వామ్యమే అయితే, ప్రజలు ప్రభువులే అయితే.. మరి దళిత ప్రజలు ఎందుకు ప్రభువులుగా లేరు? ఎందుకిట్ల ఉన్నారు? దళిత సమాజంపై భారతదేశ సమాజం అవలంబిస్తున్నది వివక్ష కాదా!? ఈ వివక్ష ఎన్ని యుగాలు, ఎన్ని శతాబ్దాలు కొనసాగాలి? ఎన్నేళ్లు బాధలతో ఉండాలి!?'' అని కేసీఆర్ ప్రశ్నించారని పత్రిక రాసింది.
''ఈ ఉద్యమంతో దేశంలో దళిత జాతి మేల్కొంటుంది. వాళ్లకు ఉద్యమ స్ఫూర్తి వస్తుంది. అన్ని రాష్ట్రాల్లో అగ్గి రగులుకుంటుంది. పిడికిలి ఎత్తి తెలంగాణలో జరిగినది ఇక్కడ ఎందుకు జరగదని నిలదీస్తారు. దేశమే మన వద్ద నేర్చుకుని పోవాలి. అందరం ముందుకు పోయి విజయం సాధించాలి'' అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారని ఆంధ్రజ్యోతి వివరించింది.

ఫొటో సోర్స్, TSMSIDC
గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు మహిళలపై అత్యాచారం
గాంధీ ఆస్పత్రిలో రోగికి సహాయకులుగా వచ్చిన ఇద్దరు మహిళలపై లైంగిక దాడికి జరిగిందని నమస్తే తెలంగాణ దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
గాంధీ దవాఖానలో పేషేంటుకు సహాయకులుగా వచ్చిన ఇద్దరు మహిళలకు దవాఖాన సిబ్బంది ఒకరు మత్తుమందు ఇచ్చి లైంగికదాడికి పాల్పడ్డాడు.
బాధితులు చిలకలగూడ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహబూబ్‌నగర్‌కు చెందిన ఒక వ్యక్తి (45) కిడ్నీ పేషెంట్.
అదే గ్రామానికి చెందిన గాంధీ దవాఖాన ల్యాబ్ టెక్నీషియన్ ఉమమహేశ్వర్‌రావు సహకారంతో ఈనెల 4న గాంధీ దవాఖానలో చేర్చారు.
పేషేంట్‌తో పాటు అతని భార్య (40) మరదలు (38), వారి అక్కకుమారుడు తోడుగా వచ్చారు.
పేషేంట్‌ను ఈనెల 5న మరో వార్డుకు తరలించడంతో మహిళలు ఇద్దరు అడ్రస్ దొరకక తికమక పడ్డారు.
పెషెంట్‌ను చూపిస్తానని చెప్పిన ఉమమహేశ్వర్‌రావు తమను ఓ గదికి తీసుకువెళ్లి బందించి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈనెల 11న పేషెంట్ తన భార్య, మరదలు కనిపించకపోవడంతో గాంధీ దవాఖాన నుంచి డిశ్చార్జి కాకుండానే గ్రామానికి వెళ్లిపోయాడు. తరువాత మరదలు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించింది.
అక్క కనిపించడం లేదని తెలుపడంతో వారి అక్కకుమారుడు, ల్యాబ్ టెక్నీషియన్ ఉమామహేశ్వర్‌రావులు గాంధీ దవాఖాన వద్ద వెతకగా ఆమె విజిటర్స్ విభాగం వద్ద కనిపించింది.
ఊరికి వెళ్లిన భార్య,మరదలు ఈనెల15న మహబూబ్‌నగర్ 1టౌన్‌లో ఫిర్యాదు చేయగా వారు చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు.
దీంతో బాధితులు సోమవారం చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
బాధితులను బరోసాకు పంపినట్లు, వారిద్వారా పూర్తి సమాచారం సేకరిస్తున్నామని గోపాలపురం ఏసీపీ వెంకటరమణ తెలిపారని నమస్తే తెలంగాణ వివరించింది.

ఫొటో సోర్స్, www.ap.gov.in/
జీవోలు కనపడకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ప్రభుత్వ ఉత్తర్వుల్ని వెబ్‌సైట్‌లో ఉంచకూడదని ఏపీ ప్రభుత్వం వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లు ఈనాడు దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
ప్రభుత్వ ఉత్తర్వు (జీవో)లను ఇకపై ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
2008 నుంచి ప్రభుత్వం జీవోలను వెబ్‌సైట్‌లో ఉంచుతోంది. తాజా నిర్ణయంతో ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజలకు కనపడవని ఈనాడు రాసింది.
ప్రభుత్వం జీవోల్ని ఉంచే 'గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూ రిజిస్టరులో (జీఓఐఆర్)' జీవో నంబర్లు జనరేట్ చేసే విధానాన్ని ఇకపై అనుసరించవద్దని, అన్ని ప్రభుత్వశాఖల కార్యదర్శులు దీనికి అనుగుణంగా వ్యవహరించాలని సాధారణ పరిపాలనశాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శి (రాజకీయ) రేవు ముత్యాలరాజు సోమవారం లేఖ పంపించారని పత్రిక తెలిపింది.
'ఇకపై జీవోలకు నంబర్లు కేటాయించడం, వాటిని ప్రదర్శించడం ఏపీ సచివాలయం ఆఫీసు మాన్యువల్, ప్రభుత్వ బిజినెస్ రూల్స్‌కు అనుగుణంగానే జరగాలి' అని లేఖలో స్పష్టం చేశారని ఈనాడు వివరించింది.

ఫొటో సోర్స్, TTD
త్వరలో టీటీడీ అగరుబత్తులు
తిరుమల తిరుపతి దేవస్థానం త్వరలో అగరుబత్తుల విక్రయాలు చేపట్టనున్నట్లు సాక్షి దిన పత్రిక ఒక వార్త ప్రచురించింది.
తిరుమల శ్రీవారికి వినియోగించిన పూలు.. తిరిగి పరిమళాలు వెదజల్లేలా టీటీడీ కార్యాచరణ రూపొందించింది.
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ ఆలయాల్లో వాడిన పుష్పాలతో సుగంధాలు వెదజల్లే అగరబత్తులు తయారు చేయాలని నిర్ణయించిందని పత్రిక చెప్పింది.
ఈ మేరకు బెంగళూరుకు చెందిన దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోగా, ఆ సంస్థ ఏడు రకాల బ్రాండ్లతో అగరబత్తులు తయారు చేసి ఇస్తోంది.
నో లాస్ నో గెయిన్ ప్రాతిపదికన ఆ సంస్థ అగరబత్తులను టీటీడీకి అందిస్తోంది. వీటిని తిరుమల, తిరుచానూరు, శ్రీనివాస మంగాపురంతో పాటు టీటీడీ ఆలయాల్లో విక్రయానికి అందుబాటులో ఉంచుతారు.
సెప్టెంబర్ తొలి వారంలో తిరుమలలో తొలి విడతగా వీటి విక్రయాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని గో సంరక్షణకు వినియోగించాలని టీటీడీ నిర్ణయించిందని సాక్షి వివరించింది.
ఇవి కూడా చదవండి:
- హుజూరాబాద్: ఉప ఎన్నికలకు ముందు ప్రభుత్వం భారీ సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం సబబేనా?
- ఓబీసీ బిల్లు: 127వ రాజ్యాంగ సవరణతో ఎవరికి లాభం, కులాలకా, పార్టీలకా?
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు - అభిప్రాయం
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- నీరజ్ చోప్రా: ఒలింపిక్ గోల్డ్ గెలిచిన భారత అథ్లెట్ కెరీర్లో 5 కీలక మలుపులు
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కరోనా కాలంలో భారత ‘వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)













