చేతన్ కుమార్: బ్రాహ్మణిజంపై వివాదంలో కన్నడ హీరో ఎలా చిక్కుకున్నారు? ఈ వివాదం ఎలా మొదలైంది?

ఫొటో సోర్స్, Instagram/chetanahimsa
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ కోసం
బ్రాహ్మణిజంపై చేసిన వ్యాఖ్యలకుగాను కన్నడ నటుడు, సామాజిక కార్యకర్త చేతన్ కుమార్‌ను నాలుగు గంటలపాటు బెంగళూరు పోలీసులు విచారించారు.
చేతన్ చేసిన వ్యాఖ్యలపై కన్నడ చిత్ర పరిశ్రమలో వివాదం రాజుకుంది. కొందరు ఆయకు మద్దతు పలకగా, మరికొందరు ఆయన్ను విమర్శిస్తున్నారు. ఈ విషయంలో చేతన్‌పై కేసు కూడా నమోదైంది.
ముఖ్యంగా వెనుకబడిన కులాల ప్రతినిధులు చేతన్‌కు మద్దతు పలుకుతున్నారు. అయితే, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు మాత్రం స్పందించడం లేదు.
‘‘చేతన్ అహింస’’గా సుపరిచితుడైన చేతన్ రెండు వారాల క్రితం సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టారు. ఇది వైరల్ అయ్యింది.
ఈ వీడియోతోనే వివాదం మొదలైంది. దీనిలో ఆయన చేసిన వ్యాఖ్యలకుగాను బ్రాహ్మణ్ డెవలప్‌మెంట్ బోర్డ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మరోవైపు భారత సంతతి వ్యక్తిగా ఉంటూ ఇక్కడి నిబంధలను ఉల్లంఘించినందుకు ఆయన్ను అమెరికాకు తిరిగి పంపించేయాలని ఫారెనర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ)లోనూ ఓ సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేశారు.
‘‘మేం అడిగిన ప్రశ్నలకు చేతన్ సుదీర్ఘ సమాధానాలు ఇచ్చారు. మేం వాటిని రికార్డు చేశాం. మరికొన్ని ప్రశ్నలు కూడా ఆయన్ను అడగాల్సి ఉంది’’అని బీబీసీకి ఓ పోలీసు అధికారి తెలిపారు.
ఐపీసీలోని సెక్షన్ 153ఏ, 295ఏ సెక్షన్‌లను చేతన్ ఉల్లంఘించారా? లేదా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
అంటే భిన్న మతాలు లేదా జాతుల మధ్య చిచ్చు పెట్టేందుకు కావాలనే ఆ వ్యాఖ్యలు చేశారా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
చేతన్ ఏం అన్నారు?
‘‘4000ఏళ్లుగా బసవ, బౌద్ధ సిద్ధాంతాలను బ్రాహ్మణిజం అణచివేసింది. 2500 ఏళ్ల క్రితం బ్రాహ్మణిజంపై బుద్ధుడు పోరాడాడు. బుద్ధుడు విష్ణు అవతారం కాదు. అది అబద్ధం’’అని వ్యాఖ్యలు చేస్తూ చేతన్ ఒక వీడియో చేశారు.
ఆ తర్వాత ఆయన మరో ట్వీట్ కూడా చేశారు. ‘‘స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం లాంటి సిద్ధాంతాలను బ్రాహ్మణిజం వ్యతిరేకిస్తుంది. బ్రాహ్మణిజాన్ని కూకటి వేళ్లతో పెకలించాలి – అంబేడ్కర్; పుట్టినప్పుడు అందరిదీ ఒకే జాతి. ఒకే కులం. బ్రాహ్మణులు మాత్రమే గొప్పవారు.. మిగతవారు అంటరానివారు.. అని చెప్పడంలో అర్థంలేదు – పెరియార్’’అని చేతన్ ట్వీట్ చేశారు.
కరోనా సమయంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సాయం చేసేందుకు కన్నడ నటుడు ఉపేంద్ర ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమాన్ని ఉద్దేశించి చేతన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కేవలం బ్రాహ్మణులను మాత్రమే ఆ కార్యక్రమానికి పిలిచారంటూ ఉపేంద్రను చేతన్ విమర్శించారు.
మనం కులాల గురించి మాట్లాడుకున్నంత వరకు... కులం అనే భావన అలానే ఉంటుందని ఉపేంద్ర వ్యాఖ్యానించారు. అయితే, కుల అసమానతలకు మూల కారణం బ్రాహ్మణిజమేనని చేతన్ వ్యాఖ్యానించారు.
వీరిద్దరి మధ్య మొదలైన మాటల యుద్ధం సోషల్ మీడియాకు పాకింది. వీరి అభిమానులు కూడా సోషల్ మీడియాలో చర్చలు మొదలుపెట్టారు.
‘‘నేను బ్రాహ్మణులను వ్యతిరేకించడం లేదు. బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకిస్తున్నాను. కర్నాటకలోని చాలా మంది బ్రాహ్మణుల్లానే ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకిస్తున్నారు’’అని చేతన్ వ్యాఖ్యానించారు.
చేతన్ వ్యాఖ్యలపై బ్రాహ్మణ్ డెవలప్‌మెంట్ బోర్డు, విప్ర యువ వేదిక.. పోలీసులకు ఫిర్యాదు చేశాయి.
‘‘అతడు అమెరికా పౌరుడని మాకు తెలియదు. భారత సంతతి కార్డుపై భారత్‌లో అడుగుపెట్టేవారు ఇలాంటి పనులు చేయకూడదు’’అని సామాజిక కార్యకర్త గిరీశ్ భరద్వాజ్.. బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Instagram/chetanahimsa
చేతన్ కుమార్ ఎవరు?
37ఏళ్ల చేతన్ కుమార్ అమెరికాలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులే.
‘‘యేల్ యూనివర్సిటీ నుంచి చేతన్ భారత్ వచ్చినప్పుడు.. ఆయనలో కొత్తదనం కనిపించేది’’అని ఆ దినగళు సినిమా డైరెక్టర్ కేఎం చేతన్య వ్యాఖ్యానించారు.
చేతన్ హీరోగా నటించిన ఈ సినిమా 2007లో విడుదలైంది. ఇది విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
మరికొన్ని సినిమాల్లోనూ చేతన్ నటించారు. అయితే, అవి కమర్సియల్‌గా విజయం సాధించలేకపోయాయి. అయితే, 2013లో వచ్చిన మైనా సినిమా విమర్శకులను మెప్పించింది.
ఆ తర్వాత సినిమా అథీర్థ.. బాక్సీఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అన్ని కమర్సియల్ హంగులు ఉన్నప్పటికీ ఇది విజయం సాధించలేకపోయింది. దీనికి చేతన్ రాజకీయ భావాలే కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి.
అదే సమయంలో సామాజిక కార్యకర్తగా చేతన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
‘‘అతడు మంచి నటుడు. కానీ విజయవంతం కాలేకపోయారు. అందరూ ఆయన్ను ఆ దినగళు చేతన్ అని పిలుస్తుంటారు. ఇప్పుడు ఆయన సామాజిక కార్యకర్తగా ముందుకు వెళ్తున్నారు’’అని డైరెక్టర్ మంజునాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Instagram/chetanahimsa
సామాజిక అంశాల్లో..
కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖులు దాదాపుగా సామాజిక అంశాలపై తమ భావాలను బయటపెట్టరు. కొందరు మాత్రం కావేరీ జల వివాదం లాంటి అంశాలపై నిరసన తెలుపుతుంటారు. అది కూడా తమిళనాడులో సిని పరిశ్రమ ఇలాంటి వివాదాల్లో చురుగ్గా పాల్గొంటుంది కాబట్టే.
కానీ చేతన్ మాత్రం అలాకాదు. కొడగు జిల్లాలో గిరిజనులను అటవీ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు తరలించడంపై చేతన్ ధర్నా చేపట్టారు. గిరిజనులకు అన్ని సదుపాయాలతో పునరావాసం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇతర అంశాల్లానే, చేతన్‌పై నమోదైన కేసు విషయంలోనూ సినీ ప్రముఖులు స్పందించేందుకు ముందుకు రావడం లేదు.
‘‘ఈ అంశం గురించి నేను మాట్లాడాలని అనుకోవట్లేదు’’అని ఒక సినీ ప్రముఖుడు చెప్పారు. ‘‘ఆ అబ్బాయి గురించి నేనేమీ చెప్పాలని అనుకోవట్లేదు’’అని మరో ప్రముఖుడు వివరించారు. ‘‘ఇలాంటి వివాదాలతో అయినా, వార్తల్లో నిలవాలని అతడు భావిస్తున్నాడు కావొచ్చు’’అని మరొకరు వ్యాఖ్యానించారు.
‘‘మన చిత్ర పరిశ్రమలో ప్రముఖులు వివాదాల జోలికి పోవాలని అనుకోరు. గిరిజనుల పునరావాసం కావొచ్చు లేదా శ్రుతి హరిహరన్ మీటూ కేసు కావొచ్చు.. ఎవరూ మాట్లాడరు. శ్రుతికి చేతన్ మద్దతు తెలిపినప్పుడు అందరూ అతణ్ని విలన్‌గా చూశారు’’అని మంజునాథ్ వ్యాఖ్యానించారు.
‘‘గిరిజనుల గురించి ధర్నా చేపట్టినప్పుడే చేతన్ సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నాడని తెలిసింది. అతడు నిజాయితీ పరుడు’’అని మంజునాథ్ అన్నారు.
శ్రుతి.. కన్నడ, తమిళ్, మలయాళ సినిమాల్లో నటించారు. మీటూ ఉద్యమంలో భాగంగా సినీ ప్రముఖుడు అర్జున్ సర్జాపై ఆమె ఆరోపణలు చేశారు.
ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ రైట్స్ అండ్ ఈక్వాలిటీ పేరుతో ఓ వేదికను కూడా చేతన్ ఏర్పాటుచేశారు. సినిమాలకు సంబంధించి వేధింపులకు గురవుతున్న, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఇది పనిచేస్తోంది.
‘‘తనకు ఎంత పేరు వచ్చిందని చేతన్ ఎప్పుడూ పట్టించుకోరు. తను చేయాలి అనుకునేవి చేస్తారు. మన చిత్ర పరిశ్రమలో హక్కులకు చోటులేదు. వేధింపులకు గురవుతున్నవారికి ఆయన సాయం చేస్తున్నారు’’అని శ్రుతి వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Instagram/sruthi_hariharan22
ఆ ఇద్దరి మద్దతు
తాజా వివాదం విషయంలో మంజునాథ్, శ్రుతి.. చేతన్‌కు మద్దతు పలికారు.
‘‘ఆయన బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఏమీ చెప్పలేదు. బ్రహ్మణ సంస్కృతి గురించి మాట్లాడారు. సినీ పరిశ్రమలో దాని వేళ్లు బాగా ఊనుకున్నాయి’’అని మంజునాథ్ అన్నారు.
‘‘నేను బ్రాహ్మణుల కుటుంబం నుంచే వచ్చాను. అయితే, బ్రాహ్మణులు పాటించే కొన్ని విధానాలను నేను అనుసరించను’’అని శ్రుతి చెప్పారు.
‘‘సమానత్వ భావనను బ్రాహ్మణిజం పాటించదని చేతన్ చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదు. ముఖ్యంగా రుతుక్రమ విషయంలో ఇలాంటి విధానాలు స్పష్టంగా కనిపిస్తాయి. చేతన్ వ్యాఖ్యలతో వేరొకరి మనోభావాలు దెబ్బతింటాయని నేను అనుకోను’’అని ఆమె వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- మియన్మార్: ఆంగ్ సాన్ సూచీపై అత్యంత తీవ్రమైన అభియోగాలు
- అయోధ్య: రామ మందిరం ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- మిల్ఖా సింగ్: కోవిడ్ అనంతర సమస్యలతో చనిపోయిన భారత ప్రఖ్యాత అథ్లెట్
- మియన్మార్: ''43 మంది పిల్లలను సైన్యం చంపేసింది''
- రష్యా-అమెరికా చర్చల గురించి సైబర్ ముఠాలకు భయమే లేదా?
- 'బాబా కా ధాబా' కాంతా ప్రసాద్ ఆరోగ్యం విషమం... దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- ఇరాన్ ఎన్నికలు: హసన్ రౌహానీ తరువాత అధ్యక్ష పదవిని చేపట్టేదెవరు?
- నిరసనకారులపై కాల్పులు జరిగిన రోజు రాత్రి విందులో పాల్గొన్న మియన్మార్ ఆర్మీ జనరల్స్
- కిమ్ జోంగ్ ఉన్: 'అమెరికాతో 'చర్చలకు, ఘర్షణకు' ఉత్తర కొరియా రెడీ అవుతోంది'
- ఆన్లైన్ వీడియో టెక్ వ్యాపార సామ్రాజ్యాన్ని జయించిన ఇరానీ మహిళ
- మియన్మార్‌లో ‘సరోంగ్ విప్లవం’: మహిళలు నడుముకు కట్టుకునే 'సరోంగ్' వస్త్రం.. నిరసనకారుల ఆయుధంగా మారిన వైనం
- సోనియా, రాహుల్, ప్రియాంక వ్యాక్సీన్ తీసుకున్నారా... ప్రశ్నించిన బీజేపీ, స్పందించిన కాంగ్రెస్
- కరోనావైరస్ మృతుల విషయంలో ఇరాన్ ఎందుకు వాస్తవాలను దాచి పెడుతోంది...
- జీ 7: రెవెన్యూ ఆర్జించే చోటే పన్నులు వసూలుచేసే ఒప్పందానికి పచ్చజెండా
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- క్రికెట్ 2050: వాతావరణ మార్పులతో ఈ ఆట ఆడే తీరే మారిపోతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








