దేశ జనాభా 134 కోట్లకు పెరిగింది - ప్రెస్ రివ్యూ

ఇండియాలో జనన, మరణాల రేట్లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఇండియాలో జనన, మరణాల రేట్లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి

దేశ జనాభా అప్రతిహతంగా పెరుగుతోంది. తాజా లెక్కల ప్రకారం 133.89 కోట్లకు చేరిందని ఈనాడు పత్రిక తెలిపింది.

కన్నుతెరిస్తే జననం, కన్నుమూస్తే మరణం అన్నట్లుగా దేశంలో జనన, మరణాలు పెరిగిపోతున్నాయి. నిమిషానికి సగటు 51 మంది శిశువులు పుడుతుంటే 16 మంది కన్నుమూస్తున్నారు. మొత్తంమీద నికరంగా దేశ జనాభాలో నిమిషానికి 35 మంది అదనంగా కలుస్తున్నారు.

2019 జనవరి 1 నుంచి డిసెంబరు 31 వరకూ దేశం మొత్తమ్మీద నమోదైన (రిజిస్టర్డ్‌) జనన, మరణాల లెక్కల ఆధారంగా 2019 డిసెంబరు 31 నాటికి దేశ జనాభా తాజా వివరాలను జన గణన విభాగం విడుదల చేసింది.

* ఏడాది (2019) వ్యవధిలో దేశంలో 2.67 కోట్ల మంది శిశువులు జన్మించగా మరణాలు 83 లక్షలున్నాయి.

* దేశంలో నమోదైన జననాల్లో 81.2 శాతం ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగాయి.

* మొత్తం 83.01 లక్షల మరణాల్లో 34.5 శాతం మందికి మరణించే సమయంలో ఎలాంటి వైద్య సదుపాయం అందలేదు. ఇవన్నీ సహజ మరణాలుగా నమోదయ్యాయి. ఆసుపత్రుల్లో చేరి వైద్యం పొందుతూ సంభవించిన మరణాలు 32.1 శాతమున్నాయి. ఇతర కారణాలతో మిగతా మరణాలు వాటిల్లాయి.

* పుట్టిన వెంటనే కన్నుమూసిన శిశు మరణాలు 1,65,257 కాగా ఇందులో 75.5 శాతం పట్టణాల్లో, మిగిలిన 24.5 శాతం గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి.

* దేశంలో జనన, మరణాల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. కేవలం 20 సంవత్సరాల వ్యవధిలోనే 118 శాతం అదనంగా జననాలు పెరిగాయి.

ఉదాహరణకు 1999లో దేశంలో 1.22 కోట్ల మంది పుడితే 2019 సంవత్సరంలో అంతకన్నా మరో 118 అదనంగా పెరిగి 2.67 కోట్ల మంది పుట్టడం గమనార్హం.

ఇదే కాలవ్యవధిలో మరణాలు ఏకంగా 129 శాతం పెరిగి 36.23 లక్షల నుంచి 83 లక్షలకు చేరడం గమనార్హం.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

ఏపీలో సడలించిన కర్ఫ్యూ వేళలు

ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న కర్ఫ్యూ వేళలను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. కర్ఫ్యూ సడలింపు ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు ఉండగా, ఈ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలిస్తారని సాక్షి పత్రిక తెలిపింది.

సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను కచ్చితంగా అమలు చేయనున్నారు. కోవిడ్‌ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నందున తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం కర్ఫ్యూ సడలింపు ఇదివరకటి లాగే (ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మినహాయింపు) కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వ కార్యాలయాలకు రెగ్యులర్‌ టైమింగ్స్‌ అమలు చేయాలని, ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు వచ్చేలా మార్పులు చేయాలని నిర్ణయించారు. దుకాణాలను మాత్రం సాయంత్రం 5 గంటలకే మూసి వేయనున్నారు.

కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై సీఎం జగన్‌ శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఆస్పత్రుల్లో పీఎస్‌ఏ ఆక్సిజన్‌ జనరేషన్‌ యూనిటే కాకుండా క్రయోజనిక్‌ ట్యాంకర్లను పెట్టాల్సిందిగా సీఎం ఆదేశించారు. దీనివల్ల పూర్తి స్థాయిలో ఆక్సిజన్‌ సరఫరాకు భరోసా ఉంటుందన్నారు.

వీటితోపాటు డి–టైప్‌ సిలెండర్లు కూడా ఉంచడం వల్ల మూడు ఆక్సిజన్‌ నిల్వలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. రోగులకు ఆక్సిజన్‌ అందించడంలో సమర్థవంతమైన ప్రత్యామ్నాయ విధానాలు అందుబాటులోకి వచ్చినట్లు అవుతుందని స్పష్టం చేశారు.

కొత్తగా నిర్మించదలచిన 350 టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్‌ను వేగవంతం చేయాలని ఆదేశించారు. దీనివల్ల మెడికల్‌ ఆక్సిజన్‌ విషయంలో రాష్ట్రానికి స్వయంసమృద్ధి వస్తుందని పేర్కొన్నారు. అవసరం లేని సమయంలో ఆ ప్లాంట్‌ నుంచి వచ్చే ఆక్సిజన్‌ను పరిశ్రమలకు ఇవ్వాలని సూచించారు.

ప్రతి 100 బెడ్లు, ఆపై పడకలున్న ఆస్పత్రుల వద్ద 10 కిలో లీటర్ల ఆక్సిజన్‌ ట్యాంకులను స్టోరేజీ కింద పెడుతున్నామని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా కోవిడ్‌ నియంత్రణ చర్యలు, థర్డ్‌ వేవ్‌ సన్నద్ధత గురించి వివరించారు. ఈ సమావేశంలో ఉప మఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఏపీ సీఎం జగన్

ఫొటో సోర్స్, FACEBOOK/YCP

ఫొటో క్యాప్షన్, ఏపీ సీఎం జగన్

'ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని అభ్యర్థించడం మినహా ఏమి చేయలేం'.. జగన్

లోక్‌సభలో ఎన్డీయేకు పూర్తి మెజారిటీ ఉన్నందున ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని అభ్యర్థించడం మినహా ఏం చేయలేమని జగన్‌ అన్నారని ఆంధ్రజ్యోతి ఒక కథనంలో తెలిపింది.

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం లేదని, బీజేపీకి పూర్తి మెజారిటీ ఉన్నందున హోదాపై పదే పదే అడగడం మినహా మనమేమీ చేయలేని పరిస్థితి ఉందని తేల్చి చెప్పారు. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూనే ఉన్నామని జగన్‌ వెల్లడించారు.

రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2021-22 ఏడాదికి సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌ను శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన విడుదల చేశారు.

ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. ప్యాకేజీ, ఓటుకు నోటు కేసు కోసం గత పాలకులు ప్రత్యేక హోదా అంశాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఇద్దరు పెద్దలు కేంద్ర మంత్రి పదవులు కూడా చేపట్టారని పేర్కొన్నారు.

గత ప్రభుత్వం మాయ మాటలతో ప్రజలకు భ్రమ కల్పించిన విషయం అందరికీ తెలిసిందేనని జగన్‌ అన్నారు. టీడీపీ నాయకులు ప్రత్యేక హోదా సాధించకపోగా.. ప్రైవేటు రంగంలోనైనా అన్నో, ఇన్నో ఉద్యోగాలు వస్తాయన్న ఆశలనూ తాకట్టు పెట్టారన్నారు.

వాళ్లు రాజీపడడం వల్ల ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ హోదా ఇవ్వండి అంటూ అభ్యర్థించాల్సి వస్తోందన్నారు. ఎన్డీయేకు పూర్తి మెజారిటీ ఉన్నందున ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామన్నారని పత్రిక తెలిపింది.

GETTY IMAGES

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, GETTY IMAGES

ఇప్పుడు పోస్టాఫీసుల్లోనే రైతుబంధు

బ్యాంకులు, ఏటీఎంలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోస్టాఫీసుల్లోనే రైతుబంధు నగదును పొందే అవకాశాన్ని పోస్టల్‌శాఖ కల్పించిందని నమస్తే తెలంగాణ ఒక వార్త రాసింది.

రాష్ట్రవ్యాప్తంగా 5,794 పోస్టాఫీసుల్లో మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేసింది. 2020-21 యాసంగి సీజన్‌లో 1.73 లక్షల మంది రైతులకు రూ.169 కోట్ల రైతుబంధు నగదును అందించామని పోస్టల్‌ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జే శ్రీనివాస్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ప్రస్తుతం వానకాలం సీజన్‌లో రైతుబంధు నగదు పంపిణీ కోసం 5,794 చోట్ల మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆధార్‌, ఫోన్‌ నంబర్‌తో లింకైన బ్యాంక్‌ ఖాతాల నుంచి అన్నదాతలు రైతుబంధు నగదును సులువుగా విత్‌డ్రా చేసుకోవచ్చని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)