ఖైదీలు కళ్లజోడు, నీరు తాగడానికి స్ట్రా అడిగినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదు?

afp

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, వరవరరావు
    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మామూలుగానే జైలు జీవితం ఎంతో కఠినంగా ఉంటుంది. ఇప్పుడు మరింత కఠినమైందని.. ఈమధ్య కాలంలో ఇండియాలోని జైలు అధికారులు ఖైదీల పట్ల మరింత నిర్దయగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్యంగా మానవ హక్కుల కార్యకర్తలతో అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

ఖైదీలతో వ్యవహరిస్తున్నప్పుడు కొంత దయ, మానవత్వం చూపించాలని ఇటీవలే బాంబే హై కోర్టు ముంబైలోని తలోజా జైలు అధికారులను మందలించింది.

"జైలర్లకు కొన్ని వర్క్‌షాపులు నిర్వహించాల్సిన అవసరం కనిపిస్తోంది.

అంత చిన్న చిన్న వస్తువులు ఇవ్వడానికి కూడా ఎందుకు నిరాకరిస్తున్నారు?

వాళ్లు అడిగినవి మానవులు ఉపయోగించే అతి సాధారణమైన వస్తువులు" అని జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ ఎంఎస్ కర్ణిక్ అన్నారు.

నిర్బంధంలో ఉన్న యాక్టివిస్ట్ గౌతమ్ నవలఖా అడిగినది కేవలం ఒక కళ్లజోడు.

ఆయన కళ్లజోడును జైల్లో ఎవరో దొంగిలించారని, కొత్త కళ్లజోడు పంపిస్తే దాన్ని జైలు అధికారులు తిరస్కరించారని నవలఖా కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు.

"నవంబర్ 30న నాకు ఫోన్ చేశారు. అప్పటికే ఆయన కళ్లజోడు పోయి మూడు రోజులైంది.

ఆయనకు 68 ఏళ్లు. ఆయనకు పవర్ ఎక్కువ ఉన్న లెన్స్ కావాలి.

కళ్లజోడు లేకపోతే ఆయనకు ఏమీ కనిపించదు" అని నవలఖా సహచరి సహ్బా హుసైన్ తెలిపారు.

మార్చ్‌లో కోవిడ్ మహమ్మారి విజృంభించడం ప్రారంభమైన దగ్గరనుంచీ జైల్లో నిర్బంధంలో ఉన్నవారిని కలుసుకోవడానికి కుటుంబ సభ్యులనుగానీ, లాయర్లనుగానూ అనుమతించడం లేదు.

ఏవైనా వస్తువులు పంపించినా అంగీకరించడం లేదు.

గౌతమ్ నవలాఖా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గౌతమ్ నవలాఖా

జైలు సూపరింటెండెంట్‌తో నవలఖా మాట్లాడారని, కళ్లజోడు తెప్పించుకోవడానికి అంగీకరించారని తనతో చెప్పినట్లు సహ్బా హుసైన్ తెలిపారు.

దిల్లీలో నివసిస్తున్న హుసైన్ వెంటనే కొత్త కళ్లజోడు తెప్పించి డిసెంబర్ 3న పోస్ట్ చేశారు.

"మూడు నాలుగు రోజుల తరువాత పార్సిల్ చేరిందా లేదా అని విచారిస్తే, డిసెంబర్ 5కే చేరిందని తెలిసింది. కానీ జైలు అధికారులు దాన్ని అంగీకరించలేదని, తిరుగుటపాలో పంపించేశారని తెలిసింది" అని హుసైన్ చెప్పారు.

దీని గురించి సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ఆగ్రహం, హై కోర్టు జడ్జ్‌ల మందలింపుల తరువాత జైలు అధికారులు నవలఖాకు కొత్త కళ్లజోడు అందించారు.

ప్రభుత్వేతర సంస్థ ‘పీపుల్స్ యూనియన్ ఫర్ డెమొక్రటిక్ రైట్స్‌’కు సెక్రటరీగా పని చేసిన నవలఖా ఒక సాధారణ ఖైదీ కాదు.

అంతర్జాతీయ గౌరవాన్ని పొంది, జీవితమంతా మానవ హక్కుల పరిరక్షణకు కృషిచేసిన వ్యక్తి.

భీమా కోరేగావ్ కేసులో నవలఖాను నిర్బంధించారు. ఏప్రిల్‌ నుంచి ఆయన జైల్లో ఉన్నారు.

మహారాష్ట్రలోని భీమా కోరేగావ్ గ్రామంలో 2018 జనవరి 1వ తేదీన జరిగిన దళిత సంఘాల ర్యాలీ సందర్భంగా కుల హింసను ప్రేరేపించారనే ఆరోపణలతో గత రెండేళ్లల్లో 16మంది యాక్టివిస్టులు, కవులు, లాయర్లను అరెస్ట్ చేశారు.

అయితే, వీరంతా కూడా తమపై వచ్చిన అభియోగాలను ఖండించారు.

కేవలం నవలఖాకు మాత్రమే ఈ పరిస్థితిని ఎదురవ్వలేదు.

అంతకు కొద్ది రోజుల ముందు, భీమా కోరేగావ్ కేసులోనే అరెస్ట్ అయిన ఫాదర్ స్టాన్ స్వామి.. మంచి నీళ్లు తాగడానికి తనకొక స్ట్రా, ఒక సిప్పర్ కావాలని అడిగారు.

దానికి కూడా జైలు అధికారులు అంగీకరించలేదు. ఈ సందర్భంగా జైలు అధికారుల ప్రవర్తనపై దేశంలో అనేకమంది ఆగ్రహం వ్యక్తం చేశారు.

యాక్టివిస్ట్, ప్రీస్ట్ అయిన 83 ఏళ్ల స్టాన్ స్వామి పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారు.

ఆయన చేతులు ఎప్పుడూ వణుకుతూ ఉంటాయి. గ్లాసుతో నీళ్లు పట్టుకుంటే ఒలికిపోతున్నాయని, నీళ్లు తాగలేకపోతున్నారని ఒక సిప్పర్ లేదా స్ట్రా ఇప్పించమని ఆయన తరపు లాయర్లు కోర్టును కోరారు.

అంత చిన్న విషయాన్ని కూడా కోర్టు నిరాకరించింది.

దాంతో సోషల్ మీడియాలో ఆగ్రహం వెల్లువెత్తింది. తలోజా జైలుకు సిప్పర్లు పంపించాలనే ప్రచారాన్ని నెటిజన్లు ప్రారంభించారు.

#SippersForStan (సిప్పర్‌ఫర్‌స్టాన్) అనే హాష్‌ట్యాగ్‌తో ఈ ప్రచారం ట్విట్టర్‌లో పెల్లుబికింది.

అనేకమంది ఆన్‌లైన్‌లో సిప్పర్లు కొని తలోజా జైలుకు పంపించారు. ఆన్‌లైన్లో కొన్నవాటి రసీదుల స్క్రీన్ షాట్లతో ట్విట్టర్ నిండిపోయింది.

"స్ట్రాలు, సిప్పర్లతో జైలును ముంచెత్తుదాం, రండి" అంటూ ముంబై నివాసి దీపక్ వెంకటేశన్ ఫేస్‌బుక్‌లో రాశారు.

గత మూడు దశాబ్దాలుగా ఫాదర్ స్టాన్ స్వామి ఆదివాసుల హక్కులకోసం పాటుపడుతున్నారు.
ఫొటో క్యాప్షన్, గత మూడు దశాబ్దాలుగా ఫాదర్ స్టాన్ స్వామి ఆదివాసుల హక్కులకోసం పాటుపడుతున్నారు.

"ఒక జాతిగా మనలో మానవత్వం ఇంకా చచ్చిపోలేదని ప్రపంచానికి నిరూపిద్దాం. నాయకులను తప్పుగా ఎంచుకుని ఉండొచ్చు.

కానీ మనలో మానవత్వం ఇంకా బతికే ఉంది. 83 ఏళ్ల వ్యక్తికి ఒక స్ట్రా ఇప్పించలేని దౌర్భాగ్య దేశం కాదు మనది" అని వెంకటేశన్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో రాశారు.

స్టాన్ స్వామి తరపు లాయర్లు కోర్టుకు వెళ్లిన మూడు వారాల తరువాత, స్వామికి సిప్పర్ అందించినట్లు జైలు అధికారులు తెలిపారు.

వరవరరావు విషయంలోనూ..

ఇదే కాకుండా, గత నెలలో కోర్టు జోక్యం చేసుకున్న తరువాతే అనారోగ్యంతో బాధపడుతున్న 80 ఏళ్ల ఏక్టివిస్ట్ వరవరరావును ఆస్పత్రికి తరలించారు.

వరవరరావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, కావలసిన వైద్య సహాయం అందించట్లేదని, గత మూడు నెలలుగా ఆయనకు కాథెటర్ మార్చలేదని..వరవరరావు తరపు న్యాయవాది ఇందిరా జైసింగ్ బాంబే హై కోర్టుకు తెలిపారు.

జైలు అధికారుల నిర్లక్ష్యాన్ని దుయ్యబడుతూ, పరిస్థితి ఇలాగే కొనసాగితే జైల్లోనే ఆయన తుదిశ్వాస విడిచే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

జులైలో వరవరరావుకు కోవిడ్ 19 సోకిందని నిర్థారణైంది.

అయితే, ఆయన కుటుంబ సభ్యులు..వైద్య సహయం కోరుతూ అత్యవసర విలేఖరుల సమావేశం ఏర్పాటుచేసి, ఒక ప్రకటన విడుదల చేసేంతవరకూ ఆయనను ఆస్పత్రికి తరలించలేదు.

“గత ఐదారేళ్లుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచే యాక్టివిస్టులను ‘అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ ఏక్ట్’ (యూఏపీఏ)లాంటి అమానుషమైన చట్టాలకింద దోషులుగా నిర్థారిస్తూ అసమ్మతిని అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాను రాను ఈ ట్రెండ్ పెరుగుతోంది" అని ఇండియన్ క్రిమినల్ లా నిపుణులు, లైవ్ లా వెబ్‌సైట్ వ్యవస్థాపకులు ఎంఏ రషీద్ తెలిపారు.

యూఏపీఏ చట్టాన్ని ఉగ్రవాదాన్ని అణిచివేయడంకోసం ఉపయోగిస్తారు. ఈ చట్టం కింద బెయిల్ మంజూరు కావడం దాదాపు అసాధ్యం.

"వీరిలో పలువురిపై దేశద్రోహం కేసులు కూడా మోపారు. యాంటీ నేషనల్ అని ముద్ర వేసారు. ఇలా నిర్బంధించబడినవారు జైల్లో దయనీయమైన పరిస్థితులు ఎదుర్కొంటూ సంవత్సరాల తరబడి సాగే విచారణలో తీర్పుకోసం ఎదురుచూస్తూ ఉండవలసిందే" అని రషీద్ తెలిపారు.

అయితే ఖైదీలకు కూడా కొన్ని రాజ్యాంగ హక్కులు ఉంటాయని..వైద్య సహాయాన్ని నిరాకరించడం, సిప్పర్లు, స్ట్రాలలాంటి చిన్న చిన్న వస్తువులు ఇవ్వడానికి నిరాకరించడం మొదలైనవన్నీ భారతీయ న్యాయ శాస్త్ర చరిత్రలో ఇంతవరకూ చూడలేదని రషీద్ తెలిపారు.

"1979లో సుప్రీం కోర్టు జస్టిస్ వీఆర్ కృష్ణన్ అయ్యర్ ఇచ్చిన తీర్పులో..ఖైదీలకు కూడా గౌరవప్రదంగా జీవించే హక్కు ఉంటుందని, వారి ప్రాథమిక హక్కులను తోసిపుచ్చలేమని తెలిపారు. భారతీయ న్యాయ చరిత్రలో ఈ తీర్పు ఒక మైలురాయి.

అప్పటినుంచీ సుప్రీం కోర్టు, ఇతర న్యాయస్థానాలు కూడా ఖైదీల మానవ హక్కులకు పెద్దపీట వేస్తూ అనేక తీర్పులను వెలువరించాయి" అని రషీద్ తెలిపారు.

అయితే, భారతీయ జైళ్లల్లో మానవ హక్కులకు స్థానం లేదని జైల్లో జీవితం గడిపి వచ్చినవారు చెబుతూ ఉంటారు.

దిల్లీ తీహార్ జైల్లో 74 రోజుల నిర్బంధంలో ఉన్న సఫూరా జర్గర్...జైల్లో తనకు, తనతోపాటూ ఉన్న ఇతర ఖైదీలకు ప్రాథమిక అవసరాలు కూడా నిరాకరించారని తెలిపారు. ఆ సమయంలో సఫూరా జర్గర్ కడుపుతో ఉన్నారు.

సఫూరా జర్గర్‌ను అరెస్ట్ చేసినప్పుడు మూడు నెలల కడుపుతో ఉన్నారు
ఫొటో క్యాప్షన్, సఫూరా జర్గర్‌ను అరెస్ట్ చేసినప్పుడు మూడు నెలల కడుపుతో ఉన్నారు

ఈ ఏడాది ప్రారంభంలో దిల్లీలో అల్లర్లు ప్రేరేపించారంటూ సఫూరాపై కేసు వేసి ఏప్రిల్‌లో ఆమెను అరెస్ట్ చేసారు. ఈ చర్యపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. జూన్‌లో ఆమెను విడుదల చేసారు.

"కాళ్లకు చెప్పులు కూడా లేకుండా, రెండు జతల బట్టలతో జైల్లోకి వెళ్లాను. నా దగ్గర సంచీలో షాంపూ, సబ్బు, టూత్‌పేస్ట్‌లాంటివి ఉన్నాయి. కానీ, వాటిని లోపలికి తీసుకెళ్లడానికి అధికారులు అనుమతించలేదు. చెప్పులు కూడా బయటే విడిచి వెళ్లాల్సి వచ్చింది. నావి కాస్త ఎత్తు చెప్పులు. వాటిని లోపలకి అనుమతించమని చెప్పారు" అని సఫూరా తెలిపారు.

సరిగ్గా లాక్‌డౌన్ విధించిన సమయంలోనే ఆమెను నిర్బంధించారు.

"నన్ను చూడ్డానికి ఎవరినీ అనుమతించలేదు. నాకు డబ్బుగానీ, పార్సిల్స్‌గానీ పంపించడానికి అనుమతించలేదు. మొదటి 40 రోజులలో నన్ను ఇంటికి ఫోన్ కూడా చేసుకోనివ్వలేదు. ప్రతీ చిన్నదానికీ తోటి ఖైదీలను అడుక్కోవాల్సి వచ్చేది. వారి దయా దాక్షిణ్యాల మీద బతకాల్సి వచ్చింది" అని ఆమె తెలిపారు.

అప్పటికే సఫూరా మూడు నెలల కడుపుతో ఉన్నారు. తోటి ఖైదీలు తనకు చెప్పులు, లోదుస్తులు, కప్పుకోడానికి దుప్పట్లు ఇచ్చి సహాయం చేసారని ఆమె తెలిపారు.

సఫూరాను జైల్లో పెట్టిన కొన్ని వారాల తరువాత ఆమెకు అదనపు దుస్తులు అందించాలని ఆమె తరపు లాయరు కోర్టులో పిటీషన్ వేసారు.

ఫిబ్రవరిలో దిల్లీలో జరిగిన అల్లరలో 53మంది చనిపోయారు. వీరిలో అధిక శాతం ముస్లింలే. ఈ అల్లర్లను ప్రేరేపించారంటూ సఫూరాతో పాటూ వందలమంది ముస్లిం స్టూడెంట్ యాక్టివిస్టులను అరెస్ట్ చేశారు.

అనేకమంది లాయర్లు, యాక్టివిస్టులు, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల సభ్యులు ఈ అరెస్టులను ఖండించారు.

వీరిలో చాలామందికి బెయిల్ మంజూరు కాలేదు. ప్రతీ చిన్న విషయానికి కోర్టును అభ్యర్థిస్తూ వారంతా ఇంకా జైల్లోనే మగ్గుతున్నారు.

గత నెలలో తమకు చెప్పులు, వెచ్చని బట్టలు ఇవ్వట్లేదని జైల్లో ఉన్న ఏడుగురు ఏక్టివిస్టులు ఫిర్యాదు చెయ్యడంతో ఆగ్రహానికి గురైన జడ్జ్..స్వయంగా తనే జైలు ఇన్స్పెక్షన్‌కు వస్తానని అధికారులను బెదిరించారు.

"మాకు గొంతు ఉంది కాబట్టి జైలు అధికారులకు మేము నచ్చలేదు. ప్రతీవారం కొత్త రూల్స్ తీసుకొచ్చి మమ్మల్ని హింస పెట్టేవారు" అని సఫూరా తెలిపారు.

ఇంకా కోవిడ్ 19 ఆంక్షలు అమలులో ఉండడంతో..అత్యవసర పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించడం మినహా తామూ ఏమీ చెయ్యలేకపోతున్నామని వీరి కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)