భీమా కోరేగావ్ కేసు: ఎన్ఐఏ ఎదుట లొంగిపోయిన ఆనంద్ తేల్‌తుంబ్డే, గౌతమ్ నవలఖా

- రచయిత, రోహన్ నామ్‌జోషి,
- హోదా, బీబీసీ ప్రతినిధి
భీమా కోరేగావ్ కేసులో లొంగిపోయేందుకు ఆనంద్ తేల్‌తుంబ్డే, గౌతమ్ నవలఖాలకు సుప్రీంకోర్టు ఇచ్చిన వారం రోజుల గడువు నేటితో ముగుస్తోంది. వారు లొంగిపోయేందుకు గడువును వారం రోజులు పొడిగిస్తున్నట్లు ఏప్రిల్ 8న జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఈ గడువు ముగిసిన తర్వాత వారికి మరోసారి పొడిగించడం కుదరదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఈ గడువు ఏప్రిల్ 14 మంగళవారంతో ముగుస్తుండడంతో వారిద్దరూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఎదుట లొంగిపోయారు.
ఆనంద్ తేల్‌తుంబ్డే ఈ మధ్యాహ్నం ముంబయిలోని ఎన్ఐఏ కార్యాలయంలో లొంగిపోయారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో మానవ హక్కుల ఉద్యమకారుడు గౌతమ్ నవలఖా కూడా ఆ తరువాత ఎన్ఐఏ సమక్షంలో లొంగిపోయినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
అంతకుముందు, "కోర్టు ఆదేశాలను గౌరవించి ఇద్దరు నిందితులూ సరెండర్ అవుతారని భావించాం. ముంబయి హైకోర్టు పనిచేస్తోంది. కానీ, వాళ్లు ఆదేశాలను అనుసరించలేదు. ఇద్దరికీ సరిపడా సమయం ఇచ్చాం. వారి వయసు, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, లొంగిపోయేందుకు మరో వారం ఇచ్చాం. వారం తర్వాత ఇద్దరూ కోర్డు ముందు సరెండర్ అవ్వాల్సిందే" అని సుప్రీంకోర్టు అప్పుడు చెప్పింది.
ప్రస్తుత కరోనావైరస్ మహమ్మారి వల్ల నెలకొన్న పరిస్థితుల గురించి కోర్టుకు వివరించేందుకు తేల్‌తుంబ్డే, నవలఖాల తరఫు న్యాయవాది ప్రయత్నించారు. కానీ, ఆయన వాదనలను సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తోసిపుచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి జైలే అత్యంత సురక్షితమైన ప్రదేశమని అన్నారు.
తేల్‌తుంబ్డేను అరెస్టు చేయొద్దంటూ దేశ, విదేశాలకు చెందిన పలు సంస్థలు ప్రకటనలు విడుదల చేశాయి. అయితే, కోర్టు ఇచ్చిన గడువును గౌరవిస్తూ వారిద్దరూ మంగళవారం లొంగిపోయారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
పలు సంస్థల మద్దతు
ప్రొఫెసర్ నందితా నారాయణ్ దిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్. ఆల్ ఇండియా ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ నిర్వహించిన ఆన్‌లైన్ విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... "ఆనంద్ తేల్‌తుంబ్డే ఒక ప్రముఖ కార్యకర్త. ఉన్నత విద్యపై గొప్ప ఆలోచనలున్న వ్యక్తి. చాలా పత్రికలకు వ్యాసాలు కూడా రాశారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించారు కాబట్టి ఆయన్ను లక్ష్యంగా చేసుకున్నారు. మేధావులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. దళిత విద్యా సంస్థలకు నిధులు నిరాకరించారు. ఆయనపై మోపిన అభియోగాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. కాబట్టి మన మధ్య విభేదాలను పక్కనపెట్టి, ఒక నిర్ణయానికి రావాలి" అని అన్నారు.
ఐఐఎం అహ్మదాబాద్‌కు అధ్యాపకులు, విద్యార్థులు కూడా ఒక ప్రకటన విడుదల చేశారని ది వైర్ మీడియా సంస్థ తెలిపింది. ఈ కేసులో ఆనంద్ తేల్‌తుంబ్డే మీద చేసిన ఆరోపణలు అసంబద్ధంగా, మానవ హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.భీమా కోరేగావ్ కేసులో పలువురు మేధావుల మీద మోపిన అభియోగాలపై అమెరికన్ బార్ అసోసియేషన్ విడుదల చేసిన నివేదికలో పలు అనుమానాలను వ్యక్తం చేశారు. "ఈ కేసులో నిందితులుగా చెబుతున్న వారికి వ్యతిరేకంగా ప్రభుత్వం దగ్గర సరైన ఆధారాలు లేవు. అలాగే, జాతీయ భద్రతకు ముప్పు ఉన్నట్లు తెలిపే ఆధారాలు కూడా లేవు. అణగారిన వర్గాలకు సేవ చేస్తున్న వారికి హెచ్చరికలు పంపే విధంగా ఇలాంటి ఆరోపణలు చేశారు" అని ఆ నివేదికలో పేర్కొన్నారు.
ఆనంద్ తేల్‌తుంబ్డేకు మద్దతుగా ఐఐఎం బెంగళూరుకు చెందిన 53 మంది అధ్యాపకులు, విద్యార్థులు, ఇతర ఉద్యోగులు ప్రకటన విడుదల చేశారని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పేర్కొంది.
"కార్పొరేట్ ప్రపంచంలో తేల్‌తుంబ్డే సాధించిన ఘనతలే కాదు, భారత రాజ్యాంగం సహా అనేక అంశాలపై ఆయన ఎనలేని జ్ఞానం సాధించారు. ఆయన అంటే మాకెంతో గర్వం. తేల్‌తుంబ్డే లాంటి మేధావులను లక్ష్యంగా చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది" అని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, TWITTER
కొందరు ఐఐటీ పూర్వ విద్యార్థులు కూడా తేల్‌తుంబ్డేకు మద్దతుగా నిలిచారు. "కోవిడ్ -19 వ్యాప్తితో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, తేల్‌తుంబ్డే వయసును బట్టి చూస్తే, ఇప్పుడు ఆయన్ను జైలుకు పంపడం చాలా ప్రమాదకరం" అని వారు తమ ప్రకటనలో అన్నారు. తేల్‌తుంబ్డేకు మద్దతుగా భరీప్-బహుజన్ మహాసంఘ్ అధ్యక్షులు ప్రకాష్ అంబేడ్కర్ కూడా ఒక ట్వీట్ చేశారు.
"ఈ దేశంలోని అగ్రశ్రేణి మేధావులు, విద్యావేత్తలలో డాక్టర్ ఆనంద్ తేల్‌తుంబ్డే ఒకరు. అన్యాయానికి వ్యతిరేకంగా బలమైన గొంతుకగా నిలబడిన వ్యక్తి ఆయన. ఆయన అరెస్టును ఆపాలి.
రాజకీయ కార్యకర్తలను, మేధావులను అందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం" అని ప్రకాశ్ అంబేడ్కర్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆనంద్ తేల్‌తుంబ్డే ఎవరు?
దళిత ఉద్యమాలతో సంబంధమున్న ప్రముఖ మేధావి ఆనంద్ తేల్‌తుంబ్డే. యావత్‌మల్ జిల్లా రాజూర్‌లో ఆయన జన్మించారు. నాగపూర్‌లోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ చదివారాయన. కొన్ని ఉద్యోగాలు చేసిన తరువాత ఐఐఎం, అహ్మదాబాద్‌లో చేరారు. అక్కడ పలు అంశాలపై అధ్యయనం చేసిన ఆయన ఆ తరువాత కార్పొరేట్ రంగంలోనూ పలు సంస్థల్లో కీలక స్థానాల్లో పనిచేశారు.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా, పెట్రోనెట్ ఇండియా ఎండీగానూ పనిచేశారు.
ప్రస్తుతం గోవా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఉద్యోగి.
అనేక పత్రికలు, మ్యాగజీన్లకు ఆర్టికల్స్ రాసిన ఆయన ఇప్పటివరకు 26 పుస్తకాలు రాశారు.
కార్పొరేట్ రంగంలోనే పనిచేసినప్పటికీ అనేక సామాజిక ఉద్యమాలలో పాలుపంచుకున్నారు.
పబ్లిక్ పాలసీ, కులం-వర్గం విశ్లేషణలకు సంబంధించిన ఆయన్ను నిపుణుడిగా చెబుతుంటారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కమిటీ (సీపీడీఆర్) జనరల్ సెక్రటరీగా ఉన్నారాయన.

తేల్‌తుంబ్డేపై ఆరోపణలేమిటి?
2017 డిసెంబరు 31న నిర్వహించిన ఎల్గార్ పరిషత్, అక్కడికి ఒక రోజు తరువాత చెలరేగిన భీమా కోరెగావ్ హింసతో సంబంధం ఉందంటూ కొద్దిమంది మేధావులను, రచయితలను 2018 ఆగస్ట్ 28న అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుల సమయంలోనే ఆనంద్ తేల్‌తుంబ్డే ఇంట్లో సోదాలు చేశారు.
పోలీసుల సోదాల సమయానికి తాను ఇంట్లో లేనని.. వారంట్ లేకుండానే ఇంట్లో సోదాలు చేసి, వీడియోలు తీసి మళ్లీ తాళాలు వేశారని ఆయన ఆరోపించారు. ఇదంతా జరిగినప్పటికి ఆయన ముంబయిలో ఉన్నారు. పోలీసులు అక్రమంగా తమ ఇంట్లో సోదాలు చేశారంటూ ఆయన భార్య గోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
2018 ఆగస్ట్ 31న అప్పటి అడిషనల్ జనరల్ ఆఫ్ పోలీస్ పరమ్ వీర్ సింగ్ పుణెలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఒక లేఖ చూపించారు. తేల్‌తుంబ్డే, అరెస్టయిన అయిదుగురు యాక్టివిస్టులకు భీమా కోరెగావ్ హింసతో సంబంధం ఉందనడానికి ఆ లేఖే ఆధారమని ఆయన చెప్పారు. ఒక కామ్రేడ్ ఆ లేఖ రాశారని పోలీసులు చెప్పారు.
''2018 ఏప్రిల్‌లో పారిస్‌లో ఒక సదస్సు జరిగింది. ఆనంద్ తేల్‌తుంబ్డేను అక్కడ ఇంటర్వ్యూ చేశారు. ఆ సదస్సుకు జరిగిన ఖర్చును మావోయిస్టులు భరించారు. ఆయన ఇంటర్వ్యూను వారే ఏర్పాటు చేశారు'' అని పోలీసులు ఆరోపించారు. ఆ సదస్సు నిర్వాహకులు ఈ ఆరోపణలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారని తేల్‌తుంబ్డే చెప్తున్నారు.
ఇదిలావుంటే.. తన మీద నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ తేల్‌తుంబ్డే ముంబై హైకోర్టులో దరఖాస్తు సమర్పించారు. ఆయన మీద ఆరోపణలను వివరిస్తూ అఫిడవిట్ సమర్పించాలని పోలీసులను కోరింది కోర్టు.
తన మీద చేసిన ఆరోపణలన్నిటినీ వ్యతిరేకిస్తూ తన న్యాయవాదులు వాదనలు వినిపించారని, తన మీద తీవ్ర నేరమేదీ మోపజాలరని నిరూపించారని తేల్‌తుంబ్డే చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ కేసుకు సంబంధించిన పోలీసు పత్రాలు.. మద్రాసులోని ఐఐటీలో పెరియార్ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేయటానికి 'ఆనంద్' అనే ఒక వ్యక్తి కారకుడని చెప్తున్నాయి. ''కానీ ఆ సమయంలో నేను ఖరగ్‌పూర్ ఐఐటీలో ప్రొఫెసర్‌గా ఉన్నాను. కాబట్టి ఇది సాధ్యం కాదు'' అంటున్నారు తేల్‌తుంబ్డే.
అనురాధ గాంధీ మెమోరియల్ కమిటీ సమావేశంలో తేల్‌తుంబ్డే కొన్ని 'మంచి' సూచనలు చేశారని కూడా పోలీసు పత్రాలు చెప్తున్నాయి. కానీ తాను చాలా సంవత్సరాలుగా ఈ కమిటీ సమావేశాలకు హాజరుకావటం లేదని ఆయన వివరణ ఇచ్చారు.
గడ్చిరోలిలో నిజ నిర్ధారణ కార్యక్రమం నిర్వహించటానికి బాధ్యుడు 'ఆనంద్' అని మరొక లేఖలో ప్రస్తావించారు. ''ఆ లేఖలో ప్రస్తావించిన 'ఆనంద్' నేనే అని ఎవరైనా అంగీకరించినా కూడా.. నేను కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమొక్రటిక్ రైట్స్ (సీపీడీఆర్) సభ్యుడిని. మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు అనుమానించే కేసుల్లో ఈ సంస్థ నిజనిర్ధారణ చేపడుతుంది. కానీ నిర్దిష్టమైన కమిటీ దేనినీ మేం ఏర్పాటు చేయలేదు'' అని ఆయన చెప్పారు.
'మిలింద్'కు ప్రతినిధ్యం వహించిన 'సురేంద్ర' అనే వ్యక్తి నుంచి ఆనంద్ తేల్‌తుంబ్డే రూ. 90,000 తీసుకున్నట్లు.. పాడైపోయిన టేప్ ఒకటి ప్రస్తావిస్తోంది.

భీమా కోరేగావ్ కేసు ఏమిటి?
పుణె సమీపంలోని భీమా-కోరేగావ్ దగ్గర 2018 జనవరి 1న హింస చెలరేగింది. ఆ రోజున లక్షలాది మంది దళితులు ఇక్కడ సమావేశమవుతారు. ఆ హింస దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ హింసకు ఒక రోజు ముందు.. 2017 డిసెంబర్ 31న పుణెలో ఎల్గాన్ పరిషత్‌ను నిర్వహించారు. ఈ సదస్సులో చేసిన ప్రశంగాలు మరుసటి రోజు హింసను రాజేశాయని ఆరోపిస్తూ ఫిర్యాదు నమోదైంది. ఆ ఫిర్యాదు ప్రాతిపదికగా పుణె పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేయటం మొదలుపెట్టారు.
ఎల్గార్ పరిషత్ వెనుక మావోయిస్టుల హస్తం ఉండటంతో పాటు ఈ మావోయిస్టు సంస్థలతో సంబంధం ఉందనే అనుమానాలతో.. దేశంలోని పలు ప్రాంతాల నుంచి వామపక్ష వైఖరి గల ఉద్యమకారులు చేలా మందిని పుణె పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యమకారులు న్యాయపోరాటం ప్రారంభించారు. ఆనంద్ తేల్‌తుంబ్డే, గౌత్ నవ్‌లఖాలు సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. ముందస్తు బెయిల్ కోసం వారు చేసిన వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. వారు లొంగిపోవటానికి మూడు వారాల గడువు ఇచ్చింది. ఆ గడువు సోమవారం ముగిసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎల్గార్ పరిషత్ కేసులో దర్యాప్తు
తేల్‌తుంబ్డే దరఖాస్తును ముంబై హైకోర్టు ఫిబ్రవరిలో తిరస్కరించిన తర్వాత.. ఆయన సుప్రీంకోర్టకు అప్పీలు చేసుకున్నారు. ఆయన వినతిని ఆలకించిన సుప్రీంకోర్టు ముందస్తు బెయిలు ఇవ్వటానికి నిరాకరించింది. జతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఎదుట లొంగిపోవాలని ఆయనకు చెప్పింది. ఆయన పాస్‌పోర్టును దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కూడా నిర్దేశించింది.
చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద నమోదైన కేసులో వాదనలను జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎం.ఆర్.షాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ఆ చట్టంలోని సెక్షన్ 43డి (4) ప్రకారం.. ఇటువంటి కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వటం సాధ్యం కాదని చెప్పింది.
సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత.. గౌతమ్ నవ్‌లఖా ఒక ప్రకటన విడుదల చేశారు. ''నేను ఇప్పుడు మూడు వారాల లోపు స్వయంగా లొంగిపోవాల్సి ఉంది కనుక.. మరొక కుట్ర కేసుగా నాకు కనిపిస్తున్నట్లు.. ఇటువంటి కేసుల పొడవైన జాబితాలో మరో కేసును నేను ఎదుర్కోకుండా ఉంటానని ఆశించే ధైర్యం చేయగలనా? సహ నిందితులు, వారివంటి ఇతరులకు వారి స్వాతంత్ర్యం మళ్లీ తిరిగి వస్తుందా? అని నన్ను నేను ప్రశ్నించుకుంటున్నా'' అని అందులో పేర్కొన్నారు.
''పౌర స్వేచ్ఛలను అంతకంతకూ అణచివేస్తున్న కాలంలో మనం నివసిస్తున్నందున ఈ ప్రశ్నలు తొలచివేస్తున్నాయి. ఒక సంస్థను నిషేధించటానికి, దాని సిద్ధాంతాన్ని చట్టవ్యతిరేకమని ప్రకటించటానికి ఈ భయానక యూఏపీఏ చట్టం వీలు కల్పిస్తోంది. దాని ఫలితంగా.. అత్యంత నిరపాయకరమైన, చట్టబద్ధమైన కార్యకలాపాలు.. రాజ్యం దృష్టిలో నేరపూరితంగా మారగలవు. విచారణ, తీర్పు కోసం వేచికుండా.. ఆ ప్రక్రియనే శిక్షగా చేస్తున్న చట్టం ఇది'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
గౌతమ్ నవ్‌లఖా, తేల్‌తుంబ్డేలు కలిసి ఉన్నారా?
గౌతమ్ నవ్‌లఖా ప్రముఖ మానవ హక్కుల ఉద్యమకారుడు, రచయిత, పాత్రికేయుడు. ఆనంద్ తేల్‌తుంబ్డే ప్రముఖ దళిత రచయిత, మేధావి.
భీమా-కోరేగావ్ కేసులో పుణె పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత 2018లో కొంతమంది ఉద్యమకారులను అరెస్ట్ చేశారు. నవ్‌లఖాను దిల్లీలోని ఆయన నివాసంలో నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆనంద్ తేల్‌తుంబ్డే గోవాలోని ఒక మేనేజ్‌మెంట్ విద్యా సంస్థలో బోధిస్తున్నారు.
తన మీద నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని సుప్రీంకోర్టును కోరారు తేల్‌తుంబ్డే. అందుకు కోర్టు నిరాకరించటంతో.. ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
పుణె కోర్టు ఆయన దరఖాస్తును తిరస్కరించిన తర్వాత.. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ఇంకా మిగిలి ఉండటంతో ఆయనను తక్షణమే విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.

ఫొటో సోర్స్, GETTY / GETTY / FACEBOOK
గౌతమ్ నవ్‌లఖా గురించి...
గౌతమ్ నవ్‌లఖా ఒక పాత్రికేయుడు, మానవ హక్కుల కార్యకర్త. భీమా-కోరేగావ్ కేసుకు సంబంధించి ఆయన మీద పుణెలోని విశ్రామ్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది.
అరెస్ట్‌ను నివారించటానికి ఆయన పలు ప్రయత్నాలు చేశారు. ముంబై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో దరఖాస్తులు చేశారు. కోర్టులు వాటిని తిరస్కరించాయి. ఆనంద్ తేల్‌తుంబ్డేతో పాటు తననూ అరెస్ట్ చేస్తారని ఆయన కూడా భయపడుతున్నారు.
ఎనిమిది సంవత్సరాల కిందట.. మావోయిస్టుల నుంచి ఛత్తీస్‌గఢ్ సాయుధ దళాలకు చెందిన ఐదుగురు సిబ్బందిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నవ్‌లఖా మీద యూఏపీఏ కింద కేసు నమోదు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలు, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చటం వంటి ఇతర ఆరోపణలూ ఉన్నాయి.
ఈ ఆరోపణలన్నిటినీ నవ్‌లఖా తిరస్కరించారు. వామపక్ష తీవ్రవాదానికి, హింసకు తాను వ్యతిరేకమని ఆయన చెప్పారు.
గౌతమ్ నవ్‌లఖా పీపుల్స్ యూనియన్ ఫర్ డెమొక్రటిక్ రైట్స్ సంస్థకు కార్యదర్శిగా పనిచేశారు. కశ్మీర్‌లో మానవ హక్కులు, న్యాయం మీద ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్‌కు కన్వీనర్‌గా కూడా ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి? నిర్థరణకు ఎలాంటి పరీక్షలు చేస్తారు?
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
- కరోనావైరస్: ఇటలీని దాటేసిన అమెరికా, ప్రపంచంలో అత్యధిక మరణాలు ఇక్కడే
- కరోనా లాక్డౌన్: విపరీతంగా బయటపడుతున్న ఎలుకలు.. వీటిని నివారించడం ఎలా
- వుహాన్‌లో లాక్ డౌన్ ఎత్తేసిన చైనా ప్రభుత్వం.. రైళ్లు, విమానాల్లో మొదలైన ప్రయాణాలు
- కరోనావైరస్: నియంత్రణ రేఖ 'సామాజిక దూరం' ఎలా పాటించాలంటున్న స్థానికులు
- మామకు కరోనా పాజిటివ్... రహస్యంగా చూసివచ్చిన అల్లుడిపై కేసు
- కొడుకు శవంతో రోడ్డుపై పరుగులు తీసిన తల్లి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








