2020 సంవత్సరం: ప్రపంచానికి వీడ్కోలు చెప్పిన కళాకారులు

ఎస్పీబీ మరణం దక్షిణ భారత సినీరంగాన్ని షాక్‌కు గురి చేసింది.

ఫొటో సోర్స్, SP balasubramaniam

ఫొటో క్యాప్షన్, ఎస్పీబీ మరణం దక్షిణ భారత సినీరంగాన్ని షాక్‌కు గురి చేసింది.
    • రచయిత, సుప్రియా సోగ్‌లే
    • హోదా, బీబీసీ కోసం

2020 సంవత్సరం ఆఖరి దశలో ఉంది. ఈ యేడాది ప్రపంచవ్యాప్తంగా అనేక చరిత్రాత్మక ఘటనలకు వేదికగా నిలిచింది. జనవరి నుంచి మొదలుకుని డిసెంబర్‌ వరకు ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలమంది కరోనా కారణంగా మరణించారు.

అదే సమయంలో భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన అనేకమంది ప్రముఖులు కోవిడ్‌తోపాటు మరికొన్ని ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌ చెందిన పలువురు ప్రముఖులు ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికారు.

గాన గంధర్వుడు-ఎస్పీబీ

దక్షిణాదితోపాటు హిందీ ప్రేక్షకులను కూడా తనదైన సమ్మోహన స్వరంతో ఆకట్టుకున్న గానగంధర్వుడు, పద్మభూషణ్‌ ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం ఈ ఏడాది సెప్టెంబర్‌ 25న కన్నుమూశారు.

74 ఏళ్ల ఈ గాయక నటుడు కోవిడ్‌ అనంతర ఆరోగ్య సమస్యలకు చికిత్స తీసుకుంటూ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

ఆరుసార్లు జాతీయ అవార్డు, సుమారు 40వేల పాటలతో బాలసుబ్రహ్మణ్యం భారతీయ సినీ సంగీత రంగాన్ని సుసంపన్నం చేశారు.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, బెంగాలీ, హిందీతోపాటు అనేక ప్రాంతీయ భాషలలో కూడా ఆయన పాటలు పాడారు. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా, వ్యాఖ్యాతగా భిన్నమైన పాత్రలు పోషించారు ఎస్‌.పి.బాలు.

ఫ్యాక్షనిస్ట్‌ విలన్‌-జయప్రకాశ్‌ రెడ్డి

తెలుగులో కామెడీ విలనిజానికి తనదైన శైలిలో కొత్త ఒరవడి అద్దిన నటుడు జయప్రకాశ్‌ రెడ్డి కూడా ఈ యేడాదే కన్ను మూశారు. తీవ్రమైన గుండెపోటుతో గుంటూరులోని తన నివాసంలో సెప్టెంబర్‌ 8న ఆయన తుదిశ్వాస విడిచారు.

ఉపాధ్యాయుడిగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన, ఆ వృత్తిలో ఉంటూనే సినిరంగంపై ఆసక్తి చూపారు.1980 నుంచి అడపాదడపా సినిమాల్లో నటించిన ఆయన సమరసింహారెడ్డి సినిమాతో టాలీవుడ్‌కు సరికొత్త విలనిజాన్ని చూపించారు.

ఫ్యాక్షనిస్ట్‌ పాత్రలకు రాయలసీమ యాసను జోడించి ఆయన వినిపించిన డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో సీరియస్‌ విలన్‌గా నటించినా, తర్వాత కామెడీవైపు దృష్టిపెట్టారు.

రిషీ కపూర్

ఫొటో సోర్స్, Neetu Kapoor

రొమాంటిక్‌ హీరో-రిషి కపూర్‌

బాలీవుడ్ లవర్‌బోయ్‌గా పేరు తెచ్చుకున్న రిషి కపూర్‌ క్యాన్సర్‌తో బాధపడుతూ ఏప్రిల్‌ 30న కన్ను మూశారు. లుకేమియా వ్యాధితో బాధపడుతున్న ఆయన న్యూయార్క్‌లో చికిత్స కూడా తీసుకున్నారు.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయనను ఏప్రిల్ 29న ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఆ మరుసటి రోజే ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 67 సంవత్సరాలు

బాలీవుడ్‌ షోమ్యాన్ రాజ్‌కపూర్‌ రెండో కుమారుడైన రిషి కపూర్‌ బాలనటుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. 1973లో ‘బాబీ’ సినిమా ద్వారా హీరోగా మారారు. ఆ సినిమాతో ఆయనకు రొమాంటిక్‌ హీరోగా పేరు వచ్చింది.

మూడు దశాబ్దాలపాటు హీరోగా నట ప్రస్థానాన్ని కొనసాగించారు. 2012లో విడుదలైన అగ్నిపథ్‌ సినిమాలో విలన్‌ పాత్ర పోషించారు.

అమర్‌ అక్బర్‌ ఆంథోనీ, చాందిని, దీవానా, బోల్‌ రాధా బోల్, దామిని, లవ్‌ ఆజ్‌ కల్‌లాంటివి ఆయన నటించిన కొన్ని ప్రముఖ సినిమాలు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

ఫొటో సోర్స్, Sushant Singh Rajput

మరణంతో సంచలనం-సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌

బాలీవుడ్‌ డ్రీమ్స్‌తో ఒక చిన్న పట్టణం నుంచి ముంబయి వచ్చిన సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం బాలీవుడ్‌లో పెను ప్రకంపనలకు కారణమైంది.

2020 జూన్ 14న సుశాంత్‌ తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మరణించారు. ప్రస్తుతం ఆయన మృతి కేసు సీబీఐ విచారణలో ఉంది. ఎయిమ్స్‌ ఆసుపత్రి సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసును ఆత్మహత్యగా ప్రకటించింది.

2010లో 'ప్రీతా రిష్టా'తో సీరియల్‌ నటుడిగా నటప్రస్థానం మొదలు పెట్టారు సుశాంత్‌ సింగ్‌. 2013లో 'కై పో చే' చిత్రంతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు.

నీరజ్‌ పాండే తీసిన బయోపిక్ ‘ఎంఎస్‌ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ చిత్రం సుశాంత్‌కు బాలీవుడ్‌లో స్టార్‌హోదాను ఇచ్చింది. సుశాంత్ చివరి చిత్రం 'దిల్ బెచారా' ఆయన మరణం తర్వాత విడుదలైంది.

బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్ వరకు ఎదిగిన ఇర్ఫాన్‌ ఖాన్‌ ఈ ఏడాది కన్నుమూశారు

ఫొటో సోర్స్, Irffan Khan

ఫొటో క్యాప్షన్, బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్ వరకు ఎదిగిన ఇర్ఫాన్‌ ఖాన్‌ ఈ ఏడాది కన్నుమూశారు

ప్రతిభావంతుడైన నటుడు-ఇర్ఫాన్‌ ఖాన్‌

పద్మశ్రీ అవార్డు పొందిన ఇర్ఫాన్‌ ఖాన్‌ భారతీయ సినీ పరిశ్రమ గర్వించదగిన నటులలో ఒకరు. 1988లో "సలాం బాంబే" తో సినీ జీవితాన్ని ప్రారంభించిన ఇర్ఫాన్‌ ఖాన్ తన ప్రతిభతో బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకు ఎదిగారు.

న్యూరో ఎండోక్రిన్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్నానని 2018 సంవత్సరంలో ఇర్ఫాన్‌ ఖాన్ ట్వీటర్‌ ద్వారా వెల్లడించారు. చికిత్స కోసం ఒక ఏడాదిపాటు లండన్‌లో గడిపారు. తిరిగి వచ్చిన తర్వాత కూడా ఓ సినిమాలో నటించారాయన.

ఈ ఏడాది ఏప్రిల్‌ 28న ఆసుపత్రిలో చేరిన ఇర్ఫాన్‌ఖాన్‌ ఏప్రిల్‌ 29న తుదిశ్వాస విడిచారు. అంతకు నాలుగు రోజుల కిందటే ఆయన తల్లి కూడా మరణించారు.

లైఫ్‌ ఆఫ్‌ పై, నేమ్‌ సేక్‌, పాన్‌సింగ్‌ తోమర్‌, మక్‌బూల్, ది లంచ్‌బాక్స్‌, స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌, ఇన్‌ఫెర్నో, హిందీ మీడియంలాంటి ప్రముఖ చిత్రాలలో నటించారు.

బహుముఖ కళాకారుడు –రావి కొండలరావు

తెలుగు సినిమా పరిశ్రమలో విభిన్నమైన రంగాలలో పనిచేసి అన్నింటిలోని తనదైన శైలిని ప్రదర్శించిన అతికొద్దిమంది కళాకారులలో రావి కొండలరావు ఒకరు.

నటుడిగా 500లకు పైగా సినిమాల్ల నటించిన రావి కొండలరు, రంగస్థల కళాకారుడిగా, కథారచయితగా, జర్నలిస్టుగా, ఎడిటర్‌గా, నిర్మాతగా, దర్శకుడి భిన్నమైన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించారు.

1960ల నుంచి సినీరంగంతోపాటు, నాటక రంగంలోనూ పని చేసిన ఆయన ఈ యేడాది జులై 28న తుదిశ్వాస విడిచారు. ఆయన భార్య రాధాకుమారి కూడా నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం.

టీవీ నటి శ్రావణి ఆత్మహత్య తెలుగు టీవీ రంగంలో సంచలనం సృష్టించింది

ఫొటో సోర్స్, FACEBOOK/KONDAPALLI SRAVANI

ఫొటో క్యాప్షన్, టీవీ నటి శ్రావణి ఆత్మహత్య తెలుగు టీవీ రంగంలో సంచలనం సృష్టించింది

చిన్నితెర విషాదం-కొండపల్లి శ్రావణి

మనసు మమత, మౌనరాగం టీవీ సీరియల్స్‌ ఫేమ్‌ కొండపల్లి శ్రావణి అనుమానాస్పద మృతి తెలుగు టీవీ రంగంలో సంచలనం సృష్టించింది.

ఈ ఏడాది సెప్టెంబర్‌8న బాత్రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శ్రావణి ఆత్మహత్యకు ఆమె ప్రియుడు దేవరాజ్‌ రెడ్డి కారణమని శ్రావణి తల్లిదండ్రులు ఆరోపించారు.

అయితే ఆమె తల్లిదండ్రులే శ్రావణిని మానసికంగా వేధించి ఆత్మహత్యకు పురికొల్పారని దేవరాజ్‌రెడ్డి ప్రత్యారోపణలు చేశారు.

నటించింది కొన్ని సీరియల్స్‌లోనే అయినా తెలుగు టీవీ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కొండపల్లి శ్రావణి ఆత్మహత్య తెలుగు టీవీ కళారంగంలో సంచలనంగా మారింది.

ఒకవైపు కరోనా సృష్టించిన భయోత్పాతం కొనసాగుతుండగానే, సుప్రసిద్ధ నటులు హఠాత్తుగా కన్నుమూయడం, కొందరి ఆత్మహత్యలు, కరోనా కారణంగా మరికొందరి మరణాలు ప్రేక్షకులకు ఈ ఏడాది విషాద సంవత్సరంగా గుర్తుండిపోయేలా చేశాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)