ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు - Press Review

జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, జస్టిస్‌ జేకే మహేశ్వరి
ఫొటో క్యాప్షన్, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిక్కిం హైకోర్టు సీజే జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి (ఎడమ) రానున్నారు.. ఏపీ ప్రస్తుత సీజే జస్టిస్‌ జేకే మహేశ్వరి సిక్కిం సీజేగా బదిలీ అయ్యారు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు రానున్నారని సాక్షి కథనం ప్రచురించింది.

వీరిలో నలుగురు సీజేలు బదిలీపై రానుండగా.. ఐదుగురు న్యాయమూర్తులకు సీజేగా పదోన్నతి లభించిందని ఈ కథనంలో రాశారు.

అలాగే మరో ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తులు ఇతర రాష్ట్రాలకు బదిలీ అయ్యారు. మొత్తమ్మీద దేశవ్యాప్తంగా సీజేలు, న్యాయమూర్తులు కలిపి 14 మందికి బదిలీ అయింది.

ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది.

దిల్లీ హైకోర్టులో సీనియర్‌ న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్‌ హిమా కోహ్లి.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

తెలంగాణ హైకోర్టు ప్రస్తుత సీజే జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ ఉత్తరాఖండ్‌ సీజేగా బదిలీ అయ్యారు.

ఇక ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిక్కిం హైకోర్టు సీజే జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి రానున్నారు.

ఏపీ ప్రస్తుత సీజే జస్టిస్‌ జేకే మహేశ్వరి సిక్కిం సీజేగా బదిలీ అయ్యారు.

అలాగే కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చి.. ఏపీ హైకోర్టుకు బదిలీపై రానున్నారని సాక్షి పత్రిక వివరించింది.

డాక్ పే

నగదు బదిలీ కోసం భారత తపాలా శాఖ సరికొత్త యాప్

నగదు బదిలీ కోసం తపాలా శాఖ కొత్త యాప్ అందుబాటులోకి తెచ్చినట్లు ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది.

తపాలా బ్యాంకు ఖాతాదారులు ఇక నుంచి మొబైల్‌ ఫోను ద్వారా ఇతర బ్యాంకు ఖాతాలకు నగదును క్షణాల్లో బదిలీ చేయవచ్చు.

మొబైల్‌ రీఛార్జితో పాటు విద్యుత్తు, నీటిబిల్లులు, పెట్రోల్‌ బంకుల్లో, బీమా ప్రీమియం వంటి చెల్లింపులూ జరపొచ్చు. ఇందుకోసం తపాలాశాఖ ‘డాక్‌ పే’ డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌ పేరుతో కొత్తగా యాప్‌ను తీసుకువచ్చింది.

షాపింగ్‌కు వెళ్లినప్పుడు క్యూఆర్‌కోడ్‌ స్కాన్‌ ద్వారా బిల్లుల చెల్లింపు వెసులుబాటూ ఉంది. గూగుల్‌ పే, పేటీఎం, ఫోన్‌ పే తరహాలో డాక్‌ పే పనిచేస్తుందని తపాలాశాఖ వర్గాలు చెబుతున్నాయని ఈనాడు రాసింది.

ఈ యాప్‌లో.. తపాలా బ్యాంకు ఖాతాతో పాటు తమకున్న ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు(140 బ్యాంకులకు చెందిన) ఖాతాలను లింక్‌ చేసుకోవచ్చు.

ఒక యాప్‌లో ఎన్ని బ్యాంకు ఖాతాలనైనా అనుసంధానం చేసుకోవచ్చు. అందులో ఏ ఖాతా నుంచైనా మిత్రులు, బంధువులు, ఎవరి బ్యాంకు ఖాతాకైనా నగదును బదిలీ చేయొచ్చు.

దీనికోసం తపాలాశాఖ యునిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ)తో ఒప్పందం చేసుకుంది.

పోస్టాఫీస్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతా ఉంటే ఐపీపీబీతో పాటు లింక్‌ చేసుకుని ఆ ఖాతాలోని సొమ్మును చెల్లింపులు, నగదు బదిలీకి ఉపయోగించవచ్చని తపాలాశాఖ వర్గాలు చెబుతున్నాయని ఈనాడు వివరించింది.

సెల్ టవర్

ఫొటో సోర్స్, Getty Images

స్పెక్ట్రమ్ వేలానికి కేంద్రం రెడీ

2021 మార్చిలో స్పెక్ట్రం వేలానికి కేంద్రం సిద్ధం అవుతోందని ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం ప్రచురించింది.

మరో విడత స్పెక్ట్రమ్‌ వేలానికి కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రధాన మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం బుధవారం ఇందుకు ఆమోద ముద్ర వేసింది.

వచ్చే ఏడాది మార్చిలో ఈ వేలం ఉంటుందని కేంద్ర ఐటీ, ప్రసార శాఖల మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ చెప్పారు. నెల రోజుల్లో ఇందుకు నోటిఫికేషన్‌ జారీ కా నుంది.

ప్రస్తుతం ఆపరేటర్ల వద్ద ఖాళీగా ఉన్న 700, 800, 900, 2,100, 2,300, 2,500 మెగాహెడ్జ్‌ (ఎంహెచ్‌జడ్‌) ఫ్రీ క్వెన్సీ బ్యాం డ్స్‌లోని 2,251 ఎంహెచ్‌జడ్‌ స్పెక్ట్రమ్‌ను మాత్రమే ఈ వేలంలో వేలం వేస్తారు.

5జీ టెలికం సేవలకు ఉపయోగపడే అధిక సామర్థ్యం గల 3,300-3,600 ఎంహెచ్‌జడ్‌ స్పెక్ట్రమ్‌ వేలాన్ని మాత్రం మినహాయించారు.

ట్రాయ్‌ నిర్ణయించిన కనీస ధర ప్రకారం చూస్తే ఈ స్పెక్ట్రమ్‌ వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.3,92,332.70 కోట్ల ఆదాయం లభించనుంది.

కంపెనీలు పోటీపడితే ఈ ఆదాయం మరింత పెరుగుతుంది. స్పెక్ట్రమ్‌ బ్యాండ్‌ను బట్టి కంపెనీలు 25 నుంచి 50 శాతం ధరను ముందుగా చెల్లించాలి.

మిగతా మొత్తాన్ని రెండేళ్ల విరామం తర్వాత 16 వార్షిక సమాన వాయిదాల్లో చెల్లించాలి.

కేటీఆర్

ఫొటో సోర్స్, FB/Kalvakuntla Taraka Rama Rao

హైదరాబాద్‌లో ఫియట్ పెట్టుబడులు

ఫియట్ సంస్థ హైదరాబాద్‌లో డిజిటల్ గ్లోబల్ హబ్ ఏర్పాటు చేయనుందని నమస్తే తెలంగాణ దిన పత్రిక కథనం ప్రచురించింది.

తెలంగాణ ఐటీ ప్రస్థానంలో మరో మైలురాయి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలకు ఫిదా అయిన మేటి ఆటోమొబైల్‌ సంస్థ ఫియట్‌.. తన డిజిటల్‌ సాంకేతికతను విస్తరించడానికి హైదరాబాద్‌ను ఎంచుకొన్నది.

భారత్‌తోపాటు దాదాపు 150 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ దిగ్గజ సంస్థ తన రెండో డిజిటల్‌ గ్లోబల్‌ హబ్‌ ఏర్పాటుకు హైదరాబాద్‌లో 1,100 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది.

వివిధ దేశాల్లో తయారయ్యే ఫియట్‌ కార్లల్లో డిజిటలైజేషన్‌ కోసం ఈ గ్లోబల్‌ హబ్‌ సాంకేతికతను అందించబోతున్నదని నమస్తే తెలంగాణ రాసింది.

ప్రపంచశ్రేణి వాహనాల తయారీలో ప్రసిద్ధి చెందిన ఫియట్‌ తెలంగాణలో తమ పరిశ్రమను ఏర్పాటుచేస్తున్నట్టు వెల్లడించింది.

తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం వల్లే హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడం తమకు సాధ్యపడిందని ఫియట్‌ సగర్వంగా ప్రకటించింది.

150 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లతో (రూ.1,110కోట్లు) ఫియట్‌ గ్లోబల్‌ హబ్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పుతున్నట్టు బుధవారం ప్రకటించింది.

ఈ సెంటర్‌లో ఎఫ్‌సీఏకు ట్రాన్స్‌ఫర్మేషన్‌, ఇన్నోవేషన్‌ ఇంజిన్‌గా గ్లోబల్‌ డిజిటల్‌ హబ్‌ సేవలు అందిస్తారు.

దీనిద్వారా తొలిదశలో వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించనున్నది. భవిష్యత్‌లో ఈ సంఖ్య మూడురెట్లు పెరుగవచ్చని ఫియట్‌ సంస్థ ఆశాభావం వ్యక్తంచేసిందని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)