కొత్త రకం కరోనావైరస్.. ఇప్పటికే తయారైన వ్యాక్సీన్లు దీనిని ఎదుర్కోగలవా?

కొత్త రూపాలు సంతరించుకుంటున్న కరోనావైరస్

ఫొటో సోర్స్, GETTY IMAGES

    • రచయిత, జేమ్స్ గళ్లఘర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కొత్త తరహా కరోనావైరస్ కథల గురించి తెలుసుకునేందుకు నేనొక సులభమైన నియమం పాటిస్తాను.

వైరస్ ప్రవర్తించే విధానం మారిందా? అని నేను ప్రశ్నిస్తాను.

వైరస్ అనేక రూపాలు సంతరించుకుంటుందనగానే చాలా భయం వేస్తుంది. కానీ స్వరూపాన్ని మార్చుకోవడమే వైరస్ లక్షణం.

చాలా సార్లు అలా మారడం అర్ధ రహితంగా ఉండవచ్చు. లేదా అది తీవ్రంగా ఇన్ఫెక్షన్ సృష్టించిన తరువాత ఆ కొత్త రూపం అంతం కావచ్చు.

ఆ వైరస్ గెలిచే ఫార్ములా మాత్రం కొన్ని సార్లు మాత్రమే పని చేస్తుంది.

కరోనావైరస్ లో కొత్త రకం ఆగ్నేయ ఇంగ్లండ్‌లో కనిపించింది. అయితే ఇది మరింత వేగంగా వ్యాప్తి చెంది తీవ్రమైన లక్షణాలను కలుగచేస్తుందనడానికి, దీంతో వ్యాక్సీన్ పని చేయకుండా పోతుందనడానికి కచ్చితమైన ఆధారాలు లేవు.

కానీ, శాస్త్రవేత్తలు దీనిపై దృష్టి పెట్టడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి.

మొదటిది కేసులు ఎక్కువగా ఉన్న చోట ఈ కొత్త వైరస్ స్థాయిలు కూడా అధికంగానే ఉన్నాయి.

ఇదొక హెచ్చరిక. దీనిని రెండు రకాలుగా అర్ధం చేసుకోవచ్చు.

ఈ వైరస్ చాలా సులభంగా వ్యాప్తి చెంది మరిన్ని ఇన్ఫెక్షన్లు కలిగించేందుకు అనేక రకాలుగా మార్పులు చెంది ఉండవచ్చు.

కానీ, ఈ మార్పు చెందిన వైరస్ రకాలు కూడా సరైన సమయంలో తగినంత మందిని ఇన్ఫెక్ట్ చేస్తూ ఒక విరామం తీసుకోవచ్చు.

సెలవుల్లో స్పానిష్ ఫ్లూకి గురై, ఇంటికి తీసుకుని రావడం వలన స్పానిష్ ఫ్లూ వేసవిలో పెరగడం ఇదే తరహాకి చెందినదిగా చెప్పవచ్చు.

ఈ కొత్త రకం వైరస్ మిగిలిన వాటి కంటే వేగంగా విస్తరిస్తుందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి పరిశోధనశాలల్లో ప్రయోగాలు చేయడం అవసరం.

ఈ వైరస్ ఇన్ని రకాలుగా ఎలా మారుతుంది అనే విషయం పట్ల శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేయడం ఇంకొక ముఖ్యమైన విషయం.

కొత్త రకం కరోనావైరస్ స్ట్రెయిన్ వలన వ్యాక్సీన్ డ్రైవ్ పై ప్రభావం చూపుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఫొటో క్యాప్షన్, కొత్త రకం కరోనావైరస్ స్ట్రెయిన్ వలన వ్యాక్సీన్ డ్రైవ్ పై ప్రభావం చూపుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి

"ఈ వైరస్ విచిత్రంగా మనం ఊహించిన దాని కంటే ఎక్కువ రకాలుగా మార్పు చెందుతోంది. కొన్ని చాలా ఆసక్తికరంగా ఉన్నాయి" అని కోవిడ్ 19 జెనోమిక్స్ యూకే కన్సార్టియం ప్రొఫెసర్ నిక్ లోమన్ చెప్పారు.

ప్రస్తుతం ఈ వైరస్ మ్యుటేషన్స్‌లో రెండు చెప్పుకోతగ్గ జతలు ఉన్నాయి.

ఈ రెండు మ్యుటేషన్లు కీలకమైన ప్రోటీన్ స్పైక్ లో కనిపిస్తాయి. ఈ ప్రోటీన్ స్పైక్ ద్వారానే వైరస్ శరీరంలో కణాలలోకి ప్రవేశించి వాటి పై దాడి చేస్తుంది.

ఎన్ 501 మ్యుటేషన్ ఈ ప్రోటీన్ స్పైక్ లో చాలా ముఖ్యమైన భాగాన్ని మార్చేస్తూ ఉంటుంది. దీనినే "రిసెప్టర్ బైండింగ్ డొమైన్" అంటారు.

ఇక్కడే ఈ ప్రోటీన్ స్పైక్ శరీరంలో ఉండే కణాలను తాకుతుంది. ఇక్కడ జరిగే మార్పుల వలన వైరస్ శరీరంలోకి సులభంగా వెళ్లే అవకాశం కలుగుతుంది.

"ఇదొక ముఖ్యమైన మార్పుగా కనిపిస్తుంది" అని ప్రొఫెసర్ లోమన్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, కొత్తరకం కరోనా వైరస్.. వేగంగా వ్యాప్తి

హెచ్ 69/వి 70 మ్యుటేషన్ గతంలో కూడా చాలా సార్లు కనిపించింది. ఇది వైరస్ సోకిన మింక్ లలో కూడా కనిపించింది.

వైరస్ బారిన పడి కోలుకున్న వారి నుంచి సేకరించిన యాంటీబాడీలు కూడా ఈ కొత్త రకం వైరస్ పై దాడి చేయడానికి ప్రభావవంతంగా పని చేయవు.

వీటినన్నిటినీ నిశితంగా అర్ధం చేసుకోవడానికి మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది.

"ఈ వైరస్‌లో మరో రకం ఉందని తెలుసు. కానీ, సజీవంగా అదేమిటో మాత్రం తెలియదు" అని బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అలన్ మక్ నల్లి అన్నారు.

ఇది ముఖ్యమైనదో కాదోననే విషయం ఇప్పట్లో నిర్ణయించడం తొందరపాటు అవుతుందని అన్నారు.

ఈ స్పైక్ ప్రోటీన్లో వస్తున్న మ్యుటేషన్ల వలన వ్యాక్సీన్ గురించి అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రస్తుతం తయారు చేస్తున్న ఫైజర్, మోడెర్నా, ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సీన్లన్నిటినీ.. రోగ నిరోధక శక్తి ఈ స్పైక్ మీద దాడి చేసే విధంగా తయారు చేస్తున్నారు.

కానీ, శరీరం ఈ స్పైక్లో వివిధ భాగాల మీద దాడి చేసే విధంగా శిక్షణ పొందుతుంది. అందువల్లే వ్యాక్సీన్ ఈ కొత్త రకం వైరస్ మీద కూడా పని చేస్తుందనే నమ్మకంతో ఆరోగ్య నిపుణులున్నారు.

ఈ వైరస్ ఒక సంవత్సరం క్రితం జంతువులలో పుట్టి మనుషులకు వ్యాప్తి చెందడం మొదలు పెట్టింది.

అప్పటి నుంచి ఈ వైరస్ ప్రతి నెలా రెండు రకాలుగా మారుతూ వస్తోంది. ఈ రోజు తీసుకున్న శాంపిల్ ను వుహాన్‌లో దొరికిన మొదటి శాంపిల్ తో పోల్చి చూస్తే రెంటికీ మధ్య వాటిని వేరు చేసి చూపే కనీసం 25 రకాల మ్యుటేషన్లు కనిపిస్తున్నాయి.

కరోనావైరస్ ఇప్పటికీ అనేక రకాలుగా మారి మనుషులను ఇన్ఫెక్ట్ చేయడానికి చూస్తోంది.

ఇలా జరగడం గతంలో చూసాం. ఇందులోనే జి 614 రకం ప్రపంచ వ్యాప్తంగా కనిపించి వేగంగా వ్యాపిస్తోంది.

కానీ, త్వరలోనే భారీ స్థాయిలో అమలు చేయనున్న వ్యాక్సీన్ డ్రైవ్ వైరస్ మీద భిన్నమైన ఒత్తిడి తీసుకుని వస్తుంది. ఎందుకంటే, ఈ వైరస్ బారిన పడకుండా రోగనిరోధక శక్తిని సంపాదించిన వారి పై దాడి చేయడానికి అది మరిన్ని రూపాలు సంతరించుకోవలసి వస్తుంది.

ఈ మార్పు ఒక వేళ వైరస్ పరిణామం చెందటాన్ని ప్రభావితం చేస్తే , ఫ్లూకి చేసినట్లే వ్యాక్సీన్లను కూడా తరచుగా అప్‌డేట్ చేయవలసి వస్తుంది.

(ఈ కథనాలను హిందీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, తమిళ భాషల్లో కూడా అందుబాటులో ఉన్నాయి)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)