బిహార్ ఎన్నికలు: కరోనావైరస్ మహమ్మారి నడుమ నరేంద్ర మోదీకి ఇది తొలి పరీక్ష

బిహార్ ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images/ANI

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కరోనావైరస్ వ్యాప్తి నడుమ బిహార్ ఎన్నికలు జరుగుతున్నాయి. కోవిడ్-19 వ్యాప్తి మొదలైన తర్వాత జరుగుతున్న ఈ తొలి ప్రధాన ఎన్నికలు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజాదరణకు పరీక్ష లాంటిది.

తూర్పు రాష్ట్రమైన బిహార్‌లో 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 7 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. మూడు దశల ఎన్నికల్లో భాగంగా తొలి దశ ఓటింగ్ బుధవారం ప్రారంభమైంది. ఫలితాలు నవంబరు 10న ప్రకటిస్తారు.

కరోనావైరస్ వ్యాప్తి నడుమ 60కి పైగా దేశాలు తమ ఎన్నికలను వాయిదా వేశాయి. అయితే, బిహార్‌లో మాత్రం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్ర జనాభా.. జపాన్‌ జనాభాకు సమానం.

ఇంటింటికీ వెళ్లి చేపట్టే సంప్రదాయ ప్రచారంపై ఇక్కడ నిషేధం విధించారు. మొదట్లో కొన్ని వర్చువల్ ర్యాలీలు జరిగాయి. మరోవైపు పోలింగ్ కేంద్రాలు కిక్కిరిసిపోకుండా చూసేందుకు.. ఎన్నికల నిర్వహణ సమయం పెంచారు. అయితే, ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. మాస్క్‌లు లేకుండా భారీగా బహిరంగ సభలకు నాయకులు, ప్రజలు హాజరైన దృశ్యాలు ఇటీవల టీవీల్లో కనిపించాయి.

కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించొద్దని అధికారులు పదేపదే హెచ్చరించినప్పటికీ పెద్దగా ఫలితం కనిపించలేదు. ఇప్పటికే రాష్ట్రంలో 2,00,000కుపైనే కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఎన్నికల నడుమ ఈ కేసులు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం అవుతోంది.

భారత్‌లో పేద రాష్ట్రాల్లో ఒకటైన బిహార్.. రాజకీయంగా కీలకమైన ప్రాంతం. కులాల వారీగా ఇక్కడ 12.4 కోట్ల మంది విడిపోయి ఉంటారు. ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీలతోపాటు దాదాపు డజను ప్రాంతీయ పార్టీలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. సంకీర్ణ రాజకీయాలకు బిహార్ పెట్టింది పేరు. ‘‘రాజకీయ పార్టీల సంఖ్య పెరగడంతో ఇక్కడ ఎన్నికలు మరింత సంక్లిష్టంగా మారుతున్నాయి’’అని రాజకీయ విశ్లేషకులు సుహాస్ పాల్‌శికర్ వ్యాఖ్యానించారు.

బీజేపీ సొంతంగా పాగా వేయలేని ఏకైక హిందీ రాష్ట్రం బిహార్ మాత్రమే. దశాబ్ద కాలం క్రితం ప్రాంతీయ పార్టీ జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ)తో కలిసి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ప్రస్తుత ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ జేడీయూ నాయకుడే. ఈయన ప్రభ ఇటీవల కాస్త తగ్గుతున్నట్లు కనిపిస్తోంది.

బిహార్ ఎన్నికలు

ఫొటో సోర్స్, AFP

ఆరేళ్ల అసెంబ్లీ ఎన్నికల్లో...

సాధారణంగా అధికారంలో ఉండే పార్టీకి ఓటర్లు వెన్ను చూపిస్తుంటారు. 2014 నుంచి వరుసగా రెండుసార్లు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీకి మిశ్రమ ఫలితాలే దక్కాయి. గత ఆరేళ్లలో పార్టీ విజయం సాధించిన అసెంబ్లీ ఎన్నికల కంటే ఓడిపోయినవే ఎక్కువ. నాలుగేళ్ల ముందు ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల తర్వాత పార్టీకి ఏ రాష్ట్రంలోనూ సంపూర్ణ ఆధిక్యం దక్కనేలేదు. గత రెండేళ్లలో ఆరు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీకి చేదు అనుభవం ఎదురైంది. ఒక చోట ఓ ప్రత్యర్థి పార్టీతో జట్టుకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.

అందుకే బిహార్ ఎన్నికలు బీజేపీకి కీలకమైనవి. ముఖ్యంగా వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు ఎన్నికలు జరగబోతున్న సమయంలో ఈ తీర్పు పార్టీకి కీలకంగా మారనుంది. ‘‘వచ్చే ఏడాది పోటాపోటీగా జరగబోతున్న ఎన్నికల ముందు తమ సత్తా చూపించుకునేందుకు పార్టీకి దొరికిన చివరి అవకాశం ఇది. బీజేపీ ఓటమి యాత్ర కొనసాగుతుందో లేదో నిర్ణయించేది కూడా ఇదే’’అని అశోక యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెర్ గిల్స్ వెర్నీర్ వ్యాఖ్యానించారు.

ఈ ఏడాది మార్చిలో కరోనావైరస్‌ కట్టడికి లాక్‌డౌన్ పేరుతో లక్షల మంది వలస కూలీలు రోడ్డున పడేలా చేసిందని మోదీ ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటోంది. లాక్‌డౌన్ నడుమ చాలా మంది కూలీలు తమ గ్రామాలకు తిరిగి వచ్చేశారు. రెండు లక్షల మందికిపైగా వలస కార్మికులకు బిహార్ నిలయం. కరోనావైరస్ వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రజలు ఎలా స్పందిస్తారో తాజా ఎన్నికలతో తెలిసిపోతుంది.

అయితే, భారత ఆర్థిక వ్యవస్థ అంతకుముందు నుంచే తిరోగమన బాటలో ఉంది. ఇక్కడ నిరుద్యోగం విపరీతంగా పెరుగుతోంది. పంటల ధరలు పడిపోయాయి. పారిశ్రామిక ఉత్పత్తి కూడా నత్త నడకన సాగుతోంది. కరోనావైరస్ వ్యాప్తితో బిహార్ లాంటి పేద రాష్ట్రాలు మరింత చతికిలబడ్డాయి. ఇక్కడ నిరుద్యోగ రేటు.. జాతీయ రేటు కంటే ఎక్కువగా ఉంది. రాష్ట్ర ఆదాయంలో మూడో వంతుగా ఉండే వలస కూలీల వేతనాలు ఆవిరి అయ్యాయి.

బిహార్ ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

వలస కార్మికుల విషయంలో..

వేరే ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను వెనక్కి తీసుకొచ్చేందుకు నీతీశ్ కుమార్ తగిన చర్యలు తీసుకోలేదని చాలా మంది స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే, ఇలా కార్మికులు వెనక్కి రావడానికి ప్రధాని మోదీ అప్పటికప్పుడు విధించిన లాక్‌డౌనే కారణం. అయితే, నీతీశ్‌పై వ్యతిరేకతకు వరుసగా నాలుగోసారి ఆయన సీఎం పదవీకి పోటీ పడటం కారణం కావొచ్చు. ‘‘ఇక్కడ పరిస్థితులను కరోనావైరస్ మరింత తీవ్రం చేసింది. నిరుద్యోగం ఇక్కడ ప్రధాన సమస్య. ఇప్పుడు ఓటింగ్‌లో ఏం జరుగుతుందో చూడాలి’’అని వెర్నీర్ వ్యాఖ్యానించారు.

బిహార్‌ను గత 15ఏళ్లుగా నీతీశ్ పాలిస్తున్నారు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను బీజేపీతో చేతులు కలిపి ఆయన ఎదుర్కోవాలని అనుకుంటున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఏర్పాటైన సంకీర్ణానికి ప్రాంతీయ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేతృత్వం వహిస్తోంది. అవినీతి కేసులో జైలులో గడుపుతున్న లాలూ ప్రసాద్ యాదవ్ కుమారులు ఈ పార్టీకి నేతృత్వం వహిస్తున్నారు. అధికార కూటమితో విడిపోయిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) కూడా ప్రస్తుతం వీరితోనే జతకట్టింది.

మోదీ మిత్ర పక్షాల్లోని అత్యంత సన్నిహిత నాయకుల్లో నీతీశ్ కూడా ఒకరు. రాష్ట్రంలో మద్యంపై నిషేధం, మౌలిక సదుపాయాల కల్పన తదితర సంస్కరణలతో నీతీశ్‌కు మంచి పేరుంది. అయితే ఉద్యోగాలు మాత్రం పెరగలేదు. ప్రస్తుతం ఇక్కడి ఎన్నికలు, ప్రచారాల్లో మోదీ కంటే నీతీశ్ ఎక్కువ కనిపిస్తున్నారు.

బిహార్ రాజకీయాలకు ఒక రూపునిచ్చిన నీతీశ్ కుమార్ లాంటి ప్రాంతీయ నాయకులకు ఈ ఎన్నికలు మంచి అవకాశం లాంటిదని రాజకీయ విశ్లేషకుడు రాహుల్ వర్మ అభిప్రాయపడ్డారు. మరోవైపు బీజేపీకి కూడా సంకీర్ణంతోనే ఇక్కడ గెలవగలమని పూర్తిగా తెలుసని ఆయన అభిప్రాయపడ్డారు.

‘‘జేడీయూ వెనుక నుంచి నెమ్మదిగా బీజేపీ పుంజుకుంటోంది. ఇన్నాళ్లు ఒక ప్రాంతీయ పార్టీ వెనుక నడిచిన పార్టీ.. తాజా ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించే అవకాశముంది’’అని వర్మ వివరించారు. దిల్లీకి చెందిన మేధోమథన సంస్థ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌లో వర్మ పరిశోధకుడిగా పనిచేస్తున్నారు.

బిహార్ ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

అంచనా కష్టమే

రాష్ట్రాల్లో బీజేపీ వరుస ఓటమి అంటే పార్టీకి ప్రజాదరణ తగ్గుతోందని భావించ కూడదని కొందరు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే మోదీ తర్వాత పార్టీలో అంత బలమైన ప్రాంతీయ నాయకులు లేకపోవడంతోనే రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఓటమిని చవిచూస్తోందని వారు భావిస్తున్నారు. ‘‘చాలా రాష్ట్రాల్లో పార్టీ ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటోంది. పార్టీ హయాం ఇప్పుడే మొదలైంది. అయితే, రాష్ట్రాల్లో వారి ఓటమి కొనసాగుతుంది. ఎన్నికల్లో ఇది సర్వసాధారణం’’అని వర్మ వ్యాఖ్యానించారు.

భారత ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఊహించడం చాలా కష్టం. కులం, మతం, నాయకుల మధ్య సయోధ్య, పాలకుల సామర్థ్యం ఇలా చాలా అంశాలు ఓటర్లను ప్రభావితం చేస్తుంటాయి. అయితే, నీతీశ్ కుమార్ నేతృత్వంలోని అధికార కూటమి గెలుస్తుందని ఓ ప్రముఖ రాజకీయ విశ్లేషక సంస్థ తెలిపింది. మరోవైపు ప్రతి నలుగురిలో ఒకరు ఎవరికి ఓటేస్తారే తెలియడం లేదని అంచనలు చెబుతున్నాయి. హంగ్ ఏర్పడే అవకాశాలనూ తోసిపుచ్చలేదు.

ప్రస్తుతం మోదీ పార్టీ సొంతంగా ఎన్ని సీట్లు గెలుస్తుంది? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని సీట్లు పెరిగినా భారత రాజకీయాల్లో బీజేపీకి తిరుగులేదని చెప్పుకోవచ్చు. తగ్గితే మాత్రం మోదీ మాత్రం ఆందోళన పడాల్సిందే. ఎందుకంటే ప్రతిపక్షాల్లో ఇది ఆశలను నింపుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)