కరోనావైరస్: భారత రాజధాని దిల్లీ... లాక్‌డౌన్‌లో దెయ్యాల నగరంగా మారిందా?

దిల్లీ

ఫొటో సోర్స్, Parul Sharma

    • రచయిత, అపర్ణ అల్లూరి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టే దిశగా మార్చి నెలాఖరులో లాక్‌డౌన్ ప్రకటించిన తరువాత దేశం మొత్తం స్తంభించిపోయింది. పెద్ద పెద్ద నగరాలన్నీ నిర్మానుష్యమైపోయాయి. ఆఫీసులన్నీ బంద్. రవాణా సౌకర్యాలన్నీ నిలిచిపోయాయి. అందరూ ఇళ్లకే పరిమితమైపోయారు.

కానీ, ఫోటోగ్రాఫర్ పారుల్ శర్మ మాత్రం మనుషుల అలికిడి లేని దిల్లీ నగరాన్ని తన ఫొటోల్లో బంధించడానికి బయలుదేరారు.

"ఒకచోట నిలకడగా ఉండలేని నాలాంటి వారికి లాక్‌డౌన్ చాలా కఠినమైనదని"అని శర్మ బీబీసీకి తెలిపారు.

"సాధారణంగా నేను ఇంట్లో ఎక్కువసేపు కూర్చోలేను. అందుకే బయటకి వెళ్దామని నిర్ణయించుకున్నాను" అని ఆమె అన్నారు.

అయితే, బయటకు వెళ్లడానికి ఆమె కుటుంబ సభ్యులు ముందు ఒప్పుకోలేదు. మెల్లగా వారిని ఒప్పించి లాక్‌డౌన్ ప్రకటించిన వారం తరువాత, ఏప్రిల్ 3న ఆమె ఇంట్లోంచి బయటకువచ్చారు.

ఆరోజు మధ్యాహ్నం నుంచీ శర్మ, తన కెమెరా పట్టుకుని దిల్లీ వీధుల్లో తిరగడం మొదలుపెట్టారు.

దిల్లీ

ఫొటో సోర్స్, Parul Sharma

తరవాత కొన్ని నెలలు తన కారులో నగరం మొత్తం తిరిగారు. కెమెరాతో పాటూ వీధుల్లో తిరగడానికి అవసరమైన పాసులు తీసుకుని నగరం మొత్తం చుట్టబెట్టారు.

"ఆకాశంలో మేఘాలు, కిలకిలమంటూ పక్షులు తప్పితే మనుషుల జాడ లేదు. ఇదేదో మాయా ప్రపంచంలా తోచింది. వింతగా, కొత్తగా, మనుషులు లేని, కదలికలు లేని ప్రపంచం. కానీ, అందమైన ప్రపంచం" అని శర్మ అన్నారు.

ఫలితంగా 10,000 అద్భుతమైన ఛాయాచిత్రాలు ఆమె తీయగలిగారు. చరిత్ర చూడని క్షణాలను ఒడిసిపట్టుకున్నారు. నిర్మానుషమైన దిల్లీ నగరాన్ని తన కెమెరాలో బంధించారు.

ఈ ఛాయాచిత్రాలన్నీ తన కొత్త పుస్తకం 'డయలెక్ట్స్ ఆఫ్ సైలెన్స్' (నిశ్శబ్దంలోని మాండలికాలు) పుస్తకంలో భాగమయ్యాయి. ఈ పుస్తకాన్ని రోలి బుక్స్ సంస్థ ప్రచురించింది.

శర్మ కెమెరా పట్టుకుని ఇంట్లోంచి బయటికొచ్చాక మొట్టమొదటగా తనకు ఎంతో ఇష్టమైన కనాట్ ప్లేస్‌కి వెళ్లారు. జార్జియన్ శైలిలో వృత్తాకార నిర్మాణం కలిగిన ఈ ప్రదేశం దిల్లీకి హృదయంలాంటిది. వలస రాజ్యాల పాలనలో ఈ ప్రదేశం వ్యాపార కేంద్రంగా ఉండేది. తరువాత అనేక బ్రాండెడ్ షాపులకు, రెస్టారెంట్లు, బార్‌లు, పబ్‌లకు ఇది కేంద్రమయ్యింది.

ఇక్కడ ఉన్న రీగల్ సినిమా థియేటర్ దిల్లీలోని పురాతనమైన, ప్రసిద్ధి చెందిన సినిమా హాళ్లల్లో ఒకటి.

దిల్లీ

ఫొటో సోర్స్, Parul Sharma

"నేను ఇక్కడ ప్రసిద్ధికెక్కిన ప్రదేశాలకు వెళ్లలేదు. నా చిన్నప్పటి జ్ఞాపకాలను వెనక్కి తీసుకువచ్చే ప్రదేశాలకు వెళ్లాను" అని శర్మ తెలిపారు.

కనాట్ ప్లేస్ సాధారణంగా చాలా రద్దీగా ఉండే ప్రదేశం. ఎక్కడ చూసినా దుకాణాలు, వీధి వ్యాపారులు, చిన్న చిన్న కెఫేలు, పెద్ద పెద్ద హోటళ్లు...పక్కనే ఉన్న ఆఫీసుల్లో పనిచేస్తున్నవారు లంచ్ కోసమో, డిన్నర్ కోసమో వస్తుంటారు. లేదా ఆఫీస్ అయిన తరువాత పబ్‌లకో, బార్లకో వచ్చేవాళ్లు, షాపింగ్ కోసం వచ్చేవాళ్లతో ఈ ప్రాంతం కిక్కిరిసి ఉంటుంది.

"కానీ ఆరోజు అక్కడ నేను చూసినది శూన్యం, ఏకాంతం."

దిల్లీ

ఫొటో సోర్స్, Parul Sharma

"అది కూడా చాలా అందంగా అనిపించింది. నిశ్శబ్దంగా, ప్రశాంతంగా...నాకేవేవో కథలు చెప్తున్నట్టు అనిపించింది" అని ఆమె అన్నారు.

శర్మ తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి ఖాన్ మార్కెట్‌ లాంటి ప్రదేశాలకు వెళ్లారు. ఖాన్ మార్కెట్ దేశ విభజన కాలంనాటి వ్యాపార కేంద్రం. ఇప్పుడు అది దిల్లీలోనే అత్యంత ఖరీదైన, అధునాతమైన షాపింగ్ ప్రాంతం. లోపలికి వెళుతూనే కనిపించే పెద్ద పుస్తకాల దుకాణం 'బారిసన్స్' మూసివేసి ఉంది. బహుశా ఇన్నిరోజులు ఈ పుస్తక దుకాణాన్ని మూసివేసి ఉంచడం ఇదే మొదటిసారి అయ్యుంటుందని శర్మ అభిప్రాయపడ్డారు.

పారుల్ శర్మ చేసిన ఈ ప్రయత్నం గురించి, దిల్లీ మీద పుస్తకం రాసిన విలియం డాల్రింపుల్ మాట్లాడుతూ..."లాక్‌డౌన్‌లో ముఖానికి మాస్క్ తొడుగుకున్న, తాళం వేసిన, పరిశుభ్రమైన, నిర్మానుష్యమైన దిల్లీని శర్మ తన కెమేరాలో ఒడిసిపట్టుకున్నారు. భారతదేశ రాజధాని ఇంత కొత్తగా, వాస్తవికంగా ఎప్పుడూ కనిపించలేదు" అని అన్నారు.

ఈ ఫోటోలు చూస్తుంటే, మిగతా దిల్లీ కన్నా పాత దిల్లీ మరీ కొత్తగా, వింతగా అనిపించింది. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాంతం ఒకప్పుడు మొఘల్ రాజుల కేంద్ర స్థానం.

దిల్లీ

ఫొటో సోర్స్, Parul Sharma

"పురాతన దిల్లీని చూస్తుంటే దెయ్యాల నగరంలా అనిపించింది. చాలా ఆశ్చర్యంగా, అబ్బురంగా తోచింది" అని శర్మ తెలిపారు.

పురాతనమైన ఇళ్లు, భవనాలు, సన్నని దారులు, కిక్కిరిసిన జనాలు, అన్ని రకాల వాహనాలతో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం ఒక్కసారిగా ఏదో మంత్రం వేసినట్టు ఖాళీగా, నిశ్చలంగా మారిపోయింది.

దిల్లీలోని అత్యంత ప్రసిద్ధి చెందిన జామా మసీదు కూడా నిశ్శబ్దమైపోయింది. రాత్రిపూట పాత దిల్లీలో తిరుగుతుంటే వింతగా, అందంగా కనిపించిందని శర్మ తెలిపారు.

"నిర్మానుష్యమైన దిల్లీలోని అందాన్ని వెతకాలని తపనపడ్డాను. కానీ రాను రాను కోవిడ్-19 కేసులు పెరగడంతో బాధ, ఆందోళన ఎక్కువయ్యాయి" అని శర్మ అన్నారు.

లాక్‌డౌన్ ప్రారంభంలో నగరానికి వచ్చిన కొత్త అందం, తేటపడిన వాతావరణం, నగరాన్ని ఆక్రమించుకున్న వెలుగు, పరిశుభ్రమైన గాలి పీలుస్తున్నామన్న ఆనందం దిల్లీ ప్రజలకు ఎంతోకాలం నిలవలేదు. కరోనావైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజల్లో భయాందోళనలు పెరగసాగాయి.

దిల్లీ

ఫొటో సోర్స్, Parul Sharma

శర్మ చాలాసార్లు దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రి 'ఎయిమ్స్' మీదుగా వెళ్లారు. ఒకరోజు, అక్కడ ఆగి బయట గుంపులు గుంపులుగా ఉన్న జనంతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. కోవిడ్-19 చికిత్స మీద దృష్టి పెట్టేందుకు వీలుగా ఎయిమ్స్‌లోని అవుట్ పేషెంట్ విభాగాన్ని మూసివేశారు. దాంతో చాలామంది రోగులు ఆస్పత్రి బయట పడిగాపులు కాస్తూ ఉన్నారు. వాళ్లందరి బాధ, ఆవేదనలను శర్మ తన కెమేరాలో చూపించడానికి ప్రయత్నించారు.

శర్మ, ఎయిమ్స్‌లోని కోవిడ్-19 విభాగానికి వెళ్లారు. డాక్టర్లంతా పీపీఈ సూట్లలో కనిపించారు. అలాగే ఆమె ఒక కోవిడ్-19 కేర్ సెంటర్‌కు కూడా వెళ్లారు. అక్కడ ఉన్నావారందరి పోటోలు తీసారు.

"అక్కడ ఒక చిన్న పాపను చూసాను. అమాయకంగా, నవ్వుతూ ఆడుకుంటోంది. పీపీఈ దుస్తుల్లో ఉన్న డాక్టర్‌ను జడ వెయ్యమని అడుగుతోంది" అని శర్మ నవ్వుతూ గుర్తు చేసుకున్నారు.

దిల్లీ

ఫొటో సోర్స్, Parul Sharma

మొదట్లో నిర్మానుష్యంగా ఉన్న దిల్లీ అందాలను తన కెమెరాలో బంధించాలని బయలుదేరిన శర్మ, తరువాత, కరోనావైరస్ వల్ల కకావికలమైన జీవితాలపై దృష్టి పెట్టారు.

చేతిలో డబ్బులు లేక ఆకలితో మలమలలాడుతున్న వ్యభిచారం చేసే మహిళలు, నిలువ నీడ లేక, తినడానికి డబ్బులు లేక బాధపడుతున్న పేద ప్రజలు, చేతిలోని పని ఆగిపోయి అవస్థలు పడుతున్న రోజూ కూలీల బతుకు చిత్రాలను శర్మ తన ఫోటోల్లో చూపించారు.

అప్పుడే ఆమెకు కొంత ప్రతిఘటన ఎదురయ్యింది.

దిల్లీ

ఫొటో సోర్స్, Parul Sharma

"నేనొక స్త్రీని కాబట్టి నన్ను అడ్డుకోవాలని చూసారు. చాలా ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ నేను ఒక ప్రేక్షకురాలిగా అంతా చూస్తూ ఉండిపోవాలనుకోలేదు" అని శర్మ అన్నారు.

అక్కడితో ఆమె ఆగిపోలేదు. హిందూ, ముస్లిం శ్మశానవాటికలకు వెళ్లారు. క్రైస్తవ శవ పేటికల తయారీదారులను కలిసారు. ఇంత తక్కువకాలంలో ఇన్ని శవపేటికలను మేమెప్పుడూ తయారుచేయలేదని వారు చెప్పారు.

దిల్లీ

ఫొటో సోర్స్, Parul Sharma

"చావు కన్నా భయపెట్టేది, విషాదకరమైనది మరొకటి ఉండదు. ఆత్మీయుల చివరి చూపులు లేవు. ఎవరూ పువ్వులు సమర్పించలేదు. చివరి వీడుకోలు లేవు. చావు మాత్రమే ఉంది" అని శర్మ అన్నారు.

దిల్లీ

ఫొటో సోర్స్, Parul Sharma

జూన్‌లో మెల్లగా లాక్‌డౌన్ సడలింపు ప్రారంభమయ్యింది. ఆ కొత్త ప్రారంభాన్ని కూడా శర్మ తన కెమేరాలో బంధించారు. మాస్కులు వేసుకుని తక్కువ సిబ్బందితో, నాలుగు గోడల మధ్య షూటింగులు జరుపుకుంటున్న ప్రకటనలు, చలనచిత్రాలు, మెల్లమెల్లగా తమ కార్యకలాపాలు ప్రారంభిస్తున్న దిల్లీ ప్రజల ఫొటోలు తీసారు.

దిల్లీ

ఫొటో సోర్స్, Parul Sharma

వీటన్నిటినీ కూడా శర్మ, తన పుస్తకంలో పొందుపరిచారు. ఆగస్ట్ చివరివారంలో విడుదల అయిన ఈ పుస్తకం ఎన్నో ప్రశంసలందుకుంది. ఎప్పుడూ, రద్దీగా హడావుడిగా ఉందే దిల్లీ మహా నగరాన్ని లాక్‌డౌన్ సమయంలో ఆత్మీయంగా స్పర్శించినందుకు ఆమెను పలువురు అభినందించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)