అర్నబ్ గోస్వామిపై మహారాష్ట్ర అసెంబ్లీలో హక్కుల ఉల్లంఘన తీర్మానం.. ఏం జరగబోతోంది

ఫొటో సోర్స్, Getty Images
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామికి వ్యతిరేకంగా మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రత్యేక హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయిక్ అర్నబ్ గోస్వామికి వ్యతిరేకంగా ఈ తీర్మానాన్ని పెట్టిన తర్వాత అసెంబ్లీలో కలకలం రేగింది. అరగంట పాటు అసెంబ్లీ కార్యకలాపాలు స్తంభించాయి. అసెంబ్లీ ఈ తీర్మానాన్ని ఆమోదించింది.
దాంతో, అర్నబ్ గోస్వామికి వ్యతిరేకంగా సభ త్వరలోనే చర్యలు ప్రారంభించే అవకాశాలున్నాయి.
అర్నబ్ గోస్వామిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర రవాణా మంత్రి అనిల్ పరబ్ కూడా డిమాండ్ చేశారు.
“ఒక జర్నలిస్టుకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే, లేదా వారిపై చేయిచేసుకుంటే ఈ అసెంబ్లీలో జర్నలిస్టుల భద్రత కోసం చట్టం చేశారు. కానీ ఒక జర్నలిస్టే ఒక ప్రజా ప్రతినిధి గురించి ఏదైనా అంటే అతడికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలా, వద్దా?” అని అనిల్ పరబ్ సభను ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
“ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ గురించి మాట్లాడుతూ అర్నబ్ గోస్వామి ప్రయోగించిన భాషను తీవ్రంగా ఖండిస్తున్నాను. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్‌ల ప్రతిష్ఠను మంటగలపాలనే ప్రయత్నం జరిగింది. అర్నబ్ గోస్వామిపై కఠినాతి కఠిన చర్యలు తీసుకోవాలి” అని ప్రతాప్ సర్నాయిక్ అన్నారు.
“అర్నబ్ తనను తాను జడ్జినని అనుకుంటున్నాడు. ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్‌లను నువ్వు-నువ్వు అంటూ మాట్లాడాడు. జర్నలిస్టుల భద్రత కోసం చట్టం చేసే అధికారం ఈ సభకు ఎలా ఉందో, అలాగే ఒక జర్నలిస్టుపై చర్యలు తీసుకోడానికి కూడా సభకు అధికారం ఉంద”ని అనిల్ పరబ్ అన్నారు.
"ఎవరైనా ప్రధానమంత్రిపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడినపుడు వారిపై చర్యలు తీసుకుంటే, ముఖ్యమంత్రిపై బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేసినవారిపైనా చర్యలు తీసుకోవాల్సిందే. ప్రధానమంత్రిని ఎవరైనా ఏదైనా అంటే మీకు కోపమొస్తుంది. కానీ, ముఖ్యమంత్రిని ఏదైనా అంటే మీకు కోపం రాదా. సుపారీలు తీసుకునే జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలి” అన్నారు అనిల్ పరబ్.

ఫొటో సోర్స్, Ani
అన్వయ్ నాయిక్ ఆత్మహత్య కేసు
“అన్వయ్ నాయిక్ కేసులో అర్నబ్ గోస్వామిపై దర్యాప్తు జరుగుతుంద”ని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అసెంబ్లీలో చెప్పారు.
అన్వయ్ నాయిక్ ఒక మరాఠీ ఇంటీరియర్ డిజైనర్. ఆయన 2018 మేలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో ఆయన “అర్నబ్ గోస్వామి రిపబ్లిక్ నెట్‌వర్క్ స్టూడియోకు ఇంటీరియర్ డిజైన్ చేయించుకున్న తర్వాత చెల్లింపులు చేయలేద”ని ఆరోపించారు.
“అన్వయ్ నాయిక్ భార్య, కూతురు నా దగ్గరకు వచ్చి అర్నబ్ గోస్వామిపై ఫిర్యాదు చేశారు. అందుకే మహారాష్ట్ర పోలీసులు అర్నబ్ గోస్వామికి వ్యతిరేకంగా దర్యాప్తు చేస్తారు. అన్వయ్ నాయిక్ భార్య అక్షతా నాయిక్, కూతురు ప్రజ్ఞా నాయిక్ ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు జరుగుతుంది” అని అనిల్ దేశ్‌ముఖ్ చెప్పారు.
మహారాష్ట్రలో కొన్ని రోజుల క్రితం ‘జస్టిస్ ఫర్ అన్వయ్’ అనే హాష్‌టాగ్ బాగా ట్రెండ్ అయ్యింది.
ఇవి కూడా చదవండి:
- ఏడు నెలల గర్భంతో ఉన్న భార్యను తీసుకుని 1200 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణం
- మీడియా జడ్జి పాత్ర పోషించొచ్చా.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అలాంటి కేసులివే
- ‘‘చాలాకాలంగా ఇలాగే చేస్తున్నాం కానీ ఎప్పుడూ గర్భం రాలేదు’’
- అన్నం తింటే డయాబెటిస్ వస్తుందా
- ఇద్దరమ్మాయిలు ఒక్కటయ్యారు.. పరువు కోసం చంపేస్తామంటున్న కుటుంబం
- ‘అధ్యాపక వృత్తి నుంచి వచ్చి వెండితెరపై వెలిగిన నటుడు జయప్రకాశ్ రెడ్డి’
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








