కరోనావైరస్: హిట్లర్‌లా మారిపోతున్న కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ
విశ్రాంత సైనికుడు మేజర్ అతుల్ దేవ్.. తన కాలనీ సంక్షేమ సంఘం (ఆర్‌డబ్ల్యూఏ)పై చాలా కోపంతో ఉన్నారు.
భారత్‌లోని పట్టణ ప్రాంతాల్లో కనిపించే ఈ సంఘాలను ఆర్‌డబ్ల్యూఏలుగా పిలుస్తారు. నివాసిత ప్రాంతాల్లో రోజువారీ కార్యకలాపాలన్నీ సవ్యంగా జరిపించే బాధ్యతను ఆర్‌డబ్ల్యూఏలు తీసుకుంటాయి. భద్రత సహా పలు అంశాలకు సంబంధించి వీరు మార్గదర్శకాలు జారీచేస్తారు. వీటిని ప్రజలంతా అనుసరిస్తారు. ఈ సంఘాల్లోని సభ్యులను కాలనీ వాసులంతా కలిపి ఎన్నుకుంటారు.
కరోనావైరస్‌ను కట్టడి చేసేందుకు భారత్‌లో లాక్‌డౌన్ విధించిన నాటి నుంచీ చాలా సంఘాలు అతి చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. అయితే అందరి సంక్షేమం కోసమే తాము చర్యలు తీసుకుంటున్నామని సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు.
ఇటీవల కాలంలో ఈ సంఘాల ప్రతినిధులను బుల్లి హిట్లర్లు, చౌకబారు నియంతలు అంటూ భారత్ మీడియా అభివర్ణించింది.
చాలా సంఘాలు.. ఏం చేయచ్చో, ఏం చేయకూడదోనని పేజీల పేజీల నిబంధనలు విడుదల చేశాయి. వీటిలో కొన్ని నిబంధనలు అయితే మరీ నిర్హేతుకంగా ఉన్నాయి. వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
"నిజంగానే కొంత మంది పిల్ల నియంతల్లా ప్రవర్తించారు. సొంతంగా నిబంధనలూ తీసుకొచ్చారు. ప్రభుత్వ సూచనలు మరీ ఉదసీనంగా ఉన్నాయంటూ వాటిని పెడచెవినా పెట్టారు."అని హిందుస్తాన్ టైమ్స్ పత్రికలో కాలమిస్ట్ వీర్ సంఘ్వి రాసుకొచ్చారు.
"కొందరైతే డెలివరీ బాయ్స్‌ను లోపలకు అనుమతించరు. మరికొందరు దినపత్రికలు వేసేవారినీ పొమ్మంటారు. బయట ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్నప్పటికీ.. కాలనీల్లో మాత్రం నియంతృత్వం రాజ్యమేలుతోంది" అని ఆయన వివరించారు.
"ప్రభుత్వం సూచించిన దానికంటే చాలా కఠినమైన నిబంధనలను తాము ప్రవేశపెట్టాలని ప్రతి సంఘమూ అనుకుంటోంది" అని మేజర్ దేవ్ వ్యాఖ్యానించారు.
80ఏళ్ల దేవ్ గురుగ్రామ్‌లోని సుశాంత్ అపార్ట్‌మెంట్స్ భవన సముదాయంలో ఉంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆయన నివసిస్తున్న కాలనీ సంక్షేమ సంఘం.. అక్కడివారిని ఇబ్బందిపెట్టే చాలా నిబంధనలు తీసుకొచ్చింది. దినపత్రికలు, సరకులు, మందులు డెలివరీచేసే బాయ్స్‌ను కేవలం మెయిన్ గేట్ వరకు అనుమతిస్తున్నారు. అలానే సందర్శకులకు అనుమతి లేదు.
"మా అబ్బాయి, మా కుటుంబం ఇదే భవన సముదాయంలో ఉంటోంది. అయితే అపార్ట్‌మెంట్లు వేరు. ఇక్కడి నిబంధనల వల్ల నన్ను కలవడానికి మా కోడలు భయపడుతోంది."అని దేవ్ చెప్పారు.
సుశాంత్ అపార్ట్‌మెంట్స్‌లో వివాదాస్పదమైన అంశం ఏంటంటే.. ఇంట్లో పనిచేసేవారిని లోపలకు అనుమతించాలా వద్దా అనేది. భారత్‌లోని చాలా నగరాల్లో ఆర్‌డబ్ల్యూఏలది ఇదే పరిస్థితి.
ధనవంతులతోపాటు మధ్య తరగతి ప్రజలూ ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీ కాంప్లెక్స్‌ల్లో నివసిస్తుంటారు. ఇక్కడి ఇళ్లలో పనిచేసేవారు సమీపంలోని బస్తీల నుంచి వస్తుంటారు. అయితే అక్కడ సామాజిక దూరం పాటించడం సాధ్యంకాదు.
పశ్చిమ దేశాలతో పోలిస్తే.. భారత్‌లోని మధ్య తరగతి ప్రజల ఇళ్లలో ఎక్కువగా ఇంటి పనులు చేసేందుకు మనుషుల్ని పెట్టుకుంటారు. బట్టలు, గిన్నెలు, ఇల్లు తుడవడం, తడిగుడ్డ పెట్టడం ఇలా అన్నింటికీ మనుషుల్ని పెట్టుకుంటారు. అందుకే ఇళ్లలో పనులు చేసేవారిని త్వరగా పనుల్లోకి రప్పించాలని చాలా కుటుంబాలు కోరుకుంటున్నాయి.
చాలా మంది కార్మికులు ఉపాధి కోల్పోతామేమోననే భయంతో త్వరగా పనుల్లోకి వెళ్లిపోవాలని భావిస్తున్నారు.అయితే చాలా సంఘాలు వారిని లోపలకు అనుమతించడంలేదు. ఎందుకంటే వారు కరోనావైరస్‌ను మోసుకొస్తారేమోనని భయపడుతున్నారు.
ప్రభుత్వం ఆంక్షలు సడలించిన మూడు వారాల తర్వాత.. మే 23 నుంచి మాత్రమే వంటపని, ఇంటిపని చేసేవారిని సుశాంత్ అపార్ట్‌మెంట్స్ అనుమతించింది.
అంతేకాదు తమ ఇంట్లో పనికి వచ్చేవారు ఆరోగ్యంగా ఉన్నారని, వారికి కరోనావైరస్ లక్షణాలేవీ లేవని ఓ పత్రం పూరిస్తేనే కార్మికులను అనుమతిస్తున్నారు.
"ఒకవేళ పనిచేసేవారికి కరోనావైరస్ తర్వాత సోకినట్లు తేలితే.. ఆ ఇంటి యజమానిదే బాధ్యత అని కూడా ఆ పత్రంలో రాసివుంది. " అని మేజర్ దేవ్ చెప్పారు. ఆ అక్రమ పత్రాన్ని తానూ పూర్తిచేసి ఇచ్చానని, అప్పుడే తన ఇంట్లోకి పనివారిని అనుమతించారని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
బయటకు వెళ్లే మార్గాలనూ సంఘాలు మూసేయడంతో కార్మికులంతా చాలా దూరం నడిచి చుట్టూతిరిగి ఇంటికి వెళ్లాల్సి వస్తోందని ఆయన చెప్పారు.
"త్వరగా వెళ్లే మార్గాలను మూసేశారు. దీంతో 200 మీటర్లకు బదులు 2 కి.మీ.లు నడవాల్సి వస్తోంది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్న ఈ వేసవిలో అలా నడవడం చాలా కష్టం."అని ఆయన వివరించారు.
"అంతేకాదు కంటైన్‌మెంట్ జోన్‌గా గుర్తించిన ప్రాంతం మీదుగా పనివాళ్లు వెళ్లేలా వారు చేస్తున్నారు. దీంతో కార్మికులు వైరస్ బారిన పడే ముప్పు ఎక్కువవుతోంది"అని ఆయన అన్నారు.
గురుగ్రామ్‌లో మాత్రమే కాదు. దేశ వ్యాప్తంగా కాలనీ సంక్షేమ సంఘాలు ఇలాంటి నిర్హేతుక నిబంధనలు పెడుతున్నాయని ఫిర్యాదులు అందుతున్నాయి.
దిల్లీలోని డిఫెన్స్ కాలనీలో ఉంటున్న హితేశ్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. మూసేసిన గేట్లు, బారికెడ్ల వల్ల కొన్ని నెలలుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోందని హితేశ్ అన్నారు.
తన జీవితం మొత్తాన్నీ ఆయన డిఫెన్స్ కాలనీలోనే గడిపారు. ఇక్కడ ప్రాంతాలన్నీ ఆయనకు బాగా తెలుసు. అయితే ఇప్పుడు గేట్లు మూసేయడం, బారికెడ్లు పెట్టడంతో.. ఉబెర్ లేదా డోర్‌డెలివరీ బాయ్స్‌కు చిరునామా సరిగా చెప్పలేకపోతున్నానని ఆయన అన్నారు.
"దినపత్రికల వల్ల కరోనావైరస్ వ్యాపించే ముప్పుందని వాట్సాప్ సందేశాలను చూసి రెండు వారాలుగా తమకు వచ్చే దినపత్రికల డెలివరీని తమ కాలనీ సంఘం అడ్డుకుంటోందని బెంగళూరుకు చెందిన నా స్నేహితుడు తెలిపారు."
గురుగ్రామ్‌లోని ఓ అపార్ట్‌మెంట్ అయితే.. పనివాళ్లు ఎలివేటర్ బటన్లు ముట్టుకోకుండా ఓ కొత్త నిబంధన తీసుకొచ్చింది. పనివాళ్లు కిందకు వెళ్లేటప్పుడు, పైకి వచ్చేటప్పుడు.. యజమానులు పక్కనుండాల్సిందేనని స్పష్టంచేసింది.
తమ అపార్ట్‌మెంట్‌లో అందరూ సవ్య దిశలోనే (గడియారం తిరిగే దిశ) నడవాలని నిబంధన తెచ్చినట్లు ఓ మహిళ తెలిపారు. వేరే దిశలో నడిస్తే రూ.500 జరిమానా తప్పదని వివరించారు.
నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అయితే పనిచేసే వారిని కనీసం లిఫ్ట్ ఉపయోగించనివ్వడం లేదు. ఇక్కడ మెట్లపై ఎక్కుతూ ఏడు అంతస్తుల పైకి చేరుకున్న ఓ పనిమనిషి వీడియో ట్విటర్‌లో వైరల్ అయ్యింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
నర్సులు, డాక్టర్లనూ ఇరుగు పొరుగువారు వేధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. మరోవైపు విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకువచ్చేందుకు వెళ్లిన తమ సిబ్బందిని కొన్ని సంఘాలు వేధించాయని తేలడంతో ఎయిర్ ఇండియా కూడా ఆగ్రహంతో ఓ ప్రకటన విడుదల చేసింది.
అయితే ఈ నిబంధనలన్నీ తమ కాలనీలో ఉండేవారు సురక్షితంగా ఉంచడం కోసమేనని కాలనీ సంఘాలు చెబుతున్నాయి.
కొన్ని సంఘాలు చాలా మంచి పనులు చేస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహమూలేదు. లాక్‌డౌన్ సమయంలోనూ నిత్యవసరాలు వచ్చేలా, వీధులన్నీ శుభ్రంగా ఉంచేలా, చెత్తను ఎప్పటికప్పుడు తీసుకుపోయేలా కొన్ని ఆర్‌డబ్ల్యూఏలు చర్యలు తీసుకున్నాయి.
కొన్నిచోట్ల అయితే వలస కూలీలు, సమీపంలోని బస్తీల్లో నివసించే పేదల కోసం భోజనం, సరకులనూ పంపిణీ చేశాయి.
ఇప్పుడు పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా ఉందని బెంగళూరులోని ఓ భవన సముదాయంలో నివసిస్తున్న భాస్కర్ కర్మాకర్ తెలిపారు. ఆయన కూడా ఓ సంక్షేమ సంఘంలో సభ్యుడు.
"నేను కూడా మా ఇంట్లోకి పనివాళ్లు రావాలనే కోరుకుంటా. నా భర్యకు, నాకు ఆఫీస్ వర్క్ ఉంటుంది. పనులన్నీ చేయడంతోపాటు ఇంట్లో మా ఇద్దరు అమ్మాయిలనూ చూసుకోవడం చాలా కష్టం."
"అయితే కాలనీ సంక్షేమ సంఘం సభ్యుడిగా ఇలా కూడా ఆలోచించాల్సి వస్తోంది. ఎవరికైనా ఒకరికి కరోనావైరస్ వస్తే.. అది వ్యాపించి.. అందరికీ సమస్యగా మారుతుంది."
"మా అపార్ట్‌మెంట్లలో వృద్ధులు, చిన్న పిల్లలు, ఇప్పటికే ఇతర వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు.. లాంటి ముప్పు ఎక్కువగా ఉండేవారూ ఉన్నారు. వారికి రక్షణ కొంచెం ఎక్కువ అవసరం."
"అంత తేలిగ్గా నిర్ణయాలు తీసుకోలేం. అయితే క్షమించండని చెప్పడం కంటే సురక్షితంగా ఉండటం మేలు."

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కూతురి కోసం దాచిన రూ. 5 లక్షలు లాక్‌డౌన్ బాధితులకు ఖర్చు చేసిన సెలూన్ యజమాని
- నా కళ్లతో చూశాను.. ఒక్కొక్కరు చనిపోతుంటే బోటులోంచి సముద్రంలోకి విసిరేశారు
- అమెరికా అంతటా విస్తరిస్తున్న ఆగ్రహ జ్వాలలు - ‘‘ఊపిరి ఆడటం లేదు... చచ్చిపోతున్నాం’’
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- కరోనావైరస్: ముంబయి మహానగరాన్ని కోవిడ్-19 ఎలా ధ్వంసం చేసింది
- స్వాల్బార్డ్‌కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- రెండో ప్రపంచ యుద్ధంలో బాంబుదాడుల నుంచి బతికి బయటపడ్డ మొసలి ఇప్పుడు మృతి
- జాక్ మా: కరోనావైరస్‌ను కట్టడి చేయాలని, చైనా ప్రతిష్ఠను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్న మహా కోటీశ్వరుడు
- ఓ వైపు యుద్ధం - మరోవైపు కరోనావైరస్.. తీవ్ర ప్రమాదంలో కామెరూన్ ప్రజలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








