ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో నెంబర్ గేమ్ ఎవరికి అనుకూలం?

ఉపరాష్ట్రపతి ఎన్నిక, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, రాధాకృష్ణన్, ఎన్డీయే కూటమి, కాంగ్రెస్
    • రచయిత, ఆనంద్ మణి త్రిపాఠి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత 15వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 9న ఓటింగ్‌ జరగడంతో పాటు అదే రోజు ఫలితాలు రానున్నాయి.

ఉపరాష్ట్రపతి పదవికి జగ్‌దీప్ ధన్‌ఖడ్ జులై 21న అనారోగ్య కారణాల వల్ల రాజీనామా చేశారు. ఆయన 2022 ఆగస్టులో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు.

ఆయన పదవీ కాలం 2027 ఆగస్టు 10వరకు ఉంది.

ఈ ఎన్నికలకు సంబంధించిన రాజకీయాలు తారస్ధాయికి చేరాయి. ఓటింగ్‌కు గడువు దగ్గరపడటంతో రెండు కూటములు 'విందు' రాజకీయాల్లో బిజీగా ఉన్నాయి.

"ఉపరాష్ట్రపతి ఎన్నిక సాధారణంగా చాలా బోరింగ్‌గా ఉంటుంది కానీ ఈసారి అది భిన్నంగా ఉంది" అని రాజకీయ విశ్లేషకురాలు నీర్జా చౌధరి అన్నారు.

ప్రభుత్వ బలం, ఆరెస్సెస్-ప్రభుత్వాల మధ్య సమన్వయం, నాయకత్వ పరిమితుల ఆధారంగా నీర్జా చౌధరి ఈ ఎన్నికలను అంచనా వేస్తున్నారు.

"ధన్‌ఖడ్ రాజీనామా చేసిన విధానం కావచ్చు లేదా రాజీవ్ ప్రతాప్‌ రూడీ కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా కార్యదర్శి పదవిని గెలుచుకున్న విధానం కావచ్చు. ఇటీవలి పరిణామాలు ఈ ఎన్నికను ఆసక్తికరంగా మార్చాయి" అని ఆమె చెప్పారు.

"ఒక చిన్న క్లబ్ ఎన్నికల్లో రూడీ 100 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో గెలిచారు. అది కూడా రూడీ ప్రత్యర్థి సంజీవ్ బలియాన్‌కు అమిత్‌షా, జేపీ నడ్డా మద్దతిచ్చినప్పుడు. ఈ ఎన్నికల్లో సోనియా గాంధీ మద్దతుతో పాటు బీజేపీ ఎంపీలు కూడా క్రాస్ ఓటింగ్‌ చేశారా అనేది కూడా ప్రశ్న" అని నీర్జా చౌధరి అన్నారు.

ఎన్డీఏ అభ్యర్థి గెలుపుకు ఇబ్బందేమీలేకున్నా, క్రాస్ ఓటింగ్ జరిగితే కూటమి, ప్రభుత్వం బలాబలాల గురించి సందేహాలు చెలరేగుతాయని ఆమె అభిప్రాయపడ్డారు.

"ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ ( INDIA - ఇండియా కూటమి)కి ఉన్న ఓట్లకంటే ఎక్కువ ఓట్లు లభిస్తే, అది కూటమి నాయకత్వం, బలం, సంస్థాగత శక్తికి నిదర్శనంగా నిలుస్తుంది" అని నీర్జా చౌధరి చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఉపరాష్ట్రపతి ఎన్నిక, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, రాధాకృష్ణన్, ఎన్డీయే కూటమి, కాంగ్రెస్

ఫొటో సోర్స్, Getty Images

నెంబర్లు అటు ఇటు అవుతాయా?

ఉప రాష్ట్రపతి ఎన్నికలో నెంబర్ల విషయానికొస్తే అది ఎన్డీయేకు అనుకూలంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు సీనియర్ జర్నలిస్ట్ విజయ్ త్రివేది.

"తన బలాన్ని మించి ఏ కూటమికి ఎక్కువ ఓట్లు వస్తాయో చూడాలి. మొత్తం 782 ఓట్లలో 48 ఓట్లు ఎన్డీయేకు లేదా ఇండియా కూటమికి అనుకూలంగా లేవు" అని ఆయన అన్నారు.

"ఎన్డీయే వ్యూహం గురించి చెప్పాలంటే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఓట్లు పడతాయా లేదా అన్నది పక్కన పెడితే ఆయన అన్ని పార్టీల నేతలతో మాట్లాడారు" అని త్రివేదీ చెప్పారు.

ఎన్నికలో గెలవడానికి అవసరమైన 391 ఓట్ల కంటే ఎన్డీయే వద్ద ఇంకా 31 ఓట్లు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇండియా కూటమికి 312 ఓట్లు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీయే గెలుపుపై ఎవరికీ ఎలాంటి సందేహాలు ఉండకపోవచ్చు.

"మరో అంశం ఏంటంటే, ఈ ఎన్నికల్లో బీజేపీ- ఆరెస్సెస్ మధ్య మెరుగైన సమన్వయం కనిపిస్తోంది. అందుకే ఉపరాష్ట్రపతి పదవికి ఆరెస్సెస్ వలంటీర్‌ను అభ్యర్థిగా పెట్టారు" అని విజయ్ త్రివేదీ అన్నారు.

ఈ ఎన్నికకు సంబంధించి ఒడిశాలో ప్రధాన ప్రాంతీయ పార్టీ బీజేడీ ఇంకా తన వ్యూహాన్ని వెల్లడించలేదు ఇది మరింత ఆసక్తికరంగా మారిందనేది విజయ్ త్రివేది అభిప్రాయం.

ప్రస్తుతం ఒడిశాలో బీజేడీ- బీజేపీ ప్రత్యర్థులైనప్పటికీ ఒకప్పుడు ఈ రెండు పార్టీలు మిత్ర పక్షాలు.

"డీఎంకే ఇండియా కూటమిలో భాగం. అయితే ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్ ‌తమిళనాడుకు చెందిన వారు. 32 ఓట్లు ఉన్న డీఎంకే ఆయనకు మద్దతివ్వవచ్చు. డీఎంకే రాధాకృష్ణన్‌కు ఓటు వేయకపోతే బీజేపీకి అది రాజకీయ అస్త్రంగా మారుతుంది" అని విజయ్ త్రివేదీ చెప్పారు.

తమిళనాడులో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 4 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంది. ఎన్డీయే భాగస్వామ్యపక్షం అన్నాడీఎంకే 66 సీట్లు గెలుచుకుంది.

"అభ్యర్ధులిద్దరూ దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో ఈ రాష్ట్రాల ఎంపీలు ఓటు వేసే విషయంలో తమ అభిష్టానికి అనుగుణంగా వ్యవహరించే అవకాశాలు పెరిగాయి" అని సీనియర్ జర్నలిస్ట్ వినీతా యాదవ్ అన్నారు.

ఉపరాష్ట్రపతి ఎన్నిక, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, రాధాకృష్ణన్, ఎన్డీయే కూటమి, కాంగ్రెస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత పార్లమెంట్

పార్టీలు విప్ ఎందుకు జారీ చేయడం లేదు?

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగవని అందుకే ఏ పార్టీ కూడా విప్ జారీ చేయదని రాజకీయ విశ్లేషకుడ అనంత్ మిశ్రా చెప్పారు.

"పార్లమెంట్ సభ్యుడు తనకు నచ్చిన వాళ్లకు ఓటు వేయచ్చు. అందుకే అనేకమంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నట్లు కనిపిస్తోంది" అని ఆయన వివరించారు.

"ఈ ఎన్నికల్లో పార్టీ విప్ జారీ చేయకపోవడంతో 1969లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారిక అభ్యర్థి ఓడిపోయారు. ఇందిరా గాంధీ మద్దతుతో వీవీ గిరి గెలిచి రాష్ట్రపతి అయ్యారు" అని అనంత్ మిశ్రా గుర్తు చేశారు.

"ఇండియా కూటమి ఈ ఎన్నికల్ని ఉత్తరాది వర్సెస్ దక్షిణాది అని మార్చింది. అయితే దక్షిణాది పార్టీల మద్దతు పొందడంలో విఫలమైనట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇస్తున్నాయి. ఇండియా కూటమి నుంచి వ్యూహాత్మకంగా ఎలాంటి చొరవ కనిపించడం లేదు" అని ఆయన చెప్పారు.

ఇండియా కూటమి అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డికి ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మద్దతు ప్రకటించారు.

"తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నన్ను సంప్రదించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికలో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతివ్వాలని కోరింది. మా హైదరాబాద్ వ్యక్తి, గౌరవ న్యాయ నిపుణుడు జస్టిస్ రెడ్డికి ఏఐఎంఐఎం మద్దతిస్తుంది" అని ఒవైసీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)