మొహమ్మద్ జుబేర్: ఈ ఫ్యాక్ట్ చెకర్ గురించి ఐక్యరాజ్య సమితి ఎందుకు స్పందించింది, యూపీలో ఆయనపై కేసు ఏంటి

ఉత్తర ప్రదేశ్, భారత న్యాయ సంహిత, పోలీసులు, జుబేర్, ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్ ఏఎల్టీ న్యూస్, విద్వేష పూరిత ప్రసంగాలు
ఫొటో క్యాప్షన్, ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్ ఏఎ‌ల్‌టీ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మొహమ్మద్ జుబేర్
    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘ఆయన్ను తక్షణం విడుదల చెయ్యండి’ అంటూ సుప్రీంకోర్టు రెండేళ్ల కిందట మొహ్మద్ జుబేర్‌కు బెయిల్ మంజూరు చేసింది. కానీ, ఆయన మళ్లీ కోర్టుకు వచ్చారు. తనను అరెస్టు చేయవద్దంటూ కోర్టును కోరారు.

“ భారత దేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు ముప్పు” అని ఆరోపిస్తూ జుబేర్‌ను అరెస్ట్ చేసేందుకు ఉత్తర ప్రదేశ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో మంగళవారం ఆయన అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది.

ఆయన మీద నమోదైన అభియోగాలు బెయిల్‌కు అర్హత లేనివి. ఈ కేసులో ఆయన దోషిగా తేలితే ఏడేళ్ల జైలుశిక్ష, జరిమానా లేదా యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉంది.

ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్ ఏఎల్‌టీ న్యూస్ సహ వ్యవస్థాపకుడే జుబేర్. తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ ఆయన తిరస్కరించారు.

“నేను చేస్తున్న పనివల్ల పోలీసులకు టార్గెట్ అయ్యానని అనుకుంటున్నా” అని ఆయన బీబీసీతో అన్నారు.

మంగళవారం కోర్టులో 20 నిముషాల వాదనల తర్వాత, ఈ కేసును విచారించేందుకు న్యాయమూర్తులు తిరస్కరించారు. ఇప్పుడీ కేసు రానున్న రోజుల్లో మరో బెంచ్‌కు బదిలీ కానుంది.

“విద్వేష పూరిత ప్రసంగాలపై ఒంటరిగా పోరాడుతూ ఉండటంతో ఆయన ప్రభుత్వానికి కంట్లో నలుసులా మారారు” అని కొందరు వ్యాఖ్యానించారు. వివాదాస్పద సాధువు ఒకరు చేసిన విద్వేష పూరిత వ్యాఖ్యలను ‘ఎక్స్’లో పెట్టారంటూ జుబేర్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు కేసులు నమోదు చేశారు.

2024 అక్టోబర్ 3న ఆయన ‘ఎక్స్‌’లో పోస్ట్ చేసిన వీడియోలో మొహమ్మద్ ప్రవక్త మీద యతి నరసింహానంద్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని కొందరు ముస్లింలు ఆరోపించారు.

యతి నరసింహానంద్ ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్ పట్టణంలో ఉన్న దస్నాదేవి ఆలయ అధిపతి. ముస్లింల మీద దాడులను బహిరంగంగా ప్రోత్సహిస్తూ తరచూ వార్తల్లో కనిపిస్తుంటారు.

ముస్లింలను, మహిళలను కించపరుస్తూ 2022లో ఆయన వ్యాఖ్యలు చెయ్యడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడాయన నెల రోజులు జైలులో ఉన్నారు.

తాజాగా ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు జుబేర్ పోస్ట్ చేసిన వీడియోలో కనిపించడంతో ఆలయం ఎదుట ముస్లింలు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన సమయంలో రాళ్లు విసిరిన 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పీటీఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.

నరసింహానంద్‌కు వ్యతిరేకంగా అనేక ముస్లిం సంస్థలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. పోలీసులు అరెస్ట్ చేస్తారని కథనాలు రావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు.

అయితే పోలీసులు ఈ కథనాలను తిరస్కరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఉత్తర ప్రదేశ్, భారత న్యాయ సంహిత, పోలీసులు, జుబేర్, ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్ ఏఎల్టీ న్యూస్, విద్వేష పూరిత ప్రసంగాలు
ఫొటో క్యాప్షన్, ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్న యతి నరసింహానంద్

మొదట వచ్చిన ఫిర్యాదులో జుబేర్ మీద మతాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, పరువు నష్టం, తప్పుడు ఆధారాలు చూపించడం వంటి తేలికపాటి అభియోగాలు ఉన్నాయి.

అయితే, గతవారం పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 152 కింద అభియోగాలు నమోదు చేశారు. ఇందులో ‘‘భారతదేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు ముప్పుగా మారారు” అని ఆయనపై ఆరోపణలు చేశారు.

ఈ సెక్షన్ కింద జుబేర్‌ను పోలీసులు అరెస్ట్ చెయ్యవచ్చని న్యాయ నిపుణులు చెప్పారు. జుబేర్ న్యాయవాది కోర్టుని ఆశ్రయించి మధ్యంతర బెయిల్ మంజూరు చెయ్యాలని, కేసును కొట్టి వేయాలని కోరారు.

నరసింహానంద్ ‌వ్యాఖ్యల్ని పోస్ట్ చేసింది తానొక్కడినే కాదని, ఇంకా అనేక మంది జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, మీడియా చానళ్ల వారు ఉన్నారని జుబేర్ కోర్టులో వాదించారు. తనకంటే ముందు వారంతా ఆ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారని చెప్పారు.

“నిరంతరం ద్వేషపూరిత ప్రసంగాలు చేసే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదులతో పోలీసులు నా మీద కేసు నమోదు చేశారు. విద్వేష పూరిత ప్రసంగాల గురించి రిపోర్టింగ్ చేస్తున్న వ్యక్తిని వాళ్లు అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. అలాంటి ప్రసంగాలు చేస్తున్నవారు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నారు” అని జుబేర్ అన్నారు.

“ప్రభుత్వానికి బాధ్యతను గుర్తు చెయ్యడానికి ప్రయత్నిస్తున్న వారి నోరు నొక్కే ప్రయత్నం ఇది” అని ఆయన ఆరోపించారు.

జుబేర్ చేస్తున్న పనులు, వాటివల్ల సమాజంపై పడుతున్న ప్రభావం వల్లనే అధికారులు ఆయనను వెంటాడుతున్నారని జుబేర్ సన్నిహితుడు, ఏఎల్టీ న్యూస్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా చెప్పారు.

“ఇది ప్రతీకార చర్య. ప్రశ్నించే వారిపై జరుగుతున్న దాడులకు అసలైన ఉదాహరణ” అని ఆయన బీబీసీతో అన్నారు.

“రెండు నెలల తర్వాత పోలీసులు ఎందుకు ఆయన మీద తీవ్రమైన అభియోగాలను నమోదు చేశారు? ఇది కేవలం నరసింహానంద్, ఆయన మద్దతుదారులు జుబేర్ వెంట పడటంవల్ల కాదు. ప్రభుత్వమే ఆయన వెంట పడుతోంది” అని ప్రతీక్ సిన్హా అన్నారు.

జుబేర్‌ మీద అదనంగా దేశద్రోహం అభియోగాలను మోపడాన్ని హక్కుల సంస్థలు విమర్శించాయి. న్యాయ సంహితలో సెక్షన్ 152 వలస పాలన కాలం నాటి రాజద్రోహ చట్టానికి ‘కొత్త రూపం’ అని జర్నలిస్టు, మీడియా సంఘాలు అంటున్నాయి.

“వేధించడం, భయపెట్టడం, మానవహక్కుల కోసం పోరాడుతున్న వారిని ఇరుకున పెట్టడం, కార్యకర్తలు, జర్నలిస్టులు, విద్యార్థులు, సినీ నిర్మాతలు, గాయకులు, నటులు, రచయితలు, భావ ప్రకటన స్వేచ్ఛ కోసం పోరాడుతున్నవారిని వేధించేందుకు చట్టాన్ని ఎలా ఉపయోగిస్తున్నారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ’’ అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా తెలిపింది.

పోలీసుల చర్యలను ఖండించిన ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, జుబేర్ మీద కేసును తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.

“మీడియా, స్వేచ్ఛావాదుల గొంతు నొక్కడానికి ఈ సెక్షన్‌ను బలవంతంగా ప్రయోగించడాన్ని మేధావులందరూ వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే వారిపైనా దీన్ని ప్రయోగిస్తున్నారు” అని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ప్రకటనలో వ్యాఖ్యానించింది.

“జుబేర్‌పై వేధింపుల తీవ్రత పెరుగుతోంది. ఆయనపై ఆరోపణలకు ఆధారాలు లేవు” అని డిజిటల్ మీడియా ఆర్గనైజేషన్స్ అసోసియేషన్ డిజిపబ్ అన్నది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించింది.

ఉత్తర ప్రదేశ్, భారత న్యాయ సంహిత, పోలీసులు, జుబేర్, ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్ ఏఎల్టీ న్యూస్, విద్వేష పూరిత ప్రసంగాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2022లో మొహమ్మద్ జుబేర్ అరెస్టును ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి కార్యాలయం విమర్శించింది.

2022లో జుబేర్‌ను అరెస్ట్ చేసినప్పుడు కూడా ప్రభుత్వం మీద ఇలాంటి విమర్శలే వచ్చాయి. అప్పట్లో ఆయన మూడు వారాల పాటు జైలులో ఉన్నారు. సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చారు..

“హిందూ మతస్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్నాడు” అని ఆరోపిస్తూ 2018లో దిల్లీ పోలీసులు జుబేర్‌ను అరెస్ట్ చేశారు. 1980ల్లో వచ్చిన ప్రముఖ బాలీవుడ్‌ సినిమాలో ఒక దృశ్యాన్ని స్క్రీన్ షాట్ తీసి ఆయన ట్వీట్ చెయ్యడమే దీనికి కారణం.

దిల్లీ పోలీసులు జుబేర్‌ను అరెస్ట్ చేసిన తర్వాత ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఆయన నేరపూరిత కుట్రలకు పాల్పడుతున్నారని, ఆయనకు విదేశీ నిధులు అందుతున్నాయనే ఆరోపణల కింద కేసు నమోదు చేశారు.

“ఎంపిక చేసిన, రాజకీయ ప్రేరేపితమైన” వాస్తవాల పరిశీలనకు పరిమితమైన వ్యక్తి అని జుబేర్‌ను విమర్శించారు బీజేపీఅధికార ప్రతినిధి గౌరవ్ భాటియా. ఆయన పెట్టే ట్వీట్లు “అనేకమంది హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉంటాయి” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే ఆ సమయంలో అనేకమంది జుబేర్ అరెస్టును అప్పట్లో బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన ఇస్లాం వ్యతిరేక కామెంట్లతో ముడి పెట్టారు.

“వాళ్లు రాసే వార్తలు, చేసే ట్వీట్లు, చేసే వ్యాఖ్యలకు జర్నలిస్టుల్ని జైల్లో పెట్టకూడదు” అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ అన్నారు. జుబేర్ అరెస్ట్ పట్ల అంతర్జాతీయ హక్కుల సంఘాలు, ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన వ్యక్తం చేశాయి.

అయితే హక్కుల సంఘాలు కూడా ఇదే చెబుతున్నాయి. జుబేర్, ఇతర జర్నలిస్టుల్ని అదుపు చేసేందుకు అధికారులు వీటినే ఎంచుకుంటున్నారని విమర్శకులు అంటున్నారు.

గ్లోబల్ ప్రెస్ ఫ్రీడమ్ ర్యాంకింగ్స్‌లో ఇండియా స్థానం దిగజారుతోంది. 180 దేశాల్లో ప్రస్తుతం భారతదేశం 159వ స్థానంలో ఉందని మీడియా వాచ్‌డాగ్ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ తెలిపింది.

“ప్రభుత్వాలను విమర్శించే జర్నలిస్టులు నిరంతరం ఆన్‌లైన్ ద్వారా వేధింపులు, బెదిరింపులు, భౌతిక దాడులకు గురవుతున్నారు. వీటితోపాటు విచారణను ఎదుర్కొంటున్నారు. వారిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు” అని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ వార్షిక నివేదిక వెల్లడించింది.

గతంలో ఈ నివేదికను భారత ప్రభుత్వం తిరస్కరించింది. ఈ నివేదిక సందేహాస్పదంగా ఉందని, ఇందులో పారదర్శకత కొరవడిందని అన్నది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)