హైడ్ అండ్ సీక్ రివ్యూ: సెల్ ఫోన్ గేమ్‌తో హత్యలు చేయిస్తున్నది ఎవరు?

ఫొటో సోర్స్, FB/Viswanth
- రచయిత, శృంగవరపు రచన
- హోదా, బీబీసీ కోసం
కేరింత సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన హీరో విశ్వంత్.
విశ్వంత్ నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ‘హైడ్ అండ్ సీక్’.
టెక్నాలజీ వల్ల నేరాలు జరిగే పద్ధతులు మారిపోయాయి. సెల్ ఫోన్స్, డ్రగ్స్, గేమ్స్‌లాంటివి వచ్చాక నేరాల తీరు మారిపోయింది.
ఓ క్రైమ్ గేమ్‌తో యువత మెదళ్లను ప్రభావితం చేసి, వారు హత్యలు చేసేలా పురిగొల్పింది ఎవరు? వారిని మెడికల్ స్టూడెంట్ శివ పట్టుకున్నాడా?
నంది రాజ్యంలో జరిగిన మారణకాండకు ఈ హత్యలకు సంబంధం ఏంటి? అన్నదే ఈ ‘హైడ్ అండ్ సీక్’ సినిమా కథ.


ఫొటో సోర్స్, FB/Vishwanth
ఫ్రెష్ కథతో ప్రయోగం
ఫ్రెష్ కథ ఇది. చారిత్రక నేపథ్యం కూడా కలగలిపిన కథ.
ఇన్వెస్టిగేషన్‌లో ఒకటి, రెండు చోట్ల ఏవో కొత్తగా చేసినవి ఉన్నాయి.
ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్న ఈ కథ సినిమాగా ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఇప్పుడు చూద్దాం.

ఫొటో సోర్స్, FB/Basireddy Rana
లాజిక్ లేకుండా..
ఆసక్తికర అంశాలు ఉన్నప్పటికీ అవి కథలో సరిగ్గా ఇమడలేదు. స్క్విడ్ గేమ్, కొన్ని హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్లలో తీసుకున్న కొన్ని అంశాలు కూడా ఈ సినిమాలో కనిపిస్తాయి. క్రైమ్ థ్రిల్లర్‌లో లాజిక్ లేకుండా మ్యాజిక్ చేయడం కుదరదు.
ఒక క్రైమ్ సీన్, ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాలి. అప్పుడే క్రైమ్ థ్రిల్లర్స్ విజయవంతం అవుతాయి.
కానీ, ఇందులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వైష్ణవి ఉద్వేగాలను ఫాలో అవుతుంది తప్ప లాజిక్‌ని కాదు. పోలీస్ వ్యవస్థ ఒక కేసును ఎలా ఛేదిస్తుందో అనే అంశంపై డైరెక్టర్ ఇంకా దృష్టి పెట్టి ఉండాల్సింది.
హీరోయిక్ ఎలిమెంట్స్‌తో శివను ఎలివేట్ చేద్దామని చూసినా వర్కవుట్ అవ్వలేదు. క్యారెక్టర్స్ మధ్య బాండింగ్ ఉండే సీన్లు ఎక్కువ లేవు.
స్నేహం, యువతకు ఉండే వ్యసనాలు, దేశ ద్రోహం లాంటివి సినిమాటిక్ లిబర్టీతో అక్కడక్కడ వస్తూ పోతూ ఉంటాయి. అంతే కానీ, బలంగా కథతో అతుక్కోవు. విశ్వంత్, శిల్ప మంజునాథన్, శివల నటన పర్వాలేదనిపించింది

ఫొటో సోర్స్, FB/Rohit Addanki
వెతికినా కనిపించని డ్రామా
ఈ సినిమాలో భూతద్దం పట్టుకుని వెతికినా డ్రామా అనేదే కనిపించదు.
హీరో ఆర్మీలో డాక్టర్ కావాలనుకుంటాడు. ప్రతి విషయాన్ని క్రైమ్ యాంగిల్‌లో కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అతనిలో అలాంటి కసి ఎందుకు పుట్టింది? అతని దేశభక్తికి ఏ నేపథ్యం ఉంది? ఇవేమీ సినిమాలో కనిపించవు. అందుకే హీరో పాత్రకు జీవం లేనట్టు అనిపిస్తుంది.
విలన్ ఒక ప్రొఫెషనల్ పనిలో ఉంటాడు. అదేంటో సినిమాలోనే చూడండి. యువతను గేమింగ్ క్రైమ్‌కు అలవాటు చేయడం అన్నది కొంత బాగానే ఉంది. ఈ సినిమాలో హీరో, విలన్ పాత్రలతో పోలీస్ వ్యవస్థకు సమాన ప్రాధాన్యం ఉంది.
పోలీసుల దర్యాప్తులో ఆవేశమే తప్ప నిబద్ధత కనిపించదు.
మంచి కథ ఉన్నా, దానికి నటులు జీవం పోయలేకపోయారు. క్రైమ్ థ్రిల్లర్‌లో సస్పెన్స్‌తో పాటు సైలెన్స్ కూడా ఉంటుంది. ఏం జరుగుతుందో ఊహించకుండా ఉండటానికే ఆ సైలెన్స్ ఉండేది. ఈ సినిమాలో మ్యూజిక్ ఆ సైలెన్స్‌ని డిస్టర్బ్ చేస్తుంది.

ఫొటో సోర్స్, FB/Rohti Addanki
ఒక కొత్త ప్రయత్నం
దర్శకుడు బసిరెడ్డి రాణాకు మొదటి సినిమా ‘హైడ్ అండ్ సీక్.’ ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన గేమింగ్ క్రైమ్స్ కాన్సెప్ట్‌ను కర్నూలు ప్రాంతానికి ఈ సినిమాలో ఆపాదించారు. మొదటి సినిమాకు ఇది చాలా మంచి ప్రయత్నమే.
ఈ తరహా సినిమాల్లో ఇన్వెస్టిగేషన్‌ను, పాత్రల మానసిక ఆరోగ్యాన్ని లాజిక్ ఫ్రేమ్‌లో పట్టేలా చూసుకోవాలి. అవేమీ లేకుండా చివర్లో ఒక మోటివేషన్ సెషన్ స్పీచ్‌లా మానసిక వైద్యురాలితో చెప్పించడం కూడా కృతకంగా ఉంది.
నంది రాజ్యంలో సంభజీవుడి కథకు, ప్రస్తుతం జరిగే కథకు బలమైన సంబంధం ఉండేలా దర్శకుడు జాగ్రత్తలు తీసుకుని ఉంటే బావుండేది.
ప్లస్ పాయింట్స్
- కొత్తగా అనిపించే కథ
- సుద్దాల అశోక్ తేజ పాట
- చారిత్రక నేపథ్యం
మైనస్ పాయింట్స్
- బలమైన డ్రామా లేకపోవడం
- కథనం బలహీనంగా ఉండటం
- పాత్రల చిత్రీకరణ
(గమనిక: ఈ రివ్యూలోని అభిప్రాయాలు సమీక్షకురాలి వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














