సివిల్స్ కోచింగ్‌ సెంటర్‌లోకి వరద నీరు ఎలా వచ్చింది, ముగ్గురి మృతి ఘటనలో అసలేం జరిగింది?

విద్యార్థుల నిరసన

దేశ రాజధాని దిల్లీలోని రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లోకి వరద నీరు చేరుకోవడంతో ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. చనిపోయిన వారిలో ఇద్దరు అమ్మాయిలు, ఒకరు అబ్బాయి.

ఈ ముగ్గురు విద్యార్థులు తెలంగాణ, కేరళ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారని దిల్లీ పోలీసులు తెలిపినట్లు ఏఎన్ఐ రిపోర్టు చేసింది. మృతదేహాలను ఆర్‌ఎంఎల్ మార్చురీకి పంపినట్లు ఏఎన్ఐ పేర్కొంది.

బేస్‌మెంట్‌ నుంచి వెలికితీసిన మృతదేహాలను గుర్తించామని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేశామని దిల్లీ సెంట్రల్ డీసీపీ హర్షవర్ధన్ తెలిపారు.

యూపీలోని అంబేద్కర్ నగర్ జిల్లాకు చెందిన శ్రేయా యాదవ్, తెలంగాణకు చెందిన తాన్యా సోని, కేరళలోని ఎర్నాకుళం ప్రాంతానికి చెందిన నివిన్ డాల్విన్‌గా గుర్తించినట్లు చెప్పారు.

అయితే, తాన్యా సోని స్వస్థలం బిహార్ అని, ఆమె తండ్రి సింగరేణిలో మేనేజర్‌గా పని చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ‘ఎక్స్‌’లో వెల్లడించారు.

విజయ్ కుమార్‌తో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కావాల్సిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా దిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌ను ఆదేశించినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
దిల్లీ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, దిల్లీ సెంట్రల్ డీసీపీ హర్షవర్ధన్

కోచింగ్ సెంటర్ యజమానిని, కోర్డినేటర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. భారత న్యాయ సంహిత (బీఎన్ఎస్‌)లోని సెక్షన్స్ 105, 106(1), 115(2), 290, 35ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

ఈ ఇన్‌స్టిట్యూట్‌లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కోసం విద్యార్థులు ప్రిపేర్ అవుతుంటారు. అకస్మాత్తుగా ఈ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ భవనంలోకి వరద నీరు చేరుకోవడంతో బేస్‌మెంట్‌లో ఉన్న లైబ్రరీలో కొందరు విద్యార్థులు చిక్కుకున్నారు.

వర్షం పడ్డ తర్వాత శనివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఈ భవంతిలోకి వరద నీరు వచ్చింది.

దిల్లీ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని, బేస్‌మెంట్‌లో వరద నీటిలో చిక్కుకున్న వారిని బయటికి తీసేందుకు ప్రయత్నించాయి.

రాజేంద్ర నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత, విద్యార్థులు ఆ ప్రాంతంలో ఉన్న కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ల ఎదుట నిరసనకు దిగారు.

ఈ కేసులో న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు.

వర్షం పడ్డ ప్రతీసారి ఈ ప్రాంతమంతా వరద నీటితో మునిగిపోతుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

‘‘గత రెండేళ్లుగా ఈ ప్రాంతంలో కొద్దిగా వర్షంపడ్డా వరద నీరు చేరుకుంటుంది. ఏడాదిలో కనీసం ఒక్కసారైనా విపత్తు సంభవిస్తుంది. ప్రతిసారి ఇలానే జరుగుతుంది. ఆరు రోజుల కిందట పటేల్ నగర్‌లో ఎలక్ట్రిక్ షాక్‌తో ఒక విద్యార్థి చనిపోయారు.’’ అని విద్యార్థులు ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు.

ఈ ప్రాంతంలో ఉన్న 80 శాతం లైబ్రరీలు బేస్‌మెంట్‌లోనే ఉన్నాయని మరో విద్యార్థి చెప్పారు.

విద్యార్థుల నిరసనతో అదనపు డీసీపీ సచిన్ శర్మ సంఘటన ప్రాంతానికి చేరుకుని, ఆందోళన చేస్తున్న విద్యార్థులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.

విద్యార్థుల ఆందోళన

ఫొటో సోర్స్, ANI

‘‘ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. పదకొండు మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చాం. నలుగురికి వైద్య చికిత్స అందిస్తున్నాం. చట్టపరంగా సాధ్యమైనంత సాయమంతా మేం చేస్తామని భరోసా ఇస్తున్నా.’’ అని నిరసన చేస్తున్న విద్యార్థులతో డీసీపీ సచిన్ శర్మ అన్నారు.

‘‘ఇప్పటి వరకు బేస్‌మెంట్ లైబ్రరీలో మూడు మృతదేహాలను వెలికితీశాం. భవంతిలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఇతరులను కూడా బయటికి తీసుకొచ్చాం. ఈ ఘటనపై క్రిమినల్ కేసు దాఖలు చేస్తాం.’’ అని దిల్లీ సెంట్రల్ డీసీపీ ఎం.హర్షవర్ధన్ చెప్పారు.

ఈ కేసులో విచారించేందుకు ఇప్పటి వరకు ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఇతర బాధ్యులను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తామని డీసీపీ తెలిపారు.

బీజేపీ, ఆమ్‌ఆద్మీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఈ ఘటనకు ఆమ్ ఆద్మీ పార్టీ బాధ్యత వహించాలని బీజేపీ అంటోంది.

రాజకీయ వివాదం

రాజేంద్ర నగర్‌లో జరిగిన ఈ ప్రమాదంపై దిల్లీలో రాజకీయంగా వేడి రాజుకుంది. ఈ ఘటనకు ఆమ్ ఆద్మీ పార్టీదే బాధ్యతని బీజేపీ ఆరోపించింది.

ప్రస్తుతం దిల్లీ ప్రభుత్వం, దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో ఉన్నాయి.

అయితే, బీజేపీ విమర్శలను ఆమ్ ఆద్మీ పార్టీ తిప్పికొట్టింది. దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను సుదీర్ఘకాలం పాలించింది బీజేపీయేనని అన్నది.

ఈ ప్రాంతపు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ సంఘటన స్థలికి వచ్చారు.

సంఘటన జరిగిన ప్రాంతం లోతట్టులో ఉందని, అకస్మాత్తుగా మురుగు కాలువ తెగిపోయి పొంగి ప్రవహించిందని అందుకే ప్రమాదం జరిగి ఉంటుందని ఆయన అన్నారు.

మరోవైపు ఈ కేసులో బాధ్యులైన ఏ అధికారిపైన అయినా చర్యలు తీసుకుంటామని దిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ తెలిపారు.

మంత్రి అతిషి, మేయర్ ఒబెరాయ్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, దిల్లీ మంత్రి అతిషి, నగర మేయర్ షెల్లీ ఒబెరాయ్

విచారణకు ఆదేశించిన దిల్లీ ప్రభుత్వం

దిల్లీ మంత్రి అతిషి ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. 24 గంటల్లోగా రిపోర్టును సమర్పించాలన్నారు.

ఈ ఘటనకు బాధ్యులైన వారిని వదిలేది లేదని, కఠిన చర్యలుంటాయని ఆమె చెప్పారు.

ముఖర్జీ నగర్, రాజేంద్ర నగర్ ప్రాంతాలు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్లకు ఫేమస్.

సివిల్ సర్వీసెస్, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఈ ప్రాంతాల్లో పలు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్లు అందుబాటులో ఉన్నాయి.

దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అవుతుంటారు. అందుకే, ఈ ప్రాంతాల్లో రద్దీ కూడా ఎక్కువ.

గత ఏడాది జూన్‌లో ముఖర్జీ నగర్‌లో ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భవనం పైకప్పు నుంచి దూకి విద్యార్థులు ప్రాణాలు రక్షించుకున్నారు.

వీడియో క్యాప్షన్, లైబ్రరీలో చదువుతున్న ఆ ముగ్గురూ ఒక్కసారి నీళ్లు రావడంతో చనిపోయారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)