రైలా ఒడింగా: కేరళలో చనిపోయిన ఈ కెన్యా నేతను నెల్సన్ మండేలాతో ఎందుకు పోలుస్తున్నారు?

కెన్యా, ఆఫ్రికా, రాజకీయాలు, రైలా ఒడింగా

ఫొటో సోర్స్, Donwilson Odhiambo/Getty Images

    • రచయిత, వైక్లిఫ్ ముయా, షింగాయ్ నయోకా

న్యమీరా కౌంటీలోని ఓ గ్రామంలో ఆదివారం సాయంత్రం గౌరవ వందనంగా 17 తుపాకులు ప్రతిధ్వనించగా, సైనిక విమానాలు గర్జించాయి, అనంతరం కెన్యా అంతటా శ్మశాన నిశ్శబ్దం అలుముకుంది.

ఒడింగా కేరళలోని ఎర్నాకుళంలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

అంతిమ రాజకీయ కిరీటమైన అధ్యక్ష పదవిని అలంకరించలేకపోయినా, లక్షలాది మంది ప్రజల హృదయాలను గెలుచుకున్న వ్యక్తి ఆ శవపేటికలో ఉన్నారు. ఆయనే పీపుల్స్ ప్రెసిడెంట్ రైలా అమోలా ఒడింగా.

గతవారం, 80 ఏళ్ల వయసులో ఆయన చనిపోయారు. రైలా మరణం ఆ దేశాన్ని కుదిపేసింది. కేవలం రాజకీయాల్లో మాత్రమే కాకుండా, దేశంలోనూ ఆయన స్థానం భర్తీ చేయలేనిదని వార్తా పత్రికలు, విశ్లేషకులు పేర్కొంటున్నారు.

దక్షిణాఫ్రికా మొదటి నల్లజాతి అధ్యక్షుడైన నెల్సన్ మండేలాతో ఆయన్ను పోలుస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

"అధికారం, వ్యక్తిగత ఆశయాలను మించిన అరుదైన రాజకీయ నేత రైలా. మండేలా మాదిరిగానే, ఆయన ప్రజల ఆకాంక్షలను మోశారు" అని కెన్యా చరిత్రకారుడు చెబి కిప్రోనో బీబీసీతో అన్నారు.

ఆయన పోరాటాన్ని గుర్తుచేస్తూ, సోషల్ మీడియా నుంచి నైట్‌క్లబ్బుల వరకూ ఆయనకు ఎంతో ఇష్టమైన రెగ్గే పాట "జమైకన్ ఫేర్‌వెల్" ప్రతిధ్వనిస్తూనే ఉంది.

ఆదివారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. ప్రత్యేక ఆహ్వానితుల మధ్య, ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరిగిన ఈ కార్యక్రమంలో, సంప్రదాయబద్ధంగా ఆయనకు వీడ్కోలు పలికారు.

మండిపోతున్న ఎండలో, జేబురుమాళ్లతో చెమటను, ఉబికివస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ జనసందోహం "జోవీ జోవీ జోవీ" అంటూ నినదిస్తూ రోదించారు. లూవో ప్రజల ఆచారం ప్రకారం చనిపోయిన వారిని గుర్తుచేసుకుంటూ చేసే నినాదమే ‘జోవీ’.

రైలా ఒడింగా, కెన్యా, ఆఫ్రికా, రాజకీయాలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, కెన్యా మాజీ ప్రధాని ఒడింగా భారత్‌లో చికిత్స పొందుతూ గత వారం మరణించారు.

ఒడింగా సంప్రదాయ లూవో వర్గానికి చెందిన వారు. లూవో సంప్రదాయ అంత్యక్రియలలో భాగంగా డర్జ్ అనే విషాద గీతం ఆలపిస్తారు. అసమాన ధైర్యసాహసాలను, అద్భుతమైన వారసత్వాన్ని ఈ గీతం సూచిస్తుంది.

ఏ ప్రభుత్వాన్నైతే ఒడింగా ధిక్కరించి నిలబడ్డాడో, ఆ ప్రభుత్వమే ఆయనను సైనిక లాంఛనాలతో గౌరవించేందుకు ముందుకొచ్చింది. ఇదే ప్రభుత్వం కనీసం విచారణ కూడా జరపకుండా ఆయన్ను ఏళ్ల తరబడి జైల్లో పెట్టింది.

ఒడింగాకు శత్రువులే అంత్యక్రియలు నిర్వహించారని ఆయనకు నివాళులర్పిస్తూ రాసిన ప్రశంసాపత్రంలో ఒడింగా సన్నిహితుడు, రాజకీయ విశ్లేషకులు వఫులా బ్యూక్ రాశారు.

"రైలాపై టియర్ గ్యాస్, బుల్లెట్లను ప్రయోగించిన వారు ఇప్పుడు మౌనంగా చూస్తున్నారు. ఆయన అంతిమ కార్యక్రమానికి మమ్మల్ని దూరం చేశారు. ఫోటోలు లేవు, పోడియంలో సీట్లు లేవు, ఆయన శవపేటికను తాకే అవకాశం కూడా దక్కలేదు. ఆయన్ను తలచుకుంటూ ఒక కవితకు కూడా అవకాశం లేకపోయింది" అని బ్యూక్ రాశారు.

"కానీ రైలా, మండేలా మనవారే. ఇప్పటికీ, ఎప్పటికీ మనవారే" అని ఆయన అన్నారు.

"ఆధునిక ఆఫ్రికాలో, ఆఖరి నిజమైన విప్లవకారుల్లో ఒడింగా ఒకరు" అని డాక్టర్ కిప్రోనో పేర్కొన్నారు.

ఫైర్‌బ్రాండ్ రాజకీయ నాయకుడిగా, బలమైన ప్రచారకర్తగా, బహుళ పార్టీ ప్రజాస్వామ్యం కోసం అంకింతభావంతో పనిచేసిన నేతగా.. దేశ రాజకీయాల్లో పోటీతత్వం, జాతీయ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేసిన ఉన్నత వ్యక్తిగా ఒడింగా ఎదిగారు.

ఆయన లేని లోటు కేవలం ప్రతిపక్షంలోనే కాకుండా, అధ్యక్షుడు విలియం రూటో ప్రభుత్వంలోనూ కనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఆయన అధికారంలో లేకపోయినా, ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చేందుకు గత ప్రభుత్వాలతో సహా రూటో ప్రభుత్వం కూడా ఆయనపై ఆధారపడింది.

రైలా ఒడింగా, కెన్యా, ఆఫ్రికా, రాజకీయాలు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, కెన్యా ప్రతిపక్ష పార్టీ ఓడీఎం నేత రైలా ఒడింగా.

"రైలా లేకపోవడం, కెన్యాను పూర్తిగా మార్చేయవచ్చు. మార్పు కోరుతూ ప్రజా ఉద్యమం ఎగసిపడే అవకాశం ఉంది" అని సుదీర్ఘ కాలం ఆయనకు ప్రతినిధిగా వ్యవహరించిన సలీమ్ లోన్ రాశారు.

ఆయన మృతదేహాన్ని ఖననం చేస్తూ, శవపేటికను భూమిలోకి దించుతున్నప్పుడు కెన్యా ప్రజాస్వామ్య పోరాటంలో ఒక అధ్యాయం ముగిసిపోతోందని స్పష్టంగా అర్థమైంది.

"మన దేశం, మన ఖండం, ఈ ప్రపంచం.. మనస్సాక్షితో ఆలోచించే నాయకుడిని, ఉక్కుసంకల్పం కలిగిన దార్శనికుడిని, నిస్సహాయ వర్గాల రక్షకుడిని కోల్పోయింది. ఆయన చూపిన మార్గం కెన్యా ప్రజాస్వామ్యాన్ని నిరంతరం ప్రకాశింపజేస్తూనే ఉంటుంది" అని ఆయనకు నివాళులర్పిస్తూ అధ్యక్షుడు రూటో అన్నారు.

52 ఏళ్ల కిందట ఒడింగాను వివాహం చేసుకుంటున్నప్పుడు, తాను ఒక పొలిటికల్ ఇంజినీర్‌ను పెళ్లి చేసుకుంటున్నట్లు తనకు తెలియదని ఆయన భార్య ఇదా అన్నారు

ఇలాంటి క్లిష్ట సమయంలో ఒడింగాను కోల్పోవడం కెన్యాకు తీరని లోటని రాజకీయ నేత, మాజీ రాజకీయ ఖైదీ అయిన కోయిగి వామ్‌వెరే వంటి కొందరు అభిప్రాయపడుతున్నారు.

"రైలా మరణించాల్సింది కాదు. అణచివేతను ఎదుర్కొనేందుకు, దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలపై పోరాడేందుకు అనుసరిస్తున్న వ్యూహాలు ఉత్తమమైనవేనా, కావా అని మేం ఆయనతో చర్చించలేదు" అని స్థానిక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వామ్‌వెరే అన్నారు.

ఒడింగా వంటి బలమైన జాతీయ నేత, ప్రతిపక్షం లేకపోతే.. అసమ్మతిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించే అవకాశం ఉందని కొందరు ఆందోళన చెందుతున్నారు.

"రైలా సాయంతో ఏర్పడిన రాజకీయ వ్యవస్థకు ఇది పరీక్షా సమయం. రానున్న రెండేళ్లు గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. నాయకత్వ పోటీ, సంకీర్ణ ప్రభుత్వ విచ్చిన్నం, భావోద్వేగపూరిత రాజకీయాలు, అధికారం గుర్తింపు కోసం పునర్వ్యవస్థీకరణలు జరిగే అవకాశాలున్నాయి" అని న్యాయవాది క్రిస్ ఓమోర్ స్థానిక వార్తాపత్రికతో అన్నారు.

ఒడింగా నేతృత్వంలోని ఆరెంజ్ డెమొక్రటిక్ పార్టీ (ఓడీఎం) ఇప్పటికే గందరగోళంలో ఉంది. రానున్న 2027 ఎన్నికల్లో రూటోకు మద్దతు ఇవ్వాలా? వద్దా? అనే విషయంలో ఇప్పటికే అంతర్గత విభేదాలు మొదలయ్యాయి.

గత ఏడాది అధ్యక్షుడు రూటోకి, ఒడింగాకు మధ్య కుదిరిన రాజకీయ ఒప్పందం కారణంగా, ప్రతిపక్ష నేతలు కూడా క్యాబినెట్‌లో భాగస్వాములయ్యారు. దీనిని "విస్తృత ప్రయోజన ప్రభుత్వం" గా పిలుస్తున్నారు.

పేదల జీవితాలను మెరుగుపరచడంలో వైఫల్యం, భారీగా పన్నుల విధింపుతో ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తిని చల్లబరిచేందుకు, అధికారంపై తన పట్టును నిలుపుకునేందుకు రూటో చేసిన ప్రయత్నంగా చాలామంది ఈ చర్యను చూస్తారు.

"2027లో ఓడీఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, లేదంటే ప్రభుత్వంలో భాగమవుతుంది" అని రూటో చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో ఓడీఎం సొంతంగా తన అధ్యక్ష అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉందని మరణానికి కొద్దిరోజుల ముందు ఒడింగా కూడా సంకేతాలిచ్చారు.

జీవన వ్యయం భారీగా పెరిగిపోతుండడంతో ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి కారణంగా రూటో తిరిగి ఎన్నికయ్యే అవకాశాలు అంతంతమాత్రమే. ఇదే సమయంలో ఓడీఎం స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయించుకుంటే.. అది రూటోకు భారీ సవాల్‌గా మారొచ్చు.

గత ఏడాది హింసాత్మక నిరసనలు చెలరేగడంతో పన్నుల పెంపు ప్రణాళికలపై రూటో ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

అలాగే, కీలక రాజకీయ నేత.. తన డిప్యూటీ రిగాతి గచాగువాపై గతేడాది విధించిన అభిశంసనతో రూటో ప్రజాదరణ కూడా దెబ్బతింది.

ఒడింగా మరణం కెన్యాను వ్యక్తిత్వ ఆధారిత రాజకీయాల నుంచి సంస్థాగత, సమ్మిళిత ప్రజాస్వామ్యం వైపు మళ్లించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

"ఒడింగా రాజకీయ లక్ష్యాలను, సైద్ధాంతిక పోరాటాన్ని కొనసాగించేందుకు యువత ముందుకు రాబోతున్నారు" అని రాజకీయ విశ్లేషకులు బరాక్ ములూకా అంటున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)