విజయ్ మాల్యా, చోక్సీ సహా 50 మంది టాప్ డిఫాల్టర్ల రూ.68,000 కోట్ల బాకీలు రైటాఫ్: ఆర్‌టీఐ సమాచారంలో ఆర్‌బీఐ వెల్లడి - ప్రెస్ రివ్యూ

విజయ్ మాల్యా

ఫొటో సోర్స్, Getty Images

దేశంలో ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ప్రకటించిన వ్యాపారవేత్తలకు సంబంధించి 2019 సెప్టెంబర్ 30 నాటికి రూ.68,000 కోట్లకు పైగా రుణాలను బ్యాంకులు సాంకేతికంగా రైట్ ఆఫ్ చేశామని సమాచార హక్కు కింద అడిగిన ప్రశ్నకు ఆర్‌బీఐ సమాధానంగా చెప్పిందని ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. ఆర్‌టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే తన ట్విటర్ ఖాతాలో దీనికి సంబంధించిన వివరాలను షేర్ చేశారు. టాప్ 50 ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై కాంగ్రెస్ నేత, వాయనాడ్ ఎంపీ రాహుల్‌ గాంధీ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం నిరాకరించడంతో తాను ఇదే విషయంపై ఆర్‌టీఐని ఆశ్రయించినట్టు గోఖలే ట్వీట్ చేశారు.

ఫిబ్రవరి 16 నాటికి టాప్-50 ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, వారి ప్రస్తుత రుణ స్థితికి సంబంధించిన వివరాలను కోరగా.. ఏప్రిల్ 24న తనకు ఈ సమాధానం వచ్చినట్టు గోఖలే చెప్పారు. టాప్ 50 ఉద్దేశపూర్వక ఎగవేతదారులు చెల్లించాల్సిన మొత్తం రూ.68,607 కోట్లను ఆర్‌బీఐ మాఫీ చేసిందని గోఖలే ట్వీట్ చేశారు. వీరిలో పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా తదితరులకు సంబంధించిన సంస్థలు ఉన్నాయి.

'విల్‌ఫుల్ డిఫాల్టర్స్' జాబితాలో రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ రూ. 5,492 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. సందీప్, సంజయ్ ఝున్‌ఝన్ వాలాకు చెందిన ఎఫ్‌ఎంసీజీ సంస్థ ఆర్‌ఈఐ ఆగ్రో లిమిటెడ్ (రూ. 4,314 కోట్లు), జతిన్ మెహతాకు చెందిన విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యువెలరీ లిమిటెడ్ (రూ.4,000 కోట్లు) రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి.

కాన్పూర్‌కు చెందిన రోటోమాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2,850 కోట్లు ఎగవేసింది. బాబా రామ్‌దేవ్ బాలకృష్ణ గ్రూప్ కంపెనీ రుచి సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇండోర్ (రూ.2,212 కోట్లు) కూడా డిఫాల్టర్ల జాబితాలో ఉంది. విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ.1,943 కోట్లతో ఈ జాబితాలో నిలిచింది.

ఇదిలావుంటే.. సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ విదేశీ రుణగ్రహీతలపై సమాచారాన్ని వెల్లడించడానికి ఆర్‌బీఐ నిరాకరించింది.

వైఎస్ జగన్

ఫొటో సోర్స్, FACEBOOK/YS JAGAN MOHAN REDDY

ఫొటో క్యాప్షన్, వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్‌లో ‘ఫీజు’ బకాయిలన్నీ వచ్చే ఏడాది నుంచి తల్లుల ఖాతాకే జమ

రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మార్చి 31 వరకూ ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను ఒక్క రూపాయి కూడా పెండింగ్‌ పెట్టకుండా ఇస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌ రెడ్డి చెప్పినట్లు ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. 2018-19లో గత ప్రభుత్వం పెట్టిన రూ. 1,880 కోట్ల బకాయిలతో పాటు 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇవ్వాల్సిన డబ్బులన్నీ చెల్లిస్తున్నామని సీఎం చెప్పారు. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ప్రతి త్రైమాసికం పూర్తయిన తర్వాత నేరుగా తల్లుల ఖాతాలోనే రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు వేస్తామన్నారు.

జగనన్న విద్యా దీవెన పథకాన్ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం మంగళవారం ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కాలేజీల మేనేజ్‌మెంట్లు, తల్లులు, విద్యార్థులతో మాట్లాడారు. బోర్డింగ్‌, లాడ్జింగ్‌ కోసం వసతి దీవెన, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం విద్యాదీవెన అనే రెండు పథకాలను తీసుకువచ్చామన్నారు.

పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి ఒక్క చదువు మాత్రమేనన్నారు.

‘‘నాన్నగారి హయాంలో మొదటిసారిగా ఎవరూ చేయని ఆలోచన చేసి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తీసుకువచ్చారు. అప్పట్లో ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాల్లోని పేదలందరికీ పూర్తి భరోసా ఉండేది. ఆయన చనిపోయాక పథకాన్ని పూర్తిగా నీరుగారుస్తూ పోయారు. ఆ రోజు నేను అనుకున్న కార్యక్రమాన్ని దేవుడి దయతో, అందరి ఆశీర్వాదంతో ఇప్పుడు అమలు చేస్తున్నాం’’ అని సీఎం వివరించారు.

ఓయూ ఆర్ట్స్ కాేలేజ్
ఫొటో క్యాప్షన్, ఓయూ ఆర్ట్స్ కాేలేజ్

ఇంజినీరింగ్‌లో డిటెన్షన్లు రద్దు యోచనలో జేఎన్టీయూహెచ్‌, ఓయూ

తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలల్లో కొనసాగుతున్న డిటెన్షన్‌ విధానాన్ని రద్దుచేయాలని జేఎన్టీయూహెచ్‌, ఉస్మానియా వర్సిటీలు యోచిస్తున్నట్లు ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో చెప్పింది.

ఆ కథనం ప్రకారం.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలు మూతపడ్డాయి. విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా బీటెక్‌, బీఫార్మసీ వంటి కోర్సుల్లో డిటెన్షన్‌ విధానాన్ని రద్దుచేయాలని ఈ వర్సిటీల అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది.

అయితే, డిటెన్షన్‌ విధానం రద్దు, విద్యా క్యాలెండర్‌ ప్రారంభం వంటి అంశాలపై యూజీసీ ఏర్పాటుచేసిన కమిటీ త్వరలోనే మార్గదర్శకాలు విడుదలచేసే అవకాశముంది. అనంతరం తుది నిర్ణయం వెల్లడి కానుంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)