Mental Health Hospital "ఆస్పత్రిలో నన్నొక జంతువులా చూశారు.. ఆస్పత్రికి పట్టిన ‘క్యాన్సర్’ అని అవమానించి, వేధించారు"

హ్యార్లీని నేల పై ఈడ్చుతున్న ఫుటేజీ
    • రచయిత, బీబీసీ పనోరమ, విలియం మెక్ లీనన్
    • హోదా, బీబీసీ న్యూస్

యూకేలోని ఒక మానసిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగుల పట్ల సిబ్బంది పాల్పడుతున్న వేధింపులు, అవమానాలకు సంబంధించిన ఆధారాలను బీబీసీ పనోరమ బృందం సంపాదించింది. ఒక యువతిని 17 రోజుల పాటు గదిలో బంధించి ఉంచిన తర్వాత ఒక రోజు బయటకు వచ్చేందుకు అనుమతి ఇచ్చి మరో 10 రోజుల వరకు గదిలో పెట్టి బంధించారు.

మానసిక రోగులకు 24 గంటలూ సేవలందించాల్సిన సిబ్బంది ఆమెను ఆస్పత్రికి పట్టిన "క్యాన్సర్" అని ఆమెకు బాగా దెబ్బలు తగలాలని అనేవారు.

ఆమె కథనాన్ని బీబీసీతో చెప్పేందుకు ఆమెతో పాటు ఆమె కుటుంబం అంగీకరించింది.

హెచ్చరిక : స్వీయ హానికి ప్రేరేపించే చిత్రాలు ఈ కథనంలో కనిపిస్తాయి.

హ్యార్లీ ఆస్పత్రిలో నేల పై కూర్చుని ఉన్నారు. ఇద్దరు పురుషులు వచ్చి ఆమె చేతులు గట్టిగా పట్టుకుని బలవంతంగా లేవదీశారు.

"మీకు సహకరించేందుకు నాకు అవకాశం ఇవ్వడం లేదు. నా అంతట నన్ను లేవనివ్వండి" అని ఆమె అరిచారు.

కానీ, ప్రయోజనం లేదు. ఆమెతో ఎటువంటి సంప్రదింపులు జరిపే ప్రసక్తి లేదని అక్కడి మేనేజర్లు నిర్ణయించేశారు.

ఆమె వారి చేతులను వదిలించుకోవడానికి గింజుకుంటూ ఉండగా, వారికి మరి కొంత మంది నర్సులు, సహాయక సిబ్బంది కూడా తోడయ్యారు.

ఆమె చేతులు, కాళ్ళు గట్టిగా పట్టుకుని, తలను కదపకుండా చేసి, ముఖాన్ని నేలకు ఆన్చి ఆమెను నొక్కి పెట్టారు.

మాంచెస్టర్ దగ్గర్లో ప్రెస్ట్‌విచ్‌లో ఉన్న ఈడెన్‌ఫీల్డ్ మానసిక రోగుల కేంద్రంలో ఆమెను గదిలో బంధిస్తున్న సంఘటనను బీబీసీ పనోరమా రహస్యంగా చిత్రీకరించింది.

ఆస్పత్రి సిబ్బంది చేసిన పనిని సరైందే అని సమర్ధించుకోవడాన్ని, ఆమెతో మాట్లాడాల్సిన పని లేదని అనుకోవడాన్ని కూడా కెమెరాలో బంధించారు.

"మీరు మళ్ళీ ఇలా చేస్తారని ఊహించలేదు. నాకొక అవకాశం కూడా ఇవ్వలేదు" అంటూ హ్యార్లీ రోదించారు.

హ్యార్లీ ఒక ఖాళీ గదిలో బందీగా ఉన్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఆమె 15 రోజులుగా ఒక ఖాళీ గదిలో బందీగా ఉన్నారు. ఆ గదిలో నేల పై ఒక పరుపు మాత్రమే ఉంది. గోడల పై మార్కర్ పెన్ తో గీసిన గీతలున్నాయి. ఒక వైపు, తాళం పెట్టిన కిటికీ నుంచి వెలుగు వస్తోంది కానీ, గాలి లేదు. మరో వైపు ఆమెను పర్యవేక్షించేందుకు సీలింగ్ నుంచి కింద వరకు ఉన్న ఒక పెద్ద కిటికీ ఉంది.

"నన్ను బలహీనురాలిని చేసేందుకే ఇదంతా చేస్తున్నారు" అంటూ ఒకసారి హ్యార్లీ అన్నారు.

"ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు నన్నిక్కడకు తోసేశారు. నన్నిక్కడ ఒక జంతువులా చూస్తున్నారు" అని ఆమె ఒక సహాయక సిబ్బందితో చెప్పారు.

హ్యార్లీ ఆస్పత్రి సిబ్బందితో చాలా దురుసుగా ప్రవర్తించేవారని పనోరమ విలేఖరికి చెప్పారు. ఆమె తరచుగా అరుస్తూ అందరినీ దూషిస్తూ ఉండటంతో ఒంటరిగా ఉంచాల్సి వచ్చిందని చెప్పారు.

ఇతరులకు హాని కలిగించే విధంగా ప్రవర్తన ఉన్నప్పుడు మాత్రమే రోగిని ఒంటరిగా ఉంచాలని మానసిక రోగులకు సంబంధించిన నిబంధనలు చెబుతున్నాయి. అది కూడా కొంత సమయం మాత్రమే ఉండాలి.

"కొన్ని తీవ్రమైన పరిస్థితుల్లో మాత్రమే రోగిని ఒంటరిగా ఉంచొచ్చు" అని ఇంగ్లాండ్ లోని స్వతంత్ర వైద్య ఆరోగ్య నియంత్రణ సంస్థ ది కేర్ క్వాలిటీ కమీషన్ తెలిపింది. ప్రభుత్వం మాత్రం ఆస్పత్రుల్లో రోగులను బంధించి ఉంచే పద్దతులను తగ్గించుకోవాలని చెబుతోంది.

కానీ, రోగులను బంధించే సంఘటనలు పెరుగుతున్నట్లు బీబీసీ న్యూస్ పరిశోధనలో తేలింది.

వీడియో క్యాప్షన్, ‘నాన్న వదిలేశాడు. మా అమ్మ లివర్ ఫెయిల్ కావడంతో నాది డొనేట్ చేశాను. కానీ, మా అమ్మ.. ’

2016 - 17లో 7720 సార్లు రోగులను బంధించారు. ఇది 2020-21 నాటికి మరో 14,164కి పెరిగింది. ఇది 80% పెరిగింది.

సుదీర్ఘకాలం పాటు అంటే 1- 3 నెలల వరకు ఒంటరిగా బందీ అయి ఉండేవారి సంఖ్య పెరుగుతోందని నేషనల్ హెల్త్ సర్వీస్ డేటా చెబుతోంది.

హ్యార్లీ తరచుగా తీవ్రమైన స్వీయ హానికి తలపడటం వల్ల ఆమెను బంధించి ఉంచారు. ఈడెన్ ఫీల్డ్ లో హ్యార్లీకి సురక్షితమైన ప్రదేశంలో ఉత్తమమైన వైద్య సేవలు అందుతాయని ఆమె కుటుంబం భావించింది. ఆమె ఇక్కడ నుంచి కోలుకుని బయటకు వస్తారని ఆశించారు.

హ్యార్లీ మొదటిసారి ప్రాధమిక పాఠశాలలో ఉండగా స్వీయ హానికి తలపడ్డారు. కొన్ని సార్లు ఆమె భావోద్వేగాలు, ప్రవర్తనను నియంత్రించుకోవడానికి ఇబ్బంది పడేవారు.

తర్వాత ఆమెకు ఆటిజం అని డాక్టర్ నిర్ధరించారు. ఆటిజంతో బాధపడేవారి మానసిక ఎదుగుదల మందంగా ఉంటుంది. ఇతరులతో మెలిగే విధానం పై ప్రభావం పడుతుంది.

ఆమెకు 12 ఏళ్ల నుంచే మానసిక ఆస్పత్రులు, ప్రత్యేక పాఠశాలలు, రెసిడెన్షియల్ హొమ్స్ చుట్టూ తిరగడం మొదలయింది.

ఈ బాధల మధ్యలో ఆమె సంతోషపడే కొన్ని క్షణాలు కూడా ఉన్నాయి.

హ్యార్లీ కుటుంబం

హ్యార్లీకి సాహస క్రీడలు, చెట్లు ఎక్కడం, సముద్ర తీరంలో గడపడం ఇష్టమని ఆమె సోదరి టియానా గుర్తు చేసుకున్నారు. వీరిద్దరూ ఒకే బెడ్ రూమ్ షేర్ చేసుకునేవారు

"ఇద్దరి కళ్ళు నీలంగా ఉండటంతో మమ్మల్ని కవలలు అని అనుకునేవారు" అని చెప్పారు.

కుటుంబంతో కలిసి షాపింగ్ కు వెళ్లడం, గంటల తరబడి మేక్ అప్ చేసుకోవడం, సెల్ఫీలు తీసుకోవడం, స్కూలు వార్షిక సంవత్సరం ముగిసే సమయంలో జరిగే కార్యక్రమానికి బాల్ గౌను ధరించి వెళ్లడం లాంటివి కూడా చేసేవారు.

హ్యార్లీ చికిత్స పూర్తయి ఒక రోజు ఇంటికి తిరిగి వస్తారని కుటుంబం భావించింది.

టియానా, హ్యార్లీ

కానీ, ఆమెకు 18ఏళ్ళు వచ్చేసరికి పరిస్థితులు క్షీణించడం మొదలయింది. దీంతో, ఆమెను ఆస్పత్రిలో చేర్చారు.

ఆస్పత్రిలో చేర్పించడం, సహకారం లేకపోవడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేశాయని ఆమె కుటుంబం అంటోంది.

"నా ప్రపంచం అంతా కూలిపోయినట్లు అనిపించింది. తను ఇంటికి తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. కానీ, ఆ అవకాశం దూరమయింది.

ఈడెన్ ఫీల్డ్ కొంత ఆశను కలిగించింది. ఆ ఆస్పత్రిలో ఆట పాటలు మాత్రమే ఉంటాయని, ఈ ప్రాంతంలోనే అదొక ఉత్తమమైన వైద్యులున్న ఆస్పత్రి అని హ్యార్లీ తల్లి మిషెల్ కు తెలిసింది.

"నువ్వు మరింత మెరుగ్గా అయి తిరిగి వస్తావు" అని ఆమె కూతురితో చెప్పారు.

కానీ, ఆస్పత్రిలో ఆమెకు లభిస్తున్న చికిత్స, సిబ్బంది చూస్తున్న విధానం గురించి ఆమె తరచుగా ఫిర్యాదులు చేసేవారు.

బీబీసీ పనోరమ రహస్య చిత్రీకరణ చేసిన మూడు నెలల సమయంలో ఆమెను మూడు సార్లు బంధించారు.

ఒక సారి 28 రోజుల్లో 27 రోజుల పాటు బందీగానే ఒంటరిగా గదిలో ఉన్నారు. కొన్ని సార్లు 17 రోజుల పాటు బందీగా ఉన్న తర్వాత ఒక రోజు బ్రేక్ ఇచ్చేవారు.

ఉద్దేశ్యపూర్వకంగానే ఆమెను వైరుధ్యంతో చూసేవారని హ్యార్లీ అంటారు.

"ఆస్పత్రి సిబ్బంది రోగిని రెచ్చగొడతారు. దానికి నేను స్పందించినప్పుడు దానినే నాకు వ్యతిరేకంగా వాడతారు. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం" అని అన్నారు.

"వాళ్లంతా నన్ను ద్వేషిస్తారు. అందుకే నాతో ఇలా ప్రవర్తిస్తారు" అని ఆమె కుటుంబంతో చెప్పారు.

దీంతో మిషెల్ ఇబ్బందిలో పడ్డారు. కూతురిని నమ్మాలో, లేదా ఆస్పత్రి సిబ్బందిని నమ్మాలో అర్ధం కాలేదు.

"హ్యార్లీ తప్పుగా భావిస్తున్నారేమో అని సర్ది చెప్పారు. వాళ్ళు నిన్ను ద్వేషించడం లేదు. నీకు సహాయం చేసేందుకే వాళ్ళున్నారు" అని చెప్పారు.

పనోరమ వెలికి తీసిన ఆధారాలు చూసిన తర్వాత ఆమె కూతురిని మోసం చేశానేమో అని బాధపడుతున్నారు.

హ్యార్లీ తల్లి

ఆస్పత్రి సిబ్బంది అవమానకరమైన పదజాలంతో హ్యార్లీ గురించి చర్చించుకోవడం రహస్య చిత్రీకరణలో బయటపడింది.

"ఆమె ఈ వార్డుకు క్యాన్సర్" లాంటి వారు అంటూ ఒక సిబ్బంది అన్నారు.

"ఆమెను జైలుకు పంపండి" అని ఆమె గురించి మాట్లాడుతూ మరొక నర్స్ అన్నారు.

"ఆమెకు బాగా దెబ్బలు తగలాలి" అని మరొకరు అన్నారు.

హ్యార్లీని ఒంటరిగా ఉంచమని ఆస్పత్రిలో నర్సులు ఆస్పత్రి మేనేజర్లను అడిగినట్లు ఒక నర్స్ బీబీసీకి చెప్పారు.

"ఇది వినడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ, వాళ్లందరికీ ఆమె నుంచి బ్రేక్ కావాలి" అని మరొక నర్స్ బీబీసీకి చెప్పారు.

ఈడెన్ ఫీల్డ్

బీబీసీ ఫుటేజీని ఇద్దరు నిపుణులకు చూపించినప్పుడు, వారు ఈ విషయం పట్ల ఆందోళనను వ్యక్తం చేశారు.

"ఆస్పత్రి సిబ్బంది విసిగిపోయినంత మాత్రాన వ్యక్తి స్వేచ్ఛను హరించలేం" అని నిపుణులు తెలిపారు.

"ఈమెకు జరిగింది నిబంధనలకు విరుద్ధం" అని అన్నారు.

"ఆమెను రోజుల తరబడి బందీగా ఉంచడం తప్ప ఆస్పత్రి సిబ్బందికి వేరే పని ఉన్నట్లుగా లేదు" అని మరొక నిపుణుడు అన్నారు.

"ఆమెను అలా బంధించడం సురక్షితం కాదు. ఇది చాలా భీభత్సంగా ఉంది. ఇది అవసరమని వాళ్ళు నిర్ణయించినప్పటికీ, వాళ్ళు దీనిని సరైన రీతిలో చేయలేదు" అని అన్నారు.

"నా ఆలోచనలతో సతమతమవుతున్నాను. నాకెవరూ సహాయం చేయడం లేదు" అని హ్యార్లీ అనడం వినిపించింది.

"ఎవరితోనైనా మాట్లాడేందుకు ప్రయత్నించావా" అని ఆమెను ఒక నర్స్ అడిగారు.

"ఈ విషయం గురించి మాట్లాడటంలో ప్రయోజనం లేదు. నేనిక్కడ ఉండలేను. ఈ ప్రదేశం నన్ను చంపేస్తోంది" అని ఆమె అన్నారు.

టియానా

ఆమె సోదరి టియానా ఈ విషయాన్ని అంగీకరించారు.

ఆస్పత్రి సిబ్బంది హ్యార్లీ పరిస్థితిని మరింత విషమం చేశారని, వాళ్ళు శ్రద్ధ వహించ లేదనేందుకు ఈ ఫుటేజీ ఆధారం" అని అన్నారు.

ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఎన్‌హెచ్‌ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్ చెప్పింది. రోగుల భద్రత కోసం సత్వర చర్యలు చెప్పట్టింది.

ఆస్పత్రిలో కొంత మంది సిబ్బందిని తొలగించారు. ఆస్పత్రి పై విచారణ కోసం స్వతంత్ర కమీషన్ నియమించారు.

హార్లీని మరొక ఆస్పత్రికి తరలించారు.

కానీ, ఈడెన్‌ఫీల్డ్‌లో హ్యార్లీకి ఎదురైనఅనుభవం ఆమె పై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని టియానా ఆందోళన చెందుతున్నారు.

"ఆస్పత్రి సిబ్బంది ఆమె పట్ల ప్రదర్శించిన వైఖరితో ఆమె భయభ్రాంతులయ్యారు" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

.