రష్యా ఎన్నికలు: రిగ్గింగ్ ఆరోపణల మధ్య మరోసారి విజయం సాదించిన పుతిన్ పార్టీ - BBC Newsreel

పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

రష్యా పార్లమెంటు ఎన్నికల్లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పార్టీ యునైటెడ్ రష్యా మరోసారి భారీ ఆధిక్యం దిశగా వెళ్తోంది. అయితే ఈసారీ ఆ పార్టీ ఓట్ల శాతం కాస్త తగ్గింది.

ఆదివారం సాయంత్రం ఎన్నికలు ముగియడానికి కొన్ని గంటల ముందే తాము విజయం సాధించబోతున్నట్లు అధికార పార్టీ చెప్పుకుంది.

పుతిన్ ప్రధానంగా తన విమర్శకులను ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకున్నారు.

ఎన్నికల్లో పోటీ చేసిన వారి గురించి కూడా నిశితంగా పరిశీలించాకే, పోటీ చేయడానికి వారికి అనుమతులు ఇచ్చారు.

ఈ ఎన్నికల్లో బలవంతంగా ఓట్లు వేయించారని, బ్యాలెట్లు తారుమారు చేశారని, మోసాలు జరిగాయని పుతిన్ విమర్శకులు ఆరోపిస్తున్నారు.

కానీ, ఓటింగ్ ప్రక్రియలో అవతతవకలు జరిగాయనే ఆరోపణలను రష్యా ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది.

80 శాతం ఓట్ల లెక్కింపు తర్వాత ప్రాథమిక ఫలితాలను బట్టి పుతిన్ పార్టీ యునైటెడ్ రష్యా పార్టీకి దాదాపు 50 శాతం ఓట్లు, విపక్ష కమ్యూనిస్ట్ పార్టీకి దాదాపు 20 శాతం ఓట్లు లభించాయి.

రష్యా ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

రష్యాలో తగ్గని పుతిన్‌ పాపులారిటీ

తాజా ఫలితాలతో వ్లాదిమిర్ పుతిన్ పార్టీ ఈసారి కూడా పార్లమెంటులో సులభంగా ఆధిక్యం సంపాదించగలదని తెలుస్తోంది.

అయితే, ఈసారీ ఆ పార్టీకి ఆదరణ కాస్త తగ్గిందనేది కూడా నిజం. 2016లో యునైటెడ్ రష్యా పార్టీ 54 శాతం ఓట్లతో విజయం సాధించింది.

మరోవైపు, పార్లమెంటులో సాధారణంగా పుతిన్ చొరవకు మద్దతు తెలిపే కమ్యూనిస్ట్ పార్టీకి ఈసారీ ఓట్లు 8 శాతం పెరిగింది.

రష్యా ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

2036 వరకూ అధ్యక్ష పదవిలోనే పుతిన్..

రష్యాలో ప్రజల జీవన ప్రమాణాలపై నెలకొన్న ఆందోళనలు, అలెక్సీ నావల్నీని జైలుకు పంపించడమే ఈసారీ పుతిన్ పార్టీకి మద్దతు తగ్గడానికి కారణమని భావిస్తున్నారు.

అయినప్పటికీ, వ్లాదిమిర్ పుతిన్‌కు ఆ దేశంలో ఇప్పటికీ అదే పాపులారిటీ ఉంది. ప్రజలు ఆయన్ను పశ్చిమ దేశాలను ఎదిరించి నిలబడగలిగే నేతగా చూస్తున్నారు.

పుతిన్ 1999 నుంచి వరుసగా అధికారంలో కొనసాగుతున్నారు.

గత ఏడాది యునైటెడ్ రష్యా పార్టీ దేశ రాజ్యాంగంలో సవరణలు తీసుకొచ్చింది. దాని ప్రకారం పుతిన్ 2036 వరకూ అధ్యక్ష పదవిలో కొనసాగవచ్చు.

పెర్మ్ యూనివర్సిటీ క్యాంపస్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కాల్పులు జరిగిన పెర్మ్ యూనివర్సిటీ క్యాంపస్

రష్యా: పెర్మ్ యూనివర్సిటీలో కాల్పులు, ఆరుగురు మృతి

రష్యాలోని పెర్మ్ నగరంలోని ఒక యూనివర్సిటీలో సాయుధుడు ఒకరు కాల్పులు జరపడంతో ఆరుగురు చనిపోయినట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి.

సోమవారం ఉదయం యూనివర్సిటీ క్యాంపస్‌లోకి నడుచుకుంటూ వెళ్లిన ఆ సాయుధుడు కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు.

కాల్పుల ఘటన తరువాత కొందరు ప్రాణభయంతో కిటికీల నుంచి బయటకు దూకడం కనిపించింది.

విద్యార్థులు, అధ్యాపకులు యూనివర్సిటీ గదుల్లో దాక్కున్నారు.

ఎంతమంది చనిపోయారు? ఎంతమంది గాయపడ్డారనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

కాల్పులు జరిపిన సాయుధుడిని అదుపులోకి తీసుకున్నట్లు రష్యా పోలీసులు ప్రకటించారు.

రాజధాని మాస్కో నగరానికి 1300 కిలోమీటర్ల దూరంలోని పెర్మ్ స్టేట్ యూనివర్సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

విద్యార్థులు ప్రాణాలు కాపాడుకోవడానికి కిటికీల్లోంచి దూకుతున్న వీడియోలు రష్యా టీవీల్లో కనిపించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)