రష్యా: పుతిన్ రాజ్యాంగ సవరణలకు భారీ మద్దతు... 2036 దాకా అధికారంలో ఆయనే కొనసాగవచ్చు..

పుతిన్

ఫొటో సోర్స్, AFP

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2036 వరకూ అధికారంలో కొనసాగేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.

ఇందుకు వీలు కల్పించే వివాదాస్పద రాజ్యాంగ సంస్కరణలకు రష్యా ఓటర్లలో దాదాపు 78 శాతం మంది తమ ఆమోదం తెలిపారు.

ఈ సంస్కరణలపై ప్రజాభిప్రాయం కోసం జరిగిన ఓటింగ్ ఫలితాలు గురువారం వెలువడ్డాయి.

సంస్కరణలను సమర్థిస్తూ 77.9 శాతం ఓట్లు, వ్యతిరేకిస్తూ 21.3 శాతం ఓట్లు వచ్చాయని రష్యా ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

రష్యాలో ఓ వ్యక్తి వరుసగా రెండు సార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టే వీలు లేదు. అయితే, తాజా సంస్కరణల ద్వారా ఆ నిబంధనను వరుసగా రెండు సార్లకు బదులుగా, రెండు సార్లుగా మార్చారు. ఇదివరకు అధ్యక్ష పదవి చేపట్టిన పర్యాయాలు ఇందులో లెక్కకురావని కూడా నిబంధన పెట్టారు.

ఇలా మరో రెండు సార్లు ఆరేళ్ల చొప్పున అధ్యక్ష పదవి చేపట్టేందుకు పుతిన్‌కు వీలు కల్పించారు.

పుతిన్

ఫొటో సోర్స్, EPA

‘వాస్తవ ప్రజాభిప్రాయం కాదు’

రష్యాలో ప్రతిపక్షం ఈ ప్రజాభిప్రాయ సేకరణను తిరస్కరించింది. రష్యాను జీవితాంతం పాలించాలని పుతిన్ లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించింది.

పుతిన్ మాత్రం ఈ ఆరోపణను కొట్టిపారేశారు.

ఆధునిక రష్యా చరిత్రలో సోవియట్ నియంతృత్వ పాలకుడు జోసెఫ్ స్టాలిన్ తర్వాత సుదీర్ఘంగా దేశాన్ని పాలించిన నాయకుడు పుతినే.

కరోనావైరస్ వ్యాప్తి ముప్పు కారణంగా ఏడు రోజుల పాటు ఈ ఓటింగ్ నిర్వహించారు. ఓ స్వతంత్ర సంస్థ పర్యవేక్షణ అంటూ లేకుండానే ఈ ప్రక్రియ సాగింది.

కొత్త రాజ్యాంగం ప్రతులు కూడా పుస్తక దుకాణాల్లో కనిపించాయి.

ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఫలితం ఓ పెద్ద అబద్ధమని, దేశ ప్రజల వాస్తవ అభిప్రాయాన్ని అది ప్రతిబింబించలేదని ప్రభుత్వ విమర్శకుడు అలెక్సీ నవాల్నీ అన్నారు.

పుతిన్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఈ ఓటింగ్ గురువారం ప్రారంభమైంది

‘అంతా ఒక షో’

‘‘ముందు నుంచీ ఈ ఓటింగ్ అంతా ఒక పీఆర్ స్టంట్. చట్టపరంగా దీని అసవరమే లేదు. ప్రజా సార్వభౌమత్వంపై దాడిగా ఇది చరిత్రలో మిగిలిపోతుంది’’ అని రష్యాలో ఎన్నికలపై పర్యవేక్షణ పెట్టే ఓ బృందానికి చెందిన గోలోస్ అన్నారు.

కొత్త సంస్కరణల్లో వివాహానికి పురుషుడు, స్త్రీ మధ్య జరిగేదిగా నిర్వచనం ఇచ్చారు. తద్వారా స్వలింగ వివాహాలపై నిషేధం విధించారు.

‘దేవుడిపై విశ్వాసం’ అంశాన్ని కూడా ఇందులో ప్రవేశపెట్టారు.

ఓటింగ్‌లో 65 శాతం మంది పాల్గొన్నారని ఎన్నికల అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ నుంచి రష్యాలో కలుపుకున్న క్రిమియాలో 90 శాతానికి పైగా సంస్కరణలకు మద్దతు లభించినట్లు వెల్లడించారు.

‘చట్టపరంగా ఈ అభిప్రాయ సేకరణ అసవరమే లేదు’

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ‘చట్టపరంగా ఈ అభిప్రాయ సేకరణ అసవరమే లేదు’

పుతిన్ ప్రస్తుత పదవీకాలం 2024లో ముగుస్తుంది. మళ్లీ అధ్యక్ష పదవికి పోటీపడతానని ఇంకా ఆయన చెప్పలేదు. అయితే, తనకు ఆ అవకాశం ఉండటం మాత్రం ముఖ్యమని ఆయన ఇదివరకు వ్యాఖ్యానించారు.

ప్రధానిగానో, అధ్యక్షుడిగానో 20 ఏళ్లుగా రష్యాలో పుతిన్ అధికారంలో ఉన్నారు.

రష్యా పార్లమెంటులోని రెండు సభలూ ఇదివరకే ఈ సంస్కరణలను ఆమోదించాయి. అయితే, వీటిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని పుతిన్ ఆదేశించారు.

ఏప్రిల్‌లోనే ఇది జరగాల్సి ఉన్నా, కరోనావైరస్ వ్యాప్తితో ఆలస్యమైంది.జూన్ చివర్లో జరిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)