కోవిడ్: బ్రెజిల్‌లో 5,00,000 దాటిన మరణాలు... భయపెడుతున్న చలికాలం

బ్రెజిల్ కోవిడ్ మరణాలు

ఫొటో సోర్స్, Getty Images

బ్రెజిల్లో కోవిడ్ మరణాల సంఖ్య ఐదు లక్షలు దాటింది. ఇది ప్రపంచంలో రెండో అత్యధికం.

మందకొడిగా సాగుతున్న వ్యాక్సినేషన్, చలికాలం ప్రారంభమవడంతో దేశంలో మహమ్మారి వ్యాప్తి మరింత తీవ్రం అవుతుందేమోనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధ్యక్షుడు జైర్ బోల్సనారో లాక్‌డౌన్, సామాజిక దూరం లాంటి నిబంధనల అమలుకు నిరాకరించడంతో దేశంలో వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది.

బ్రెజిల్లో పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని, దేశంలో ఇప్పటివరకూ 15 శాతం పెద్దలు మాత్రమే పూర్తిగా వ్యాక్సీన్ వేసుకున్నారని ఆరోగ్య సంస్థ ఫియోగ్రజ్ చెప్పింది.

టీకాలు, లాక్‌డౌన్లు, మాస్క్ వేసుకోవడం పట్ల తనకున్న సందేహాలవల్ల అధ్యక్షుడు బొల్సొనారో దేశవ్యాప్తంగా సమన్వయంతో కూడిన చర్యలు చేపట్టకపోవడం, వాటిని సడలించాలనుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

దేశంలో మహమ్మారి తీవ్రతను తగ్గించి చెబుతూ వస్తున్న అధ్యక్షుడు రాజకీయ కారణాలతోనే వ్యాక్సీన్ల కొనుగోలులో జాప్యం చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

కరోనా మహమ్మారి బ్రెజిల్లో మరింత వేగంగా వ్యాపించే వైరస్ వేరియంట్లకు కారణమైంది. వీటిలో అమెజాన్ ప్రాంతంలో మొదట గుర్తించిన గామా వేరియంట్ కూడా ఉంది. గత వారం దేశంలో రోజుకు సగటున 70 వేల కేసులు నమోదయ్యాయి.

బ్రెజిల్లో నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

చాలా రాష్ట్రాల్లో 80 శాతానికి పైగా ఐసీయూ పడకలు నిండిపోయాయి. చలికాలం మొదలవడంతో వచ్చే వారం నుంచి ఈ కేసుల సంఖ్య మరింత పెరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

"చలికాలం మొదలై, పరిస్థితి మరింత ఘోరంగా మారే అవకాశం ఉండడంతో బ్రెజిల్ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ప్రమాదాన్ని ఎదుర్కోంటోంది" అని ఫియోక్రజ్ చెప్పింది.

కోవిడ్ వల్ల చనిపోయినవారి కుటుంబ సభ్యులకు దేశ ఆరోగ్య మంత్రి మార్సెలో క్వీరోగా సంతాపం తెలిపారు. "కరోనా మహమ్మారి వల్ల బ్రెజిల్లో 5 లక్షమంది ప్రాణాలు కోల్పోయారు" అని తెలిపారు.

కోవిడ్ వల్ల అత్యధిక మరణాలు అమెరికాలో నమోదయ్యాయి. ఆరు లక్షల మందికి పైగా చనిపోయారు.

ఈ ఏడాది మార్చి నుంచి బ్రెజిల్లో ప్రతి వారం సగటున 1,500 మరణాలు నమోదయ్యాయి.

వ్యాక్సినేషన్ మందగించడంతో ప్రజలు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని ఆన్విసా మాజీ ఆరోగ్య అధికారి గోంజాలో వెసినా చెప్పారు.

"5 లక్షల మంది చనిపోయారు. దురదృష్టవశాత్తూ ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎందుకంటే, వ్యాక్సినేషన్ వేగం అందుకోడానికి కొంతకాలం పడుతుంది. బహుశా, ఈ ఏడాది కూడా అది కష్టమే కావచ్చు. ఎందుకంటే మేం వ్యాక్సీన్ల డెలివరీపై ఆధారపడ్డాం. వాటిని చాలా ఆలస్యంగా కొనుగోలు చేస్తున్నాం" అన్నారు.

బొల్సొనారో ప్రభుత్వానికి వ్యతిరేకంగా శనివారం దేశవ్యాప్తంగా వేలమంది నిరసన ప్రదర్శనలు చేశారు. వ్యాక్సినేషన్ వేగం పెంచాలని డిమాండ్ చేశారు. తగిన సంఖ్యలో డోసులు లేక చాలా నగరాల్లో జనం ఇబ్బంది పడుతున్నారు.

దేశంలో లాక్‌డౌన్ విధించడానికి అధ్యక్షుడు బొల్సొనారో నిరాకరించారు. దానివల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని, అది కరోనా ప్రభావం కంటే ఘోరంగా ఉంటుందని అన్నారు.

కానీ, వివిధ దేశాల నుంచి టీకాలు కొనుగోలు చేయడానికి అవసరమైన చర్యలన్నీ చేపడుతున్నట్లు ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)