జార్జ్ ఫ్లాయిడ్: అమెరికాను సంక్షోభం అంచుల్లోకి నెట్టేసిన హత్య

- రచయిత, టారా మెక్‌కెల్వీ
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
ఒక హత్య కేసు తీర్పు కోసం అమెరికాలో చాలామంది ఉద్విగ్నంగా ఎదురు చూశారు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య అమెరికా న్యాయస్థానం తీర్పు చెప్పింది.
జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో భద్రతా అధికారి చావిన్‌ను దోషిగా ప్రకటించింది. ఈ తీర్పుతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు, ఈ హత్య జరిగినప్పటి నుంచి దేశంలో నెలకొన్న పరిణామాలను గుర్తు చేసుకున్నారు.
దేశంలోని పోలీసు విభాగంలో సంస్కరణలు కోరుతున్న వారికి ఇది ఊరటనిచ్చే తీర్పు. నల్ల జాతీయుల పట్ల పోలీసులు క్రూరంగా వ్యవహరిస్తున్నారని ఆ వర్గం ప్రజలు చాలాకాలంగా ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వచ్చిన ఈ తీర్పును ఒక మైలురాయిగా చెప్పుకోవాల్సి ఉంటుంది.
జార్జి ఫ్లాయిడ్ హత్య కేసులో చావిన్‌ను సెకండ్, థర్డ్ డిగ్రీ మర్డర్ తో పాటు వివిధ సెక్షన్ల కింద దోషిగా న్యాయస్థానం నిర్ధారించింది.
ఈ తీర్పుతో ఇక నుంచి పోలీసుల ప్రతి చర్య పరిశీలనకు లోనవుతుందని చెప్పవచ్చని న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ జడ్జిమెంట్ తో ఈ తరహా కేసుల్లో పోలీసులను న్యాయస్థానం ముందుకు తీసుకు రావడానికి అవకాశాలు పెరిగాయి.
పోలీసులు విభాగంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ఈ కేసు తీర్పు, వారు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉందన్న సందేశాన్ని కూడా ఇచ్చింది.
వ్యక్తులు నిర్లక్ష్యంగా వ్యవహరించినా, వ్యవస్థ పని చేస్తూనే ఉంటుందని కూడా ఈ తీర్పు చెప్పకనే చెప్పింది.
'' పోలీసులు చట్టానికి అతీతులు కారని ఈ తీర్పు స్పష్టం చేసింది'' అన్నారు న్యాయవాది జాక్ రైస్. ''భవిష్యత్తులో ఈ తరహా కేసులపై ఈ తీర్పు ప్రభావం తప్పకుండా ఉంటుంది. అలాగే పోలీసులు ప్రవర్తనపై కూడా దీని ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుంది'' అన్నారాయన.

బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమకారులు, ఫ్లాయిడ్ హత్యకు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొన్న వారు తీర్పు వినగానే ఆనందం వ్యక్తం చేశారు. '' నాకు చాలా సంతోషంగా ఉంది'' అన్నారు 20 ఏళ్ల విద్యార్ధిని ఎరికా ఆట్సన్. ఈమె బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఆందోళనల్లో పాల్గొన్నారు.
'ఇదో పెద్ద రిలీఫ్' అన్నారు మరో విద్యార్ధిని రోసా గోమెజ్.
అయితే హెన్నెపిన్ కౌంటీకి షెరీఫ్ (పోలీస్ అధికారి)గా పని చేసిన రిక్ స్టానెక్, ఆయన సహచరులు కొందరి అభిప్రాయాలు మాత్రం వేరుగా ఉన్నాయి.
2020 మే లో ఫ్లాయిడ్ హత్య జరిగింది. ఆ తర్వాత అనేక అల్లర్లు జరిగాయి. కొన్ని దశాబ్దాల తర్వాత మళ్లీ
ఒక పెద్ద న్యాయ పోరాటం జరిగింది. తీర్పు కోసం కోట్లమంది ఎదురు చూశారు.

ఫ్లాయిడ్ హత్య కేసుకు సంబంధించి మిన్నియాపోలీస్ పోలీస్ చీఫ్‌తోపాటు పలువురు అధికారులను న్యాయస్థానం విచారించింది. వీరిలో చాలామంది అధికారులు చావిన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చారు. కానీ పోలీసు శాఖలో పనిచేసిన చాలామంది ఇప్పటికీ చావిన్ మీద సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
సామాన్య ప్రజలకు అరెస్టు అంటే పరిస్థితులు చేయిదాటినప్పుడు తీసుకునే చర్య. అయితే ఇది ఒక్కో సందర్భంలో ఒక్కోలా ఉంటుందని, పోలీసు విధులలో ఉన్న వ్యక్తి వివిధ పరిణామాలను అంచనా వేసుకుంటూ మెలగాల్సి ఉంటుందని చావిన్ కు మద్దతుగా మాట్లాడే మాజీ పోలీసు అధికారులు అభిప్రాయాపడుతున్నారు.
అందుకే వారిలో చాలామంది అధికారులపై చర్యలు తీసుకోవడాన్ని సమర్ధించరు. అందుకే వీరిలో చాలామంది ఈ తీర్పు విని నిర్ఘాంత పోయారు.

తీర్పు వచ్చాక కోర్టు ప్రాంగణంలో ఓ మహిళా కార్యకర్త సంతోషంతో ''అతను జైలుకెళుతున్నాడు'' అంటూ పాటపాడుకుంటూ బైటికి వచ్చారు.
తీర్పు కోసం ఎదురు చూస్తున్న వారిలో చాలామంది జడ్జిమెంట్‌ను విని ఎగిరి గంతేశారు. ''మేం ఇక్కడితో ఆగేవాళ్లం కాదు. గతంలో పోలీసులు పాల్పడ్డ అకృత్యాలన్నింటిపైనా విచారణ జరగాలి.'' అని ఓ మహిళా కార్యకర్త అన్నారు.
ఈ ఉద్యమాలతో సంబంధంలేని వారు మాత్రం మొత్తానికి విచారణ పూర్తయింది అని ఓ నిట్టూర్పు విడిచారు. అయితే తర్వాత ఏం జరగబోతోంది అన్న సందేహాలు మాత్రం వారిని వెంటాడుతున్నాయి.
ఎందుకంటే, ఫ్లాయిడ్ హత్య తర్వాత మిన్నియాపోలీస్ నగరంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. నగర స్వరూపమే మారిపోయినట్లుగా తయారైంది. సుమారు 350 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2500 కోట్లు) విలువైన ఆస్తుల ధ్వంసం జరిగినట్లు ప్రభుత్వం అంచనా వేసింది.
''మా సిటీ ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ స్వేచ్ఛ ఉంటుంది. అమెరికా దక్షిణాది రాష్ట్రలతో పోలిస్తే జాతి వివక్ష తక్కువ. కానీ ఇప్పుడు ఇలా జరిగింది.'' అని రోసా గోమెజ్ బీబీసీతో అన్నారు. ఆమె ఈ కేసు విచారణను పూర్తిగా ఫాలో అయ్యారు.
''అతను చాలా నెమ్మదస్తుడు. అతని వీడియో టీవీలో చూసి షాకయ్యాను'' అని 1990లలో చావిన్‌కు బాస్ గా వ్యవహరించిన జెర్నీ ఒబిగ్లో వ్యాఖ్యానించారు.
'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' ఉద్యమం విషయంలో కొన్ని ఛానళ్లు పక్షపాత ధోరణితో వార్తలు ప్రసారం చేశాయని, చావిన్ కు వ్యతిరేకంగా తీర్పు రావడంలో వాటి పాత్ర కూడా ఉందని ఒబిగ్లో అన్నారు. ''బహుశా వాళ్ల ఇళ్లు తగలబడ కూడదని జాగ్రత్త పడి ఉంటారు'' అన్నారాయన.

'విధ్వంసం జరగాల్సిందే'
తీర్పు రానున్న తరుణంలో కోర్టు దగ్గర భారీ ఎత్తున బలగాలను మోహరించారు. ఈ కేసు కారణంగా మిన్నియాపోలీస్ నగరంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయనడానికి ఇది కూడా నిదర్శనంగా నిలిచింది.
తీర్పు రోజైన సోమవారం నాడు 3000 మంది నేషనల్ గార్డ్స్ పోలీసులు విధులలో ఉన్నారు. ''ఇది ఏదో విదేశీ ఆపరేషన్‌కు వెళ్లినట్లుంది'' అన్నారు మాజీ షెరీఫ్ రిక్ స్టానెక్.
అయితే నగరంలో ఇన్ని మార్పులు జరిగినా కొన్ని పరిస్థితులో మాత్రం ఎలాంటి తేడా కనిపించ లేదు. ఒక పక్క ఫ్లాయిడ్ కేసు విచారణ జరుగుతుండగానే, ఓ నల్లజాతి యువకుడిని తెల్లజాతి పోలీసు ఒకరు పొరపాటున కాల్చి చంపారు.
2000 సంవత్సరం నుంచి 50 మంది నల్లజాతీయులు పోలీసుల చేతిలో చనిపోయారని స్టార్ ట్రిబ్యూన్ వెల్లడించింది.
''ఆందోళన సమయంలో నగరం మొత్తం పొగ కమ్ముకున్నట్లు కనిపించింది. ఏటీఎంలను పగల గొట్టారు. విధ్వంసం అనేది న్యాయానికి మార్గం కాదు. కానీ వారి ఆక్రోశాన్ని అర్ధం చేసుకోవాల్సి ఉంది. ఎన్నాళ్లు మేం శాంతియుతంగా ఉండగలం'' అని ఎరికా ఆట్సన్ ప్రశ్నించారు.
ఆమె ఈ కేసు విచారణ జరిగినప్పుడల్లా కోర్టు ప్రొసీడింగ్స్‌ను ఫాలో అయ్యారు.
''మేం ఇంకా హింసకు దిగాల్సింది. ప్రభుత్వ భవనాలను ధ్వంసం చేయాల్సింది. అది మంచిది కాదని తెలుసు. కానీ అలా జరగాల్సిందే'' అన్నారామె.

ఐయోవా రాష్ట్రానికి చెందిన 35 ఏళ్ల మారెన్ బియార్డ్ కూడా తన ఊళ్లో కూర్చుని ఈ కోర్టు ట్రయల్‌ను వీక్షించారు. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమం జరుగుతున్న సమయంలోనే ఆమె పోలీసులు క్రూరత్వాన్ని తెలిపే ఓ వీడియోను షేర్ చేశారు.
''ఇలాంటివి ఎన్నో జరిగాయి. వీటిని షేర్ చేయడం ప్రజలకు ఒక మేలుకొలుపు లాంటిది. నేను చేయగలిగింది చేశాను'' అన్నారామె.
ఆమెకు అది మేలుకోలుపు అంశం కాగా, మరికొందరికి అది మిన్నియాపోలీస్ నగరాన్ని తలకిందులు చేసే విషయం.
''గత ఏడాది జరిగిన అల్లర్లకు నా సంపూర్ణ మద్ధతు ప్రకటించాను. ఆ రోజు నాకు ఒక వ్యక్తి ఒక కాగడాలాంటిది ఇచ్చారు. నేను దానితో చాలా వస్తువులకు నిప్పంటించాను. ఆ మంటలను చూసి నాకు సరదాగా అనిపించింది.'' అన్నారు రోసా గోమెజ్.
''మేం కార్ రేస్‌ను మొదలు పెట్టబోవడం లేదు. ముగించాలనుకుంటున్నాం'' అన్నారు రోసా. ఈ తీర్పు ఆ దిశగా వేసిన అడుగు అన్నారామె.
ఇవి కూడా చదవండి:
- మహాత్మా గాంధీ: పాకిస్తాన్‌కు రూ.55 కోట్లు ఇవ్వాలన్న డిమాండే హత్యకు కారణమా?
- మెహులీ ఘోష్: జాతరలో బెలూన్లు కాల్చిన ఈ షూటర్ గురి ఇప్పుడు ఒలింపిక్స్‌పై
- గీతా గోపీనాథ్‌పై అమితాబ్ బచ్చన్ ప్రశంసల మీద ఎందుకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి?
- ఆంధ్రప్రదేశ్: హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం చేశానన్న ప్రవీణ్ చక్రవర్తి అసలు ఎవరు?
- వైట్ టైగర్: హాలీవుడ్ సినిమాల్లో అసలైన భారతదేశాన్ని చూపించేదెప్పుడు
- కాసిం సులేమానీ హత్య ఐఎస్‌కు వరంగా మారుతుందా
- మగాళ్లు రేప్ ఎందుకు చేస్తారు? అలాంటి ఆలోచనలు వారికి ఎందుకు వస్తాయి?
- సుభాష్ చంద్రబోస్ 'ద గ్రేట్ ఎస్కేప్': బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి నేతాజీ దేశం ఎలా దాటారు?
- కోడి రామ్మూర్తి నాయుడు: ‘కలియుగ భీముడు’గా పేరు తెచ్చుకున్న ఈ తెలుగు వీరుడి కథేంటి?
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








