బ్రిటన్ రాజకుటుంబం: ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌ల రూపంలో చరిత్ర పునరావృతమవుతోందా?

ఫొటో సోర్స్, RICHARD HEATHCOTE/GETTY IMAGES
బ్రిటన్‌లో రాజ కుటుంబాన్ని తాము ఎందుకు విడిచి పెట్టామో ఓప్రా విన్‌ఫ్రేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువరాజు హ్యారి, ఆయన భార్య మేఘన్ మార్కెల్ వివరించారు.
ప్యాలెస్‌లో జాతి వివక్ష వ్యాఖ్యలు కూడా వినిపించాయని హ్యారిస్ భార్య మేఘన్ ఈ ఇంటర్వ్యూలో అన్నారు. అయితే, ఆ వ్యాఖ్యలు రాణి లేదా రాజు చేసినవి కాదని హ్యారీ ఓప్రా విన్‌ఫ్రేకు చెప్పారు.
విన్‌ఫ్రే ఇంటర్వ్యూలో జాతి వివక్షపై మేఘన్ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవని, వీటిని సీరియస్‌గా తీసుకుంటున్నామని బకింగ్‌హమ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
మేఘన్, హ్యారీలు తమ కుటుంబంలో అత్యంత ప్రేమను పొందిన జంట అని, వారికి కలిగిన అసౌకర్యాన్ని పరిశీలించి ప్రైవేట్‌గా ఈ సమస్యను పరిష్కరిస్తామని ఆ ప్రకటనలో రాజకుటుంబం పేర్కొంది.
వీరి ఇంటర్వ్యూ తర్వాత రాజకుటుంబం క్రైసిస్ మేనేజ్‌మెంట్ టీమ్ అత్యవసరంగా సమావేశం నిర్వహించి, ఈ ప్రకటనను వెలువరించింది.
తమ కుమారుడు ఆర్చీ చర్మం రంగు ఎంత నల్లగా ఉంటుందోనని కుటుంబంలోని ఒక వ్యక్తి వ్యాఖ్యలు చేశారని ఓప్రా ఇంటర్వ్యూలో మేఘన్ తెలిపారు.
ప్రిన్స్ హ్యారీ, మేఘన్ దంపతుల ఇంటర్వ్యూ సోమవారంనాడు బ్రిటన్‌లో ప్రసారమైంది. ఈ ఇంటర్వ్యూలో దంపతులు మాట్లాడిన అంశాలు సంచలనంగా మారాయి.
మరి ఆధునిక రాజరికాన్ని, హోదాలను కాదని బకింగ్‌హమ్ ప్యాలెస్‌ను వదిలి ఈ జంట ఎందుకు అమెరికా వెళ్లిపోయింది? రాజప్రాసాదాన్ని విడిచి పెట్టడానికి కారణమేంటి?

ఫొటో సోర్స్, MAX MUMBY/INDIGO/GETTY IMAGES
ఒక ప్రేమ కథ
ప్రిన్స్ హ్యారీ అమెరికన్ నటి మేఘన్ మార్కెల్‌తో డేటింగ్ చేస్తున్నారని 2016లో ఊహాగానాలు వినిపించాయి. 'షూట్స్' అనే టీవీ డ్రామా ద్వారా మేఘన్ అప్పటికే గుర్తింపు పొందారు.
ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరు ఒకరికొకరు పరిచయమయ్యారు. కలుసుకున్న 18 నెలల్లోనే నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.
అప్పటి నుంచి మీడియా ఈ జంట వెంటపడింది. 2018లో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. యునైటెడ్ కింగ్ డమ్‌లో కోట్లమంది ప్రజలు ఈ వివాహ వేడుకలను టీవీలో చూశారు.

ఫొటో సోర్స్, RICHARD HEATHCOTE/GETTY IMAGES
తర్వాత ఏం జరిగింది?
పెళ్లి తర్వాత మేఘన్ రాజకుటుంబంలో భాగంగా మారారు. బ్రిటన్ పత్రికలు ఆ జంట గురించి కథలు కథలుగా రాశాయి.
"చాలామంది ఇది చరిత్రలో కొత్త అధ్యాయం అనుకున్నారు. కానీ నాకు ఇక్కడ చరిత్ర పునరావృతమవుతుంది అనిపించింది.
ఎందుకంటే ఆమె మిక్స్‌డ్ రేస్‌కు చెందిన వ్యక్తి మాత్రమే కాదు, విడాకులు పొందిన మహిళ." అని క్రౌన్ క్రానికల్స్ సంపాదకులు విక్టోరియా హోవార్డ్ అన్నారు
"నిశ్చితార్ధానికి ముందే మేఘన్ టాబ్లాయిడ్‌లకు లక్ష్యంగా మారారు. హ్యారిస్ ఆమెను పెళ్లి చేసుకుంటారని తెలిసిన తర్వాత మేఘన్ మీద అసభ్యకర పదజాలంతో వార్తలు రాసి వేధించారు." అన్నారు హోవార్డ్.
ప్రిన్స్ హ్యారీ కూడా మేఘన్‌పై దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. "ఒక జాతీయ వార్తాపత్రిక మొదటి పేజీలో ఆమెను విమర్శిస్తూ కథనాలు వచ్చాయి. వాటిలో జాత్యహంకారం ఉంది. సోషల్ మీడియాలో ట్రోల్స్ కనిపించాయి." అని హోవార్డ్ వ్యాఖ్యానించారు.
రాజకుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కథనాలు రాయడం టాబ్లాయిడ్‌లకు కొత్త కాదని, 2007నాటికి ప్రేమలో ఉన్న ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్‌లు విభేదాలతో విడిపోవడానికి కూడా మీడియానే కారణమని హోవార్డ్ అన్నారు.
"రాజకుటుంబం, మీడియా మధ్య సంబంధాలు చాలా సున్నితంగా ఉంటాయి. ప్యాలెస్‌లోకి కొత్తగా మహిళలు వచ్చినప్పుడు ముందు వారిని తెగ పొగుడుతారు. అందానికి వారు ఎలాంటి క్రీములు వాడతారు, ఎలాంటి డ్రెస్సులు ఇష్టపడతారులాంటి కథనాలు ప్రచురిస్తారు.
ఏడాది తర్వాత ప్రజలు ఈ కథనాలతో విసిగిపోయారని అర్ధంకాగానే ఆమె స్నేహితులెవరు, ఎవరెవరితో రిలేషిప్‌లున్నాయని మొదలుపెడతారు" అన్నారు హోవార్డ్.
మేఘన్‌పై ఇలాంటి దాడులను తాను సహించనని ప్రిన్స్ హ్యారీ అన్నారు. రాజకుటుంబం నుండి నిష్క్రమించిన తరువాత, బ్రిటన్‌లో మీడియా సృష్టించిన 'విషపూరిత' వాతావరణాన్ని నివారించాలని నిర్ణయించుకున్నామని ఈ జంట వెల్లడించారు.
"తన తల్లితో మీడియా ప్రవర్తించిన తీరును చూసిన హ్యారీ, మేఘన్ రూపంలో అది పునరావృతం కావడాన్ని ఇష్టపడ లేదు." అని యాహూ న్యూస్‌సైట్‌కు రాజకుటుంబం వ్యవరాలను రాసే జర్నలిస్ట్ జెస్సీకా మోర్గాన్ అన్నారు.
"డయానా కూడా బహిరంగంగానే మాట్లాడేవారు. మౌనంగా ఉండటం ఆమెకు ఇష్టం ఉండదు. ఈ విషయంలో డయానాకు, మేఘన్‌కు పోలికలున్నాయి. ఆమె చిన్నపిల్లకాదు" అన్నారు జెస్సీకా.

ఫొటో సోర్స్, MICHELE SPATARI/AFP VIA GETTY IMAGES
చరిత్ర పునరావృతమవుతుందా?
డయానా రాజకుటుంబంలోకి వచ్చినప్పుడు మీడియా స్పందన సానుకూలంగానే ఉంది. మేఘన్ విషయంలోనూ అలాగే జరిగింది.
"డయానాను మొదట్లో బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే అప్పటికి ఆమె చాలా చిన్నది. అందగత్తె. ఆమెను తప్పుబట్టడానికి ఏమీ కనిపించలేదు.
కానీ, ప్రిన్స్ చార్లెస్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు తెలిసిన తర్వాత ఫొటోగ్రాఫర్లు ఆమె వెంటపడ్డారు. 'మీరు నా జీవితాన్ని నరకం చేస్తున్నారు' అని ఒకసారి డయానా పెద్దగా అరిచారు.'' అని హోవర్డ్ తెలిపారు.
ఆఖరికి ఆమె జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలో కూడా రహస్యంగా ఫొటోలు తీశారు. అప్పట్లో ఆమె ప్రియుడు ఫయీద్‌తో కలిసి ఉన్న ఫొటోను 10 లక్షల డాలర్లకు అమ్ముకున్నట్లు చెబుతారు.
ఫొటోగ్రాఫర్లు వెంబడిస్తుండటంతో కారు వేగంగా పోనిచ్చి యాక్సిడెంట్‌కు గురై డయానా మరణించారు.
ఈ సంఘటన తర్వాత డయానా కుమారులకు, మీడియాకు మధ్య విభేదాలు మొదలయ్యాయి. తన తల్లి జీవితంలోకి మీడియా చొరబాటు, దాని భయంకర పరిణామాలను హ్యారీ స్వయంగా చూశారు.

ఫొటో సోర్స్, CHRIS JACKSON/GETTY IMAGES
తీవ్ర దుష్ప్రచారం
రాజ కుటుంబ వారసుడిగా ప్రిన్స్ హ్యారీ నిత్యం మీడియాలో నిలుస్తూనే ఉన్నారు. అలాగే ఆయన జీవిత భాగస్వామి కూడా.
అయితే టాబ్లాయిడ్‌లు మేఘన్ వ్యక్తిగత జీవితం, కుటుంబం, విడాకులులాంటి అంశాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టాయి. ముఖ్యంగా ఆమె మిక్స్‌డ్ రేస్ (మిశ్రజాతి)కు చెందిన వ్యక్తి అని పదే పదే ప్రస్తావిస్తూ మీడియా కథనాలు రాసింది.
"మేఘన్ రాజకుటుంబంలోకి ప్రవేశించినప్పుడు వాతావరణం చాలా సానుకూలంగా ఉంది. ప్రజలు సంతోషించారు. కానీ ఇప్పుడు పత్రికలు జాత్యహంకార ధోరణితో కథనాలు రాస్తున్నాయి" అన్నారు జెస్సీకా మోర్గాన్.
"ఇది నల్ల జాతీయులపై జరుగుతున్న దాడిగా నాకు కనిపించింది" అన్నారు జెస్సీకా.
మేఘన్ మొండి మనిషని, ఆమెను భరించడం కష్టమని, ఆమె తన ఇద్దరు సహాయకులను కెన్సింగ్‌టన్ ప్యాలెస్ నుంచి తరిమేశారని పత్రికలు రాయగా, ఆమె దీనిని ఖండించారు.
ప్రిన్స్ విలియం, హ్యారీ భార్యల విషయంలో మీడియా వివక్ష చూపిందని, నల్లజాతికి చెందిన వ్యక్తి కావడంతో ఆమె చేసిన ప్రతి పనిని మీడియా తప్పుబట్టిందని ఆన్‌లైన్‌లో అనేమంది విమర్శలు చేశారు.
" విలియం భార్య కేట్ రాయల్ ప్రొటోకాల్‌ను ఉల్లంఘించినప్పుడు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారని రాసిన పత్రికలు, మేఘన్ కారు డోర్‌ను స్వయంగా వేయడాన్ని పెద్ద రాద్ధాంతం చేశాయి." అని జెస్సీకా అన్నారు.
తన గురించి, భార్య మేఘన్ గురించి నిరంతర వెలువడుతున్న మీడియా కథనాలకు విసుగెత్తిన హ్యారీ 2019 అక్టోబర్‌లో బ్రిటీష్ టాబ్లాయిడ్లను విమర్శిస్తూ ఒక ప్రకటన చేశారు.
ఈ పత్రికలు తన భార్య విషయంలో అత్యంత క్రూరమైన ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆ ప్రకటనలో అన్నారు.
డైలీ మిర్రర్, ది డైలీ మెయిల్, డైలీ ఎక్స్‌ప్రెస్‌తో సహా పలు ఇతర మీడియా సంస్థలతో మాట్లాడబోమని రాజదంపతులు ప్రకటించారు.
మేగాన్ ఇటీవల మెయిల్ ఆన్ సండే, మెయిల్ ఆన్‌లైన్‌కు పత్రికలపై కాపీరైట్ హక్కుల కేసు వేసి గెలిచారు.

ఫొటో సోర్స్, HARPO PRODUCTIONS/JOE PUGLIESE VIA GETTY IMAGES
ఓప్రా విన్‌ఫ్రే ఇంటర్వ్యూలో ఏముంది?
మీడియాతో హ్యారీ, మేఘన్‌లకు పూర్తిగా సంబంధాలు క్షీణించడంతో రాజకుటుంబంలో వివాదాలపై ఊహాగానాలు పెరగడం ప్రారంభించాయి.
రాజరికపు బాధ్యతల నుంచి తాము వైదొలగుతామని ప్రిన్స్ హ్యారీ, మేఘన్ 2020 జనవరిలో ప్రకటించినప్పుడు ఇది కుటుంబాన్ని సంప్రదించకుండానే తీసుకున్న నిర్ణయంగా ప్రచారం జరిగింది.
ప్రిన్స్ ప్రకటనతో రాజకుటుంబం తీవ్ర నిరాశకు గురైందని పత్రికలు రాశాయి. హ్యారీ దంపతులు ఫిబ్రవరిలో తమ కుమారుడితో కలిసి అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లారు.
హ్యారీ ఇకపై రాజరికపు బాధ్యతల స్వీకరించబోరని రాణి తరువాత ధృవీకరించారు.
ఓప్రా విన్‌ఫ్రేతో ఇంటర్వ్యూలో ఈ జంట రాజకుటుంబంలో జరిగిన అనేక సంఘటనలను వివరించారు.
తమ గురించి అబద్ధాలు ప్రచారం కావడంలో రాజకుటుంబం, అందులోని కొందరు సిబ్బంది కారణమని చెబుతున్నట్లు కొన్ని క్లిప్‌లలో ఉంది.
మేఘన్ విషయంలో మీడియా పాత్ర తన తల్లి విషయంలో జరిగినట్లుగానే ఉందని, చరిత్ర రిపీట్ అవుతున్నట్లు కనిపించిందని, ఇది తనను ఆందోళనకు గురి చేసిందని హ్యారీ చెప్పారు.
"అప్పట్లో మా అమ్మ ఎంత బాధ అనుభవించిందో నేను ఊహించలేను. ఇప్పుడు మేమిద్దరం కలిసికట్టుగా ఈ సమస్యను ఎదుర్కొంటాం" అన్నారు హ్యారీ.
ఇవి కూడా చదవండి:
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
- కొండ బారిడి: తుపాకులు గర్జించిన నేలలో ఇప్పుడు సేంద్రియ వ్యవసాయ విప్లవం
- కరోనా వైరస్ వ్యాక్సీన్ కోసం నమోదు: కోవిన్ యాప్, వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ఇలా.. ఏఏ ధ్రువపత్రాలు కావాలంటే
- హాథ్రస్: కూతురిని వేధించారని కేసు పెట్టినందుకు తండ్రిని కాల్చి చంపేశారు
- కరోనావైరస్: ఇండియాలో మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతుండడానికి కారణమేమిటి.. మరో వేవ్ మొదలైందా
- ఇథియోపియా టిగ్రే సంక్షోభం: బీబీసీ విలేకరిని నిర్బంధించిన సైన్యం
- కృత్రిమ గర్భధారణ ఖర్చులు భరించలేక ఫేస్బుక్లో వీర్యదాతలను ఆశ్రయిస్తున్నారు... ఆరోగ్యం ఏమవుతుంది?
- భారతదేశంలోని ‘అస్థిపంజరాల సరస్సు’.. అంతు చిక్కని రహస్యాల నిలయం
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








