కలరా వ్యాధి ఎప్పుడు, ఎక్కడ వ్యాపిస్తుందో అంతరిక్షం నుంచి చూసి పసిగట్టేస్తున్నారు, ఎలాగంటే..

ఫొటో సోర్స్, EPA
కలరా వ్యాప్తిని అంతరిక్షం నుంచే గుర్తించే పద్ధతిని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వాతావరణ మార్పులను గమనించే ఉపగ్రహాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో వాళ్లు ఈ పనిచేస్తున్నారు.
కలరా ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జనం ప్రాణాలను కాపాడేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడొచ్చని పరిశోధకులు ఆశిస్తున్నారు.
''అంతరిక్షంలోని ఉపగ్రహాలు ఇలా ఆరోగ్యపరమైన విషయాలకు తోడ్పడతాయని చాలా మంది అనుకోరు. కానీ, ఇప్పుడు దీని ఉపయోగం అందరికీ తెలుస్తోంది'' అని యురోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ)కి చెందిన డాక్టర్ పవాలో సిపోలిని అన్నారు.,
ఈ కొత్త సాంకేతికతను ఉపయోగించి భారత్‌లోని తీర ప్రాంతాల్లో కలరా వ్యాప్తిని పరిశోధకులు అంచనా వేశారు. ఫలితాలు 89 శాతం మేర సరిగ్గా వచ్చాయి.
ఈఎస్‌ఏ, ప్లైమౌత్ మెరైన్ లాబోరేటరీ (పీఎంఎల్) కలిసి ఈ అధ్యయనం చేశాయి. ఎనిమిదేళ్లుగా అందుబాటులో ఉన్న వాతావరణ సమాచారం తీసుకుని, ఏఐ సాయంతో కలరా వ్యాప్తిని అంచనా వేసే మోడల్‌ను రూపొందించాయి.
'విబ్రియో కలరా' అనే బ్యాక్టీరియా వల్ల కలరా సోకుతుంది. ఇది ఉప్పు నీటిలో కనిపించే బ్యాక్టీరియా. దీనితో కలుషితమైన ఆహారం, మంచి నీటి ద్వారా ఇది మనుషులకు వ్యాపిస్తుంది.
తీర ప్రాంతాల్లో, జన సాంద్రత ఎక్కువగా ఉంటే ఉష్ణమండల ప్రాంతాల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తోంది.
ప్రపంచంలో నమోదవుతున్న కలరా కేసుల్లో సగం భారత్ సహా ఉత్తర హిందూ సముద్ర తీర దేశాల్లోనే వస్తున్నాయని... తమ అధ్యయనం కూడా ఈ ప్రాంతాలపైనే దృష్టి పెట్టి చేశామని పరిశోధకులు చెప్పారు.

ఫొటో సోర్స్, ESA
నీటి తేడాలను గమనిస్తూ...
వివిధ ఉపగ్రహాల నుంచి తీసుకున్ని ఏడు రకాల కొలమానాలను ఉపయోగించి పరిశోధకులు ఈ అంచనాలు వేశారు.
కలరా బ్యాక్టీరియా వెచ్చటి ఉప్పు నీటిలో బాగా పెరుగుతుంది. ప్లవక జీవాలకు (ప్లాంక్టాన్) అంటిపెట్టుకుని ఉంటుంది. అందుకే నీటిలో వస్తున్న మార్పులను, ప్లవక జీవాల పెరుగుదలను పరిశోధకులు ఉపగ్రహ సమాచారం ద్వారా గమనించారు.
వడ గాడ్పుల వంటి అంశాలను కూడా వారు పరిగణనలోకి తీసుకున్నారు. ఎందుకుంటే, ఇలాంటి సమయంలో చల్లదనం కోసం జనం నీటిలో సేదతీరుతుంటారు. వర్షాలు పడ్డప్పుడు కూడా నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంటుంది. వీటిని కూడా పరిశోధకులు గమనించారు.
''రకరకాల అంశాలను మా అధ్యయనంలో పరిగణనలోకి తీసుకున్నాం. నీటి లవణత్వం కూడా వీటిలో ఒకటి. కలరా వ్యాప్తిని అంచనా వేయడంలో దీన్ని లెక్కలోకి తీసుకోవడం ఇదే మొదటిసారి. ఇది అంచనాలకు చాలా ఉపయోగపడింది'' అని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న ఏమీ కాంప్‌బెల్ అన్నారు.
''ఎప్పుడు, ఎక్కడ కలరా వ్యాపిస్తుందో గుర్తించగలిగితే, మనం జనాన్ని హెచ్చరించేందుకు వీలు ఉంటుంది. అవసరమైన ఏర్పాట్లు కూడా ముందుగానే చేసుకోవచ్చు. వ్యాక్సీనేషన్ కార్యక్రమాల్లాంటివి నిర్వహించుకోవచ్చు'' అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తుల కారణంగా కలరా వ్యాపిస్తున్న ఉదంతాలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సమాచారం ప్రకారం ఏటా 40 లక్షల మందికి కలరా సోకుతోంది. 1.43 లక్షల మంది ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు.
కలరా సోకినవారిలో స్వల్ప లక్షణాలే కనిపించినా, తీవ్రమైన డయేరియా (విరేచనాలు) రావొచ్చు. చికిత్స చేయించుకోకపోతే కొన్ని గంటల్లోనే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది.
''ఇలా నీటి ద్వారా సోకే రోగాల బారిన చిన్న పిల్లలు, ముఖ్యంగా ఐదేళ్ల లోపు చిన్నారులు ఎక్కువగా పడుతుంటారు. అలాంటి వారికి ముప్పు తగ్గించేందుకు ఈ అంచనా వ్యవస్థ ఉపయోగపడుతుందని మేం ఆశిస్తున్నాం'' అని పీఎంఎల్‌లో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ మేరీ ఫానీ రకాల్ట్ అన్నారు.
వర్షాకాలానికి ముందు సమయంలో ఈ వ్యవస్థ అంచనాలు 93.3 శాతం వరకూ సరిగ్గా వస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. కచ్చితత్వం పెరిగేలా ఈ వ్యవస్థకు మరిన్ని మెరుగులు కూడా దిద్దాల్సి ఉందని వారు అంటున్నారు.

ఫొటో సోర్స్, ESA
''సామాజిక ఆర్థికపరమైన అంశాలు కూడా ఫలితాలను ప్రభావితం చేస్తాయి. వాతావరణ మార్పులతో సంబంధం లేకుండా సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేని చోట్ల కూడా కలరా వ్యాప్తి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి'' అని ఏమీ అన్నారు.
కోవిడ్-19 సంక్షోభం కూడా వ్యాధుల వ్యాప్తిని ముందస్తుగా అంచనా వేయడం ఎంత ముఖ్యమో తెలిసేలా చేసింది.
ఈ కలరా అంచనా వ్యవస్థను ఇప్పటివరకూ భారత్‌లో తప్ప మరెక్కడా పరీక్షించలేదు.
''వ్యాధుల వ్యాప్తి, వాతావరణ మార్పులు వ్యాధులపై చూపిస్తున్న ప్రభావం లాంటివాటి గురించి తెలుసుకునేందుకు భూ పరిశీలనను మరింతగా వినియోగించుకోవడం మనం చూస్తాం. ఇలాంటి అంచనాలు వేయడం చాలా ముఖ్యం. కడు పేదరికంలో మగ్గుతున్న సమాజాలకు వీటి ద్వారా ప్రయోజనం చేకూరుతుంది'' అని డాక్టర్ పవాలో సిపిలోని అన్నారు.

ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ‘ప్రచారానికి వెళ్తే పేరంటానికా అని ఎగతాళి చేశారు... మగవాళ్లందరినీ ఓడించాం’
- మోటేరా స్టేడియం.. అపూర్వమైన ప్రపంచ రికార్డులకు వేదిక
- Hyperemesis: గర్భం దాల్చి వారాలు గడిచినా వాంతులు తగ్గట్లేదు, ఎందుకిలా? వాంతుల వల్ల బిడ్డకు హాని ఉంటుందా?
- సద్దాం హుస్సేన్ కూతురు రగద్: 'నా భర్తను మా నాన్నే చంపించారు'
- దేశద్రోహ చట్టం: అసమ్మతిని అణచివేయడానికి ప్రయోగిస్తున్న అస్త్రం
- మోదీ సర్కారు ప్రభుత్వ కంపెనీలను ఎందుకు అమ్మేస్తోంది...
- ఆరాంకో: ప్రపంచంలో అత్యధిక లాభాలు సంపాదించే కంపెనీ షేర్ మార్కెట్లోకి ఎందుకొస్తోంది?
- కేజీఎఫ్: కోలార్ గోల్డ్‌ఫీల్డ్స్ ఇప్పుడు ఎందుకు వెలవెలబోతున్నాయి... ఏపీలో చిగురిస్తున్న ఆశలేంటి?
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
- సియాచిన్: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రం
- డోనల్డ్ ట్రంప్‌కు అభిశంసన ఆరోపణల నుంచి విముక్తి... సెనేట్‌లో వీగిపోయిన తీర్మానం
- జ్యోతిషాన్ని నమ్మే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది... ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








