కరోనిల్‌కు డబ్ల్యూహెచ్‌వో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ పతంజలి ప్రకటన, అదంతా 'శుద్ధ అబద్ధం' అన్న ఐఎంఏ

రాందేవ్ బాబా

ఫొటో సోర్స్, Getty Images

కోవిడ్-19కు తొలిసారిగా 'ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్' విడుదల చేస్తున్నట్లు యోగా గురు బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి సంస్థ శుక్రవారం ప్రకటించింది. తాము తయారు చేసిన కరోనిల్ ఔషధం కోవిడ్-19 చికిత్సకు ఉపయోపడే ఆయుర్వేద మందుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ధృవీకరించినట్లు బాబా రాందేవ్ ప్రకటించారు.

అదే సమావేశంలో దీనికి సంబంధించిన శాస్త్రీయ పరిశోధనా పత్రాన్ని ఆయన విడుదల చేశారు. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ కరోనిల్ మందును ఆయుష్ మంత్రిత్వ శాఖ ధృవీకరించిందని కూడా బాబా రాందేవ్ తెలిపారు.

"డబ్ల్యూహెచ్ఓ ధృవీకరణ నిబంధనలను అనుసరించి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ)లోని ఆయుష్ విభాగం నుంచి కరోనిల్‌కు సర్టిఫికేట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్ (సీఓపీపీ) లభించింది" అంటూ పతంజలి సంస్థ ప్రకటించింది.

సీఓపీపీ కింద కరోనిల్‌ను 158 దేశాలకు ఎగుమతి చేయవచ్చని, తాము అందించిన డాటా ఆధారంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ కరోనిల్‌ను "కోవిడ్-19 చికిత్సలో సహాయక ఔషధంగా" గుర్తించిందని పేర్కొన్నారు.

భారత వైద్య మండలి విడుదల చేసిన ప్రకటన

ఫొటో సోర్స్, IMA

ఫొటో క్యాప్షన్, భారత వైద్య మండలి విడుదల చేసిన ప్రకటన

అయితే, కరోనిల్ మాత్రను డబ్ల్యూహెచ్ఓ ధ్రువీకరించిందంటూ పతంజలి సంస్థ ప్రకటించడం షాక్‌కు గురి చేసిందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది. అది "శుద్ధ అబద్ధం" అని వ్యాఖ్యానించింది. దీనిపై వివరణ ఇవాల్సిందిగా ఆ సమావేశానికి హాజరైన కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్‌ను ఐఎంఏ కోరింది.

ఈ ఔషధం కరోనా చికిత్సకు ఉపయోగపడుతుందని చెబుతూ ఈ దేశ ప్రజలను మోసం చేస్తున్నారంటూ మండిపడింది.

"ఈ దేశానికి ఆరోగ్య శాఖ మంత్రి అయ్యుండి ఇలాంటి అశాస్త్రీయమైన, కల్పిత ఔషధం గురించి తప్పుడు ప్రచారం చేయడం ఎంతవరకు సమర్థనీయం? కోవిడ్-19 చికిత్సకు కరోనిల్ ఉపయోగపడుతుందని రుజువులు ఉన్నాయంటున్నారు కదా.. ఏ సమయంలో, ఎంత కాలం పాటు క్లినికల్ ట్రయల్స్ చేశారో వివరించగలరా?" అంటూ ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్‌ను ఐఎంఏ నిలదీసింది.

ఇదిలా ఉండగా, పతంజలి సంస్థ తయారు చేసిన కరోనిల్ ఔషధం సామర్థ్యాన్ని తాము పరిశీలించలేదని, దానికి ఏ రకమైన ధృవీకరణ పత్రాన్నీ జారీ చేయలేదని డబ్ల్యూహెచ్ఓ ట్వీట్ చేసింది.

అనంతరం, పతంజలి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ డబ్ల్యూహెచ్ఓ ధృవీకరణ పత్రం గురించి వివరణ ఇస్తూ.. "కరోనిల్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ జీఎంపీ (గూడ్ మానుఫాక్చరింగ్ కాంపొనెంట్) కాంప్లియంట్ సీఓపీపీ సర్టిఫికేట్‌ను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా జారీ చేసింది. డబ్ల్యూహెచ్ఓ ఔషధాలకు ఆమోద ముద్ర వేయడం గానీ, నిరాకరించడం గానీ చెయ్యదు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు మెరుగైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించే దిశలో డబ్ల్యూహెచ్ఓ పనిచేస్తుంది" అని బాలకృష్ణ తెలిపారు.

వీడియో క్యాప్షన్, ఆ చిన్న గ్యాడ్జెట్ సింగపూర్ దేశాన్నే కరోనా నుంచి బయటపడేలా చేసింది
BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)