బ్రెగ్జిట్: బ్రిటన్, యూరోపియన్ యూనియన్‌లకు మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంలో ఏముంది?

ఫొటో సోర్స్, PA Media
ఎట్టకేలకు యూకే, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లు తమ భవిష్యత్తు సంబంధాలను నిర్వచించే ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
సుదీర్ఘ ప్రక్రియ తర్వాత, ఈయూ నుంచి 2020 జనవరి 31 నాడు బ్రిటన్ బయటకు వచ్చేసిన దగ్గరనుంచీ కొత్త వాణిజ్య నిబంధనలపై ఇరుపక్షాలూ చర్చిస్తూ ఉన్నాయి.
ప్రస్తుతం, ఇరు పక్షాల మధ్య ఉన్న తాత్కాలిక నిబంధనలు డిసెంబర్ 31తో ముగియనుండడంతో శాశ్వత ద్వైపాక్షిక ఒప్పందం ఓ కొలిక్కి వచ్చింది.
ఈ డీల్‌లో ఏముంది?
యూకే, ఈయూల మధ్య స్నేహవాతావరణం నెలకొనేలా భారీ వాణిజ్య ఒప్పందం జరిగింది. అయితే, ఈ ఒప్పందానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇంకా విడుదల కాకపోవడంతో డీల్ పూర్తి వివరాలు తెలియలేదు.
తెలిసిన వివరాలు:
* ఇరు పక్షాల మధ్య వాణిజ్య ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులకు సుంకాలు లేవు (వీటిని టారిఫ్స్ అంటారు)
* వర్తకం చేయగల ఉత్పత్తులపై పరిమితులు లేవు (వీటిని కోటాలు అంటారు)
ఇరు పక్షాలకూ సమానమైన లాభం చేకూరేలా వాణిజ్య ఒప్పందాలు ఉంటాయని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉరుసులా వాన్ డెర్ లెయిన్ తెలిపారు.
"వాతారవరణ మార్పులు, ఇంధన శక్తి, భద్రత, రవాణా తదితర అంశాల్లో యూకే, ఈయూ పరస్పర సహకారం కొనసాగిస్తాయని" ఆమె తెలిపారు.
విద్యార్థులకోసం ఏర్పాటు చేసిన ఎరాసమస్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రాంలో యూకే భాగం పంచుకోదన్న విషయం తెలిసిందే.

ఫొటో సోర్స్, Reuters
ఈ ఒప్పందం కుదుర్చుకోడానికి ఎందుకు ఇంత సమయం పట్టింది?
ఎందుకంటే డీల్ కుదుర్చుకోవలసిన ముఖ్యమైన అంశాలు అనేకం ఉన్నాయి.
ఈయూ, యూకేకు సమీపంలో ఉన్న అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. 2019లో ఇరు రెండు పక్షాల మధ్య సుమారు 66 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని యూకే ప్రభుత్వం తెలిపింది.
యూకే, ఈయూతో కలిసి ఉన్న కాలంలో ఎగుమతి, దిగుమతులకు సుంకాలు చెల్లించవలసిన అవసరం ఉండేది కాదు.
ఇప్పుడు ఒప్పందం కుదుర్చుకోకపోతే ఈ రెండు పక్షాలు వాణిజ్య సుంకం చెల్లించాల్సి ఉంటుంది. దీనివలన ఇరు వర్గాలవారికీ వ్యయాలు పెరిగే అవకాశం ఉంది.
ఒకవేళ ఏ ఒప్పందం కుదుర్చుకోకపోతే సరిహద్దులవద్ద అధిక స్థాయిలో భద్రతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. దానివలన ఉత్పత్తుల రవాణా ఆలస్యం అవుతుంది.
తరువాత ఏం జరుగుతుంది?
వాణిజ్య ఒప్పందం కుదిరినప్పటికీ దీన్ని ఇంకా చట్టబద్దం చేయాల్సి ఉంది. అందుకోసం యూకే, ఈయూ పార్లమెంట్‌లు ఈ ఒప్పందాన్ని అంగీకరించవలసి ఉంటుంది.
ఇప్పటికే చాలా ఆస్యమవడంతో, ఈ ఏడాది ముగిసేలోపు యూరోపియన్ పార్లమెంట్ ఈ ఒప్పందంపై సంతకం పెట్టలేకపోవచ్చు. అయినప్పటికీ, 2021 జనవరి 1నుంచీ ఈ డీల్ అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ ఒప్పందంపై అంగీకారం తెలిపేందుకు డిసెంబర్ 30న ఎంపీలతో సమావేశం కాబోతున్నామని యూకే ప్రభుత్వం తెలిపింది. కానీ డీల్ వివరాలను పరిశీలించి, చర్చించేంత సమయం ఉండకపోవచ్చు.
ఒప్పందం కుదిరిందని ఇరు పక్షాలు తెలిపినప్పటికీ జనవర్ 1నుంచీ దీన్ని అమలులోకి తీసుకురావడానికి కావలసిన ఏర్పాట్లు చేసేందుకు ఎక్కువ సమయం లేదు.

ఈయూ, బ్రెగ్జిట్ అంటే ఏంటి?
27 ఐరోపా దేశాలు కలిసి యూరోపియన్ యూనియన్‌గా ఏర్పడ్డాయి.
ఈయూ ప్రజలందరూ ఈ 27 దేశాల్లో ఎక్కడైనా నివసించవచ్చు, ఉద్యోగాలు చేయవచ్చు. అదనపు సుంకాలు చెల్లించవలసిన అవసరం లేకుండా కంపెనీలు తమ ఉత్పత్తులను ఎగుమతి, దిగుమతి చేసుకోవచ్చు.
ఈయూ విడిచివెళ్లిన మొట్టమొదటి దేశం యూకే. దీన్నే బ్రెగ్జిట్ (బ్రిటన్ ఎగ్జిట్) అంటారు.
రిఫరండం ద్వారా బ్రెగ్జిట్ జరిగింది. యూకే, ఈయూలో ఉండాలా వద్దా అనే అంశంపై 2016 జూన్‌లో పబ్లిక్ ఓటింగ్ జరిగింది. విడిపోవడానికే అధిక శాతం ఓటు వేయడంతో బ్రెగ్జిట్ జరిగింది.
విడిపోవాలని 52% మంది ఓటు వేయగా, కలిసి ఉండాలని 48% ప్రజలు ఓటు వేసారు.
ఈయూ, యూకేల మధ్య కొత్త ఒప్పందాలు కుదిరేవరకూ అంటే ఈ ఏడాది డిసెంబర్ 31 వరకూ యూకే, ఈయూ నిబంధనలనే పాటిస్తుందని తాత్కాలిక ఒప్పందం కుదిరింది.
ఇప్పుడు, అదనపు సుంకాలు, వాణిజ్య వస్తువులపై పరిమితులు లేకుండా ఇరు పక్షాల మధ్య శాశ్వతమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది.
ఇవి కూడా చదవండి:
- క్రిస్మస్: బైబిల్‌ను తొలిసారిగా తెలుగులోకి అనువాదం చేసింది విశాఖపట్నంలోనేనా?
- Ind vs Aus: బాక్సింగ్ డే టెస్టుకు ఈ పేరు ఎలా వచ్చింది? క్రికెట్‌తో సంబంధంలేని రోజును అలా ఎందుకు పిలుస్తారు?
- అనంతపురం - ధర్మవరం: స్నేహలత హత్య కేసు నిందితులకు ‘దిశ’ చట్టం ఎందుకు వర్తించడం లేదు ?
- ‘మనిషి లాంటి’ చేప: ఇది కేన్సర్‌కి పరిష్కారం చూపుతుందా?
- కరోనావైరస్: రొయ్యల సాగుదారుల చిక్కులేంటి.. లాక్ డౌన్‌తో నష్టం ఎంత?
- అమెరికా అధ్యక్షుడు ఏం తింటారు? వాటి అర్థం ఏంటి?
- వేరుసెనగ పప్పు తింటే చనిపోతారా?
- ఉప్పు తిన్న సముద్రానికే మనం ముప్పు తెస్తున్నాం
- డాక్టర్లు బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేస్తుంటే... ఆ అమ్మాయి పియానో వాయించింది
- కరోనా వ్యాక్సీన్ భారతదేశంలో మొదట ఎవరికి ఇస్తారు... దీని కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
- ఆడపిల్లలు వయసు రాకముందే రజస్వల కావడానికి కారణాలేమిటి? సమస్యలేమిటి? పరిష్కారాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








