కరోనావైరస్: మోడెర్నా వ్యాక్సీన్‌కు అమెరికా ఆమోదం... 20 కోట్ల డోసుల కొనుగోలుకు ఓకే

ఫొటో సోర్స్, MODERNA
మోడెర్నా వ్యాక్సీన్‌కు అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అమెరికా ఆమోదించిన రెండో కోవిడ్ వ్యాక్సీన్ ఇది.
అమెరికాలో తయారైన ఈ టీకా మందుకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఆమోదముద్ర వేసింది. దీనికి వారం రోజుల క్రితం ఫైజర్/బయోఎన్‌టెక్ వ్యాక్సీన్‌ను కూడా ఎఫ్‌డీఏ ఆమోదించింది. ఆ వ్యాక్సీన్ పంపిణీ ఇప్పటికే ప్రారంభమైంది.
అమెరికా 20 కోట్ల మోడెర్నా వ్యాక్సీన్ డోసులను కొనుగోలు చేయడానికి అంగీకరించింది. 60 లక్షల డోసులు డెలివరీకి సిద్ధంగా ఉన్నాయి.
కోవిడ్ కేసులు, మృతుల సంఖ్య అమెరికాలో అత్యధికంగా ఉంది. ఈ దేశంలో 3,13,500 మంది కరోనావైరస్ బారిన పడి చనిపోయారు. 1.75 కోట్ల మంది ఇన్ఫెక్షన్‌గు గురయ్యారని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
శుక్రవారం నాడు మోడెర్నాకు అత్యవసర ఆమోదం తెలిపిన సందర్భంగా ఎఫ్‌డీఏ కమిషనర్ స్టీఫెన్ హాన్, "అమెరికాలో ప్రతి రోజూ ఎంతో మంది ప్రజలను ఆస్పత్రుల పాలు చేస్తూ, హత మారుస్తున్న అంతర్జాతీయ మహమ్మారిని ఎదుర్కవడంలో ఇది రెండో ముందడుగు" అని అన్నారు.
కరోనావైరస్ నివారణకు మోడెర్నా సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సీన్ సురక్షితమైనదని, 94 శాతం సమర్థంగా పనిచేస్తోందని నిపుణులు కొన్ని రోజుల కిందటే ధ్రువీకరించారు. దాంతో, అమెరికాలో దాన్ని అత్యవసరంగా ఆమోదించేందుకు మార్గం సుగమమైందని వార్తలు వచ్చాయి.
అమెరికాలో ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సీన్ వేయడం ప్రారంభించిన ఒక రోజు తరువాత ఈ మోడెర్నా టీకా కూడా వేయడం ప్రారంభిస్తారు.

ఎఫ్‌డీఏ శాస్త్రవేత్తలు ఈ టీకాకు సంబంధించి ఇచ్చిన 54 పేజీల నివేదికలో దాని సామర్థ్యాన్ని చెప్పడమే కాకుండా భద్రతకు సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి ఆందోళనలూ లేవని, ప్రతికూల ప్రభావాలున్న దాఖలాలూ ఎక్కడా లేవని తేల్చారు.
30 వేల మందిపై చేసిన ప్రయోగాల అనుసారం మోడెర్నా టీకా దక్షత రేటు(ఎఫిషియన్సీ రేట్) 94.1 శాతమని ఆ నివేదిక గుర్తించింది.
ఈ టీకా వల్ల జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయనీ చెప్పారు.
గతవారం ఫైజర్ టీకాకు అనుమతులు ఇవ్వడానికి ముందు కూడా ఎఫ్‌డీఏ ఇలాంటి డాటా విడుదల చేసింది.
కాగా 2010లో స్థాపించిన మోడెర్నా సంస్థకు చెందిన ఏ ఉత్పత్తికీ ఇంతవరకు ఎఫ్‌డీఏ అనుమతులు రాలేదు.
ఈ ఏడాది ఇంతవరకు ఆ కంపెనీ షేర్లు 700 శాతానికి మించి పెరిగాయి.

ఫైజర్ టీకాకు దీనికి తేడా ఏమిటి?
ఫైజర్ టీకాతో పోల్చితే మోడెర్నా టీకా రవాణా సులభం.
- 75 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఫైజర్ టీకాను రవాణా చేయాల్సి ఉండగా మోడెర్నా టీకాను సాధారణ ఫ్రీజర్‌లలో -20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో రవాణా చేయొచ్చు.
ఫైజర్ టీకాలాగే మోడెర్నా టీకాకు కూడా బూస్టర్ డోస్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఫైజర్ టీకా మొదటి డోస్ వేసుకున్న 21 రోజులకు రెండో డోస్ ఇవ్వాల్సి ఉండగా మోడెర్నా టీకా బూస్టర్ డోస్‌కు 28 రోజుల వ్యవధి అవసరం.
కేంబ్రిడ్జ్, మషచూషెట్స్ కేంద్రంగా పనిచేసే మోడెర్నాకు అనుమతులు దొరికితే ఎక్కువ శాతం అక్కడి నుంచే టీకా ఉత్పత్తి చేస్తామని ఆ సంస్థ తెలిపింది.
మరోవైపు ఫైజర్ టీకా జర్మనీ, బెల్జియం సహా అనేక దేశాల్లో తయారవుతుంది.
ఇవి కూడా చదవండి:
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- చంద్రుడిపై ఎర్ర జెండా పాతిన చైనా.. ప్రపంచంలో రెండో దేశం
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- ‘మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని అర్థమైంది’
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








