కరోనావైరస్ చికిత్సకు ప్లాస్మా థెరపీని భారతీయ డాక్టర్లు ఎందుకు అనుమానిస్తున్నారు?

వైరస్‌ నుంచి బైటపడినవారు చాలామంది ప్లాస్మా ఇవ్వడానికి ముందుకు వచ్చారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వైరస్‌ నుంచి బైటపడినవారు చాలామంది ప్లాస్మా ఇవ్వడానికి ముందుకు వచ్చారు
    • రచయిత, వికాస్‌ పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్‌లో చాలామంది డాక్టర్లు ప్లాస్మా థెరపీతో ప్రయోజనంలేదని చెబుతున్నా, ఆ చికిత్స కావాలంటూ సోషల్‌ మీడియాలో చాలామంది అభ్యర్థన చేస్తూనే ఉన్నారు.

కోవిడ్‌ లేదా ఇతర వైరస్‌ల బారినపడ్డ వారిలోని వ్యాధి నిరోధక వ్యవస్థ యాంటీబాడీలను తయారు చేసుకుంటుంది. ఇవి శరీరంలో ప్రవేశించిన వైరస్‌తో పోరాడతాయి. ఉత్పత్తి అయిన యాంటీబాడీలు రక్తంలోని ప్లాస్మాలో చేరతాయి.

కోవిడ్‌-19తో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే వారికి ప్లాస్మా చికిత్స అందించేందుకు చాలా ప్రపంచ దేశాల మాదిరిగానే భారత వైద్యాధికారులు కూడా అనుమతి ఇచ్చారు. ఈ చికిత్సకు పేషెంట్‌, అతని కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరి.

అయితే ఈ థెరపీ ఎంత వరకు పని చేస్తుందన్న దానిపై డాక్టర్లు, పరిశోధకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే దీన్ని మితిమీరి వాడొద్దని ఇండియన్ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ఇటీవలే హెచ్చరించింది.

మరణాలను తగ్గించడంలో, తీవ్ర అస్వస్థత నుంచి బయటపడేయడంలో ఈ చికిత్స ఏమాత్రం ఉపయోగపడటం లేదని ఐసీఎంఆర్‌ తన పరిశోధనలో గుర్తించింది.

ప్లాస్మా థెరపీని భారత ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అనుమతించింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్లాస్మా థెరపీని భారత ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అనుమతించింది.

ఎందుకు నిషేధించ లేదు?

దాదాపు ఇలాంటి ఫలితాలే ప్రపంచవ్యాప్తంగా కూడా కనిపించాయి. అయితే ఐసీఎంఆర్‌ ఈ విధానాన్ని నిషేధించలేదు.

“దీనర్థం ఈ విధానాన్ని మనం నిలిపేయలేము అని’’ అని మేదాంత హాస్పిటల్‌ అధిపతి డాక్టర్‌ నరేశ్‌ త్రేహాన్‌ బీబీసీతో అన్నారు. తొలినాళ్లలో ఈ విధానాన్ని అమలు చేసిన ఆసుపత్రుల్లో మేదాంత ఒకటి.

“మాకు చాలా సానుకూల ఫలితాలొచ్చాయి’’ అన్నారు డాక్టర్‌ త్రేహాన్‌. అయితే ఈ చికిత్సలో టైమింగ్‌ అనేది చాలా కీలకపాత్ర పోషిస్తుందని అంటున్నారు డాక్టర్‌ త్రేహాన్‌.

“జీవకణాల విధ్వంసం (సైటోకీన్‌ స్ట్రామ్‌) రెండు లేదా మూడో దశలో ఉన్నప్పుడు ఈ థెరపీ బాగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆఖరి దశలో దీన్ని చేపట్టడం వల్ల ఉపయోగం ఉండదు’’ అని అన్నారాయన. అందుకే ప్లాస్మా థెరపీపై ఓ నిర్ణయానికి రాలేదని త్రేహాన్‌ అభిప్రాయపడ్డారు.

ముంబయిలోని జస్‌లోక్‌ ఆసుపత్రిలో అంటువ్యాధుల నిపుణుడిగా పనిచేస్తున్న డాక్టర్‌ ఓమ్‌ శ్రీవాస్తవ కూడా దీన్ని అంగీకరించారు. ఐసీఎంఆర్‌ పరిశోధనలో ఆయన పని చేస్తున్న ఆసుపత్రి కూడా పాలు పంచుకుంది.

అయితే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు దీనిపై సానుకూల ఫలితాలను ఇవ్వకపోయినా, తొందరపడి ప్లాస్మా థెరపీని నిషేధించాల్సిన అవసరం లేదని శ్రీవాస్తవ అన్నారు.

“నా పరిశీలన ప్రకారం వైరస్‌ సోకిన బాధితుల పరిస్థితి విషమంగా మారకుండా ఈ థెరపీ చాలావరకు కాపాడింది’’ అన్నారు శ్రీవాస్తవ. అయితే ఆయన కూడా ఈ విధానాన్ని అనుసరించడంలో టైమింగ్‌ చాలా ముఖ్యం అన్నారు.

ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండి, ఐసీయూ, వెంటిలేటర్‌ల మీదున్న పేషెంట్లకు ప్లాస్మా ఇవ్వడం ఎంత వరకు ప్రయోజనం అనే అంశాన్ని ఐసీఎంఆర్‌ ట్రయల్స్‌ పరిశీలించాయి.

అయితే ఏ బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది అన్నది తేల్చడంలో తాను భిన్నమైన మార్గాలను అనుసరించానని శ్రీవాస్తవ చెప్పారు. ప్లాస్మా ఇవ్వకుండా రోగి పరిస్థితి విషమించే వరకు తాను ఎదురు చూడలేదని ఆయన అన్నారు.

ప్లాస్మాలో యాంటీబాడీలుంటాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్లాస్మాలో యాంటీబాడీలుంటాయి.

న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీలు ఏం చేస్తాయి?

అయితే కోవిడ్‌ ఆరంభంలో ఐసీఎంఆర్‌తోపాటు మరే పరిశోధనా కూడా న్యూట్రలైజింగ్‌ యాండిబాడీలపై దృష్టి సారించలేదని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీలు కోవిడ్‌ వైరస్‌ను అంటి పెట్టుకుని, ఇతర కణాలకు పాకకుండా ఆ వైరస్‌ను అడ్డుకుంటూ ఉంటాయి.

కానీ వైరస్‌ నుంచి కోలుకున్న వారందరిలో ఈ న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీలు ఒకే తీరుగా లేవని పరిశీలనలో తేలింది.

ఈ న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీల పని తీరు విశ్వసించదగినట్లుగానే ఉందని ప్లాస్మాలను స్టడీ చేసిన సైంటిస్టులు వెల్లడించారు.

యాంటీబాడీల సమర్థత ఒక్కో పేషెంట్లో ఒక్కోరకంగా ఉన్నట్లు ప్లాస్మా థెరపీ ట్రయల్స్‌లో తేలిందన్నారు డాక్టర్‌ అర్చితా మిశ్రా. ఆమె సింగపూర్‌లోని ఓ ఇమ్యూనాలజీ నెట్‌వర్క్‌లో పరిశోధకురాలిగా పని చేస్తున్నారు.

ఈ పరీక్షలు చాలా ఖరీదైనవని, సమయం కూడా ఎక్కువగానే పడుతుందని డాక్టర్‌ అర్చిత చెప్పారు. అయితే ఈ పరీక్షల ఫలితాల్లో వచ్చిన తేడాలను గమనించాల్సిన అవసరం ఉందన్నారామె. వైరస్‌ బాధితుడి వయసు కూడా కీలకమైన పాత్ర పోషిస్తుందంటారామె.

కరోనా నుంచి బయటపడిన బాధితుల్లో అత్యధిక యాంటీ బాడీలున్నవారిని గుర్తించడంలో వయసు, లింగం, వ్యాధి తీవ్రత కీలకపాత్ర పోషిస్తాయని జాన్స్ హాప్కిన్స్‌ బ్లూమ్‌బర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్ జరిపిన అధ్యయనం తేల్చింది.

ప్లాస్మా థెరపీ ప్రయోజనంపై ప్రపంచవ్యాప్తంగా నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ప్లాస్మా థెరపీ ప్రయోజనంపై ప్రపంచవ్యాప్తంగా నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు

భారత్‌ చేసిన ట్రయల్స్‌లో ఏం తేలింది ?

రక్తంలో ఆక్సిజన్‌ కొరతను ఎదుర్కోవడం, ఆసుపత్రిలో ఎక్కువ రోజులు గడపాల్సిన పరిస్థితిని నివారించడంలో ప్లాస్మా థెరపీ ఉపయోగపడుతుందని ఇటీవల భారత్‌లో జరిగిన ఓ ట్రయల్‌లో తేలింది.

కానీ ప్రపంచవ్యాప్తంగా అనేకమంది వైద్యులు, సైంటిస్టులు ప్లాస్మా థెరపీతో అంతగా ప్రయోజనం లేదనే వాదిస్తున్నారు. ప్లాస్మా చికిత్స చేసిన వారికి, చేయని వారికి పెద్ద తేడా లేదని, మరణాలు సైతం తగ్గలేదని న్యూ ఇంగ్లండ్‌ స్కూల్ ఆఫ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పేర్కొంది. మిగతా అనేక పరిశోధనలు కూడా ఇదే విషయం చెబుతున్నాయి.

వందలమంది కోవిడ్‌ పేషెంట్లకు చికిత్స చేసిన డాక్టర్‌ ఫతాహుద్దీన్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

“మొదట్లో చాలామంది దీనిపై ఆసక్తి చూపించారు. ఎందుకంటే చాలామందికి వైరస్‌, దాని ట్రీట్‌మెంట్‌ గురించి పెద్దగా తెలియదు. ఇందులో రిస్కు చాలా తక్కువ ఉండటంతో చాలామంది ఆశలు పెట్టుకున్నారు’’ అన్నారు ఫతాహుద్దీన్‌. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని, దానితో పెద్దగా ప్రయోజనంలేదని ఆయన అన్నారు.

దిల్లీ ప్రభుత్వం ప్లాస్మా థెరపీని అంగీకరించగా, మితిమీరి వాడొద్దని ఐసీఎంఆర్‌ సూచించింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దిల్లీ ప్రభుత్వం ప్లాస్మా థెరపీని అంగీకరించగా, మితిమీరి వాడొద్దని ఐసీఎంఆర్‌ సూచించింది

తమిళనాడులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీలో పల్మనరీ మెడిసిన్‌ విభాగాధిపతిగా పని చేస్తున్న డాక్టర్‌ క్రిస్టోఫర్‌ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్లాస్మా థెరపీ పని చేస్తుందనడానికి తనకు ఎలాంటి ఆధారాలూ కనిపించలేదని అన్నారు.

ఇన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టే వివిధ దేశాలు ప్లాస్మా థెరపీని పెద్దగా నమ్ముకోవడంలేదని అర్థమవుతోంది. అమెరికాలో కూడా ప్రయోగాత్మకంగానే ఈ థెరపీని కొనసాగించాలని చెప్పారు తప్ప అదే ప్రధాన చికిత్సగా ఎక్కడా పేర్కొనలేదు.

ఏ విధంగా చూసినా, ప్లాస్మా థెరపీ ప్రయోజనకరమని అనిపించడంలేదని, అయితే ఇందులో కొన్ని పరిశీలనాంశాలు ఉన్నాయని, అందువల్లే దాన్ని ఇప్పటికిప్పుడు నిషేధించే పరిస్థితి లేదని ఎపిడెమాలజిస్ట్‌ డాక్టర్‌ చంద్రకాంత్‌ లహారియా వ్యాఖ్యానించారు. ఆధారాలు లేకపోయినా ఈ చికిత్సను అందుకే కొనసాగిస్తున్నారని చంద్రకాంత్‌ అన్నారు. డాక్టర్‌ అర్చితా మిశ్రా కూడా ఈ వ్యాఖ్యలతో ఏకీభవించారు.

దీనివల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమీ లేవు కాబట్టి ప్రయోజనం ఉంటుందేమోనని ఓ ఆశ అన్నారు డాక్టర్‌ మిశ్రా.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)