ఇటలీలో విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులు.. సినిమా థియేటర్లు, జిమ్‌ల మూత -BBC Newsreel

ఫొటో సోర్స్, Reuters
వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో సోమవారం నుంచి సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లను మూసేయాలని ఇటలీ ప్రభుత్వం నిర్ణయించింది.
షాపులపై ఎలాంటి ఆంక్షలు లేకపోగా బార్లు మాత్రం సాయంత్రం 6 గంటల నుంచి మూసేయాల్సి ఉంటుంది.
దేశంలో వైరస్ నిరోధానికి సంబంధించిన ఆంక్షల అమలు విషయంలో సహకరించేందుకు ఇటలీలోని స్థానిక నాయకులకు, ప్రధానమంత్రికి మధ్య అంగీకారం కుదిరింది.
ఆ దేశంలోని నేపుల్స్‌లాంటి కొన్నిప్రాంతాలలో ఇప్పటికీ తీవ్రమైన ఆంక్షలు కొనసాగుతున్నాయి.
అయితే తొలిదశలో మాదిరిగా మళ్లీ దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించే ఉద్దేశంలేదని ఇటలీ ప్రధాని అన్నారు.
తాజాగా ప్రకటించిన విధి విధానాల ప్రకారం సెకండరీ గ్రేడ్ స్థాయి విద్యార్ధులకు ఆన్‌లైన్‌లోనే క్లాసులు తీసుకోవాలని ఇటలీ ప్రభుత్వం ఆదేశించింది.
ఇటలీలో శనివారంనాడు రికార్డు స్థాయిలో 19,600 కేసులు నమోదు కాగా, 151మంది చనిపోయారు.
స్పెయిన్‌లో కర్ఫ్యూ..
మరోవైపు వైరస్‌ను అడ్డుకోవడంలో భాగంగా జాతీయస్థాయిలో ముందు జాగ్రత్త చర్యలకు స్పెయిన్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించేందుకు వీలు కలుగుతుంది.
తొలి దశ వైరస్ వేవ్‌లో ఈ రెండు యూరప్ దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

ఫొటో సోర్స్, Reuters
శాంసంగ్ గ్రూప్ చైర్మన్ 78 ఏళ్ల లీ కున్-హీ మృతి
దక్షిణ కొరియాలోని అతిపెద్ద వ్యాపార సంస్థ అయిన శాంసంగ్ గ్రూప్ చైర్మన్ లీ కున్-హీ 78 ఏళ్ల వయసులో మృతిచెందారు. తండ్రి ప్రారంభించిన చిన్న వ్యాపారాన్ని ఒక ఆర్థిక శక్తిగా మార్చడానికి, షిప్పింగ్, ఇన్సూరెన్స్ లాంటి రంగాల్లో వైవిధ్యం తీసుకురావడానికి లీ కృషి చేశారు.
ఆయన జీవితకాలంలో శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ సంస్థల్లో ఒకటిగా నలిచింది.ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం 21 బిలియన్ డాలర్ల ఆస్తులతో ఆయన దక్షిణ కొరియాలోనే అత్యంత సంపన్నుడుగా నిలిచారు.
లీ ఆదివారం తన కుటుంబ సభ్యుల మధ్య కన్నుమూశారని శాంసంగ్ సంస్థ చెప్పింది. కానీ, ఆయన మరణానికి కారణం ఏంటనేది తెలీడం లేదు. 2014లో లీకి గుండెపోటు వచ్చినప్పటికీ, ఆయన కోలుకున్నారు.
"శాంసంగ్‌లో ఉన్న మేమంతా ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకుంటాం, ఆయనతో కలిసి ఈ ప్రయాణాన్ని పంచుకున్నందుకు రుణపడి ఉంటామ"ని సంస్థ ఒక ప్రకటనలో చెప్పింది.
1938లో శాంసంగ్ గ్రూప్‌ను స్థాపించిన బ్యుంగ్-చల్ మూడో కొడుకు లీ కున్-హీ. 1968లో ఆయన కుటుంబ సంస్థలోకి అడుగుపెట్టారు. 1987లో తండ్రి మరణం తర్వాత సంస్థకు ఛైర్మన్ అయ్యారు. అప్పట్లో, శాంసంగ్‌ను చౌక, నాసిరకం వస్తువుల ఉత్పత్తిదారుగా చూసేవారు. కానీ లీ నాయకత్వంలో సంస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.
"మన భార్యలు, పిల్లలను తప్ప అన్నిటినీ మార్చేద్దాం" అని 1993లో లీ తన ఉద్యోగులతో అన్న మాటలు చాలా ప్రాచుర్యం పొందాయి. తర్వాత సంస్థ తాము ఉత్పత్తి చేసిన లక్షా 50 వేల పాత మొబైల్ ఫోన్లను తగలబెట్టింది.
మీడియాతో లీ అరుదుగా మాట్లాడేవారు. ఆయన ఏకాంతంగా ఉంటారని చెప్పుకుంటారు. అందుకే ఆయనకు ది హెర్మిట్ కింగ్(సన్యాసి రాజు) అని పిలుచుకుంటారు. దక్షిణ కొరియాలో పెద్ద కుటుంబం యాజమాన్యంలో నడిచే సంస్థల్లో శాంసంగ్ అతిపెద్దది. దేశ ఆర్థిక వ్యవస్థలో ఇది ఆధిపత్యం చెలాయిస్తోంది.
పన్నుల ఎగవేతకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయన 2008లో శాంసంగ్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. పన్నులు కట్టలేదని ప్రభుత్వం ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. కానీ, 2009లో ఆయనకు అధ్యక్షుడి క్షమాబిక్ష లభించింది. 2010లో ఆయన మళ్లీ శాంసంగ్ చైర్మన్ అయ్యారు.

ఫొటో సోర్స్, Reuters
నాసా: కోట్ల మైళ్ల దూరంలోని ఆస్టరాయిడ్ నుంచి సేకరించిన నమూనాలు చేజారే ప్రమాదం
భూమినుంచీ కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెన్ను అనే గ్రహశకలం (ఆస్టరాయిడ్)నుంచీ రాళ్లనూ, మట్టినీ సేకరించడానికి ఒసైరిస్-రెక్స్ అనే శాటిలైట్‌ను నాసా పంపించింది.
ఈ వారం మొదట్లో బెన్ను మీద విజయవంతంగా దిగిన ఒసైరిస్-రెక్స్ కావలసినదానికన్నా ఎక్కువ రాళ్లను సేకరించడంతో నమూనాలు బయటకి చొచ్చుకొస్తున్నాయి.
రాళ్ల సేకరణ అనుకున్నదానికన్నా ఎక్కువగా సాగిందని ఈ పరిశోధక అంతరిక్ష నౌకను పంపిన అధికారులు అంటున్నారు.
ఒసైరిస్-రెక్స్ భూమికి పంపించిన చిత్రాల్లో..ఒక కంటైనర్ తలుపు కొంచెం తెరిచి ఉన్నట్లుగానూ, అందులోంచి సేకరించిన నమూనాలలో కొంతభాగం బయటకు వచ్చేస్తున్నట్లుగానూ కనిపిస్తోందని నాసా చెబుతోంది.
ప్రస్తుతం సేకరించిన రాళ్లను జాగ్రత్తగా పోగు చెయ్యడానికి నాసా ప్రయత్నిస్తోంది.
"సేకరించిన ద్రవ్యరాశిలో గణనీయమైన భాగం బయటకు వచ్చేసినట్లు కనిపిస్తోంది" అని ఈ మిషన్ అధ్యక్షులు డాంటే లారెట్టా తెలిపారు.
ఈ స్పేస్‌క్రాఫ్ట్ సుమారు 400 గ్రాముల శకలాలను సేకరించిందని ఆయన తెలిపారు.
ఈ మిషన్ విజయవంతమైందనే చెప్పొచ్చు కానీ, సేకరించిన శకలాలు బయటకి లీక్ అయిపోవడం కొంత ఆందోళన కలిగిస్తోందని" లారెట్టా అన్నారు.
అయితే, నమూనాలను సేకరించిన కంటైనర్‌ను జాగ్రత్తగా స్పేస్‌క్రాఫ్ట్ లోపల అమర్చడానికి నాసా ప్రయత్నిస్తోంది.
"వీలైనంత వేగంగా నమూనాలను పొందుపరచడానికి ప్రయత్నిస్తున్నామని, సేకరించినవాటిని కోల్పోకుండా జాగ్రత్తగా వెనక్కి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని" నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ సైన్స్ థామస్ జర్బకెన్ విలేకర్లకు తెలిపారు.
"ఈ గ్రహశకలంనుంచీ సేకరించిన నమూనాలను పరిశీలించడానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాం. వీటి ద్వారా సైన్‌కు సంబంధించిన ఎన్నో కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంది" అని జర్బకెన్ తెలిపారు.
భూమికి సుమారు 32 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెన్నుపై ఈ మంగళవారంనాడు ఒసైరిస్-రెక్స్ దిగింది.
450 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన సౌర కుటుంబం శిథిలాలు బెన్ను గ్రహశకలంపై ఉన్నాయి. దీన్నుంచి సేకరించిన నమూనాలు సౌర కుటుంబం పుట్టుపూర్వోత్తరాల గురించి మరిన్ని వివరాల తెలియజెయ్యగలవని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.
ఒసైరిస్-రెక్స్ 2023లో భూమికి తిరిగి రానుంది. 2016లో ఈ మిషన్‌ను ప్రారంభించారు. వచ్చే ఏడాది మార్చ్‌లో ఈ శాటిలైట్ భూమికి తిరుగుప్రయాణం కడుతుంది.

ఫొటో సోర్స్, Reuters
అఫ్గానిస్తాన్: విద్యాసంస్థపై ఆత్మాహుతి దాడి, 18 మంది మృతి
అఫ్గానిస్తాన్‌లో ఒక విద్యాసంస్థ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో 18 మంది చనిపోయారు. ఉన్నత విద్యా కోర్సులు బోధించే ఒక ప్రైవేటు విద్యా సంస్థ బయట ఈ దాడి జరిగింది
షియా ముస్లింలు ఎక్కువగా ఉండే దష్త్-ఎ-బార్చీ ప్రాంతంలో ఉన్న ఈ భవనంలో సాధారణంగా వందల మంది ఉంటారు. గాయపడ్డ చాలా మందిని ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని భావిస్తున్నారు.
ఈ దాడికి తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ సోషల్ మీడియాలో ఒక సందేశం పోస్ట్ చేసింది. కానీ, ఎలాంటి ఆధారాలూ బయటపెట్టలేదు.
అంతకు ముందు తాలిబాన్లు ఈ దాడి తమ పని కాదని ప్రకటించారు.
"ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు భవనం లోపలికి వెళ్లడానికి ప్రయత్నించాడు సెక్యూరిటీ సిబ్బంది అతడిని గుర్తించడంతో అతడు గేటు దగ్గరే తనను తాను పేల్చుకున్నాడ"ని హోం శాఖ ప్రతినిధి తారీక్ ఎరియన్ ఒక ప్రకటన జారీ చేశారు.
'మృతుల్లో ఎక్కువగా విద్యార్థులు ఉన్నారు. వారంతా భవనంలోకి వెళ్లడానికి బయట వేచిచూస్తున్నారు. భారీ పేలుడు జరిగినప్పుడు, నేను ఆ ప్రాంతానికి దాదాపు వంద మీటర్ల దూరంలో ఉన్నాను" అని స్థానికుడు అలీ రెజా వార్తా ఏజెన్సీ ఏఎఫ్‌పీకి చెప్పారు.
గత కొన్ని వారాలుగా అఫ్గానిస్తాన్‌లో హింస పెరిగింది. వీటిలో ఎక్కువ దాడులు తాలిబన్లు చేశారు.
కతార్ రాజధాని దోహాలో అఫ్గానిస్తాన్ ప్రభుత్వం-తాలిబన్ల మధ్య శాంతి చర్చలు నడుస్తున్నాయి. వీటిపై ఈ హింస ప్రభావం పడే అవకాశం ఉంది.
అఫ్గానిస్తాన్‌లోని షియాలను తీవ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. విద్యా సంస్థలు లక్ష్యంగా వారు దాడి చేయడం ఇది మొదటిసారి కాదు.
2018 ఆగస్టులో ఒక విద్యా సంస్థపై జరిగిన దాడిలో 48 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులే. అప్పుడు కూడా ఈ దాడి తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ చెప్పింది.
ఈ ఏడాది మేలో ఒక ప్రసూతి కేంద్రంపై జరిగిన దాడిలో 24 మంది మహిళలు, పిల్లలు చనిపోయారు.
ఇదే వారంలో ఒక మతపరమైన అంశాలు బోధించే ఒక పాఠశాలపై కూడా వైమానిక దాడి జరిగింది. లోపల ఉన్న 11 మంది పిల్లలు, ఒక బోధకుడు చనిపోయాడు.
అయితే, అఫ్గానిస్తాన్ ప్రభుత్వం ఈ దాడి తాలిబాన్ తీవ్రవాదులు లక్ష్యంగా జరిగిందని చెబుతోంది.
ఇవి కూడా చదవండి:
- భారత్-నేపాల్ వివాదం: నేపాల్ ప్రధానితో రా చీఫ్ రహస్య భేటీ, ఆ దేశ అధికార పార్టీకి షాక్
- పాకిస్తాన్లో వంట గ్యాస్ అయిపోతుందా... డిమాండ్ పెరుగుతోంది, సరఫరా తగ్గుతోంది.. ఇప్పుడెలా?
- మాన్సాస్ ట్రస్టు: విజయనగర గజపతి రాజుల వ్యవహారాలు ఇప్పుడు ఎందుకు రచ్చకెక్కుతున్నాయి?
- 'జాతీయ ప్రతిజ్ఞ'ను స్కూలు పిల్లలు చదువుతున్నారని ఆ రచయితకు 25 ఏళ్ళ తరువాత తెలిసింది
- మహాత్మాగాంధీతో బెజవాడ నాస్తిక కేంద్రానికి ఉన్న బంధం ఏంటి?
- కంటెయినర్ల నుంచి సెల్ఫోన్లు దోచుకుని బంగ్లాదేశ్‌లో విక్రయిస్తున్న గ్యాంగ్‌ను పట్టుకున్న ఏపీ పోలీసులు
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఏంటి? వీటికి పరిష్కారాలు ఏంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









