శ్రీలంక: సునామీ వచ్చినప్పుడు తప్పిపోయిన బిడ్డ కోసం ఇద్దరు తల్లుల పోరాటం

హమాలియా, సియాన్
ఫొటో క్యాప్షన్, హమాలియా, సియాన్
    • రచయిత, యూఎల్ మంబ్రూక్
    • హోదా, బీబీసీ కోసం

దాదాపు పదేళ్ల కిందట తప్పిపోయిన తన కొడుకు తిరిగి వచ్చాడంటూ ఆనందంతో హమాలియా తబ్బిబ్బవుతున్నారు. ఆమెది శ్రీలంకలోని మాలిగాయిక్కాడు ప్రాంతంలోని అంబరాయి జిల్లా.

హమాలియా తన కొడుకుగా చెబుతున్న మహమ్మద్ అక్రమ్ రిస్కాన్‌కు ఇప్పుడు 21 ఏళ్లు. 2004లో సునామీ వచ్చినప్పుడు ఆయన తప్పిపోయారు.

ఇప్పుడు ఆయన తిరిగి తన కన్నవారికి వద్దకు చేరాడన్న కథ స్థానిక మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయమైంది.

కాల్మునైలోని ఆష్రఫ్ మెమోరియల్ ఆసుపత్రిలో హమాలియా పనిచేస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత తిరిగివచ్చిన ఆమె కొడుకును చూసేందుకు బంధువులు, ఇరుగుపొరుగువారు చాలా మంది వస్తున్నారు.

అక్రమ్ రిస్కాన్ 1999లో పుట్టాడని హమాలియా చెప్పారు.

అక్రమ్ తిరిగి కన్నవారి వద్దకు చేరిన వార్త టీవీల్లో చూసి... సునామీ సమయంలో తప్పిపోయిన చాలా మంది పిల్లల కోసం వాళ్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలు, వివరాలు పెడుతున్నారు.

‘‘సునామీ వచ్చినప్పుడు నేను పని చేస్తూ ఉన్నా. ఇంటి వద్ద లేను. అప్పటికి నా కొడుకుకు ఐదేళ్లు. నేను పనికి వెళ్లినప్పుడు మా అమ్మ వద్ద వాడిని ఉంచేదాన్ని. అయితే, ఆ విపత్తు సమయంలో వాడు తప్పిపోయాడు’’ అని బీబీసీతో చెప్పారు హమాలియా.

‘‘వాడి కోసం చాలా చోట్ల వెతికా. సునామీ వచ్చిన తర్వాత నాలుగో రోజుకు ఓ ఆసుపత్రిలో ఉన్నాడని తెలిసింది. అక్కడికి వెళ్లి చూస్తే, లేడు. కానీ, నేను వెతకడం ఆపలేదు’’ అని ఆమె అన్నారు.

హమాలియాకు రిస్కాన్ ఒక్కడే సంతానం.

రిస్కాన్ పుట్టిన నాలుగు నెలలకే తన భర్త తనను వదిలివెళ్లిపోయారని హమాలియా చెప్పారు.

‘‘2016లో అంబరాయిలోని ఓ ఇంట్లో నా కొడుకు పెరుగుతున్నాడని ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న మహిళ చెప్పారు. అప్పుడు నేను వెళ్లి ఆ కుటుంబంతో మాట్లాడాను. రిస్కాన్ నా కొడుకేనని చెప్పాను. కానీ, వాళ్లు ఒప్పుకోలేదు. కొందరు మిత్రుల ద్వారా ఈ మధ్యే నా కొడుకు ఫోన్ నెంబర్ సంపాదించా. వాడితో మాట్లాడా. ఉద్యోగం కోసం కొలంబోలో ఉన్నట్లు చెప్పాడు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడు’’ అని హమాలియా చెప్పారు.

రిస్కాన్ తన కొడుకేనని కచ్చితంగా నిర్ధారించే పత్రాలేవీ హమాలియా చూపలేకపోయారు. ఓ పాత ఫొటోను చూపించి, అందులో ఉన్నది రిస్కానేనని ఆమె చెప్పారు.

హమాలియా
ఫొటో క్యాప్షన్, హమాలియా

రిస్కాన్‌తోనూ బీబీసీ మాట్లాడింది. అంబరాయిలోని తన ఇంటి వివరాలను ఆయన చెప్పారు.

తన కొడుకు పేరు అక్రమ్ రిస్కాన్ అని హమాలియా అంటున్నారు. అయితే, ఆయన మాత్రం తన పేరు మహమ్మద్ సియాన్ అని చెబుతున్నారు. హమాలియాతో ముడిపడిన చిన్ననాటి విషయాలేవీ తనకు గుర్తుకులేవని అన్నారు.

హమాలియా తనకు చెప్పిన విషయాలన్నీ తాను నమ్మానని, అందుకే ఆమె దగ్గరికి వచ్చానని చెప్పారు.

తప్పిపోయిన తన కొడుకు వేరే కుటుంబంతో ఉంటున్నాడని, అతడిని తిరిగి తనకు అప్పగించాలని సమ్మంతురాయి పోలీస్ స్టేషన్‌లో తాను ఇదివరకు ఫిర్యాదు చేసినట్లు హమాలియా చెప్పారు.

అధ్యక్ష కార్యాలయానికి, మానవహక్కుల కమిషన్‌కు కూడా తాను ఫిర్యాదులు చేశానని, కానీ వాటికి స్పందన లేకుండా పోయిందని ఆమె అన్నారు.

ఈ మొత్తం ఉదంతానికి సంబంధించి మీడియా సంస్థలన్నీ హమాలియా చెప్పిన విషయాల గురించే వార్తలు రాశాయి. అంబరాయిలో ఉన్న కుటుంబం గురించి ఎవరూ చూపలేదు. అయితే, బీబీసీ వారితో మాట్లాడింది.

హమాలియా తన కొడుకుగా చెబుతున్న సియాన్... నూరుల్ ఇన్షాన్ వద్ద పెరిగాడు. నూరుల్‌కు ఇప్పుడు 42 ఏళ్లు.

మహమ్మద్ సియాన్ తన సొంత కొడుకు అని, ఉద్యోగం కోసం కొలంబో వెళ్లాడని ఆమె బీబీసీతో అన్నారు. ప్రస్తుత పరిస్థితిని వివరించినప్పుడు, ఆమె షాక్ తిన్నారు.

‘‘హమాలియా అనే మహిళ చాలా సార్లు తన కొడుకును వెతక్కుంటూ ఇక్కడికి వచ్చారు. ఆ సమయంలో నేను విదేశాల్లో మెయిడ్‌గా పనిచేస్తున్నా. హమాలియా పొరపాటుపడుతున్నారని మా అమ్మ ఆమెకు నచ్చజెప్పారు. ఆమె ఒప్పుకోలేదు. పదే పదే వస్తూ ఇబ్బందిపెట్టారు’’ అని చెప్పారు నూరుల్.

సియాన్ 2001 ఏప్రిల్ 19న అంబరాయ్ ఆసుపత్రిలో పుట్టాడని ఆమె వివరించారు. తాను ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరిన పత్రం, సియాన్ గ్రోథ్ రిజిస్టర్, అతడి చిన్నప్పటి ఫొటోలు కూడా ఆమె చూపించారు.

‘‘నా కుమార్తెకు సియాన్ ఒక్కడే కొడుకు. గర్భంతో ఉన్నప్పుడే ఆమెను భర్త వదిలివెళ్లిపోయాడు. సియాన్ పుట్టినప్పుడు ఆసుపత్రిలో ఆమెకు తోడుగా నేను ఉన్నా’’ అని నూరుల్ తల్లి చెప్పారు.

నూరుల్ ఇన్షాన్
ఫొటో క్యాప్షన్, నూరుల్ ఇన్షాన్

సియాన్ అంబరాయిలోని సత్తాతిస్సా స్కూల్‌లో మూడు నెలల పాటు చదువుకున్నాడు.

ఆ తర్వాత నూరుల్ హంబాంతోట్టంకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నారు. అప్పుడు అంబరాయి నుంచి హంబాంతోట్టంకు వారు వెళ్లిపోయారు. సియాన్ అక్కడే ఐదో తరగతి వరకూ చదువుకున్నాడు.

ఆ తర్వాత నూరుల్ అంబరాయికి తిరిగివచ్చారు. సియాన్ ఐదు నుంచి పదో తరగతి వరకూ ఇక్కడే చదివారు.

ఈ విషయాలన్నీ నూరులే చెప్పారు.

అయితే, రిస్కాన్ నూరుల్ సొంత కొడుకు కాదని, తన కొడుకు అని హమాలియా అంటున్నారు.

మరోవైపు నూరుల్ కూడా అతడు తన సొంత కొడుకు అని వాదిస్తున్నారు. తన కొడుకును తిరిగి తనకు అప్పగించాలని సమ్మంతురై పోలీస్ స్టేషన్‌లో ఇటీవల నూరుల్ ఫిర్యాదు చేశారు.

ఈ వ్యవహారం సునామీ తర్వాత ఇదివరకు శ్రీలంకలో జరిగిన ఓ విచిత్ర ఘటనను గుర్తుకు తెచ్చింది. అప్పుడు కాల్మునైలోని ఓ ఆసుపత్రిలో ఉన్న రెండు నెలల పాప... తమదంటే తమదంటూ తొమ్మిది మంది మహిళలు ముందుకువచ్చారు.

కోర్టు అప్పుడు డీఎన్ఏ పరీక్షలకు ఆదేశించింది. ఆ తర్వాత ఆ పాపను అసలైన తల్లిదండ్రులకు అప్పగించారు.

నూరుల్, హమాలియాల మధ్య వివాదాన్ని కూడా ఇప్పుడు కోర్టు విచారిస్తోంది. ఈ వ్యవహారంలోనూ అదే రీతిలో పరిష్కారం చూపించే అవకాశాలున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)