రియా చక్రవర్తి సోదరుడిని అరెస్ట్ చేసిన ఎన్‌సీబీ - BBC Newsreel

ఫొటో సోర్స్, SARANG GUPTA/HINDUSTAN TIMES/SUJIT JAISWAL/AFP
నటి రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటి మేనేజర్ సామ్యూల్ మిరాండాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో శుక్రవారం అరెస్ట్ చేసినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
గత జూన్ నెలలో చనిపోయిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుకు సంబంధించి.. మాదకద్రవ్యాల వినియోగం ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌సీబీ శుక్రవారం వారిని ప్రశ్నించింది.
అంతకుముందు శుక్రవారం ఉదయం షోవిక్ చక్రవర్తి, సామ్యూల్ మిరాండాల నివాసాల్లో ఎన్‌సీబీ సోదాలు నిర్వహించింది. షోవిక్ చక్రవర్తి, రియా చక్రవర్తి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు.
అధికారుల బృందాల్లో మహిళా అధికారులు మాస్కులు, గ్లవ్స్ ధరించి ఈ సోదాల్లో పాల్గొన్నారని.. అనంతరం వారిని ఎన్‌సీబీ కార్యాలయానికి తీసుకెళ్లి ప్రశ్నించారని ఎన్‌డీటీవీ ఒక కథనంలో తెలిపింది.

ఫొటో సోర్స్, IAF
శ్రీలంక తీరంలో మంటల్లో ఆయిల్ టాంకర్.. భారత సేనల సాయం
శ్రీలంక తీరంలో ఒక భారీ చమురు రవాణా నౌక మంటల్లో చిక్కుకుంది. దానిలోని చమురు హిందూ మహాసముద్రంలోకి భారీగా ఒలికిపోతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆనౌకను తీర ప్రాంతం నుంచి దూరంగా సముద్రం మీదకు లాక్కెళుతున్నారు.
పనామా రిజిస్ట్రేషన్ ఉన్న ఈ నౌక గురువారం మంటల్లో చిక్కుకున్నప్పుడు 2 లక్షల 70 వేల టన్నుల ముడి చమురు తీసుకెళ్తోంది.
శ్రీలంక నావికా దళంతో పాటు.. భారత కోస్ట్ గార్డు కూడా రంగంలోకి దిగి వాటర్ కనాన్లు, హెలికాప్టర్ల ద్వారా ఈ మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.
మంటల్లో చిక్కుకున్న నౌక ఇంజన్ రూమ్‌లో పేలుడు జరగడంతో సిబ్బందిలోని ఒక ఫిలిప్పీన్ దేశస్థుడు చనిపోయాడని శ్రీలంక నావికా దళం చెప్పింది.
సిబ్బందిలో మిగతా 22 మందిని నౌక నుంచి తప్పించారు. వీరిలో ఐదుగురు గ్రీస్, 17 మంది ఫిలిప్పీన్ దేశస్థులు ఉన్నట్లు అధికారులు చెప్పారు.

ఫొటో సోర్స్, IAF
'న్యూ డైమండ్' అనే ఈ 330 మీటర్ల నౌకను లిబియాలోని ఒక కంపెనీకి చెందింది.
"ప్రస్తుతానికి చమురు సముద్రంలో కలిసే ప్రమాదమేమీ లేదు, ఒకవేళ అదే జరిగితే మాకు కచ్చితంగా అంతర్జాతీయ సాయం అవసరం అవుతుంది" అని శ్రీలంక నావికాదళం ప్రతినిధి శుక్రవారం చెప్పారు.
నీళ్లలో ఉన్న నౌకకు 10 మీటర్ల పైన 2 మీటర్ల పొడవైన పగులును కూడా భారత కోస్ట్ గార్డ్ గుర్తించిందని శ్రీలంక నానికాదళం చెప్పింది.
"ఈ నౌక నుంచి చమురు సముద్రంలో ఒలికితే అది ఈ ప్రాంతానికే కాదు, ప్రపంచంలోని అతిపెద్ద పర్యావరణ విపత్తుల్లో ఒకటి మారుతుంది" అని శ్రీలంక మెరైన్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ అథారిటీ(ఎంఈపీఏ) అధ్యక్షుడు ధర్శానీ లహందపుర హెచ్చరించారు.
నౌక యజమానులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ఎంఈపీఏ చెప్పింది.

ఫొటో సోర్స్, Reuters
అమెరికాలోని పోర్ట్‌లాండ్‌లో నిరసన ప్రదర్శనల సమయంలో ఒక మితవాద కార్యకర్తను కాల్చిచంపిన కేసులో అనుమానితుడు పోలీసులు కాల్పుల్లో చనిపోయాడు.
మైకేల్ రైనో (48)ను అరెస్ట్ చేసే సమయంలో అతడి నుంచి తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని భావించి కాల్పులు జరిపినట్లు పోలీసులు చెప్పారు.
గత వారాంతంలో జరిగిన ఘర్షణ సమయంలో అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మద్దతుదారుడిని చంపిన కేసులో మైకేల్ రైనో నిందితుడు.
పేట్రియాట్ ప్రేయర్ గ్రూప్ మద్దతుదారుడు ఆరాన్ డానియెల్సన్‌ను తన ఆత్మరక్షణ కోసమే కాల్చిచంపానని ఇంతకుముందు రైనో చెప్పాడు.
మే నెలలో జార్జ్ ఫ్లాయిడ్ చనిపోయినప్పటి నుంచి పోర్ట్ లాండ్‌లో రాత్రిపూట 'బ్లాక్ లైవ్ మాటర్' నిరనస ప్రదర్శనలు జరుగుతున్నాయి.
గత శనివారం భారీ ర్యాలీ నిర్వహిస్తున్న ట్రంప్ మద్దతుదారులు, వివక్షకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్న ఆందోళనకారులకు మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది.
తనను, తన స్నేహితుడిని డానియెల్సన్ పొడుస్తాడని భయపడ్డామని, అందుకే అతడిని కాల్చిచంపామ"ని నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న రైనో గతంలో వైస్ న్యూస్‌తో చెప్పాడు.
గురువారం ట్రంప్ కూడా డానియెల్సన్ హత్యను తన ట్వీట్‌లో ప్రముఖంగా ప్రస్తావించారు. "పోర్ట్‌లాండ్ పోలీసులు హంతకుడిని ఎందుకు పట్టుకోవడం లేదు, త్వరగా పట్టుకోండి" అని ఆదేశించారు.
రైనో అరెస్ట్ కోసం వారంట్ కూడా జారీ అయ్యింది. వాషింగ్టన్‌కు దాదాపు 193 కిలోమీటర్ల దూరంలో నార్త్ పోర్ట్‌లాండ్‌లోని లేసీలో అతడు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
అరెస్ట్ చేసేందుకు వెళ్లినపుడు అతడి దగ్గర ఆయుధం ఉందని, అధికారులతో ఘర్షణకు దిగడంతో కాల్చిచంపామని పోలీసులు చెప్పారు.
"అతడి దగ్గర ఆయుధం ఉందనే విషయం తెలిసింది. తను పారిపోతున్న సమయంలో వాహనంపై కాల్పులు జరిపాం. మొత్తం నలుగురు అధికారులు తమ ఆయుధాలతో కాల్పులు జరిపారు" అని ఓ అధికారి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
సిక్కుల ఊచకోత కేసు: సజ్జన్ కుమార్‌కు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు
1984లో జరిగిన సిక్కుల ఊచకోత కేసులో సీనియర్ కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్‌కు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే నేతృత్వంలోని బెంచ్ సజ్జన్ కుమార్‌కు బెయిల్ ఇవ్వకూడదని నిర్ణయించింది.
కోర్టు గదిలో ఈ కేసు విచారణ ప్రారంభమైన తర్వాత అపీల్ చేసుకోవచ్చని బెంచ్ సూచించింది.
సజ్జన్ కుమార్ మెడికల్ రిపోర్ట్ ప్రకారం ఆయన్ను ఆస్పత్రిలో ఉంచాల్సిన అవసరం లేదని కూడా కోర్టు చెప్పింది.
అనారోగ్య కారణాలతో సజ్జన్ కుమార్‌కు తక్షణం తాత్కాలిక బెయిల్ ఇవ్వాలని ఆయన లాయర్ వికాస్ సింగ్ కోర్టును కోరినట్లు బీబీసీ హిందీ సహచర జర్నలిస్ట్ సుచిత్ర మొహంతి చెప్పారు.
74 ఏళ్ల సజ్జన్ కుమార్ 2018 డిసెంబర్ నుంచి జైల్లో ఉన్నారని, ఆ సమయంలో ఆయన 8 కిలోలు బరువు తగ్గారని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు.
1984లో సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్ల సమయంలో రాజ్‌నగర్‌లోని ఒకే కుటుంబంలోని ఐదుగురు సభ్యులను క్రూరంగా హత్య చేశారు. ఈ కేసులో సజ్జన్ కుమార్ ప్రధాన నిందితుడు.
2018 డిసెంబర్ 17న ఈ కేసులో ఆయనను దోషిగా ఖరారు చేసిన దిల్లీలోని ఒక కోర్టు సజ్జన్ కుమార్‌కు జీవిత ఖైదు విధించింది.

ఫొటో సోర్స్, AFP/Getty Images
లాక్‌డౌన్ తర్వాత షూటింగ్ మొదలైన కొన్ని రోజులకో బ్యాట్‌మన్ సినిమా షూటింగ్ మళ్లీ ఆగిపోయింది.
ప్రముఖ నటుడు రాబర్ట్ పాటిన్‌సన్‌కు కరోనావైరస్ సోకడంతో షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయినట్లు అమెరికన్ మీడియా వెల్లడించింది.
ప్రొడక్షన్ టీమ్‌లో ఒకరు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు వార్నర్ బ్రదర్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే ఆ వ్యక్తి పేరును మాత్రం వెల్లడించలేదు.
గ్లాస్గోలో ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ప్రారంభంలో మొదలైంది. అయితే లాక్‌డౌన్ నడుమ ఇది వాయిదా పడింది.
2021 జూన్ ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే లాక్‌డౌన్ నడుమ దీన్ని అక్టోబరు 2021కి వాయిదా వేశారు.
గతంలో క్రిస్టియన్ బాలే, బెన్ అఫ్లెక్, జార్జి క్లూనీ వంటి నటులు గతంలో బ్యాట్‌మన్ పాత్రల్లో నటించి, అలరించారు.
ట్విలైట్ సినిమాతో పేరుతెచ్చుకుని, తాజాగా టెనెట్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రాబర్ట్ పాటిన్‌సన్ సరికొత్త బ్యాట్‌మన్ పాత్రలో నటిస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
పశ్చిమ జర్మనీలోని సోలింగన్ నగరంలోని ఓ పెద్ద హౌసింగ్ బ్లాక్‌లో ఐదుగురు పిల్లల మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
27ఏళ్ల వయసున్న వీరి తల్లే వీరిని హతమార్చి, సమీపంలోని డుసెల్‌డార్ఫ్ రైల్వే స్టేషన్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు భావిస్తున్నారు.
పిల్లలు ఎలా చనిపోయారో ఇంకా తెలియలేదని పోలీసులు వివరించారు. పిల్లల వయసు ఒకటి నుంచి ఎనిమిది వరకు ఉంది. వీరిలో ముగ్గురు పాపలు, ఇద్దరు బాబులు ఉన్నారు. 11ఏళ్ల మూడో కుమారుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.
వీరి అమ్మమ్మ ఫోన్‌కాల్‌పై పోలీసులు అప్రమత్తం అయినట్లు జర్మనీ న్యూస్ వెబ్‌సైట్ బిల్డ్ పేర్కొంది.
వేగంగా వెళ్తున్న రైలు మీదకు దూకేయడంతో పిల్లల తల్లి తీవ్రంగా గాయపడినట్లు పోలీసుల అధికార ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
- చైనా యాప్స్‌ను భారత్ బ్యాన్ చేసింది... తరువాత ఏంటి?
- చైనా యాప్స్ బ్యాన్‌తో అయోమయంలో పడిన టిక్‌టాక్ స్టార్ భవితవ్యం
- చైనా యాప్స్‌పై భారతీయుల ఆగ్రహం - ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
- ’టెస్ట్ చేయకుండానే కోవిడ్ వార్డులో పెట్టారు... మా అమ్మా, నాన్న మరణంపై విచారణ జరిపించాలి’
- ‘కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.. బలవంతంగా గుండు గీయించారు’
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్‌లా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








