అసదుద్దీన్ ఒవైసీ: 'నేను బతికున్నా, లేకున్నా హిజాబ్ ధరించిన మహిళ ఏదో ఒక రోజు దేశ ప్రధాని అవుతుంది' -ప్రెస్ రివ్యూ

అసదుద్దీన్ ఒవైసీ

ఫొటో సోర్స్, SHASHI.K

హిజాబ్ ధరించిన మహిళ ఏదో ఒక రోజు దేశ ప్రధానమంత్రి అవుతుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చెప్పారని ఈనాడు దిన పత్రిక వార్త ప్రచురించింది.

కర్ణాటకలో హిజాబ్ ధరించిన విద్యార్థినులను విద్యాసంస్థల్లోకి అనుమతించకపోవడంపై మండిపడుతూ ఒవైసీ తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.

హిజాబ్ ధరించిన మహిళలు తప్పకుండా కళాశాలలకు వెళ్లి కలెక్టర్లు, మేజిస్ట్రేట్లు, వైద్యులు, వ్యాపారవేత్తలు అవుతారని ఆయన పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

తాను బతికి ఉన్నా లేకున్నా ఏదో ఒకరోజు హిజాబ్ ధరించిన మహిళ దేశ ప్రధాని అవుతుందని, ఆ విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని అసదుద్దీన్ తెలిపారని ఈనాడు రాసింది.

మోహన్ బాబు

ఫొటో సోర్స్, Mohan Babu M/twitter

నా ఆత్మకథలో అన్నీ నిజాలే ఉంటాయి-మోహన్ బాబు

తను హీరోగా నటిస్తున్న 'సన్నాఫ్‌ ఇండియా' సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడిన సినీ నటుడు మోహన్ బాబు తన ఆత్మకథలో అన్నీ నిజాలే రాస్తున్నానని చెప్పారని ఆంధ్రజ్యోతి దిన పత్రిక కథనం ప్రచురించింది.

సన్నాఫ్ ఇండియా ఓటీటీ కోసం తీసిన సినిమా. కొన్ని ముద్దు సీన్లు కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం.

ఓ మంచి సినిమా చూశామన్న సంతృప్తి ప్రేక్షకుడికి కలుగుతుంది. ఇలాంటి కథ ఈ మధ్య కాలంలో చేయలేదు. 'పుణ్యభూమి నాదేశం', 'ఎం.ధర్మరాజు ఎం.ఏ' లాంటి చిత్రాల్లో నా పాత్రలు గుర్తుండిపోయాయి. 'సన్నాఫ్‌ ఇండియా' కూడా అంతే.

విలన్‌ పాత్రల్లో రకరకాల మేనరిజాలను చేసిన నటుడ్ని. ఇప్పటికీ విలన్‌గా నటించాలని వుంది. ఓ పెద్ద హీరో సినిమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఈమధ్య వార్తలొచ్చాయి. అవన్నీ గాసిప్పులే. విలన్‌గా నటించాలంటే.. ఇప్పుడు కొంచెం ఇబ్బంది. నేను హీరోని కొట్టడం, హీరో నన్ను కొట్టడం.. ఇలాంటి సీన్లు ఇప్పుడు చేయలేను అని ఆయన అన్నారని పత్రిక చెప్పింది.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను. ఆ ఉద్దేశ్యం లేదు. చంద్రబాబు నాయుడు మా బంధువు. అందుకే అప్పట్లో టీడీపీ కోసం ప్రచారం చేశాను. జగన్‌ కూడా నా బంధువే. అందుకే వైకాపా తరపున కూడా ప్రచారం చేశాను. ఇటీవల ఏపీ మంత్రి పేర్ని నాని మా ఇంటికి వచ్చారు. తను నా స్నేహితుడు. ఓ పెళ్లిలో కలిశాం. 'బ్రేక్‌ఫాస్ట్‌ చేద్దాం.. ఇంటికి రండి' అని ఆహ్వానించా. ఆయన వచ్చాడు. మేం వ్యక్తిగత విషయాలు మాట్లాడుకున్నాం తప్ప, రాజకీయాల గురించి కాదు. ఆ మాత్రం దానికే.. జనాలు రకరకాలుగా అనుకోవడం భావ్యం కాదు.

నా ఆత్మ కథని పుస్తకంగా రాస్తున్నా. అందులో అన్నీ నిజాలే ఉంటాయి. తిరుపతిలో శిరిడీసాయి మందిరం నిర్మించబోతున్నాం. దర్శకత్వం చేయాలని వుంది. రెండు కథలు కూడా సిద్ధం చేసుకున్నా అని మోహన్ బాబు చెప్పారని ఆంధ్రజ్యోతి వివరించింది.

కలశం పేరుతో దోపిడీ

ఫొటో సోర్స్, Getty Images

అద్భుత కలశం పేరుతో టోపీ

అద్భుత శక్తులున్న కలశం ఉందంటూ చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు తమిళనాడులో పలువురి నుంచి నగదు వసూలు చేసి ఉడాయించారని సాక్షి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

తమ వద్ద అతీత శక్తులున్న అద్భుత కలశం ఉందంటూ చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె, కలికిరి మండలాలకు చెందిన నలుగురు వ్యక్తులు తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన పలువురి నుంచి రూ.9 లక్షల నగదు వసూలు చేసి పరారయ్యారు.

బాధితులు ఆదివారం నిమ్మనపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఎస్‌ఐ ఫాతిమా కథనం ప్రకారం.. నిమ్మనపల్లె మండలం, వెంకోజిగారిపల్లెకు చెందిన మల్లేశ్వరరావు, తవళం గ్రామానికి చెందిన ఎల్లారెడ్డి, కలికిరి మండలం, గొల్లపల్లెకి చెందిన చిన్నబ్బ, కలికిరికి చెందిన రమణారెడ్డి ముఠాగా ఏర్పడ్డారు.

వీరు ఇటీవల తిరువళ్లూరు జిల్లా, పల్లిపట్టు తాలూకా, కేశవరాజు కుప్పంకు చెందిన పలువురిని కలిశారు. తమ వద్ద అతీత శక్తులు కలిగిన, అద్భుత పురాతన కలశం ఉందని, దానికి చాలా మహిమలున్నాయని, గుప్త నిధులు, బియ్యం ఆకర్షించగలదని నమ్మించారు.

కలశం ఉన్నవారికి సిరి సంపదలు, అతీత శక్తులు సిద్ధిస్తాయని చెప్పారు. రూ.కోట్లు విలువ చేసే కలశాన్ని రూ.20 లక్షలకే ఇస్తామనడంతో వారి మధ్య ఒప్పందం కుదిరింది.

దీంతో శనివారం నిమ్మనపల్లె మండలం, ముష్ఠూరు గ్రామం, బహుదా ప్రాజెక్టు వద్దనున్న అమ్మవారి గుడివద్ద కలశాన్ని అందజేస్తామన్నారు.

బాధితులు శనివారం నిందితులను కలిసి, కలశం ఇవ్వాలని అడగ్గా.. గుడిలో కలశానికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయని, పూజల అనంతరం రాత్రికి కలశాన్ని తీసుకెళ్లవచ్చునని చెప్పారు.

వారి మాటలు నమ్మి రూ.9 లక్షల నగదును నిందితులకు అందజేశారు. అంతే.. నిందితులు నగదు తీసుకుని పరారయ్యారు. కలశం కోసం వెళ్లిన బాధితులకు అక్కడ కలశం లేకపోవడం.. నిందితులు స్పందించకపోవడంతో మోసపోయామని గ్రహించారు.

బాధితులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారని సాక్షి వివరించింది.

కేసీఆర్

ఫొటో సోర్స్, FB/KCR

ప్రజలు కోరితే పార్టీ పెట్టడానికి వెనుకాడను-కేసీఆర్

దేశ ప్ర‌జ‌లంతా కోరితే.. త‌ప్ప‌కుండా దేశ‌వ్యాప్తంగా పార్టీ పెడ‌తా.. అని సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్‌లో చెప్పారని నమస్తే తెలంగాణ పత్రిక వార్త ప్రచురించింది.

కేసీఆర్‌కు ద‌మ్ములేదా.. అధికారం లేదా.. త‌ప్ప‌కుండా అవ‌స‌రం వ‌స్తే పార్టీ పెడ‌దాం. టీఆర్ఎస్ పార్టీ పుట్టిన నాడు ఏమ‌న్న‌రు.. ఇప్పుడు ఏమైంది.. ఇది ప్ర‌జాస్వామ్యం.. ప్ర‌జ‌లు అనుకున్న నాడు త‌ల‌కిందులు అయిత‌ది.

కేసీఆర్ నీటిబొట్టు అంత కాదు అన్న‌రు నిన్న‌.. మ‌రి నీటిబొట్టు లాంటి కేసీఆర్ ను చూసి ఎందుకు భ‌య‌ప‌డుతున్నారు. ఇప్పుడు కూడా ఏం జ‌రుగుత‌దో ఎవ‌రికి తెలుసు.

నేను రైల్వే స్టేష‌న్‌లో చాయ్ అమ్ముకున్నా అని మోదీనే చెప్పారు క‌దా. ఆయ‌న ప్ర‌ధాన మంత్రి కాలేదా. సినిమా న‌టులు ముఖ్య‌మంత్రులు కాలేదా. ఎంజీఆర్, ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రులు అయ్యారు.

ఏం జ‌రుగుతుందో నాకు తెలియ‌దు కానీ.. ఏదో ఒక‌టి మాత్రం జ‌రుగుతుంది.. అని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారని పత్రిక వివరించింది.

ISWOTY Footer

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)