జగన్మోహన్ రెడ్డి: ‘చంద్రబాబును చూడాలని ఉంది’ - ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, YSRCP
'మీ లీడరును చూడాలని ఉంది. చంద్రబాబును శాసనసభ సమావేశాలకు తీసుకురండి' అని టీడీఎల్పీ ఉపనేత కె. అచ్చెన్నాయుడుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారని ‘ఆంధ్రజ్యోతి’ కథనం తెలిపింది.
‘‘గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో సభాపతి తమ్మినేని సీతారాం అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశం జరిగింది.
జగన్, అచ్చెన్నాయుడితో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అనిల్‌కుమార్, ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంతరెడ్డి పాల్గొన్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బీఏసీ భేటీకి అచ్చెన్న రావడంతోనే.. 'కమాన్.. అచ్చెన్నా ది గ్రేట్.. నిన్న (బుధవారం) మీరిచ్చిన స్టేట్‌మెంట్ చూశాను' అంటూ ఆహ్వానించారు.
కుప్పంలో వైసీపీ గెలించిందని.. చంద్రబాబు ఓడిపోయారని మంత్రి అనిల్ కుమార్ ఈ సందర్భంగా అన్నారు.
అచ్చెన్నాయుడు బదులిస్తూ.. 'కుప్పంలో మీరెలా గెలిచారో మీ అంతరాత్మకే తెలుసు. అక్కడ వైసీపీ ఎలా గెలిచిందో మీకూ తెలుసు.. మాకూ తెలుసు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఒకసారి మేం గెలుస్తాం. మరోసారి మీరు గెలుస్తారు. ఈసారి మీరు గెలిచారు.. అంతే' అని జగన్‌నుద్దేశించి అన్నారు.
కుప్పం, నెల్లూరు ఫలితాలను సీఎం ప్రస్తావిస్తూ.. ఈ ఫలితాల తర్వాత చంద్రబాబును చూడాలని ఉందని చెప్పారు. ఆయన్ను సభకు తీసుకురావాలన్నారు. చంద్రబాబు కచ్చితంగా సభకు వస్తారని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
ఇంతకూ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనుకుంటున్నారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఒక్క రోజు మాత్రమేనని స్పీకర్ చెప్పారు.
సరేనంటూ అచ్చెన్న లేచి బయటకు వెళ్లబోతుండగా.. సీఎం కలుగజేసుకుని.. ఎన్నిరోజులు జరపాలని అచ్చెన్న ది గ్రేట్ కోరుకుంటున్నారని అడిగారు. ప్రజా సమస్యలను అసెంబ్లీ ప్రస్తావించేందుకు కనీసం 15 రోజులైనా నిర్వహించాలని అచ్చెన్న కోరారు.
సీఎం తన చొక్కా జేబు నుంచి చిన్న పుస్తకం తీసి చూస్తూ 'అచ్చెన్న ది గ్రేట్ అడుగుతున్నారుగా! ఈ నెల 26 వరకూ నిర్వహిద్దాం. పెద్దాయన అడుగుతున్నారుగా.. కనీసం వారం రోజులైనా పెడదాం. సభలో ప్రజా సమస్యలను లేవనెత్తుదాం' అని అన్నారు.
అచ్చెన్నతో సమన్వయం చేసుకోవాలంటూ చీఫ్‌విప్ గడికోటకు సూచించారు. మళ్లీ అంతలోనే.. చంద్రబాబును అసెంబ్లీకి తీసుకురావాలని అచ్చెన్నతో జగన్ అన్నారు.
ఆయన ఇప్పుడు కూడా శాసనసభ ప్రాంగణంలోనే ఉన్నారని అచ్చెన్న అన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. అచ్చెన్న కోరిన వెంటనే సమావేశాలను 26వ తేదీ దాకా కొనసాగించాలనుకోవడం అరుదని.. ప్రతిపక్షం కోరిన వెంటనే సీఎం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని.. ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదంటూ జగన్‌ను ప్రశంసించారు.
దీంతో 26వ తేదీ దాకా సమావేశాలు నిర్వహించాలని బీఏసీ తీర్మానించింది’’ అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, PROJECTTIGER.NIC.IN
కార్తీక స్నానాలకు వెళ్లిన 30 మందిని వెంబడించిన పులి
తెలంగాణలోని కుమురంభీం జిల్లాలో కార్తీక స్నానాలకు వెళ్లిన గ్రామస్తులను పెద్దపులి వెంబడించిందని ‘సాక్షి’ కథనం తెలిపింది.
‘‘పోలీసుల కథనం ప్రకారం.. కుమురంభీం జిల్లా దహెగాం మండలం చిన్నరాస్పెల్లి గ్రామానికి చెందిన 30 మంది కార్తీక స్నానాలు, దేవర మొక్కుల కోసం ఎడ్లబండ్లపై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మూడు వాగుల గడ్డ వద్దకు వెళ్లారు.
ఎర్రవాగు, పెద్దవాగు, మరోవాగు కలిసే చోట కార్తీక స్నానాలు చేయాలని భావించి, అనువైన చోటుకోసం చూస్తుండగా అదే ప్రాంతంలో వారికి పెద్దపులి కనిపించింది.
దీంతో భయపడిన గ్రామస్తులు ఒక్కచోట చేరి డప్పు చప్పుళ్లు చేయడంతోపాటు కేకలు వేశారు.
అయినా పులి అక్కడి నుంచి కదల్లేదు. అక్కడే ఉంటూ గ్రామస్తుల కదలికలను గమనించసాగింది. సాయంత్రం అయినా పులి అక్కడి నుంచి వెళ్లిపోలేదు. వారికి సమీపంలోనే తిరుగుతూ కనిపించింది.
దీంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం అందించారు.
అటవీ అధికారులు, దహెగాం ఎస్సై రఘుపతి, పోలీసు సిబ్బంది, చిన్నరాస్పెల్లి నుంచి వచ్చిన గ్రామస్తులు డప్పు చప్పుళ్లు చేసుకుంటూ.. కాగడాలు పట్టుకుని వాగు వద్దకు వెళ్లారు.
పోలీసులు, అటవీ సిబ్బంది వచ్చే సమయానికి పులి దూరంగా వెళ్లిపోయినా.. అది మళ్లీ ఏ దిక్కునుంచి వచ్చి దాడి చేస్తుందోనని వారంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు.
చివరికి రాత్రి 8.30 గంటల ప్రాంతంలో అధికారులు వాగువద్ద చిక్కుకున్నవారిని క్షేమంగా గ్రామానికి తీసుకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
గత సంవత్సరం నవంబర్‌లో పెద్దపులి ఇద్దరిపై దాడి చేసి చంపిన విషయం తెలిసిందే. తాజా ఘటనతో పత్తి తీయడానికి వెళ్లే వారు సైతం భయాందోళన చెందుతున్నారు’’ అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, TRS
కేసీఆర్: ‘రైతుల సమస్యపై దేశాన్ని ఏకం చేస్తాం’
రైతు సమస్యలపై దేశాన్ని ఏకం చేస్తామని, దీనిపై జరిగే పోరుకు నేతృత్వం వహిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ తెలిపారని ‘ఈనాడు’ కథనం రాసింది.
‘‘కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాల రద్దు కోసం తన చివరి రక్త బొట్టున్నంతవరకు కొట్లాడుతానన్నారు.
కేంద్రంలో దిక్కుమాలిన ప్రభుత్వం ఉందని, వరి ధాన్యం కొనుగోళ్లలో దాని వైఖరి రైతులకు జీవన్మరణ సమస్యగా, నష్టదాయకంగా మారిందన్నారు.
పండించిన పంట కొంటారా.. కొనరా అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారన్నారు.
కేంద్రం కళ్లు తెరిపించడానికే యుద్ధానికి శ్రీకారం చుట్టామన్నారు.
ఇది ఈ రోజుతో అయిపోదని, కేంద్రం దిగివచ్చి రైతులకు న్యాయం చేసేవరకు సాగుతుందని, ఉద్ధృతమై.. ఉప్పెనలా మారుతుందన్నారు. కేంద్రం తీరు వల్ల మాకు ఇష్టం లేకున్నా తెలంగాణ రైతులను వరి వేయొద్దని, దానికి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని కోరామన్నారు.
ధాన్యం సేకరణలో కేంద్రం వైఖరికి నిరసనగా గురువారం ఇందిరాపార్కు వద్ద తెలంగాణ రాష్ట్రసమితి ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించార’’ని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘భారత్‌లోనే పొగ'రాయుళ్లు అధికం’
భారత్‌లో 'పొగ'రాయుళ్ల సంఖ్య అధికంగా ఉందని, ధూమపాన అలవాటును మానేసే వారి శాతం తక్కువగా ఉన్న దేశాల జాబితాలో కూడా మన దేశం ఉందని తాజా నివేదికలో వెల్లడైందని ‘నమస్తే తెలంగాణ’ కథనం తెలిపింది.
‘‘ధూమపాన వ్యతిరేక పోరాటానికి సంబంధించిన ఒక అంతర్జాతీయ కమిషన్ 'ఇంటర్నేషనల్ కమిషన్ టు రీఇగ్నైట్ ది ఫైట్ అగైనెస్టు స్మోకింగ్' పేరిట ఓ నివేదికను విడుదల చేసింది.
దీని ప్రకారం 16 నుంచి 64 ఏండ్ల మధ్య వయస్కుల్లో పొగతాగే వారి సంఖ్యలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. చైనా, భారత్‌లో కలిపి 16-64 ఏండ్ల వయసు వారిలో పొగాకు వినియోగదారులు 50 కోట్లకు పైగా ఉన్నార’’ని ఆ కథనంలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికాను అధిగమించి అత్యంత సంపన్న దేశంగా అవతరించిన చైనా -మెకెన్సీ రిపోర్ట్
- బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల విషయంలో భారత్ ఎందుకు ఆచితూచి వ్యహరిస్తోంది
- ‘అలెగ్జాండర్ ‘గ్రేట్’ కాదా? యోగి ఆదిత్యనాథ్ ఏమన్నారు? పర్షియన్ చరిత్ర ఏం చెబుతోంది?
- ఉద్దమ్ సింగ్ జనరల్ డయ్యర్‌ను కాల్చి చంపడానికి ముందు, తర్వాత బ్రిటన్‌లో ఏం జరిగింది?
- బ్రిట్నీ స్పియర్స్: ఈ పాప్ గాయని కన్న తండ్రిపైనే కోర్టులో పోరాడాల్సి వచ్చింది ఎందుకు?
- అడవిలో కూలి పనులు చేసిన ఈ గిరిజన మహిళ.. రైతులకు రోల్ మోడల్ ఎలా అయ్యారు?
- ‘పోలీస్ కావాలనుకున్న నా కొడుకును దొంగను చేశారు’
- జర్నలిస్ట్ హత్య: ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌ల అక్రమాలను బయటపెట్టినందుకు చంపేశారా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.












