మంత్రి పేర్ని నాని: 'ఆంధ్రాలో టీఆర్ఎస్ పార్టీ పెట్టడం ఎందుకు? ఏపీ, తెలంగాణలను కలిపేస్తే సరిపోతుంది కదా' - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Perni Nani
ఆంధ్రాలో కొత్తగా టీఆర్ఎస్ పార్టీ పెట్టాల్సిన పనేముంది? ఏపీ, తెలంగాణను కలిపేస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి, రెండు రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుంది కదా అని మంత్రి పేర్ని నాని అన్నారంటూ ఈనాడు ఒక కథనం ప్రచురించింది.
ఆ కథనం ప్రకారం.. ఆంధ్రాలోనూ పార్టీ పెట్టమంటున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. దీనిపై మీరేమంటారని జర్నలిస్టులు అడిగినప్పుడు ఆయన ఇలా స్పందించారు.
రెండు రాష్ట్రాలను కలిపేస్తే అంతర్జాతీయ టీఆర్ఎస్, జాతీయ, ప్రాంతీయ టీఆర్ఎస్ అనే అంశమే తలెత్తదు. ఏపీ, తెలంగాణలను కలిపేసిన తర్వాత ఎవరికి ఓటేస్తే వారు సీఎం అవుతారని అన్నారు.
ఎక్కువ పార్టీలుంటే ఇబ్బందేమీ ఉండదు. 2013లోనే ఆంధ్రప్రదేశ్‌ను దుర్మార్గంగా విభజించొద్దని, సమైక్య రాష్ట్రం తెలుగు వారికి అవసరమని జగన్ చెప్పారు. ఇవాళ కేసీఆర్ అక్కడా ఇక్కడా పోటీ చేయాలని అందరూ కోరుతున్నారంటున్నారు.
టీఆర్ఎస్ సంక్షేమ పథకాల గురించి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ దగ్గర ప్రస్తావిస్తే నిజాలు తెలుస్తాయి. ఊళ్లో పల్లకి మోత.. ఇంట్లో ఈగల మోత సామెతలా ఉందని ఆయన మంత్రి వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Fb/Akkineni Nagarjuna
జగన్‌ను చూసి చాలా రోజులైంది.. అందుకే వచ్చి కలిశా -నాగార్జున
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో సినీ నటుడు అక్కినేని నాగార్జున భేటీ అయ్యారని ఆంధ్రజ్యోతి కథనం రాసింది.
ఆ కథనం ప్రకారం.. తాను జగన్ శ్రేయోభిలాషినని నాగార్జున చెప్పారు. ఆయన్ను చూసి చాలా రోజులైందని.. అందుకే చూసేందుకు వచ్చానని.. అంతకుమించి ఏమీ లేదని ఆయన తెలిపారు. జగన్‌తో కలిసి లంచ్ చేశానన్నారు.
ఏపీలో ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై ఆర్డినెన్స్ జారీకి సీఎం ఆమోదం తెలిపిన కొద్దిసేపటికే నిర్మాత నిరంజన్‌రెడ్డి, దర్శకుడు ప్రీతమ్‌రెడ్డితో ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయంలో దిగిన నాగార్జున.. రోడ్డుమార్గాన తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్నారు. జగన్ దంపతులతో కలిసి భోజనం చేశారు.
సమావేశం వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇది మర్యాదపూర్వక భేటీయేనని, సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలు చర్చకు రాలేదని తెలిసిందని ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, instagram/realyssharmila
'మంత్రివర్గంలో సంస్కారహీనులు'
'తెలంగాణ మంత్రివర్గంలో సంస్కారం లేని వ్యక్తులు ఉన్నారు. చందమామను చూసి కుక్కలు మొరిగినట్లు మంత్రులు మొరుగుతున్నారు' అని వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారని సాక్షి కథనం ప్రచురించింది.
ఆ కథనం ప్రకారం.. మంత్రి నిరంజన్‌రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ కుమార్తె కవితను కూడా ఇలాగే హేళన చేస్తారా అని ప్రశ్నించారు. ఆయనకు భార్య బిడ్డలు, తల్లి, చెల్లి లేరా..? అంటూ నిలదీశారు.
ఈ నెల 20న చేవెళ్ల నుంచి వైఎస్ షర్మిల ప్రారంభించిన పాదయాత్ర గురువారం ఎలిమినేడు, కప్పపహాడ్, తుర్కగూడ, చెర్లపటేల్‌గూడ మీదుగా ఇబ్రహీంపట్నానికి చేరుకుంది.
కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడాలని, రాజన్న రాజ్యం కోసం పోరాడాలని షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు.

ఉస్మానియా స్కిన్ బ్యాంకుకు చర్మదానం
ఉస్మానియా స్కిన్ బ్యాంకుకు ఒకరు చర్మదానం చేసినట్లు వెలుగు దినపత్రిక ఒక కథనం రాసింది.
మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన 53 సంవత్సరాల మహిళ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ గురువారం బ్రెయిన్‌డెడ్ అయింది.
ఈ విషయం తెలుసుకున్న ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలోని స్కిన్ బ్యాంక్ డాక్టర్ల టీమ్ ఆ ఆస్పత్రికి వెళ్లి పేషెంట్ కుటుంబ సభ్యుల అనుమతితో ఆమె కాళ్ల చర్మాన్ని సేకరించారు. ఆ చర్మాన్ని ఉస్మానియాలోని చర్మ సంరక్షణ బ్యాంక్‌లో భద్రపరిచారు.
కాలిన గాయాలతో వచ్చే పేషెంట్ల ట్రీట్‌మెంట్‌కు ఈ చర్మాన్ని ఉపయోగిస్తామని డాక్టర్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ‘జగన్ రాజకీయ భవిష్యత్తు కోసం అడిగిందల్లా చేశా.. సంబంధం లేదు అంటే బాధేసింది’ - వైఎస్ షర్మిల
- వైఎస్ షర్మిల: నాకు పదవి ఎందుకు ఇవ్వలేదో జగన్నే అడగండి -News Reel
- త్రిపురలో ముస్లింలపై దాడులు.. కారణమేంటి
- హైదరాబాద్: మూడు గంటలపాటు ఆపరేషన్, ఒకే కాన్పులో నలుగురు పిల్లలు
- డికాక్: ‘మోకాళ్లపై నిలబడనందుకు క్షమాపణలు.. నేను జాత్యాహంకారిని కాదు’
- చేతిలో ఏకే-47, వెంట 100 మంది సాయుధ సైన్యం.. అయినా ఈ బందిపోటు ఎందుకు లొంగిపోయాడు
- COP26: వాతావరణ లక్ష్యాలకు భారత్ ఎంత దూరంలో ఉంది
- వైట్ మ్యారేజ్: ఈ ధోరణి ఏమిటి.. ఇలాంటి జంటలకు పుట్టే పిల్లలను అధికారికంగా గుర్తించరా
- హైదరాబాద్: మూడు గంటలపాటు ఆపరేషన్, ఒకే కాన్పులో నలుగురు పిల్లలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











