India vs Pakistan-T20 World Cup: పాకిస్తాన్‌పై వరుసగా 13వసారి కూడా విజయం భారత్‌దేనా?

మొదటి టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మొదటి టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు
    • రచయిత, సి. వెంకటేశ్
    • హోదా, బీబీసీ కోసం

ఇప్పటి వరకు భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య ఏడు వన్డే ప్రపంచ కప్ మ్యాచ్‌లు, ఐదు టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లు జరిగితే వాటన్నిటిలో ఇండియానే నెగ్గింది. పాకిస్తాన్‌కు మచ్చుకు ఒక్కటంటే ఒక్క విజయం కూడా దక్కలేదు.

1992లో మొదటిసారిగా మొట్టమొదటిసారి ఇండియా, పాకిస్తాన్ జట్లు ప్రపంచ కప్ పోటీల్లో తలపడ్డాయి. అప్పటి నుంచి మూడు దశాబ్దాలుగా క్రికెట్‌లో తన చిరకాల ప్రత్యర్ధిపై తొలి ప్రపంచ కప్ విజయం కోసం పొరుగు దేశం గజనీలా దండయాత్రలు చేస్తూనే ఉంది.

ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య ఏ స్థాయిలో మ్యాచ్ జరిగినా దానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. రెండు దేశాల్లో కూడా అది ఒక 'మినీ యుద్ధం' గానే భావిస్తారు తప్ప మామూలు క్రికెట్ పోటీ అని ఎవరూ అనుకోరు.

ఇక ప్రపంచ కప్ స్థాయి పోటీ అయితే ఇక ప్రతి ఒక్కరూ టీవీ సెట్ల చుట్టూ చేరాల్సిందే.

మరి ఇంత ముఖ్యమైన ప్రపంచ వేదికపైన పరాజయాల పరంపరకు పాకిస్తాన్ ఎందుకని బ్రేక్ వేయలేకపోతోందనే దానికి కారణాలు చూద్దాం.

వీడియో క్యాప్షన్, ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే యుద్ధమేనా?

పాకిస్తాన్ ఆటగాళ్లు ఇండియాతో మ్యాచ్‌కు ముందు 'ఈ సారి లెక్క సరి చేస్తాం' అంటూ అనవసరంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారని డాషింగ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ వీరెందర్ సెహ్వాగ్ అంటారు.

'మేము అలాంటి ప్రగల్భాల జోలికెళ్ళకుండా ఆట మీద, వ్యూహ రచన మీద ఫోకస్ పెట్టడం వల్లనే వరుసగా గెలుస్తూ వచ్చాం' అంటాడతను.

నిజమే, 2003 ప్రపంచ కప్ నాటి పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు, పది రోజుల పాటు తాను నిద్రలేని రాత్రులు గడిపానని సచిన్ టెందుల్కర్ కూడా చెప్పాడు.

ఆ మ్యాచ్‌లో ఆడాలనుకున్న ఇన్నింగ్స్ ముందే మనసులో అనేక పర్యాయాలు ఆడేసుకున్నానని సచిన్ అన్నాడు. అందుకే 2003 ఇండియా-పాక్ మ్యాచ్‌లో సచిన్ 98 పరుగుల ఇన్నింగ్స్ చిరస్మరణీయంగా మిగిలిపోయింది.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌లంటే రెండు జట్ల పైన కూడా చాలా ఒత్తిడి ఉంటుంది. అయితే వరసగా ఓడిపోతూ వస్తున్న పాకిస్తాన్ మీద అలాంటి వత్తిడి మరీ ఎక్కువగా ఉంటుంది.

మూడు దశాబ్దాలుగా ఊరిస్తున్న విజయం ఈ సారి కూడా దక్కదేమోనన్న నెగెటివ్ ఫీలింగ్ వారిని అలముకుంటున్నట్టుగా ఉంది. అందుకే ఆ పరాజయాల నుంచి బయటపడలేక పోతున్నారు.

అయితే, రెండు జట్ల బలాబలాల విషయంలో ఉన్న వ్యత్యాసం పాకిస్తాన్‌పై భారత జట్టు ప్రపంచ కప్‌లో వరస విజయాలు సాధించడానికి అన్నిటికన్నా ముఖ్యమైన కారణంగా కనిపిస్తోంది.

1975 నుంచి ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నప్పటికీ, 1992కు ముందు ఇండియా, పాకిస్తాన్ ఈ మెగా టోర్నీలో తలపడలేదు.

నిజానికి 1970, 1980ల నాటి పాకిస్తాన్ జట్టు చాలా బలంగా ఉండేది. జహీర్ అబ్బాస్, ఇమ్రాన్ ఖాన్, జావేద్ మియాందాద్, సర్ఫరాజ్ నవాజ్ లాంటి దిగ్గజాలు అప్పటి జట్టులో ఉండేవారు. అప్పట్లో రెండు జట్ల మధ్య ప్రపంచ కప్ మ్యాచ్‌లు జరిగితే పాకిస్తాన్ గెలిచి ఉండేదేమో.

1990 దశకంలో కూడా ఇమ్రాన్, మియాందాద్ కొనసాగారు గానీ అప్పటికి వారి ప్రతిభ చాలా వరకు సన్నగిల్లింది. గత మూడు దశాబ్దాలుగా పాకిస్థాన్ జట్టు బౌలింగ్‌లో పదును తగ్గలేదు గానీ బ్యాట్స్‌మెన్ విషయంలో సరైన టాలెంట్ లేని పరిస్థితి చూస్తున్నాం.

రాజకీయపరమైన కల్లోలాల వల్ల వాళ్ల దేశవాళీ క్రికెట్ కూడా గతంలో ఉన్నట్టుగా పటిష్టంగా లేదు. మరోవైపు ఇండియా అన్ని ఫార్మాట్లలో పాకిస్తాన్ కంటే చాలా ముందుకు దూసుకుపోతూ వస్తోంది. అందుకే రెండు జట్ల మధ్య గ్యాప్ మరింతగా పెరిగింది.

అందుకే ఈసారి టీ20 ప్రపంచ కప్‌లో కూడా తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌తో తలపడుతున్న భారత జట్టు వరసగా పదమూడో సారి కూడా విజయం నమోదు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

(అభిప్రాయాలురచయత వ్యక్తిగతం)

వీడియో క్యాప్షన్, ఇండియా-పాకిస్తాన్ టీ20 మ్యాచ్‌కు టికెట్లు ఫ్రీగా ఇస్తున్నారు...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)