ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రసంగించి జైలుకెళ్లిన దిలీప్ కుమార్

ఫొటో సోర్స్, VIMAL THAKKER
- రచయిత, వందన
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒక నటుడిగా దిలీప్ కుమార్ జీవితంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. యాక్టింగ్ కాకుండా ఆయన జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన ఘటనలు జరిగాయి.
40వ దశకంలో సినిమాల్లోకి రావడానికి ముందు దిలీప్ కుమార్ డబ్బు సంపాదించడానికి రకరకాల మార్గాలు వెతికేవారట.
ఒకసారి ఆయన ఇంట్లో గొడవ పడి బాంబే నుంచి పుణెకు పారిపోయారు. బ్రిటిష్ ఆర్మీ క్యాంటీన్‌లో పనిచేయడం మొదలుపెట్టారు. అక్కడ ఆయన చేసే శాండ్‌విచ్‌లు చాలా ఫేమస్ కూడా అయ్యాయి.
భారత్‌కు స్వాతంత్ర్యం రావడానికి ముందు ఆ ఘటన జరిగింది.

ఫొటో సోర్స్, TWITTER/DILIP KUMAR
అప్పట్లో దేశంలో ఆంగ్లేయుల పాలన ఉంది.
దిలీప్ కుమార్ పుణెలో "స్వాతంత్ర్యం కోసం భారత పోరాటం సబబేనని, బ్రిటన్ పాలకులు తప్పు చేస్తున్నారని" ఒకసారి ప్రసంగం కూడా ఇచ్చారు,
"తర్వాతేం జరిగిందంటే, బ్రిటన్‌కు వ్యతిరేకంగా ప్రసంగించినందుకు నన్ను ఎరవాడ జైలుకు పంపించారు. అక్కడ అప్పటికే చాలా మంది స్వతంత్ర సమరయోధులు ఉన్నారు" అని తన ఆత్మకత 'దిలీప్ కుమార్-ద సబ్‌స్టన్స్ అండ్ ద షాడో'లో ఆయన చెప్పారు.
"అప్పుడు స్వతంత్ర సమరయోధులను గాంధేయవాదులు అనేవారు. మిగతా ఖైదీలకు మద్దతుగా నేను కూడా నిరాహారదీక్ష చేశాను. ఉదయం నాకు తెలిసిన ఒక మేజర్ అక్కడికి రావడంతో, జైలు నుంచి విడుదల చేశారు. అలా, నేను కూడా గాంధేయవాదిని అయిపోయా" అని రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
హెలెన్ పాటలకు దిలీప్ కుమార్ డాన్సులు
దిలీప్ కుమార్‌ను 'ట్రాజెడీ కింగ్' అని చెప్పుకుంటారు. కానీ నిజ జీవితంలో ఆయన ఒక మంచి 'ప్రాంక్‌స్టర్'(కొంటె వ్యక్తి) అనిపించుకున్నారు.
దిలీప్ చిలిపి పనుల గురించి ఆయన ఆటోబయోగ్రఫీలో సైరా బానో చెప్పారు.
"సాహెబ్ అప్పుడప్పుడూ హెలెన్ పాటలకు అచ్చం ఆమెను అనుకరిస్తూ డాన్సులు వేసేవారు. అలాంటి బట్టలే వేసుకుని, అలాంటి స్టైల్లోనే స్టెప్స్ వేసేవారు. నేను నిజంగా షాక్ అయ్యేదాన్ని" అని చెప్పారు.
"ఆయన కథక్ డాన్సర్ గోపీ కృష్ణను కూడా కాపీ కొట్టేవారు. ఆ డాన్స్ చాలా కష్టం. ఒకసారి సితారా దేవి, గోపీ జీ ఉన్నప్పుడే ఆయన డాన్స్ వేశారు. అది చూసి వాళ్లు పడీపడీ నవ్వారు" అన్నారు.

ఫొటో సోర్స్, TWITTER/DILIP KUMAR
అమ్మాయిని చూసి చెమటలు పట్టాయి
అయితే, చిన్నతనంలో దిలీప్ కుమార్ చాలా సిగ్గరి. ఆ రోజుల్లో దిలీప్ కుమార్, రాజ్ కపూర్ బాంబేలోని ఖల్సా కాలేజీలో చదివేవారు.
"రాజ్ కపూర్ చాలా అందంగా ఉండేవారు. కాలేజీలో.. ముఖ్యంగా అమ్మాయిల్లో చాలా పాపులర్ అయ్యారు. అప్పుడు నేను యావరేజిగా, సిగ్గరిగా ఉండేవాడిని" అని దిలీప్ కుమార్ తన పుస్తకంలో చెప్పుకున్నారు.
"ఒకసారి రాజ్ కపూర్ నాలో సిగ్గును దూరం చేయాలని నిర్ణయించుకున్నారు. కొలాబా టూర్ సాకుతో నన్ను బయటకు తీసుకెళ్లారు. మేం ఒక గుర్రపు బండిలో వెళ్తున్నాం. దారిలో ఇద్దరు పార్శీ అమ్మాయిలు కనిపించడంతో రాజ్ హఠాత్తుగా దాన్ని ఆపించారు"
"వాళ్లతో గుజరాతీలో మాట్లాడిన రాజ్ కపూర్ 'మిమ్మల్ని ఎక్కడైనా వదలాలా' అని అడిగారు. దాంతో వాళ్లు మా బండిలో ఎక్కారు. అమ్మాయిలు ఎక్కడంతో నేను ఊపిరి బిగబట్టుకుని కూర్చున్నాను" అని చెప్పారు.
"రాజ్, ఆ అమ్మాయిలు నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. ఒక అమ్మాయి నా పక్కనే కూర్చుంది. నాకు చెమటలు పడుతున్నాయి. నిజానికి నేను అమ్మాయిల దగ్గర ఇబ్బంది పడకుండా చేయడానికి రాజ్ వేసిన ప్లాన్ అది. అలాంటివి ఎన్నోసార్లు జరిగాయి. కానీ, రాజ్ ఎప్పుడూ అసభ్యంగా ప్రవర్తించలేదు. తను ఒక దెయ్యం అంతే" అని దిలీప్ చెప్పారు.

ఫొటో సోర్స్, INDIA TODAY
సూట్, టై, పుస్తకాలంటే ఇష్టం
సినిమాలతోపాటూ దిలీప్ కుమార్‌కు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. ఆయన లైబ్రరీ నిండా ఉర్దూ, పార్శీ, ఇంగ్లిష్ సాహిత్యం ఉండేది. ఖురాన్, భగవద్గీత రెండూ ఆయనకు బాగా తెలుసు.
ఆయన సాధారణంగా సాదా కాటన్ కుర్తాలు వేసుకుంటారు. కానీ అందమైన టై, సూట్, స్టైలిష్ బూట్లంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన బట్టలను రంగుల ప్రకారం విడివిడిగా చాలా శుభ్రంగా పెట్టాల్సుంటుంది.

ఫొటో సోర్స్, SAIRA BANO
దిలీప్ పెళ్లికి మోకాళ్లపై వచ్చిన రాజ్
దిలీప్ ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటే, వాళ్ల ఇంటికి మోకాళ్లపై వెళ్తానని రాజ్ కపూర్ తరచూ మీడియాతో అనేవారు.
దిలీప్ కుమార్ నిఖా సైరా బానోతో అయినప్పుడు, ఆయన తన మాట నిలబెట్టుకున్నారు. నిజంగానే దిలీప్ కుమార్ ఇంటికి మోకాళ్లపై వెళ్లారు.
ఆ పెళ్లికి గుర్రం తీసుకుని వచ్చిన వాళ్లలో పృథ్వీ రాజ్ కపూర్, శశి కపూర్, నాసిర్ (దిలీప్ కుమార్ సోదరుడు) ఉన్నారు.

ఫొటో సోర్స్, SAIRA BANO
నెహ్రూ-దిలీప్ కుమార్
పండిట్ జవహర్ లాల్ నెహ్రూను దిలీప్ కుమార్ ఆదర్శంగా భావిస్తారు.
1962లో నెహ్రూ చెప్పడంతో ఆయన నార్త్ బాంబే నుంచి పోటీ చేసిన వీకే కృష్ణ మీనన్ కోసం ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు.
1979లో దిలీప్ కుమార్ బాంబే షెరీఫ్ అయ్యారు. 2000 నుంచి 2006 వరకు రాజ్యసభ సభ్యులుగా కూడా ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








