విశాఖపట్నంలోని భూములను జగన్ ప్రభుత్వం ఎందుకు అమ్ముతోంది...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శ్రీనివాస్ లక్కోజు
- హోదా, బీబీసీ కోసం
విశాఖపట్నంలో ప్రభుత్వ భూముల అమ్మకం వ్యవహారం అక్కడ రాజకీయ తుపానును రేపుతోంది. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదని అధికార పార్టీ అంటుంటే, రాష్ట్రాన్ని దివాలా తీయించి, భూములు అమ్మి ఖజానా నింపుకునేందుకు సర్కారు ప్రయత్నిస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
విశాఖపట్నం త్వరలో ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా మారనుంది. ఇది ఏ క్షణంలోనైనా జరగనుందంటూ మంత్రులు, వైసీపీ నేతలు తరచూ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.
ఒకవైపు పరిపాలనా రాజధాని విశాఖ అంటూనే, ఇక్కడున్న అత్యంత విలువైన భూములను వేలం ద్వారా అమ్మకానికి పెడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇంతకీ ప్రభుత్వం ఈ వేలం ద్వారా ఏ సాధించబోతోంది?

ఫొటో సోర్స్, FACEBOOK/YSJAGAN
సర్కారు వారి పాట...
'మిషన్ బిల్డ్ ఏపీ' లో భాగంగా విశాఖలో ఖరీదైన స్థలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ఈ అమ్మకం వేలం ద్వారా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ప్రక్రియకు నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్‌బీసీసీ) 18 స్థలాలకు వేలం ప్రకటన విడుదల చేసింది. వీటి అమ్మకానికి గ్లోబల్ ఆక్షన్ నిర్వహిస్తారు.
బీచ్ రోడ్డులో ఏపీఐఐసీకి చెందిన 13.59 ఎకరాల అత్యంత విలువైన భూమికి ఎన్‌బీసీసీ రూ. 1452 కోట్లను ఆఫ్‌సెట్ ప్రైస్ (రిజర్వ్ ధర)గా నిర్ణయించింది. ఈ భూమినే గత టీడీపీ ప్రభుత్వ హయంలో దుబాయ్‌కి చెందిన 'లులూ' గ్రూప్‌కి కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్, సినిమా థియేటర్లు కట్టేందుకు లీజుకు ఇచ్చారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీటిని రద్దు చేసింది. బీచ్ రోడ్డులోని స్థలంతో పాటు విశాఖపట్నంలోని అగనంపూడి, ఫకీర్ టకీయా ప్రాంతాలలోని మరో 17 ఆస్తులు కూడా ప్రభుత్వం వేలానికి పెట్టిన వాటిలో ఉన్నాయి.
అయితే ఇవన్నీ ఎకరం, అర ఎకరం కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న భూములే. ఈ మొత్తం భూముల వేలానికి సంబంధించిన పూర్తి వివరాలను ఎన్‌బీసీసీ వెబ్‌సైట్‌లో ఉంచారు.

'మిషన్ బిల్డ్ ఏపీ' అంటే...
ఏపీలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించడం, ఆక్రమణలు, వివాదాల్లో ఉన్న భూముల వివరాలను సేకరించడం, వాటిలో ప్రభుత్వ అవసరాల మేర భవన సముదాయాలు నిర్మించడం, అలాగే ప్రభుత్వ భూములను వేలం ద్వారా అమ్మి తద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకుర్చుకోవడం 'మిషన్ బిల్డ్ ఏపీ' కార్యక్రమ లక్ష్యాలు.
ఇందులో భాగంగానే ప్రభుత్వం ఎన్‌బీసీసీ సంస్థకు భూముల అమ్మకం, వేలం పనులను అప్పగించింది. అయితే ఈ పథకం పేరుతో ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా అమ్మేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
విశాఖలో అమ్మకానికి పెట్టిన దాదాపు 18 ఎకరాల భూములు ఆక్షన్ వరకు వెళ్లి అమ్మకం జరిగితే, 'మిషన్ బిల్డ్ ఏపీ' ద్వారా జరిగిన తొలి విక్రయం ఇదే అవుతుంది.

ఫొటో సోర్స్, NBCC
ఎకరం రూ. 107కోట్లు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'మిషన్ బిల్డ్ ఏపీ' కింద విశాఖపట్నంలో కొన్ని స్థలాల్ని విక్రయించాలని నిర్ణయించిందని, ఆయా స్థలాలకు ప్రభుత్వం తరఫున తాము వేలం నిర్వహిస్తున్నామని ఎన్‌బీసీసీ తన వెబ్‌సైట్ పేర్కొంటోంది.
ఈ వేలంలో పాల్గొనదలచిన వారి కోసం దరఖాస్తు ఫారాన్ని కూడా అందుబాటులో ఉంచింది. ఈ నెల 22వ తేదీ ఉదయం 11 గంటలలోపు ప్రి-బిడ్ (ముందస్తుగా చెల్లించాల్సిన మొత్తం) సమర్పించాలని చెప్పింది.
అలాగే వేలంలో పాల్గొనే వారికి అవగాహన కోసం 'మాక్ ఆక్షన్' (నమూనా వేలం) ను ఈ నెల 19, 20 తేదీలలో నిర్వహిస్తున్నట్లు వెబ్‌సైట్ ద్వారా వెల్లడించింది. 22 తేదీన వేలం ప్రక్రియ మొదలవుతుంది.
వేలం ద్వారా అమ్మకానికి పెట్టిన స్థలాల వివరాలు, ఫొటోలు, లే అవుట్ కాపీలు, ప్లాట్ నంబర్లు, మ్యాప్‌ల వివరాలను వెబ్‌సైట్‌లో పొందు పరిచింది.
ఈ భూములు సిటీలోని ప్రధాన జంక్షన్ల నుంచి ఎంత దూరంలో ఉన్నాయి? ప్రస్తుతం అక్కడ అభివృద్ధి ఎలా ఉంది? వంటి సమాచారం, ఫొటోలతో సహా ఎన్‌బీసీసీ వెబ్‌సైట్‌లో వివరించారు.
"బీచ్ రోడ్డులోని 13.59 ఎకరాల స్థలానికి ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం చూసినా ఎకరం ధర రూ.107కోట్లు. వేలంలో ఇది ఎంత వరకైనా వెళ్లొచ్చు. రూ.200కోట్లు పలికిన ఆశ్చర్యం లేదు.
ఇటువంటి స్థలాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే, రేపు ప్రభుత్వానికి ఏదైనా అవసరం వస్తే వారు ఇంతకు పది రెట్లు ఎక్కువ ధరకు అమ్ముతారు. వైసీపీ ప్రభుత్వం పిచ్చి పని చేస్తోంది" అని టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు బీబీసీతో అన్నారు.
"విశాఖలో భూములను అమ్మాల్సిన అవసరం ఏముంది? ముఖ్యమంత్రి చేతకానితనం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనమైంది. ఏదో ఒకటి అమ్ముకుంటే గానీ, రోజు గడవని పరిస్థితికి తీసుకొచ్చారు" అని ఆయన విమర్శించారు.

'భూములు జీవీఎంసీకి బదలాయించాలి'
విశాఖలో భూముల వేలాన్ని దాదాపు అన్ని విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. భూ అమ్మకాలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని ఆందోళనకు దిగుతున్నాయి.
టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్షాలు సహా వివిధ పార్టీలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వ భూములను అమ్మడం సరి కాదని ఆయా పార్టీల నేతలు వాదిస్తున్నారు. ఒక వైపు పరిపాలన రాజధాని అంటూనే ఖరీదైన భూముల్ని అమ్మేస్తే...రేపు రాజధాని అవసరాలకి భూమి ఎక్కడ నుంచి తెస్తారని ప్రశ్నించారు.
"గతంలో టీడీపీ ప్రభుత్వం 'లులూ' గ్రూప్‌కి భూములు ఇచ్చింది. రూ.2 వేల కోట్ల పెట్టుబడితో అంతర్జాతీయ స్థాయిలో కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్, ఫైవ్‌స్టార్ హోటల్ వంటి ప్రాజెక్టులను పెడతామని చెప్పారు. దాదాపు 5వేల మందికి ఉపాధి కల్పిస్తామని అన్నారు. జగన్ ప్రభుత్వం ఆ లీజును రద్దు చేసింది. అంత వరకూ బాగానే ఉంది. కానీ ఇప్పుడు అవే భూముల్ని అమ్మకానికి పెట్టడంలో ప్రభుత్వ అంతర్యం అర్థం కావడం లేదు" అని జనసేన నేత, కార్పొరేటర్ మూర్తి యాదవ్ బీబీసీతో అన్నారు.
"విశాఖ నగరంలో ప్రతి గజం ఎంతో విలువైనది. నగర పరిధిలో ఉన్న భూములను జీవీఎంసీకి బదలాయిస్తే మంచిది. కస్టోడియన్‌గా జీవీఎంసీనే కొనసాగించాలి. అప్పుడే భూములను కాపాడుకోగలుతాం" అని అన్నారాయన.
కరోనా నష్టాల్ని పూడ్చేందుకే...
పరిపాలన రాజధాని అంటూ విశాఖను ప్రకటించి, ఇప్పుడు భూముల అమ్మకంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది.
ఒకప్పుడు ఆ భూములను లీజుకివ్వడాన్నే తప్పుబట్టిన వైసీపీ, ఇప్పుడు వాటిని అమ్మకానికి పెట్టడానికి కారణాలేంటో కనుక్కునేందుకు వైసీపీ నేతలతో బీబీసీ మాట్లాడింది.
"భూముల వేలాన్ని పబ్లిక్ డొమైన్‌లో పెట్టే చేస్తున్నాం. కొనుక్కోవాలనుకుంటే చంద్రబాబు కూడా వేలంలో పాల్గొనవచ్చు. గతంలో చంద్రబాబు ఖరీదైన భూముల్ని కారు చౌకగా లీజుకి ఇచ్చారు. మేం అలాంటి తప్పు చేయడం లేదు'' అని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ బీబీసీతో అన్నారు.
"ప్రజా అవసరాల కోసమే ఈ భూముల విలువని మార్కెట్ లెక్కల ప్రకారం ధర కట్టి ఆక్షన్‌లో పెట్టాం. కరోనా లాక్‌డౌన్ వల్ల ప్రభుత్వం రూ.21 వేల కోట్లు నష్టపోయింది. దీనిని పూడ్చుకునేందుకు అనేక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, NBCC
'ఎకనామీ సైకిల్ ఆగకూడదు'
ఆర్ధిక అవసరాల కోసం ప్రభుత్వం భూమిలాంటి సహజ వనరులను అమ్ముకోవచ్చా? ఇది ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది ? అనే అంశంపై బీబీసీ నిపుణులతో మాట్లాడింది.
"ప్రభుత్వం అప్పు చేయవచ్చు. అవసరాలకు తన ఆధీనంలోని వనరులను అమ్ముకోవచ్చు. తప్పేమీ లేదు. అయితే వాటిని ఒక పరిమితికి లోబడి చేయాలి" అని ఆంధ్రా యూనివర్సిటీ ఎకనామిక్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎం.ప్రసాదరావు బీబీసీతో అన్నారు.
"భూములు అమ్మి, అప్పులు చేసి తెస్తున్న డబ్బుతో ప్రొడక్టివ్ యాక్టివిటీస్ జరగాలి. దాని వలన మళ్లీ ఎకనామీ జనరేట్ అవుతుంది. ఎకనామీ సైకిల్ ఆగకుండా ఉండాలి. ఆర్థిక రంగాన్ని గాడిన పెట్టేందుకు ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులేదు. కానీ తిరిగి రాని పెట్టుబడి కోసం ఆస్తులను అమ్మడం, అప్పులు చేయడం సరికాదు" అని అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?
- తమిళనాడు ఎన్నికల వల్లే శ్రీలంక వ్యతిరేక తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరయ్యిందా...
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్‌లో పరిస్థితి ఏంటి?
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్‌పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










