ఫేస్‌బుక్ వేదికగా కొత్త మోసం: మీలాగే ప్రొఫైల్ పెడతారు.. మీ స్నేహితుల నుంచి డబ్బు కొట్టేస్తారు - Press Review

ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్ పోలీసుల పేరుతో ఫేస్‌బుక్‌లో మోసాలు జరుగుతున్నట్లు ‘ఈనాడు’ ఒక కథనం ప్రచురించింది.
ఆ కథనం ప్రకారం.. ఫేస్‌బుక్ వేదికగా కాసులు కాజేసేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త పంథా అనుసరిస్తున్నారు. పోలీసులు, సమాజంలో పేరున్న వ్యక్తుల పేరిట నకిలీ ఖాతాలు సృష్టిస్తున్నారు.
వారి సన్నిహితులు, బంధువులకు డబ్బులు కావాలని కోరుతూ సందేశాలను పంపుతున్నారు. దీనిని నమ్మి సొమ్ములు పంపినవారు ఆ తర్వాత తాము మోసపోయామని గుర్తించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఈ తరహా సైబర్ నేరగాళ్ల మోసాలు వెలుగు చూస్తున్నాయని ఈనాడు చెప్పింది..
అసలును పోలినట్టే నకిలీ ఖాతా: సైబర్ నేరగాళ్లు ప్రముఖుల ఫేస్‌బుక్ ఖాతాల్లోని వివరాలను పరిశీలిస్తున్నారు. వారి ప్రొఫైల్ చిత్రంతోపాటు ఖాతాలో ఉన్న ఇతర చిత్రాలను డౌన్‌లోడ్ చేసుకుంటారు.
అందులో పేర్కొన్న వ్యక్తిగత వివరాలు, స్నేహితుల జాబితాలోని వ్యక్తుల పేర్లు సేకరిస్తారు. వాటి ఆధారంగా అవే చిత్రాలు, అవే పేర్లతో అసలును పోలినట్టే ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాను సృష్టిస్తారు.
అసలైన ఖాతాలోని స్నేహితుల జాబితాలో ఉన్న వారికి దీని నుంచి ‘ఫ్రెండ్ రిక్వెస్టు’లు పెడతారు. ఆ వినతిని అంగీకరించిన తర్వాత కొన్నాళ్లపాటు ఆ స్నేహితులకు సంబంధించిన పోస్టుల్ని పరిశీలిస్తారు. అనంతరం నెమ్మదిగా తమ పన్నాగాన్ని అమల్లో పెడతారు.
మెసెంజర్‌లో డబ్బుల కోసం సందేశాలు: ఫేస్‌బుక్ నకిలీ ఖాతాలో ఉన్న స్నేహితుల మెసెంజర్‌కు సందేశాలు పంపిస్తారు. హాయ్, హలో అంటూ కుశల ప్రశ్నలు అడుగుతారు.
అచ్చం అసలైన వ్యక్తి చాటింగ్ చేసిన తరహాలోనే మాట్లాడుతారు. తనకు అత్యవసరంగా కొంత నగదు అవసరం ఉందని, గూగుల్‌పే, ఫోన్‌పే ద్వారా చెల్లించాలని కోరతారు.
ఇది నమ్మి తమవారే కదా అడిగిందని కొందరు డబ్బులు బదలాయిస్తున్నారు. ఆ తర్వాత డబ్బులు అందాయా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు ఫోన్ చేసి అడిగినప్పుడు అసలు విషయం బయటపడుతోంది. దాంతో తాము మోసానికి గురయ్యామని తెలుసుకుంటున్నారని రాశారు.
ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో ఉంటున్న సైబర్ నేరగాళ్లు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. ఎక్కువ మొత్తాల్ని ఒకేసారి అడగకుండా తక్కువ మొత్తాల్లో డబ్బులు కోరుతున్నారు. ఇలా చేయటంవల్ల ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయరని.. తద్వారా తాము పట్టుబడే అవకాశాలు తక్కువగా ఉంటాయనే ఎత్తుగడతో వ్యవహరిస్తున్నారని ఈనాడు కథనంలో వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
టీఎఎస్ ఎంసెట్ ర్యాంకులు గల్లంతు
తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో తప్పులు దొర్లినట్లు ఆంధ్రజ్యోతి రాసింది.
ఎంసెట్ ఫలితాల్లో తప్పులు దొర్లాయి. ఇంటర్, ఎంసెట్‌లో అర్హత మార్కులు సాధించినా.. అనేకమందికి ర్యాంకులు ప్రకటించలేదు.
దీనిపై బుధవారం విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇంటర్‌లో ఫెయిలై, ప్రభుత్వ నిర్ణయంతో పాస్ అయిన విద్యార్థులకు ఇలాంటి సమస్యలు ఎక్కువగా వచ్చాయి.
ఈ విషయంపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఇంటర్ బోర్డు కార్యాలయానికి, జేఎన్‌టీయూకు చేరుకుని అధికారులకు ఫిర్యాదు చేశారు.
అప్రమత్తమైన జేఎన్‌టీయూ అధికారులు సమస్యను గుర్తించారు. అర్హత సాధించి ర్యాంకులు పొందనివారు ఆందోళన చెందవద్దని, అలాంటివారికి గురువారం ర్యాంకులు ప్రకటిస్తామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారని పత్రిక చెప్పింది..
ఎంసెట్ పరీక్షకు అర్హత సాధించాలంటే ఇంటర్‌లో కనీసం 45 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఫలితాలు ప్రకటించిన అనంతరం విద్యార్థుల వివరాలను ఇంటర్ బోర్డు జేఎన్‌టీయూకు అందిస్తుంది. ముందుగా రెగ్యులర్ ఇంటర్ ఫలితాలు.. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మారిన వివరాలను రెండోసారి, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైనవారి వివరాలను మూడోసారి అందిస్తుంది.
అలాగే ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు, సీబీఎ్‌సఈ, ఇతర బోర్డులు కూడా వారి విద్యార్థుల వివరాలను.. ఎంసెట్ నిర్వహణ సంస్థ అయిన జేఎన్‌టీయూకు ఏటా అందిస్తాయి.
ఈసారి కూడా విద్యార్థుల వివరాలను ఇంటర్‌బోర్డు మూడు విడతల్లో అందించింది. ఈసారి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ రద్దుచేసి విద్యార్థులందరినీ పాస్ చేయడంతో.. వారి జాబితా కూడా పంపించింది.
అసలు సమస్య ఇక్కడే తలెత్తినట్టు తెలిసింది. రెగ్యులర్ పరీక్షలో ఫెయిలై, ప్రభుత్వ నిర్ణయంతో పాస్ అయిన వారి వివరాలను జేఎన్‌టీయూ అప్‌డేట్ చేయలేదని సమాచారం.అందినట్లు పత్రిక తెలిపింది.
దీంతో వారు ఎంసెట్‌లో అర్హత సాధించినా.. ఇంటర్ బోర్డు అందించిన మొదటి జాబితా ప్రకారం ఫెయిలైనట్టు (‘‘ఫెయిల్డ్ ఇన్ క్వాలిఫైయింగ్’’) అని వచ్చింది. ఇంటర్లో ఫెయిలయ్యారని భావించి వారందరికీ ర్యాంకులు కేటాయించలేదని కథనంలో వివరించారు..
ఇంటర్‌లో కనీస అర్హత మార్కులు సాధించని 9006 మందిని మినహాయించి.. మిగతా 80,728 మందికి ర్యాంకు కేటాయించారు. వీరిలో ఇంటర్, ఎంసెట్ పరీక్షల్లోనూఅర్హత సాధించి ర్యాంకులు దక్కనివారి సంఖ్యపై గురువారం స్పష్టత రానుందని పత్రిక రాసింది.

ఫొటో సోర్స్, Facebook
జగనన్న విద్యా కానుకకు నేడు శ్రీకారం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న విద్యా కానుక పథకాన్ని నేటి (గురువారం) నుంచి ప్రారంభిస్తున్నట్లు సాక్షి కథనం ప్రచురించింది.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా కానుక గురువారం ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అందనుంది.
ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేక స్కూల్ కిట్‌లు అందజేయనున్నారు.
పాఠశాలల్లో పిల్లల నమోదును గణనీయంగా పెంచడంతో పాటు, మెరుగైన ఫలితాలు సాధించడమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 42,34,322 మంది విద్యార్థులకు వారి విద్యాభ్యాసానికి అవసరమైన ఏడు రకాల వస్తువులను ఈ కిట్ల రూపంలో అందించనున్నారు.
పిల్లలను బడిలో చేర్చే సమయంలో ఇబ్బంది పడే పేదింటి అక్కచెల్లెమ్మలకు విముక్తి కలిగించడంతో పాటు, పాఠశాలల్లో “డ్రాప్ అవుట్ఙ్‌లను గణనీయంగా తగ్గిస్తూ, బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే లక్ష్యంగా “జగనన్న విద్యా కానుక’ను ప్రభుత్వం అమలు చేస్తోందని పత్రిక రాసింది.
రాష్ట్ర వ్యాప్తంగా 42,34,322 మంది విద్యార్థిని, విద్యార్థులకు దాదాపు రూ.650 కోట్ల ఖర్చుతో స్కూల్ కిట్లు పంపిణీ చేస్తున్నారు.
స్కూళ్లు తెరిచే నాటికి పిల్లలు యూనిఫామ్‌లు కుట్టించుకునే విధంగా వారికి ముందుగానే ఈ కిట్లు అందజేస్తున్నారు. ప్రతి విద్యార్థికి స్కూల్ కిట్‌తో పాటు మూడు మాస్కులు అందించనున్నారు.
3.13 కోట్లకు పైగా పాఠ్య పుస్తకాలు, 2.19 కోట్లకు పైగా నోట్ పుస్తకాలు, 1.27 కోట్ల యూనిఫారాలు (క్లాత్), బూట్లు, సాక్సులు, బెల్టు, బాల బాలికలకు వేర్వేరు రంగుల బ్యాగులు ఆయా తరగతులకు తగ్గట్టుగా అందించనున్నారు. యూనిఫామ్ కుట్టు కూలీ మూడు జతలకి రూ.120 చొప్పున తల్లుల అకౌంట్‌కే నేరుగా జమ చేస్తారని సాక్షి రాసింది.

ఫొటో సోర్స్, AFP
శశికళ 2 వేల కోట్ల ఆస్తులు స్తంభన
తమిళనాడు ఐటీ శాఖ శిశికళకు చెందిన 2 వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను స్తంభింపచేసిందని నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళకు ఐటీశాఖ భారీ షాక్ ఇచ్చింది.
ఆమెకు చెందిన రూ.2వేల కోట్ల విలువైన ఆస్తులను స్తంభింపజేసింది. సిరుత్తవూరు, కొడనాడులో ఉన్న ఈ ఆస్తులు శశికళ, ఇళవరసి, సుధాకరన్ పేర్ల మీద ఉన్నాయవు నమస్తే తెలంగాణ రాసింది.
సదరు స్థిరాస్తుల వద్ద ఐటీ శాఖ నోటీసులు అంటించింది. బినామీల నిషేధ చట్టం ప్రకారం ఆస్తులను అటాచ్ చేసినట్టు అందులో పేర్కొన్నది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. మూడు నెలల్లో జైలు నుంచి విడుదల కానున్నారు.
2021 మేలో తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. జయలలిత చనిపోయిన సమయంలో శశికళ అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టి సీఎం కావాలని ప్రయత్నాలు చేశారు.
కానీ కేసుల్లో దోషిగా తేలడంతో జైలుకు వెళ్లారు. తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం పార్టీని సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పనీర్‌సెల్వం నడిపిస్తున్నారు.
2021 ఎన్నికల్లో సీఎం అభ్యర్థి పళనిస్వామి అని పనీర్‌సెల్వంప్రకటించారు. అదే రోజు శశికళకు చెందిన ఆస్తులను అటాచ్ చేస్తున్నట్టు ఐటీ శాఖ ప్రకటించిందని పత్రిక వివరించింది.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- పుండ్లలోని చీముతో ప్రమాదకరంగా ఆ వ్యాక్సీన్ ఎక్కించేవారు, అది లక్షల మంది ప్రాణాలు కాపాడింది
- భారతదేశంలో కోవిడ్ మరణాలు 1,00,000 దాటాయి... ఈ మరణాలకు కారణాలేమిటి?
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- చైనాలో మహిళలకు మాత్రమే పరిమితమైన రహస్య భాష... నుషు
- కరోనావైరస్: వ్యాక్సీనా, హెర్డ్ ఇమ్యూనిటీనా... ఏది వస్తే మేలు?
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








