రియా చక్రవర్తిపై నార్కోటిక్స్ కేసు నమోదు: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసు కీలక మలుపు - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, RHEA CHAKRABORTY INSTA
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు కీలక మలుపు తిరిగిందని.. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి డ్రగ్ డీలరుతో జరిపిన వాట్సాప్ చాటింగ్‌ను పరిశీలించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రియా చక్రవర్తిపై కేసు నమోదు చేసిందని 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. రియా చక్రవర్తి మాదకద్రవ్యాల వ్యాపారి గౌరవ్ ఆర్యతో వాట్సాప్ చాటింగ్ చేసినట్లు అధికారులు గుర్తించటంతో.. ఈ కేసులో మాదకద్రవ్యాల కుట్ర కూడా ఉందనే అనుమానం రేకెత్తింది. సీబీఐ దర్యాప్తులో రియాకు సంబంధించిన కీలక విషయాలను సుశాంత్ స్నేహితుడు పితాని సిద్ధార్థ్ వెల్లడించినట్లు చెప్తున్నారు.
ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం.. జూన్ 8న సుశాంత్‌తో రియా చక్రవర్తి గొడవపడిందని అతను విచారణలో బయటపెట్టాడు. జూన్ 15న సుశాంత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం గమనార్హం.
సుశాంత్ నివాసంలో ఆధారాలు దొరక్కుండా 8 హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేశారని, ఆ సమయంలో సుశాంత్ మేనేజర్ దీపేష్, వంటమనిషి ధీరజ్ ఉన్నారని సిద్ధార్థ్ చెప్పాడు. హార్డ్ డిస్క్‌ల్లో ఏముందో తనకు తెలియదని సిద్ధార్థ్ విచారణలో తెలిపాడు.
రియా సమక్షంలోనే హార్డ్ డిస్క్‌ల ధ్వంసం జరిగినట్లు సీబీఐకి ఆధారాలు లభించినట్లు చెప్తున్నారు. దీంతో.. డ్రగ్స్ లింకుతో రంగంలోకి దిగిన నార్కొటిక్స్ కంట్రోల్ బోర్డు రియా చక్రవర్తిపై కేసు నమోదు చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్ కొత్త పోకడ.. పిల్లల్నీ పీడిస్తున్న వైరస్
కరోనా మహమ్మారి కొత్త సవాళ్లను విసురుతోందని.. కొందరి పిల్లల్లో కొవిడ్ వైరస్ తొలి 14 రోజుల్లో పెద్దగా ప్రభావం చూపించకపోయినా 3, 4 వారాల్లో తీవ్రమవుతోందని తాజాగా వస్తున్న కేసులను బట్టి తెలుస్తున్నట్లు 'ఈనాడు' ఒక కథనంలో చెప్పింది.
ఆ కథనం ప్రకారం.. వైరస్ సోకినా తొలి రెండు వారాల్లో లక్షణాలు పెద్దగా బయటపడకపోవడంతో పిల్లలు కరోనా మహమ్మారి బారిన పడిన విషయాన్ని తల్లిదండ్రులు కూడా గుర్తించలేకపోతున్నారు. ఆ తర్వాత తీవ్ర జ్వరం, ఒళ్లంతా దద్దుర్లు, కడుపునొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్న చిన్నారులను జాగ్రత్తగా పరీక్షిస్తే.. కొవిడ్‌కు అనుబంధంగా ఉత్పన్నమవుతున్న తీవ్ర సమస్యగా నిర్ధారణ అవుతోంది.
''సాధారణంగా పెద్దల్లో కరోనా దుష్ప్రభావాలు రెండోవారంలో ఎక్కువగా కనిపించే అవకాశాలున్నాయి. దీనిని వైద్య పరిభాషలో సైటోకైన్స్ దాడి అంటాం. చాలా చిత్రంగా కొంతమంది పిల్లల్లో ఇటీవల మూడు, నాలుగు వారాల్లో ఈ తరహా దాడి వెలుగులోకి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది'' అని వైద్య నిపుణుడు ఒకరు ప్రస్తుత పరిస్థితుల్ని విశ్లేషించారు.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసులను పరిశీలిస్తే.. 10 ఏళ్లలోపు పిల్లలు సుమారు 4 శాతం మంది ఉన్నారు. ఈ వైరస్ పిల్లలను పూర్తిగా ఏమీ చేయదు అని తొలి రోజుల్లో భావించేవారు. ఇప్పుడు కొంత ముప్పు పొంచి ఉందనే అవగాహనకు వచ్చినట్లుగా వైద్యనిపుణులు చెబుతున్నారు.
కొత్త వైరస్ కావడంతో అనుభవాలను బట్టి ఆలోచనలు కూడా మారుతున్నాయి. కరోనా సోకిన కొంత మంది చిన్నారుల్లో 15-30 రోజుల్లో తాజాగా 'మల్టీసిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్(ఎంఐఎస్)' సమస్య ఎదురవుతోందని నిపుణులు గుర్తించారు.
గాంధీ ఆసుపత్రిలోనే గత నెల రోజుల్లో దాదాపు 26 మంది చిన్నారులు ఇవే లక్షణాలతో చేరారు. ఒక ప్రైవేటు పిల్లల ఆసుపత్రిలోనూ నెల రోజుల్లో దాదాపు 21 మంది చిన్నారులు 'ఎంఐఎస్'తో చికిత్స పొందడం గమనార్హం. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో సుమారు 4,400 మంది చిన్నారులు కొవిడ్ బారినపడగా.. వీరిలో 'ఎంఐఎస్' వ్యాధితో ఇబ్బందిపడిన వారి సంఖ్య స్వల్పమేనని వైద్యనిపుణులు చెబుతున్నారు.
అయితే సత్వరమే గుర్తించి చికిత్స అందించకపోతే.. ఈ జబ్బు ప్రాణాంతకంగా కూడా మారే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ''కొవిడ్‌కు అనుబంధంగా ఈ తరహా లక్షణాలు కనిపించడం కొత్త కావడంతో.. కొందరు వైద్యనిపుణుల్లోనూ అవగాహన లేక.. ఇతర వ్యాధులనుకొని వాటికి చికిత్స అందిస్తున్నారు. మూణ్నాలుగు వారాల కిందట కొవిడ్ లక్షణాలు స్వల్పంగా వచ్చి వెళ్లినా సరే.. కొన్ని తీవ్ర లక్షణాలు గుర్తించినప్పుడు వాటిని తేలిగ్గా తీసుకోవద్దు'' అని నిపుణులు సూచిస్తున్నారు.
''పిల్లలకు వైరస్ సోకినా లక్షణాలు పెద్దగా బయటపడకపోవడంతో.. జ్వరం, దద్దుర్లు వంటివి వచ్చినప్పుడు కొవిడ్‌కు సంబంధించినది అని అనుకునే అవకాశాలు చాలా తక్కువ. ఇది సాధారణమే అనే భావనతో తల్లిదండ్రులు కొంత ఉదాసీనంగా ఉండే ప్రమాదమూ ఉంది. అవగాహన పెంచుకొని అప్రమత్తతతో మెలగాలి'' అని చెబుతున్నారు.
నిర్ధారణ పరీక్షలు: డీ డైమర్, ఐఎల్ 6, సీబీపీ, సీఆర్‌పీ, ఫెర్రిటిన్, ఎక్స్‌రే, 2 డి ఎకో. (వీటిలో అవసరాన్ని బట్టి పరీక్షలు చేయాల్సి ఉంటుంది.)
''పిల్లల్లో కరోనా ప్రభావం చాలా తక్కువగా ఉంది. వచ్చినా భయపడక్కర్లేదు. కోలుకునే అవకాశాలెక్కువ. ప్రభుత్వ వైద్యంలో అన్ని రకాల వసతులున్నాయి. ఇక్కడికొచ్చే చిన్నారులకు కొవిడ్ లక్షణాలుంటే అవసరమైన పరీక్షలు నిర్వహిస్తున్నాం. పరిస్థితి తీవ్రతను బట్టి గాంధీ ఆసుపత్రికి పంపిస్తున్నాం. కొందరు పిల్లల్లో మూడో వారం తర్వాత లక్షణాలు కనిపించడమే కొత్త విషయం. ఇప్పుడిప్పుడే దీనిపై అవగాహన పెరుగుతోంది. ఎటువంటి లక్షణాలు కనిపించినా.. చికిత్స పొందడంలో జాప్యం చేయొద్దు'' అని నిలోఫర్ పిల్లల వైద్యనిపుణుడు డాక్టర్ నరహరి చెప్పారు.

ఫొటో సోర్స్, twitter
మహిళల కోసం షీ మొబైల్ టాయిలెట్
మహిళల కోసం ప్రత్యే కంగా షీ మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపినట్లు 'నమస్తే తెలంగాణ' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో షీ మొబైల్ టాయిలెట్స్‌ను నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వచ్చే మహిళలకు ఇబ్బంది కలగకుండా షీ టాయిలెట్స్‌ను ప్రారంభించినట్లు మంత్రి చెప్పారు.
ఇటీవలే కోస్గి మున్సిపాలిటీలో ప్రారంభించగా.. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లో ప్రారంభించామని చెప్పారు. జిల్లాలో మరోటి ఏర్పాటు చేస్తామన్నారు. సోలార్ పవర్‌తో పనిచేసే ఈ మొబైల్ షీ టాయిలెట్‌లో ఓ మహిళా అటెండర్ ఉంటుందన్నారు. బస్సులో టాయిలెట్స్‌తోపాటు సేదతీరేందుకు, టీ, కాఫీ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు.
మంత్రి కేటీఆర్ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిందని, ఇప్పటికే హైదరాబాద్‌లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. అవసరమైన చోట అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఫొటో సోర్స్, Getty Images
సెప్టెంబర్ 19 నుంచి 27 వరకు బ్రహ్మోత్సవాలు
సెప్టెంబరు మాసంలో తిరుమలలో విశేష పర్వదినాలు ఉన్నాయని 'సాక్షి' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. సెప్టెంబర్ 1న అనంత పద్మనాభ వ్రతం, 17న మహాలయ అమావాస్య ఉంది. 18వ తేదీన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది.
ఆ తర్వాతి రోజు అంటే సెప్టెంబరు 19న ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 23న శ్రీవారి గరుడసేవ, 24న శ్రీవారి స్వర్ణ రథోత్సవం, 26న రథోత్సవం నిర్వహించనున్నారు. 27న శ్రీవారి చక్రస్నానం, ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి.
ఇక సెప్టెంబరు 28న శ్రీవారి బాగ్ సవారి ఉత్సవం జరుగుతుంది.
ఇవి కూడా చదవండి:
- భవిష్యత్తులో ఉద్యోగాల పరిస్థితి ఏమిటి? ఏయే రంగాల్లో అవకాశాలు ఉంటాయి?
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- పార్టీ సమావేశంలో ప్రత్యక్షమైన కిమ్ జోంగ్ ఉన్... ఇంతకీ ఆయనకేమైంది?
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- చైనాను ఎదుర్కోవడంలో భారత్ ముందున్న ‘సైనిక ప్రత్యామ్నాయాలు’ ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








