శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్ అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి... సీఐడీ విచారణకు ఆదేశించిన కేసీఆర్

- రచయిత, వి శంకర్
- హోదా, బీబీసీ కోసం
శ్రీశైలం ఎడమగట్టువైపు ఉన్న భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గురువారం తార్తి షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగి దట్టంగా పొగ కమ్ముకుపోవడంతో సొరంగ మార్గంలో చిక్కుకున్న తొమ్మిది మంది ఉద్యోగులు మరణించారని అధికారులు ధ్రువీకరించారు.
సహాయకచర్యలు చేపడుతున్న సిబ్బంది శుక్రవారం సాయంత్రానికి మొత్తం తొమ్మిది మృతదేహాలను గుర్తించారు.
దట్టమైన పొగ చెలరేగడం, సొరంగ మార్గం నుంచి లోపలికి ప్రవేశించాల్సి ఉండటం వల్ల సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడడంతో అందులో చిక్కుకున్న వారిని ప్రాణాలతో కాపాడడం సాధ్యం కాలేదు.
38 మంది సభ్యులు ఉన్న అగ్నిమాపక దళం ఈ సహాయక చర్యలు చేపట్టినప్పటికీ దట్టమైన పొగలో కూరుకుపోయిన 9 మంది ఉద్యోగుల మృతదేహాలను మాత్రమే వెలికి తీసుకురాగలిగారు.

ప్రమాదంలో చనిపోయినవారు
- DE శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్
- AE వెంకట్‌రావు, పాల్వంచ
- AE మోహన్ కుమార్, హైదరాబాద్
- AE ఉజ్మ ఫాతిమా, హైదరాబాద్
- AE సుందర్, సూర్యాపేట
- ప్లాంట్ అటెండెంట్ రాంబాబు, ఖమ్మం జిల్లా
- జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్, పాల్వంచ
- హైదరాబాద్‌కు చెందిన ఆమెరాన్ బ్యాటరీ కంపెనీ ఉద్యోగి మహేష్ కుమార్
- ఆమెరాన్ బ్యాటరీ కంపెనీకి చెందిన మరొక ఉద్యోగి వినేష్ కుమార్

సీఐడీ విచారణకు ఆదేశించిన కేసీఅర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ ప్రమాదంపై సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు వెలికి తీయాలని, ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు బయటకు రావాలని కేసీఆర్ అన్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సిఐడి అడిషనల్ డి.జి.పి. గోవింద్ సింగ్ ను విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కోరారు.
ఉద్యోగుల ప్రమాదంలో చిక్కుకుపోవడంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, గవర్నర్లు తమిళిసై, బిశ్వ భూషణ్ హరిచందన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అందరూ క్షేమంగా బయటకు రావాలని ఈ ఉదయం వారు ఆకాంక్షించారు.

మృతుల కుటుంబాలకు పరిహారం
డీఈ శ్రీనివాస్ కుటుంబసభ్యులకు రూ.50 లక్షలు, మిగతా మృతుల కుటుంబసభ్యులకు రూ. 25 లక్షల చొప్పున ప్రభుతవం పరిహారం చెల్లిస్తుందని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు.
అలాగే, మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు.
ఏం జరిగింది?
శ్రీశైలం జలాశయం ఎడమ గట్టువైపు ఉన్న తెలంగాణ జల విద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదం జరిగినప్పుడు దాదాపు 19 మంది సిబ్బంది ప్లాంటులోపల ఉన్నారని జెన్‌కో వర్గాలు వెల్లడించాయి.
900 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఈ పవర్ ప్లాంటులో 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు యూనిట్లు ఉన్నాయి.
మొదటి యూనిట్‌లో అగ్నిప్రమాదం జరిగిందని, మంటలు, పొగ పెద్ద ఎత్తున చెలరేగాయని కొన్ని వీడియోలను చూస్తే అర్థమవుతోంది.
ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి అని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్వర్ రెడ్డి మీడియాతో అన్నారు.
మొత్తం తొమ్మిది మంది లోపల చిక్కుకుపోయారని, వారిని రక్షించేందుకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామని, సింగరేణి సహకారం కూడా కోరామని ఆయన చెప్పారు.

సొరంగ మార్గంలో చిక్కుకున్న ఉద్యోగులు
అయితే ప్రమాదం జరిగినప్పుడు విధుల్లో ఉన్న 17 మంది ఉద్యోగులకు గానూ 8 మంది సొరంగం నుంచి బయటకు రాగలిగినట్టు శ్రీశైలం అధికారులు ప్రకటించారు. మిగిలిన 9 మంది ఉద్యోగులు సొరంగ మార్గంలోనే చిక్కుకున్నారని అంచనా.
పొగ ఎక్కువగా వ్యాపించడంతో ప్రమాదం సంభవించినట్టు చెబుతున్నారు. వారు బయటపడేందుకు వీలులేక అక్కడే చిక్కుకుపోయి ఉంటారని, వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని కలెక్టర్ శర్మన్ మీడియాకు తెలిపారు. సొరంగంలో ఉన్నవారిని బయటకు తీసుకొచ్చేందుకు మూడు అత్యవసర దారులు ఉన్నాయని.. పొగ తగ్గిన తర్వాత వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామని వెల్లడించారు.
ఆచూకీ దొరకని అధికారులు, సిబ్బంది వీళ్లే..
ఆచూకీ దొరకని వారిలో 7 గురు జెన్ కో ఉద్యోగులు కాగా ఇద్దరు అమ్రాన్ కంపెనీ సిబ్బంది ఉన్నారు. వారిలో డీఈలు శ్రీనివాస్, వెంకట్రావు, ఏఈలు ఫాతిమ, మోహన్, సుందర్, కిరణ్, రాంబాబు, మరో ఇద్దరు హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులు అని అధికారులు గుర్తించారు.
సమాచారం అందిన తర్వాత తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి మంత్రి జగదీష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాల్ రాజ్, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు కూడా ఘటన స్ధలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
బయటపడిన 10 మందిలో ఆరుగురు ఉద్యోగులు జెన్‌కో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారంతా సురక్షితంగా ఉన్నారని మంత్రి తెలిపారు.
సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి
శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రం లో ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. అక్కడి పరిస్థితిని కేసీఆర్ ఎప్పటికపపుడు తెలుసుకుంటున్నారని, ప్లాంట్ లో చిక్కుకున్న వారు క్షేమంగా తిరిగిరావాలని కోరుకున్నారని సీఎంఓ వివరించింది.

జగన్ శ్రీశైలం పర్యటన రద్దు
ఏపీ సీఎం జగన్ శ్రీశైలం పర్యటనను రద్దయ్యిందని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
వరుసగా రెండో ఏడాది శ్రీశైలంలోకి వరదనీరు భారీగా వస్తున్న నేపథ్యంలో రాయలసీమ సహా వివిధ ప్రాజెక్టులకు తాగు, సాగునీటి అవసరాలకు నీటి తరలింపుకు, ప్రాజెక్టు వద్ద పరిస్థితులను సమీక్షించేందుకు, పూజలు నిర్వహించేందుకు జగన్ శుక్రవారం శ్రీశైలం వెళ్లాల్సి ఉంది.
అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గత రాత్రి అగ్నిప్రమాదం సంభవించిన విషయాన్ని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
జలవిద్యుత్ కేంద్రంలో చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని సీఎంకు వివరించారు.
ఇలాంటి పరిస్థితులు నేపథ్యంలో అక్కడకు వెళ్లి పూజలు నిర్వహించండం, సమీక్షా సమావేశాలు నిర్వహించడం సబబుకాదని ముఖ్యమంత్రి అధికారులతో అన్నారు.
తెలంగాణ విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం పట్ల సీఎం దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. చిక్కుకుపోయిన వారు సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షించారు.
ఏపీ ప్రభుత్వం నుంచి, యంత్రాంగం నుంచి ఎలాంటి సహాయం కోరినా వెంటనే వారికి అందించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఈ నేపత్యంలో శ్రీశైలం పర్యటనను రద్దుచేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు.
సీబీఐ విచారణ జరపాలి - రేవంత్ రెడ్డి
శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగింది ప్రమాదమా? కుట్రా? అని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఈ వ్యవహారంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని ఒక ట్వీట్‌లో ఆయన డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- కృష్ణా, గోదావరి పరవళ్లు.. దశాబ్దం తర్వాత మళ్లీ నిండుకుండల్లా ప్రాజెక్టులు
- కరోనావైరస్: బ్రెజిల్లో లక్ష దాటిన కోవిడ్ మరణాలు... భారత్ కూడా అలాంటి తప్పులే చేస్తోందా?
- ఇంటి పనులు చేయడం లేదా? అయితే ఇది చదవండి!
- మహిళల ఆరోగ్యం: ఇంటిపని చేయడం వ్యాయామం కిందకు వస్తుందా?
- 'మోదీజీ, మా ఆయన ఇంటి పనిలో సాయం చేయడం లేదు, మీరైనా చెప్పండి...'
- కరోనావైరస్: వర్క్ ఫ్రమ్ హోమ్ బాటలో కంపెనీలు.. ఇంటి నుంచి ఒంటరిగా పనిచేయటం ఎలా?
- వంట చేశాడు... ఇల్లు ఊడ్చాడు... హింసించే భర్త మనిషిగా మారాడు
- ప్రపంచంలోనే అత్యంత చల్లని కంప్యూటర్... ఇది శత్రు విమానాల్ని అటాక్ చేస్తుందా?
- నిజాయితీగా పన్ను చెల్లించేవారికి కొత్త ప్రయోజనాలు ఉంటాయన్న మోదీ
- కరోనావైరస్: తెలంగాణ, బీహార్, గుజరాత్, యూపీలలో టెస్టులు పెంచాలి - ముఖ్యమంత్రుల సదస్సులో మోదీ
- ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
- #HisChoice: అవును... నేను హౌజ్ హస్బెండ్ని
- కమలా హ్యారిస్ ఎవరు? జో బిడన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆమెనే ఎందుకు ఎంచుకున్నారు?
- ఇండియా, ఇరాక్, బ్రిటన్, ఆస్ట్రేలియా.. అన్ని చోట్లా అమ్మోనియం నైట్రేట్ టెన్షన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










