ఇండియా లాక్‌డౌన్: కరోనావైరస్ మీద యుద్ధంలో ముందు నిలిచి పోరాడుతున్న యోధులు ఎవరు? వారు ఏమంటున్నారు?

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

కరోనావైరస్ మీద పోరాటంలో భారతదేశం ఇప్పుడు క్లిష్ట దశలో ఉంది. ఈ వైరస్ సామాజిక వ్యాప్తి గురించి భయాలు పెరుగుతున్నాయి. దేశం యావత్తూ దిగ్బంధనంలో ఉంది.

అయినాకానీ.. వైరస్ మీద యుద్ధం చేయటానికి ముందు వరుసలో నిలిచిన కార్యకర్తలు ప్రతి రోజూ బయటకు వెళుతూనే ఉన్నారు.

''ఇది దేశం ఓడిపోవటానికి వీలులేని యుద్ధం'' అని ఒక డాక్టర్ అభివర్ణించారు. బీబీసీ ప్రతినిధి వికాస్ పాండే కథనం.

కోట్లాది మంది ప్రాణాలను ప్రమాదంలో పడేసి.. దేశాన్ని అతలాకుతలం చేయగల ఈ మహమ్మారి విజృంభించకుండా నియంత్రించటానికి గడువు మించిపోలేదని నిపుణులు హెచ్చరించారు.

భారీ విస్ఫోటనాన్ని తట్టుకోగల సామర్థ్యం భారత ఆరోగ్యరక్షణ వ్యవస్థకు లేదని చాలా మంది ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దేశ జనాభాలో 10 శాతం మందికి వైరస్ సోకినా కూడా 1.30 కోట్ల మంది ఆస్పత్రుల్లో చేరాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని పరిమిత అంచనాలు సూచిస్తున్నాయి.

కానీ.. దేశంలో ప్రతి రెండు వేల మందికీ సగటున ఒక ఆస్పత్రి పడక మాత్రమే ఉందని ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ చెప్తోంది.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

కాబట్టి సోషల్ డిస్టాన్సింగ్, సంపూర్ణ దిగ్బంధనం ద్వారా మహమ్మారి విస్ఫోటనం చెందకుండా నియంత్రించటం మీద భారతదేశం ఆశలు పెట్టుకుంది. ఈ యుద్ధంలో విజయం సాధించటం.. మనకు తెలియని, నిస్వార్థ శ్రామికుల కృషి మీద ఆధారపడి ఉంది.

డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు, పైలట్లు, రైల్వే కార్మికులు, చెత్త సేకరించేవారు.. ప్రతి రోజూ ప్రమాదాలకు ఎదురు వెళుతున్నారు.

ఈ కృషిలో వైద్య సిబ్బంది ముందు వరుసలో ఉన్నారు.

''ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి వైద్య రంగం సంసిద్ధంగా లేదు'' అని చెప్పారు అహ్మదాబాద్‌లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారిణి తారిణి జోహ్రీ.

''కరోనావైరస్ వార్డుల్లో పని చేస్తున్న డాక్టర్లు, నర్సులకు మంచి రక్షణ పరికరాలు ఉన్నాయి. కానీ.. రోగులను పరీక్షిస్తున్న డాక్టర్లకు కూడా ప్రమాదం ఉన్నప్పటికీ వారికి రక్షణ పరికరాలు లేవు. మరిన్ని రక్షణ పరికరాలు తక్షణ అవసరం'' అని ఆమె వివరించారు.

లక్నోలోని ఒక ఆసుపత్రికి చెందిన డాక్టర్ ప్రియా శ్రీవాస్తవ.. ''తక్షణమే స్పందించాల్సిన సమయమిది'' అని పేర్కొన్నారు.

డాక్టర్ తారిణి
ఫొటో క్యాప్షన్, దేశం మునుపెన్నడూ చూడని తీవ్ర పరిస్థితులు ఎదురుకానున్నాయని డాక్టర్ తారిణి అంటున్నారు

''వేగంగా తాత్కాలిక హాస్పిటళ్లనునిర్మించాల్సిన అవసరముంది. సామాజిక వ్యాప్తి తీవ్రతరమయ్యే పక్షంలో దానికి సంసిద్ధంగా ఉండాలి. ఆ పరిస్థితి మనం మునుపెన్నడూ చూడనిది. అటువంటి పరిస్థితిని ఎదుర్కొనే శిక్షణ మాకు లేదు'' అని ఆమె చెప్పారు.

ఇది ఫ్లూ సీజన్ కావటంతో పరిస్థితి మరింత దిగజారుతోందన్నారు.

''అంతటా తీవ్ర భయం వ్యాపిస్తోంది. చిన్నపాటి దగ్గు, జలుబు వంటివి ఉన్నా తమకు కోవిడ్-19 ఉందన్న భావనతో జనం ఆస్పత్రులకు వస్తున్నారు. కాబట్టి కరోనావైరస్ లక్షణాలను ఎలా గుర్తించాలనే సరైన సందేశం మనం బలంగా పంపించాల్సిన అవసరముంది'' అని ఆమె తెలిపారు.

మూడు దశాబ్దాలకు పైగా దిల్లీలో వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ వి.కె.బాత్రా.. ''డాక్టర్లుగా మేం చేయగలిగినదంతా చేస్తున్నాం'' అని చెప్పారు.

డాక్టర్ బాత్రా
ఫొటో క్యాప్షన్, డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి రక్షణ పరికరాలు అందించాలని డాక్టర్ బాత్రా కోరుతున్నారు

''ప్రజలకు మేం చెప్పే ఒకే ఒక్క ముఖ్యమైన సందేశం: ఇంట్లో ఉండండి చాలు. కొన్ని వారాల పాటు ఇంటి నుంచి కదలకుండా ఉండండి. అలా చేస్తే ఈ వైరస్ విజృంభించకుండా పోరాడే అవకాశం మనకు ఉండొచ్చు'' అని పేర్కొన్నారు.

''మాలో కొంతమంది.. రోగులకు చికిత్స చేయటం కోసం రోజుల తరబడి మా కుటుంబాలకు దూరంగా ఉండాల్సి రావచ్చు. అది చాలా ఒత్తిడి కలిగిస్తుంది. కానీ మాకు మరో దారి లేదు. మేము ఊహించని ఒక శత్రువుతో మేం పోరాడుతున్నాం'' అన్నారాయన.

తమకు అందాల్సినంత వేగంగా రక్షణ పరికరాలు అందటం లేదని చెప్పారు. ''మేం ముందు వరుసలో ఉండి పోరాడుతున్నాం. రక్షణ పరికరాలు లేకుండా ఈ యుద్ధం గెలవలేం'' అన్నారు.

భారతదేశంలో ఇప్పుడు ప్రైవేటు లాబొరేటరీల్లో కరోనావైరస్ పరీక్షలు నిర్వహించటానికి అనుమతించారు. కొంతమంది లాబ్ టెక్నీషియన్లకు శిక్షణ ఇస్తున్నారు. వారిలో అమర్‌దీప్ చౌదరి ఒకరు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
అమర్‌దీప్
ఫొటో క్యాప్షన్, ‘నా వంతు కృషి చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అంటున్నారు అమర్‌దీప్

''శాంపిల్స్ సేకరించటానికి నేను జనం ఇళ్లకు వెళుతుండేవాడిని. మమ్మల్ని మేం రక్షించుకోవటానికి జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ కరోనావైరస్ కథ వేరే. నాకు భయంగానే ఉంది. అయినా నేను వెనుకడుగు వేయను'' అని చెప్పారాయన.

ఆసుపత్రుల్లో కరోనావైరస్ మీద డాక్టర్లు పోరాటం చేస్తుంటే.. బయట వీధుల్లో లాక్‌డౌన్‌ను అమలు చేయాల్సిన బాధ్యతలు పోలీసులు నిర్వర్తిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన సీనియర్ పోలీస్ ఆఫీసర్ రాహుల్ శ్రీవాస్తవ.. మొదటి రెండు రోజులు చాలా కష్టంగా ఉందని చెప్పారు. ''ఇళ్లలో కదలకుండా ఉండటం జనానికి అలవాటు లేదు. లాక్‌డౌన్ ఎంత ముఖ్యమో వాళ్లకి అసలు అర్థంకాదు'' అని ఆయన పేర్కొన్నారు.

చాలా ప్రాంతాల్లో.. ప్రజలు ఇళ్లలోనే ఎందుకు ఉండాలో వివరించటం, విజ్ఞప్తి చేయటం, ఒత్తిడి చేయటం అనే విధానాన్ని పోలీసులు అనుసరిస్తున్నారని ఆయన తెలిపారు.

కరోనావైరస్

''జనం బయటకు వెళ్లాలని మొండిగా ప్రవర్తించినపుడు మేం కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఇది కష్టమైన పని. ప్రజల భద్రతతో పాటు, పోలీసు సిబ్బంది భద్రతను కూడా చూసుకోవాలి కాబట్టి.. ఇది రెండింతల సవాళ్లతో కూడుకున్న పని'' అని చెప్పారాయన.

లాక్‌డౌన్ అమలు చేయటం కోసం తాము వారంలో ప్రతి రోజూ 24 గంటల పాటూ వీధుల్లోనే ఉంటామన్నారు.

పోలీసులతో పాటు.. సెక్యూరిటీ గార్డులు, వ్యర్థాలను శుభ్రం చేసే వారు కీలక పాత్ర పోషిస్తున్నారు.

దేశమంతటా లాక్‌డౌన్ ప్రకటించగానే తాను తన స్వగ్రామానికి వెళ్లిపోవాలని అనుకున్నానని.. కానీ తమ పని ఎంత ముఖ్యమో తమ యజమాని తనకు వివరించాడని దిల్లీ శివారు ప్రాంతాల్లో చెత్తను సేకరించే సోను కుమార్ చెప్పారు.

కరోనావైరస్
ఫొటో క్యాప్షన్, ప్రమాదకర పరిస్థితుల్లో చెత్తను తొలగిస్తున్న సోనుకుమార్ వంటివారు తమ భద్రత గురించి ఆలోచించాలని ప్రజలకు చెప్తున్నారు

''వైరస్ మీద పోరాడటంలో పరిశుభ్రత చాలా కీలకం. కానీ మాకు భయంగా ఉంది. జనం తమ చెత్తను మూసివేయటం లేదు. తెరచివున్న చెత్త కుండీల్లో వాడేసిన టిష్యూలు, మాస్కులు, గ్లోవ్స్ ఉంటాయి. మేం రక్షణ పరికరాలు వాడుతున్నా కానీ మాకు భయంగానే ఉంది'' అని ఆయన వివరించారు.

''మా భద్రత గురించి ఆలోచించండి. వ్యర్థాలను మూసివేయండి. మీకోసమే మేం ఈ పని చేస్తున్నాం'' అని ఆయన విజ్ఞప్తి చేశారు.

విజయ్ దూబే.. దిల్లీ సమీపంలోని నోయిడాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. జనాన్ని నియంత్రించటం చాలా కష్టంగా ఉందని ఆయన చెప్తారు.

''జనం మందుల కోసం, ఆహారం కోసం బయటకు వెళ్లాలనికుంటే నేను అర్థం చేసుకోగలను. కానీ.. వాళ్లు ఇంట్లో విసుగు వస్తోందని, ఊరకే తిరగటం కోసం బయటకు వస్తుండటం తెలివితక్కువ పని'' ఆయన వ్యాఖ్యానించారు.

కరోనావైరస్
ఫొటో క్యాప్షన్, దేశంలో లాక్‌డౌన్ అమలులో సెక్యూరిటీ గార్డులు కూడా విధులు నిర్వర్తిస్తున్నారు

''వాళ్లు చదువుకున్న వాళ్లే అయినా అర్థం చేసుకోరు. మేం బయట ఉండటం ద్వారా మా సొంత భత్రను పణంగా పెడుతున్నాం. జనం చేయగలిగిన అతి స్వల్పమైన పని.. ఇంట్లో కదలకుండా ఉండటం'' అని పేర్కొన్నారు.

దేశంలో రైళ్లు, విమానాలు అన్నీ నిలిపివేశారు. కానీ పైలట్లు, రైల్వే సిబ్బంది ఇప్పటికీ తమ విధులు నిర్వర్తిస్తున్నారు.

యూరప్, ఇరాన్‌లలో చిక్కుకుపోయిన భారతీయులను అక్కడి నుంచి రక్షించి తీసుకురావటానికి ఎయిర్ ఇండియా ప్రత్యేక సహాయ విమాన సర్వీసులు నడిపింది. కానీ తమ రక్షణ విషయంలో రాజీ పడ్డారని తాము భావిస్తున్నట్లు ఎయిర్ ఇండియా సిబ్బంది బీబీసీతో చెప్పారు.

''అంతర్జాతీయ మార్గాలన్నింట్లో విమానాలను రద్దు చేశాక.. విదేశాల నుంచి తిరిగి వచ్చే పైలట్లు, సిబ్బందికి.. స్వదేశ మార్గంలో విమానాలు నడపాలని చెప్పే ముందు కేవలం నాలుగు రోజుల విశ్రాంతి మాత్రమే ఇచ్చారు. ఇది మాకు, ప్రయాణికులకు చాలా ప్రమాదంతో కూడుకున్న విషయం. మేం యూరప్, అమెరికాల్లో ఆగినపుడు మాలో ఎవరికీ వైరస్ సోకి ఉండదని నేను ఆశిస్తున్నా'' అని వారిలో ఒకరు పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

''ఇటువంటి జాతీయ సంక్షోభం సమయంలో సేవలు అందించటానికి మాకు అభ్యంతరం లేదు. కానీ.. 14 రోజుల పాటు క్వారంటైన్ చేయాలన్న విధానాన్ని పాటించాలని మాత్రమే మేం కోరుతున్నాం'' అని తెలిపారు.

ఈ ఆరోపణలను ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి ఒకరు తిరస్కరించారు. తాము ''ప్రొటోకాల్స్ ప్రకారం నడుచుకున్నాం'' అని చెప్పారు.

ఇక విమాన సిబ్బంది, రైల్వే సిబ్బందిలో కొందరికి వైరస్ సోకిందన్న అనుమానంతో కొంతమంది జనం వివక్షా పూరితంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.

''నేను విధుల్లో ఉన్నపుడు పొరుగింటి వారు మా అమ్మతో మాట్లాడటానికి నిరాకరించారు'' అని ఒక ఫ్లైట్ అటెండెంట్ చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

''మా ఇంటి దగ్గరి కిరాణాషాపు వాళ్లు మాకు నిత్యావసర సరకులు అమ్మటానికి కూడా తిరస్కరించారు'' అని ఆమె తెలిపారు.

రైల్వే సిబ్బందిలో కూడా కొంతమందికి ఇవే అనుభవాలు ఎదురయ్యాయి.

''మేం ప్రతి రోజూ 100-150 మందిని కలుస్తుంటాం. కానీ.. మాకు ఎటువంటి రక్షణ పరికరాలు కానీ, శానిటైజర్లు కానీ ఇవ్వలేదు'' అని పేరు వెల్లడించటానికి ఇష్టపడని ఒక ఉద్యోగిని బీబీసీకి చెప్పారు.

''అయినాకానీ.. లాక్‌డౌన్ అమలుకు ముందు ఎంతో మంది ప్రయాణికులు తమ గ్రామాలకు వెళ్లాలని ఆరాటపడుతుండటంతో మేం పని చేస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు మాకు వైరస్ సోకి ఉండొచ్చునని పొరుగింటి వాళ్లు అనుమానిస్తున్నారు'' అని ఆమె తెలిపారు.

''ఈ యుద్ధంలో గెలవాలంటే మనకు కావలసింది ఐకమత్యం, మానవత్వం. లేదంటే మనం ఓడిపోతాం. అది మనం తట్టుకోలేం'' అని ఆయన పేర్కొన్నారు.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)