ఫ్లెక్సీ వివాదం: బీఆర్ఎస్ కార్యకర్తపై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి అనుచరులు దాడి, ఏమిటీ ఫొటో గొడవ?

మాగంటి గోపినాథ్

ఫొటో సోర్స్, Facebook/Maganti Gopinath

ఫొటో క్యాప్షన్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (శాలువా కప్పుకున్న వ్యక్తి)
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఫ్లెక్సీలో ఫొటో చిన్నది వేశారంటూ భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) పార్టీ కార్యకర్త మీద జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అనుచరులు దాడి చేశారనే ఆరోపణలు వచ్చాయి.

ఎమ్మెల్యే సమక్షంలోనే ఆయన అనుచరులు సొంత పార్టీకి చెందిన వ్యక్తి మీద దాడి చేయడం వీడియోలో కనిపించింది.

ఏం జరిగింది?

జూలై 16వ తేదీ ఆదివారం మాగంటి గోపీనాథ్ తన అనుచరులు, పోలీసుల బందోబస్తు మధ్య మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంగళరావు నగర్‌లో ఒక కాలనీకి వెళ్లారు.

అక్కడ గణేశ్ అనే కార్యకర్త ఇంటి ముందు తన అనుచరులతో కలిసి వాదనకు దిగారు.

వీడియోలో కనిపించిన ప్రకారం, ఎమ్మెల్యే బెదిరింపు ధోరణిలో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు.

ఇంతలో ఎమ్మెల్యేతో వచ్చిన అనుచరులు గణేశ్ మీదకు దూసుకెళ్లారు. ఆయనను తోసుకుంటూ ఇంట్లోకి వెళ్లారు. కొందరు చేయి చేసుకున్నారు.

అయితే అనుచరులను వారించేందుకు మాగంటి గోపినాథ్ ప్రయత్నించలేదు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగింది. చివరకు పోలీసులు దాడిని అడ్డుకున్నారు.

భౌతిక దాడిని ఎమ్మెల్యే కనీసం ఆపే ప్రయత్నం చేయకుండా ఆ తరువాత కూడా కోపంగా మాట్లాడుతూ కనిపించారు.

పోలీసులు సర్దిచెప్పిన తరువాత ఎమ్మెల్యే వెళ్లిపోయారు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.

బోనాల సందర్భంగా పెట్టిన ఫ్లెక్సీ
ఫొటో క్యాప్షన్, వివాదానికి కారణమైన ఫ్లెక్సీ ఇదే

ఫ్లెక్సీతో వివాదం

ఎమ్మెల్యే అనుచరుల చేతుల్లో దెబ్బలు తిన్న వ్యక్తి పేరు గణేశ్. బోనాల పండుగకు ఆయన శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీ పెట్టారు.

ఆ ఫ్లెక్సీలో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఫొటో చిన్నగా ఉంది.

ప్రోటోకాల్ ప్రకారం తన ఫొటోను పెద్ద సైజులో పెట్టకపోవడంతో ఎమ్మెల్యేకు కోపం వచ్చిందనేది ఆరోపణ.

రావుల శ్రీధర రెడ్డి అనే మరో బీఆర్ఎస్ నాయకుడి అనుచరుడే గణేశ్.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విద్య, సంక్షేమ మౌలికసదుపాయల అభివృద్ధి కార్పొరేషన్‌కు రావుల శ్రీధర్ రెడ్డి చైర్మన్‌గా ఉన్నారు.

2018 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి బీజేపీ తరపున మాగంటి గోపినాథ్ మీద రావుల శ్రీధర్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు.

ఆ తరువాత 2020 ప్రాంతంలో బీఆర్ఎస్‌లో చేరారు.

మాగంటి గోపినాథ్‌కి సన్మానం

ఫొటో సోర్స్, Facebook/Maganti Gopinath

శ్రీధర్ రెడ్డికి ప్రాధాన్యంపై ఆగ్రహం

గణేశ్ ఏర్పాటు చేసే ఫ్లెక్సీల్లో శ్రీధర రెడ్డికి ‘ప్రాధాన్యం’ ఇవ్వడంపై చాలా కాలంగా మాగంటి గోపీనాథ్ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది.

తాజాగా బోనాల పండగ సందర్భంగా ఫ్లెక్సీలో కూడా అలాగే జరగడంతో ఆయన నేరుగా గణేశ్ ఇంటికే అనుచరులతో వెళ్లారు.

గణేశ్ మీద జరిగిన దాడిపై రావుల శ్రీధర రెడ్డి వర్గం అసహనంతో ఉంది.

ఈ ఘటన మీద గణేశ్ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

‘‘బోనాల పండగ సందర్భంగా కుటుంబంతో ఇంట్లో ఉన్నా. ఆ సమయంలో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, కార్పొరేటర్లు రాజకుమార్, దేదీప్య సహా మరో 80 మంది అనుచరులు మా ఇంటికి వచ్చారు. రాగానే ఎమ్మెల్యే నన్ను బూతులు తిట్టారు.

ఎమ్మెల్యే అసిస్టెంట్ సుబ్బరాజు నన్ను కొట్టాడు. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన నా తండ్రినీ కొట్టారు. నా తండ్రి వేలికి గాయమైన రక్తం వచ్చింది. నాకు, నా కుటుంబానికి ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ నుంచి ముప్పు ఉంది’’ అని గణేశ్ తన ఫిర్యాదులో రాశారు.

ప్రస్తుతం కేసు విచారణలో ఉన్నట్టు మధురా నగర్ పోలీసులు బీబీసీతో చెప్పారు. దీనిపై మాగంటి గోపీనాథ్ స్పందించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)