బైలేటరల్ న్యుమోనియాతో ఇబ్బంది పడుతున్న పోప్ ఫ్రాన్సిస్, అసలు ఈ జబ్బు ఏంటి, ఎవరికి ఎక్కువ ముప్పు..

ఫొటో సోర్స్, Reuters
ఆస్తమా లాంటి శ్వాసకోశ సంబంధిత జబ్బుతో ఇబ్బంది పడుతున్న పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వాటికన్ సిటీ తెలిపింది. శనివారం ఆయన పరిస్థితి మరింత విషమంగా మారిందని, రక్తమార్పిడి చేయాల్సి వచ్చిందని వాటికన్ సిటీ తన ప్రకటనలో చెప్పింది.
88 ఏళ్ల పోప్ ఫ్రాన్సిస్‌కు ఊపిరితిత్తుల్లో న్యుమోనియాకు రోమ్‌లోని జెమెల్లి ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నట్లు వాటికన్ సిటీ వర్గాలు తెలిపాయి.
ఆయనకు సీటీ స్కాన్ చేయగా బైలేటరల్ న్యుమోనియా లక్షణాలు కనిపించాయని, అవి ప్రాథమిక దశలో ఉన్నాయని వాటికన్ సిటీ వర్గాలు వెల్లడించాయి.
అసలు బైలేటరల్ న్యుమోనియా అంటే ఏంటి? ఎవరు ఎక్కువగా దీని బారిన పడతారు?


ఫొటో సోర్స్, Getty Images
న్యుమోనియా అంటే?
న్యుమోనియా ఒక ఇన్ఫెక్షన్. ఇది ఊపిరితిత్తుల్లో మంటను కలిగిస్తుంది. ఊపిరితిత్తుల్లోని గాలి సంచులు ద్రవాలతో నిండిపోయి కఫంతో కూడిన దగ్గు, చీము, జ్వరం, చలి, ఒళ్లు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి తలెత్తుతాయి.
బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్ వంటి వివిధ సూక్ష్మజీవులు, న్యుమోనియాకు కారణం అవుతాయి.
న్యుమోనియా కలిగించే సూక్ష్మజీవులు, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వచ్చే తుంపరల ద్వారా లేదా కలుషితమైన ఉపరితలాలను చేతులతో తాకి కళ్లు, ముక్కు, నోరు వంటి వాటికి తాకడం ద్వారా వ్యాప్తి చెందుతాయి.
బైలేటరల్ అంటే ఈ ఇన్ఫెక్షన్ ఒకటి కాకుండా రెండు ఊపిరితిత్తుల్లో కనిపిస్తుంది.
2021లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 34 కోట్లమంది న్యుమోనియా కేసులు నమోదయ్యాయని, 21 లక్షల మరణాలు సంభవించాయని గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్ సంస్థ అధ్యయనం తెలిపింది. ఇందులోని డేటా ప్రకారం, న్యుమోనియా కారణంగా అయిదేళ్ల లోపున్న చిన్నారులు దాదాపు 5 లక్షలమంది మృతి చెందారు.
ఆ ఏడాది సంభవించిన మరణాలకు కారణాలను చూస్తే లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్లు అయిదో స్థానంలో నిలిచాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తెలిపింది. గుండె జబ్బులు, కోవిడ్-19, స్ట్రోక్, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధులు తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి.

ఫొటో సోర్స్, Getty Images
న్యుమోనియా ముప్పు ఎవరికి ఎక్కువ?
ఫిజికల్ ఎగ్జామినేషన్ తర్వాత వైద్యుడు, రోగికి న్యుమోనియా ఉన్నట్లు అనుమానిస్తే, ఉంటే వెంటనే దాన్ని నిర్ధరించడం కోసం రక్తపరీక్ష నిర్వహిస్తారు. రక్తపరీక్ష ద్వారా ఈ లక్షణాలకు కారణమైన సూక్ష్మజీవిని గుర్తించేందుకు ప్రయత్నిస్తారని, కానీ ఇది అన్నిసార్లు సాధ్యం కాదని అమెరికాలోని ప్రముఖ ఆరోగ్య సంరక్షణ సంస్థ మయో క్లినిక్ పేర్కొంది.
ఇన్ఫెక్షన్‌ను గుర్తించడానికి ఛాతీ ఎక్స్‌రే సిఫార్సు చేస్తారు. ఇన్ఫెక్షన్ మూలాన్ని గుర్తించడానికి కఫం పరీక్ష, ఊపిరితిత్తుల నుంచి స్వాబ్‌తో శాంపుల్ తీసి పరీక్షిస్తారు.
రక్తప్రవాహంలోకి తగినంత ఆక్సీజన్‌ను ఊపిరితిత్తులు సరఫరా చేయకుండా న్యుమోనియా అడ్డుకుంటుంది. కాబట్టి తరచుగా ఆక్సీమీటర్‌తో రక్తంలో ఆక్సీజన్ స్థాయిలను పరీక్షిస్తుంటారు.
న్యుమోనియా వల్ల ఎవరి ఆరోగ్య పరిస్థితి అయినా సీరియస్‌గా మారొచ్చు. ఇక పోప్ వంటి వృద్ధులకు ప్రమాదం ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది.
ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వారిలో, రెండేళ్ల లోపున్న పసిపిల్లలకు తీవ్ర ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. దీనికి వారి వయస్సే ప్రధాన కారణమని చెబుతున్నారు.
వయస్సుతో పాటు ఊపిరితిత్తులు చెడిపోవడం, ఎంఫిసెమా, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ వంటి ఊపిరితిత్తుల వ్యాధులు, పొగ తాగడం, బలహీన రోగనిరోధక వ్యవస్థ కారణంగా కూడా తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.
పోప్ ఫ్రాన్సిస్ కేసులో వయస్సుతో పాటు మరో కారణం కూడా ఉంది. ఫ్రాన్సిస్ యుక్తవయసులో ఉండగా ఆయనలో ప్లూరిసీ డెవలప్ అయింది. ఆయనకు 21 ఏళ్ల వయస్సులో ఊపిరితిత్తులలో కొంత భాగాన్ని తొలగించారు. దీనివల్ల ఆయన ఇన్‌ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంది.
పోప్ తొలుత ఫిబ్రవరి 15న బ్రాంకైటిస్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. చాలా రోజులపాటు ఆయన దీనికి సంబంధించిన లక్షణాలతో బాధపడ్డారు.
బ్రాంకైటిస్ అనేది ఊపిరితిత్తుల అంతటా గాలిని మోసుకెళ్లే శ్వాసనాళ గొట్టాల పొరల్లో వచ్చే వాపు.

ఫొటో సోర్స్, Getty Images
న్యుమోనియాకు ఎలా చికిత్స చేస్తారు?
న్యుమోనియాకు యాంటీబయాటిక్స్ లేదా యాంటీ వైరల్స్‌తో చికిత్స అందించవచ్చు.
ఒకవేళ పలు బ్యాక్టీరియాల వల్ల న్యుమోనియా సోకితే ఆ రోగికి విరివిగా యాంటీ బయాటిక్స్ (బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్) అందించవచ్చు.
అయితే, వైరస్ ద్వారా సంక్రమించిన వైరల్ న్యుమోనియాకు చికిత్స చేయడం మరింత కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అందుబాటులో ఉన్న యాంటీవైరల్ ఔషధాలు అంతగా ప్రభావవంతంగా ఉండవు, వ్యాధి మూలాన్ని అంతగా లక్ష్యంగా చేసుకోవు.
న్యుమోనియాతో ఆసుపత్రిలో చేరే రోగులకు తరచుగా ఫ్లూయిడ్స్, ఆక్సీజన్ ఎక్కిస్తారు.
ఎక్కువగా కదలలేని వారికి, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన ద్రవాన్ని తొలగించడంలో ఫిజియోథెరపీ సహాయపడుతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














