అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం ఎందుకంత కష్టమవుతోంది?

దక్షిణ కొరియా అధ్యక్షుడి అధికారిక నివాసం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దక్షిణ కొరియా అధ్యక్షుడి అధికారిక నివాసం బయట ఆయన మద్దతుదారుల్ని అడ్డుకుంటున్న పోలీసులు
    • రచయిత, కెల్లీ ఎన్జీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను అరెస్ట్ చేసే ప్రయత్నాలు విఫలం కావడం చర్చనీయాంశమయ్యాయి.

అరెస్ట్ వారెంట్‌తో అధ్యక్షుడు యూన్ ఇంటిని చుట్టుముట్టిన సుమారు 100 మంది పోలీసులు ఆరు గంటలు ప్రయత్నించినా కూడా అరెస్ట్ చేయలేకపోయారు.

యూన్ భద్రతా సిబ్బంది ఆయన ఇంటి చుట్టూ ఒక మానవ హారంగా ఏర్పడి పోలీసుల్ని అడ్డుకున్నారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం వాహనాలను అడ్డుపెట్టి, అరెస్ట్ చేయడానికి వచ్చిన టీమ్‌ను యూన్ భద్రతా సిబ్బంది అడ్డుకున్నట్టు తెలిసింది. దీంతో ఆయన ఇంటి ముందు తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సౌత్ కొరియా రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి.

అధ్యక్షుడు యూన్ దేశంలో మార్షల్‌ లా ప్రకటించిన తరువాత తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ వ్యతిరేకత దృష్యా వెంటనే ఆయన తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.

ఫలితంగా అభిశంసన ఎదుర్కొన్నారు యూన్. మరోవైపు ఆయనపై దర్యాప్తు కూడా మొదలైంది. అయితే, విచారణకు హాజరయ్యేందుకు యూన్ నిరాకరిస్తున్నారు. గతవారం ఆయన అరెస్టుకు వారెంట్ జారీ అయ్యింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
యూన్ వ్యతిరేక ప్రదర్శనలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అభిశంసనకు గురైన అధ్యక్షుడి అరెస్ట్ చేయలేకపోవడంతో పోలీసులతో ఘర్షణ పడుతున్న యూన్ వ్యతిరేకులు.

యూన్‌ అరెస్ట్ కాకుండా అడ్డుకున్న మద్దతుదారులు

అయితే, యూన్‌కు భారీ సంఖ్యలో మద్దతుదారులు ఉన్నారు. ఆయన అరెస్టును అడ్డుకునేందుకు వేలాదిగా ఆయన ఇంటి ముందు శుక్రవారంనాడు గుమిగూడారు.

పార్లమెంట్లో అభిశంసన ఎదుర్కొని, అధ్యక్ష పదవి పోగొట్టుకున్న ఆయన తన పదవి విషయమై రాజ్యాంగ ధర్మాసనం తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు.

ఇన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ, యూన్‌ను అరెస్ట్ చేయడం ఎందుకింత కష్టంగా మారింది? దీనికి అనేక కారణాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

అభిశంసనతో యూన్ తన అధ్యక్ష పదవి ద్వారా వచ్చే అధికారాలు కోల్పోయినప్పటికీ, భద్రతను కొనసాగించేందుకు అర్హులే.

శుక్రవారం యూన్ అరెస్టును అడ్డుకోవడంలో ఆయనకు కేటాయించిన భద్రతా సిబ్బంది కీలక పాత్ర పోషించారు.

యూన్ పట్ల తమకున్న విశ్వాసం వల్లనో లేదా తమ రాజ్యాంగ బాధ్యత గురించి సరైన అవగాహన లేకనో ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ (పీఎస్ఎస్) సిబ్బంది అలా ప్రవర్తించి ఉంటారని సోల్‌కు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ మేసన్ రిచే అన్నారు.

యూన్ తన పదవి నుంచి తొలగిపోయారు కాబట్టి, తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సంగ్ మాక్ ఆదేశాలను ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీసెస్ సిబ్బంది పాటించాల్సి ఉంటుంది.

అయితే, అడ్డుకునే ప్రయత్నాలు చేయవద్దని తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సంగ్ మాక్ ఆదేశాలు ఇచ్చి ఉండకపోవచ్చు లేదంటే ఆయన ఆదేశాలు ఇచ్చినా వారు పాటించి ఉండకపోవచ్చని ప్రొఫెసర్ రిచే అన్నారు.

యూన్ నివాసం

భద్రతా సిబ్బంది విశ్వాసమంతా యూన్ పట్ల ఉంది తప్ప అధ్యక్ష పదవి పట్ల కాకపోవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీసెస్‌కు నాయకత్వం వహిస్తున్న పార్క్ జోంగ్‌ను గత సెప్టెంబర్‌లో యూన్ నియమించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

పార్క్ ‌జోంగ్‌కు ముందు ఈ పదవిని నిర్వహించిన కిమ్ యోంగ్ హ్యూన్ మాజీ రక్షణ మంత్రి.

యూన్‌కు మార్షల్‌లా ప్రకటించాల్సిందిగా సూచించింది కూడా హ్యూన్ అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే యూన్ పై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా హ్యూన్‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు.

తనపై కేసులను, అరెస్టులను ఊహించిన యూన్, తన భద్రతా సిబ్బందిలో విశ్వాస పాత్రులను పెట్టుకుని ఉంటారని యూఎస్‌కు చెందిన న్యాయవాది, కొరియా నిపుణులు క్రిస్టఫర్ జుమీన్ లీ అన్నారు.

పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీసెస్ కాస్త సంయమనం పాటించాల్సిందిగా సూచించడమే ఇప్పుడు తాత్కాలిక అధ్యక్షుడి ముందున్న మార్గమని జుమీన్ లీ అన్నారు.

ఒకవేళ ఈ ఆదేశాలు జారీ చేయడానికి చోయ్ సిద్ధంగా లేకపోతే, ఆయన కూడా నేషనల్ అసెంబ్లీలో అభిశంసన ఎదుర్కోవలసి రావచ్చని జుమీన్ లీ అభిప్రాయపడ్డారు.

యూన్ అధ్యక్షత పదవి నుంచి తొలగిపోయాక, హాన్ డక్ సూ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన కూడా అభిశంసన ఎదుర్కొని పదవి నుంచి తొలగిపోవడంతో, ఆర్ధిక మంత్రి చోయ్ తాత్కాలిక అధ్యక్షుడయ్యారు.

ఈ ప్రతిష్టంభన సౌత్ కొరియా రాజకీయాలను యూన్ అనుకూలురు, వ్యతిరేకులు అనే రెండు వర్గాలుగా చీల్చింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)