టోక్యో ఒలింపిక్స్: క్రీడా సంగ్రామం ముగిసింది... భారత్‌కు పతకాలు తీసుకొచ్చిన స్టార్ ప్లేయర్లు వీరే..

టోక్యో ఒలింపిక్స్

ఫొటో సోర్స్, PIB

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శనతో ఒక బంగారం, రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలను కైవసం చేసుకుంది. ఆగస్టు 8తో ఈ క్రీడా సంగ్రామం ముగిసింది.

అథ్లెటిక్స్ (స్వర్ణం), వెయిట్ లిఫ్టింగ్ (రజతం), కుస్తీ (ఒక రజతం, ఒక కాంస్యం), హాకీ (కాంస్యం), బ్యాడ్మింటన్ (కాంస్యం), బాక్సింగ్ (కాంస్యం)లలో భారత్‌కు పతకాలు వచ్చాయి.

టోక్యో ఒలింపిక్స్‌ ముగింపు వేడుకలు ఇలా..

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టోక్యో ఒలింపిక్స్‌ ముగింపు వేడుకలు ఇలా..

టోక్యో ఒలింపిక్స్‌కు ముందుగా ఒలింపిక్స్‌లో గరిష్ఠంగా భారత్‌ ఆరు పతకాలను సాధించింది. 2012 లండన్ ఒలింపిక్స్ దీనికి వేదికైంది.

నీరజ్ చోప్రా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నీరజ్ చోప్రా

13ఏళ్ల తర్వాత స్వర్ణం

13ఏళ్ల క్రితం ఒలింపిక్స్‌లో మనకు స్వర్ణ పతకం వచ్చింది. తాజాగా టోక్యోలో నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని సాధించారు. జావెలిన్ త్రోలో 87.58 మీటర్లకు జావెలిన్‌ను విసిరి ఆయన బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. ఒలింపిక్స్‌లో నీరజ్ పాల్గొనడం ఇదే తొలిసారి.

ఈ ఏడాది భారత్‌లో నిర్వహించిన ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్‌లో 88.07 మీటర్లకు జావెలిన్‌ను విసిరి నీరజ్ తన రికార్డును తానే తిరగరాసుకున్నారు. గత జూన్‌లో పోర్చుగల్‌లోని లిస్బన్‌లో జరిగిన సీడాడే డీ లిస్బోవా టోర్నమెంట్‌లో కూడా ఆయన స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. టోక్యోలో 90 మీటర్లకు జావెలిన్‌ను విసరాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.

నీరజ్ చోప్రా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నీరజ్ చోప్రా

వ్యక్తిగత స్పోర్ట్స్‌లో నీరజ్ కంటే ముందే షూటర్ అభినవ్ బింద్రా భారత్‌కు స్వర్ణ పతకాన్ని తెచ్చిపెట్టారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పది మీటర్ల ఎయిర్ రైఫిల్స్ విభాగంలో ఆయన పతకాన్ని గెలిచారు.

నీరజ్ చోప్రా

ఫొటో సోర్స్, Reuters

నీరజ్ పతకాన్ని సాధించిన వెంటనే అభినవ్ సోషల్ మీడియలో అభినందనలు తెలిపారు. తృటిలో పతకాన్ని కోల్పోయిన పరుగుల రాణి పీటీ ఉష కూడా నీరజ్‌ను అభినందించారు. మరోవైపు పాకిస్తాన్‌ నుంచి కూడా నీరజ్‌కు అభినందనలు వెల్లువెత్తాయి.

స్వర్ణ పతకాన్ని సాధించిన అనంతరం నీరజ్‌కు ప్రోత్సాహకాలు వెల్లువెత్తాయి. హరియాణా, పంజాబ్, మణిపుర్‌ ప్రభుత్వాలతోపాటు బీసీసీఐ, చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఆయనకు నగదు ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించాయి.

మీరాబాయి చానూ

ఫొటో సోర్స్, VINCENZO PINTO/AFP/Getty Images

ఫొటో క్యాప్షన్, మీరాబాయి చానూ

21ఏళ్ల తర్వాత వెయిట్ లిఫ్టింగ్‌లో

టోక్యో ఒలింపిక్స్‌లో తొలి రోజే రజత పతకాన్ని గెలిచి భారత్‌తో మీరాబాయి చానూ బోణీ కొట్టించారు.

21ఏళ్ల తర్వాత, ఆమె వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు పతకం తెచ్చిపెట్టారు. 49 కేజీల విభాగంలో బరిలోకి దిగిన ఆమె మొత్తంగా 202 (87 కేజీలు + 115 కేజీలు) కేజీల బరువును ఎత్తారు.

మీరాబాయి చానూ

ఫొటో సోర్స్, Dean Mouhtaropoulos/Getty Images

ఫొటో క్యాప్షన్, మీరాబాయి చానూ

2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో 69 కేజీల విభాగంలో కరణం మళ్లీశ్వరి భారత్‌కు కాంస్య పతకం తెచ్చిపెట్టారు.

సింధు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సింధు

సుశీల్ కుమార్‌తో సింధు సమానంగా

బ్యాడ్మింటర్ స్టార్ పీవీ సింధు.. టోక్యో ఒలింపిక్స్‌లో రెండో ఒలింపిక్ పతకాన్ని గెలిచారు. రియో ఒలింపిక్స్‌లో ఆమె రజత పతకాన్ని గెలిచిన సంగతి తెలిసిందే.

టోక్యోలో కాంస్య పతకాన్ని గెలవడం ద్వారా.. వ్యక్తిగత క్రీడల్లో రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన తొలి భారత మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. పురుషుల్లో ఆమె కంటే ముందు సుశీల్ కుమార్ ఈ ఘనత సాధించారు.

పీవీ సింధు

ఫొటో సోర్స్, Getty Images

కుస్తీలో 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న సుశీల్.. 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని గెలిచారు.

లవ్లీనా బోర్గోహైన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లవ్లీనా బోర్గోహైన్

బాక్సింగ్‌లో లవ్లీనా..

స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్.. టోక్యోలో ఎప్పటికీ మరచిపోలేని ప్రదర్శన ఇచ్చారు. అయితే, 69 కేజీల సెమీ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్ 1 ఛాంపియన్, టర్కీకి చెందిన సుర్మేనేలి చేతిలో ఆమె ఓడిపోయారు. దీంతో ఆమెకు కాంస్య పతకం దక్కింది.

బాక్సింగ్‌లో 9ఏళ్ల తర్వాత భారత్‌కు ఈ పతకం వచ్చింది. అసోంలోని గోలఘాట్‌కు చెందిన లవ్లీనా.. ఒలింపిక్స్‌లో భారత తరఫున బాక్సింగ్‌లో పతకం అందుకున్న మూడో క్రీడాకారిణి.

లవ్లీనా బోర్గోహైన్

ఫొటో సోర్స్, EPA

2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో విజేందర్ సింగ్ కాంస్య పతకాన్ని గెలవగా, 2012 లండన్ ఒలింపిక్స్‌లో మేరీ కోమ్ కూడా కాంస్య పతకాన్ని గెలిచారు.

రవి దహియా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, రవి దహియా

రెండో రజతం రవి దహియా తెచ్చారు..

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో రజతాన్ని రెజ్లర్ రవి దహియా తీసుకొచ్చారు. ఫైనల్స్‌లో రష్యా రెజ్లర్ జవుర్ యుగుయేవ్‌ చేతిలో 7-4 తేడాతో రవి ఓడిపోయారు. దీంతో 57 కేజీల విభాగంలో ఆయన రజత పతకాన్ని సాధించారు.

ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని గెలిచిన భారత రెజ్లర్లలో రవి దహియా రెండోవారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్ ఓ రజత పతకాన్ని సాధించారు.

హాకీ

ఫొటో సోర్స్, Reuters

హాకీలో 41ఏళ్ల తర్వాత పతకం

ఈ సారి రెండు హాకీ జట్లూ భారత్‌ను ఆనందోత్సాహాల్లో ముంచెత్తాయి. గతంలో వరుస ఒలింపిక్ పతకాలు సాధించిన మన హాకీజట్లు గత కొన్నేళ్లుగా చతికిలపడ్డాయి. అయితే 41ఏళ్ల తర్వాత మళ్లీ రెండు జట్లూ సెమీ ఫైనల్స్‌లో అడుగుపెట్టాయి. జర్మనీ లాంటి మంచి టీమ్‌పై విజయం సాధించి భారత పురుషుల జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

ఈ కాంస్య పతకంతో 41ఏళ్ల తర్వాత హాకీలో భారత ఖాతాలో ఒలింపిక్ పతకం పడింది. దీంతో మొత్తంగా భారత ఖాతాలో హాకీ నుంచి 8 బంగారం, ఒక రజతం, మూడు కాంస్య పతకాలు పడినట్లు అయింది.

హాకీ

ఫొటో సోర్స్, Getty Images

ఇది భారత్‌కు టోక్యోలో ఐదో పతకం. దీనిపై పాకిస్తాన్‌లోనూ పెద్దయెత్తున చర్చ జరిగింది. పాకిస్తాన్ కూడా మూడు సార్లు ఒలింపిక్స్‌లో హాకీలో స్వర్ణం సాధించింది.

మరోవైపు భారత మహిళల హాకీ జట్టు కూడా టోక్యోలో మంచి ప్రదర్శన ఇచ్చింది. దశాబ్దాల తర్వాత తొలిసారిగా మహిళల జట్టు సెమీస్‌లోకి అడుగుపెట్టింది. కాంస్య పతకం తృటిలో చేజారినా.. జట్టు పోరాడిన తీరుపై ప్రశంసల వర్షం కురిసింది.

బజ్‌రంగ్ పూనియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బజ్‌రంగ్ పూనియా

బజ్‌రంగ్ పూనియాకు కాంస్యం

నీరజ్ చోప్రాలానే బజ్‌రంగ్ పూనియాకూ ఇదే తొలి ఒలింపిక్స్. 65కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో కాంస్యం కోసం కజఖ్‌స్తాన్‌కు చెందిన దౌలత్ నియాజ్బెకోవ్‌తో పూనియా తలపడ్డాడు. దౌలత్‌కు ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా 8-0 తేడాతో పూనియా విజయం సాధించాడు.

టోక్యో ఒలింపిక్స్ ముగియడానికి ఒక రోజు ముందు భారత్ గెలిచిన ఆరో మెడల్ ఇదీ. కాసేపటికే సువర్ణ క్షణాలు భారత్‌ను వరించాయి. జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించి నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు.

టోక్యో ఒలింపిక్స్‌ ముగింపు వేడుకలు ఇలా..

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టోక్యో ఒలింపిక్స్‌ ముగింపు వేడుకలు ఇలా..

లండన్ ఒలింపిక్స్‌లో ఎవరు గెలిచారు?

  • షూటింగ్ (25 మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టర్): విజయ్ కుమార్ (రజతం)
  • రెజ్లింగ్ (66 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్): సుశీల్ కుమార్ (రజతం)
  • షూటింగ్ (పది మీ ఎయిర్ రైఫిల్): గగన్ నారంగ్ (కాంస్యం)
  • బ్యాడ్మింటన్ (విమెన్స్ సింగిల్స్): సైనా నెహ్వాల్ (కాంస్యం)
  • బాక్సింగ్ (ఫ్లైవెయిట్, 51 కేజీ): మేరీ కోమ్ (కాంస్యం)
  • రెజ్లింగ్ (60 కేజీల ఫ్రీస్టైల్): యోగేశ్వర్ దత్ (కాంస్యం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)