అఫ్గానిస్తాన్: తాలిబన్లను అడ్డుకునేందుకు దేశమంతటా కర్ఫ్యూ

ఫొటో సోర్స్, Getty Images
తాలిబన్ల గుప్పిట్లోకి నగరాలు వెళ్లకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా దాదాపు దేశం మొత్తం కర్ఫ్యూ విధిస్తున్నట్లు అఫ్గానిస్తాన్ ప్రభుత్వం శనివారం ప్రకటించింది.
రాజధాని కాబూల్‌తోపాటు మరో రెండు ప్రధాన ప్రావిన్స్‌లలో రాత్రి 10 నుంచి ఉదయం నాలుగు గంటల మధ్య ఎవరూ బయట తిరగకూడదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
అంతర్జాతీయ బలగాలు ఇక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోతుండటంతో, గత రెండు నెలల్లో ఇక్కడి ప్రభుత్వం, తాలిబన్ల మధ్య ఘర్షణ వాతావరణం విపరీత స్థాయికి పెరిగింది.
అఫ్గానిస్తాన్‌లో సగం భూభాగాన్ని ఇప్పటికే తాలిబాన్లు ఆధీనంలోకి తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.
అమెరికా బలగాలను ఇక్కడి నుంచి ఉప సంహరించుకోవడంతో.. సరిహద్దుల్లోని ప్రధాన భూభాగాలు, గ్రామీణ ప్రాంతాలను తాలిబన్లు తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం పట్టణాలు, నగరాలను అనుసంధానించే ప్రధాన రాహదారులను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు.
చాలా నగరాలకు వీరు సమీపంలో ఉన్నారు. అయితే, ఇప్పటివరకు ఒక్క నగరాన్ని కూడా వీరు తమ ఆధీనంలోకి తీసుకోలేదు.
‘‘హింసను అడ్డుకోవడంతోపాటు తాలిబన్లకు కళ్లెం వేసేందుకు రాత్రి కర్ఫ్యూను అమలులోకి తీసుకొస్తున్నాం. 31 ప్రావిన్సుల్లో ఇది అమలులో ఉంటుంది’’అని దేశ హోం శాఖ తెలిపింది.
కాందహార్ నగర శివార్లలో గత వారం విధ్వంసకర ఘర్షణలు చెలరేగాయి. దీంతో గురువారం ఇక్కడ అమెరికా వైమానిక దాడులు చేపట్టింది. అయితే, వచ్చే నెల 31తో ఇక్కడ అమెరికా తమ బలగాలను ఉపసంహరించుకోబోతోంది. దీంతో ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతాయోనని ఆందోళనలు వినిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
2001లో అఫ్గాన్‌లోని తాలిబన్ ప్రభుత్వాన్ని అమెరికా నేతృత్వంలోని సేనలు గద్దె దించాయి. ఒసామా బిన్ లాడెన్‌తోపాటు అమెరికాలో సెప్టెంబరు 11 దాడులకు కారణమైన ఇతర అల్‌ఖైదా నాయకులకు తాలిబన్ ఆశ్రయం ఇచ్చింది.
పశ్చిమ దేశాలపై దాడులకు తెగబడే జీహాదీలకు అఫ్గాన్ ఆశ్రయం ఇవ్వకుండా ఉండేలా చూసేందుకు తగిన చర్యలు తీసుకున్న తర్వాతే, తమ సేనలను ఉప సంహరించుకుంటున్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు.
జులై మొదటివారంలో బర్గామ్ వైమానిక స్థావరం నుంచి తమ సేనలను అమెరికా ఉపసంహరించుకుంది. ఇది అఫ్గాన్‌లోని అమెరికా సేనలకు ప్రధాన స్థావరం. ఒకప్పుడు ఇక్కడ విదేశీ సైనికులు లక్షల సంఖ్యలో ఉండేవారు.
ఆరు నెలల్లోగా తాలిబాన్ మళ్లీ ఇక్కడ పట్టు సంపాదిస్తుందని అమెరికా నిఘా సంస్థలకు చెందిన కొందరు ప్రముఖులు విశ్లేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదన్న కేంద్రం, మరి రుయా ఆస్పత్రిలో మరణాలెలా సంభవించాయి?
- మొన్న చైనాలో మంకీ బీ వైరస్, ఇప్పుడు అమెరికాలో మంకీపాక్స్ కలకలం
- 1971 యుద్ధంలో భారత్ ముందు లొంగిపోయిన పాక్ ఫొటోను అఫ్గానిస్తాన్ ఉపాధ్యక్షుడు ఇప్పుడెందుకు షేర్ చేశారు?
- తెలంగాణలో భారీ వర్షాలు: నిర్మల్‌లో రోడ్ల మీదే చేపల వేట
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








